Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 26


    అప్పుడు దుర్యోధనుఁడు కర్ణుని పక్ష మవలంబించి కృపాచార్యునితో "అయ్యా! గొప్పకులమునందు జనించిన వాఁడే రాజని పిలువఁబడును గదా! రాజనందనుడైన పార్థునితో రాజనందనుఁడే గాని యుద్ధము సేయఁదగఁ డని గదా మీయుద్దేశ్యము. మంచిది! అట్లయిన నా మిత్రుఁడగు నీరాధాపుత్రుని నిప్పుడె యంగరాజ్యమునకుఁ బట్టము గట్టుచున్నా" నని పలికి భీష్మ ధృతరాష్ట్రుల యనుమతంబు వడసి కర్ణునిఁ గాంచనమయ పీఠమున నునిచి మహా వైభవముగా నంగ రాజ్యమున కభిషిక్తుం గావించెను.
    కర్ణుఁడును దన కా మహాసభా మధ్యమున సుయోధనుఁడు గావించిన మహోపకారమున కెంతయుఁ గృతజ్ఞుండై పరమహర్షముతో నాతని కిట్లనియెను: "రాజకుమారా! ఇందఱ సమ్ముఖమ్మున నా గౌరవమ్ము నిలబెట్టితివి. ఈలోకమున నాకు నీకన్న నాశ్రయణీయుఁ డెవ్వరు? నేఁడు మొదలు నేనే నీవాడ. అరిభయంకర పరాక్రమోద్దండమగు మదీయ భుజాదండంబు సమారోపిత కోదండంబై నీకండయై యుండగల" దని పలుకుచున్నంత గర్ణుని జనకుండగు నధిరథుండు మణిమకుటహార కేయూరాది భూషణ భూషితుండును సకల రాజలక్షణ లక్షితుండు నగు తన తనయుని సమీపించి తదీయ మూర్ధాఘ్రాణ మొనరించి యంగరాజ్యాభిషేకమ్ముచే నార్ద్రమైన యాతని శిరస్సును సంతోష బాష్ప ధారలతో మరింత యార్ద్రము గావించెను. కుంతియుఁ దన యజ్ఞాత నందనుని వదనారవిందము మరల మరల రహస్య వీక్షణమ్ములం గనుంగొని సంతృప్తి నందెను.
    అధిరథ రాధేయులు యనోన్య ప్రేమాలింగనములఁ గాంచినంతనే ఆ సభయందలి వారందఱు కర్ణుడా యధిరథుని నందనుండని గుర్తించిరి. "నూతవంశ సంజాతుండగు నీతఁడు క్షత్రియోచితమగు నంగరాజ్యమునకుఁ దగడని" భీమసేనాదులాక్షేపించిరి. రథముతోలు వానికి నాయుధములజోలియేల నని కొందఱు ప్రత్యాఖ్యానము సలిపిరి. సుయోధనుఁడు వారిమాటలు పాటింపక "దివ్యప్రభా విరాజితుండును, సహజ కవచకుండల మండితుండును; నసమాన ధనుర్విద్యా విశారదుండు నగు నీతఁడు తన భుజబల సౌభాగ్యముచే నీ యంగ రాజ్యమ్మునకే కాదు సకల మహీ సామ్రాజ్యమునకైనఁ దగినవాఁడే యని సమర్థించుచుండ సూర్యాస్తమయ సమయ మాసన్న మయ్యెను. అంత నెల్లవారును కర్ణుని పరాక్రమమును పరిపరి విధములఁ బ్రశంసించుచుఁ బార్థునకుఁ దగిన ప్రతివీరుఁ డీతఁడొక్కఁడేయని పలుకుచు నిజమందిరము లకుఁ జనిరి. సుయోధనుండు గర్ణుఁదోడ్కొని బంధుమిత్ర సమేతముగను, దుశ్శాసనాది సోదర సహితముగను నాత్మ సౌధమ్మున కరిగెను.
    కుంతీదేవి యంతఃపురమున కేగినదే గాని యామెచిత్త మంతయు కర్ణునిమీఁ దనే యుండెను. ప్రేమాశ్రుసంసిక్తము లగు నామె కన్నుల యెదుట వీరమూర్తి ప్రతిక్షణము గోచరించు చుండెను. కాని పాప మామె యేమిచేయఁ గలదు! తన రహస్యము నెట్లు బయలు చేయఁగలదు? చేసిన నెంత యపకీర్తి! ఎంతటిలోక దూషణము! ఎవరికి జెప్పుకొనగలదు? ఎవరోదార్చువారు? అట్లే హృదయమున పొంగి పొంగి విషాద తరంగముల మ్రింగుకొని గుండెను బండ గావించుకొని లోలోన నామె క్రుంగి కుమిలిపోవు చుండెను.
    కౌరవులకుఁ బాండవులకుఁ గ్రమక్రమముగా మచ్చరము పెచ్చరిల్లినది. తమ తండ్రి భాగము కొరకై పాండవులు ప్రయత్నింతురనియును నెట్లయినను ముందు ముందు కౌరవ పాండవ యుద్ధము తప్పదనియుఁదలఁచి భీమార్జునుల పరాక్రమ విశేషములకు భీతినొందుచున్న సుయోధనుండు కర్ణుండు దనకుఁ బ్రాణమిత్రుండైన నాఁటనుండి ధైర్యము దెచ్చుకొని గుండెలు కుదుటబడి నిశ్చింతగా ఱొమ్ముపైఁ జేయివైచుకొని నిద్రపోవుచుండెను. కర్ణుండును విలువిద్యయందు నెట్లయిన నర్జునునికంటెఁ దనదే పైచేయి గావించుకొన వలయునను నిశ్చయముతో నిరంతర ధనుర్విద్యాభ్యాస నిమగ్నుఁడయ్యెను. ద్రోణాచార్య కృపాచార్యుల హృదయమ్ము నెఱిఁగి, వారిందృప్తులగావించి, యనేక ధనుర్విద్యా రహస్యమ్ములం గ్రహించెను. వివిధ కళా విశేషముల నశేషముగ నభ్యసించి వీరాధి వీరుఁడై విరాజిల్లుచుండెను.
    ఒక దినమ్మున రాధేయుఁ డత్యంత భయభక్తుడై ధనురాచార్యుఁడగు ద్రోణుని సమ్ముఖంబునకుం జని ప్రదక్షిణ ప్రణామమ్ముల యథావిధి నాచరించి తనకు బ్రహ్మాస్త్రమ్ముపదేశింపుమని ప్రార్థించెను. అది విని కుంభసంభవుఁడు కర్ణునితో "రాధేయా! బ్రహ్మాస్త్ర దానమ్మునకు బ్రాహ్మణ క్షత్రియులు మాత్రమే యోగ్యులు. తదితరుల కిమ్మహాస్త్ర దానమ్ము శాస్త్రవిరుద్ధ"మని వచించెను. సూర్యనందనుఁడు నిరాశోపహత హృదయుఁడై యింటికింజని యెట్లయిన బ్రహ్మాస్త్రమ్ము సంపాదించి తీరవలయునని దృఢనిశ్చయము గావించుకొని జగద్విఖ్యాతుఁడగు పరశురాముని పాలికిం బోయినఁదన సంకల్పము సఫలమగునని తలంచెను.
    ఒక శుభదినమ్మున సుయోధనునకుఁ దన వాంఛితము నెఱింగించి తదంగీకారముం గొని, మాతాపితరులకు నమస్కరించి వారి యాశీర్వాదమ్ముల నందుకొని, మహేంద్ర పర్వతంబుపైఁ దపోనియతినున్న మహానుభావుఁడగు భార్గవ రాముని యొద్దకుఁ బ్రయాణమైపోయెను. అచ్చటఁ గొంత కా మహాత్ముని సేవించి ప్రసన్నునిఁ గావించుకొనెను. పరశురాముండును దిననాథనందనుని వినయ విధేయతలకు సంప్రీత చేతస్కుండై "కుమారా! నీ వెవ్వఁడవు? ఏల మా సమ్ముఖమ్మునకు వచ్చితి" వని యడిగెను. కర్ణుఁడు చేతులు మోడ్చి "స్వామీ! నేను బ్రాహ్మణుఁడను. భృగువంశ జాతుఁడను. అస్త్ర విద్యాప్రాప్తికై మిమ్మాశ్రయింప వచ్చియున్నా"నని పలికిన జమదగ్ని తనయుఁడు సంతసించి యాత్మ శిష్యునిగాఁ జేసికొని యతనికి ననేక శస్త్రాస్త్ర రహస్యముల ననుగ్రహించు చుండెను.
    ఇట్లు రాధేయుఁడు కొన్ని దినమ్ములు పరశురాముని శ్రద్ధాళువై పరిచరించుచు మహేంద్ర మహీధరమ్ముపై విలువిద్య సభ్యసించుచుండెను. ఒకనాఁడా వీరకుమారుఁడు ధనుర్బాణముల ధరించి యాశ్రమ ప్రాంతమున నొక్క యెడలాఘవాభ్యాసమ్ము గావించుచుండ నొక బ్రాహ్మణుని యావు దూడ చెంగు చెంగున గంతులిడుచు నా వైపునకుఁ బరువెత్తుకొని వచ్చెను. కర్ణునిచేఁ బ్రయోగింపబడిన బాణ మొకటి ప్రమాద వశమున నాభూమీసురుని హోమధేను ధరణిపైఁ బడి యసువులు వీడెను.
    ఆవుదూడ యార్తధ్వని యాలించి తదపతియగు బ్రాహ్మణుఁడు ప్రళయకాల దండధరుఁడో యన మండిపడుచు నచ్చటి కరుదెంచి గూలియున్న ధేనువత్సమును శరశరాసన ధరుఁడగు రాధేయునిఁ గని క్రోధారుణిత నేత్రుఁడై రూక్షవీక్షణమ్ముల స్ఫులింగములఁ గురియ "నోరీ మదాంధుఁడా! ఎంత ఘాతుక కృత్యమును గావించితివి? నోరులేని యాశ్రమ వత్సములపైననా నీయస్త్ర విద్యా ప్రావీణ్యము? అంతగాఁ గన్నులకుఁ బొరలు గప్పెనా? ఇదియేనా నీ వీరత్వము? నీ పాపమునకుఁ బ్రతిఫలముగా రణరంగమున నీ రథచక్రము ధరణిఁ గ్రుంకుగాక" యని భయంకరముగా శపించెను. పాపము! భానుతనయుఁడు బహుభంగుల బ్రతిమాలుకొనెను గాని యా బ్రాహ్మణుని పాషాణ హృదయము కరగలేదు. కర్ణుఁడు చేయునది లేక ప్రాప్తించిన ప్రమాదమునకుఁ బశ్చాత్తాపము నందుచుఁ బరశురామునియొద్ద కరుదెంచి యెప్పటివలె శుశ్రూష గావించుచుండెను.

 Previous Page Next Page