Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 27


    పరమ భక్తియుక్తుడగు శిష్యునకు గురువు బ్రహ్మాస్త్రము మొదలగు ననేక మహాస్త్రములఁ బ్రసాదించెను. ఆ యస్త్రభాగ్యమున కెంతయు నానందము నంది దినకర నందనుఁడు కతిపయ దినములలో నాచార్యునొద్ద సెలవు గైకొని గృహమ్మున కేగ నుత్సాహపడుచుండెను.
    ఇట్లుండగా నొకనాడు జమదగ్ని సూతి శిష్యునితోఁ గూడి సమిత్కుశములఁ గొనివచ్చుటకై వనమ్మునకేగి కొంతసేపటు నిటు తిరిగి యాశ్రమ ప్రాంతమున నొక్క మహీరుహము శీతలచ్చాయలో నించుక విశ్రమింపఁ గోరెను. గురుభక్తి యుక్తుఁ డగు రాధేయుఁడు గురుదేవునకుఁ దన తొడ తలగడగా నొనర్చి సుఖనిద్రా నిమగ్నుడైన యాయనకు నుత్తరీయాంచ లమ్మున విసరుచుండెను.
    ఆ సమయమున నొక భయంకరమగు పురుగువచ్చి కర్ణుని యూరుభాగమునఁ గొఱుక నారంభించెను. రాధేయుని తొడనుండి రక్తము ప్రవహింపసాగెను. ధీరోదాత్తుఁ డగు నాతఁడు కాలు కదల్చినఁ దన గురుదేవునకు నిద్రాభంగము గలుగునని యాబాధ నెట్లో యోర్చుకొనుచు నిశ్చలుఁడై యట్లే కూర్చుండెను. ఆరక్తప్రవాహ మెక్కువై పరశురాముని శరీరము దడుపుటచే నతఁడు దిగ్గున మేల్కాంచి "యీ రుధిర ప్రవాహ మెక్కడి" దని శిష్యుని బ్రశ్నించెను. కర్ణుఁడును గంపించుచున్న కంఠముతో "గురుదేవా! ఈ దుష్టకీటక మెక్కడినుండియో వచ్చి నా తొడ తొలువ నారంభించినది. నేను గదలినఁ దమకు నిద్రాభంగ మగునని కదలకుంటిని. ఈ రక్త మంతయు నా తొడనుండి కారినదియే!" యని పల్కెను భార్గవరాముడు వాని ధైర్యమున కాశ్చర్యపడి నిజముగా నీతఁడు బ్రాహ్మణుఁడే యయిన నింతటిబాధ నోర్వగలిగి యుండునా? యని సందేహించి "ఓయీ! నీవు నిజము చెప్పుము. వాస్తవముగా నీవు మొదట చెప్పినట్లు భృగువంశ సంజాతుడవేనా?" అని కఠినముగా బ్రశ్నించెను. రాధేయుఁడు క్రోధారుణితములైన భృగునందనుని నేత్రములం గాంచి భయకంపిత హృదయుండై హస్తముల మోడ్చి "స్వామీ! నన్ను క్షమింపుఁడు. నేను సూతకుల సంజాతుఁడను. యుద్ధమున శత్రుసంహరణార్థమై దివ్యాస్త్ర లాభము నాశించి తమ సమక్షమున బ్రాహ్మణుఁడనని బొంకితిని" అని పలికి వినయ వినమితోత్త మాంగుఁడై నిలిచియుండెను.
    కర్ణుని వచనముల విని పరశురాముఁడు మహాగ్రహా వేశములతో మండిపడి "అసత్యవాదీ! గురుద్రోహము చేసి సంపాదించిన శస్త్రాస్త్రములు నీ యాపత్కాలమున నీకు జ్ఞప్తికి రాకుండుగాక" యని భయంకరముగ శపించెను. పాపము కర్ణుఁడు తాను పడిన కష్టమంతయు నాఁటితో వృథా యయ్యెనని డెందంబునఁ గుందుచు జమదగ్ని సందనునకు నమస్కరించి నిజగృహాభి ముఖుఁడయ్యెను.


                                3


    అంతకంతకు దుర్యోధనునకు పాండవ విద్వేషము వృద్ధి యగుచుండెను. వీరాధి వీరుడైన విజయుని జయింప గలఁడని కౌరవపతి కర్ణునిపైఁ గొండంత యాశపెట్టుకొని యుండెను. కురుపాండవుల విద్వేషముతోఁ బాటు కర్ణార్జునుల యన్యోన్య జయాభిలాష సైతము దినదిన ప్రవర్ధమాన మగుచుండెను. లాక్షాగృహ దహనానంతరము పాండవులు ప్రాణములు దక్కించుకొని యెట్లో ఏకచక్రపురము జేరి యచ్చట బ్రాహ్మణ వేషధారులై కాలము గడుపుచుండిరి. అంతలోఁ బాంచాల దేశాధీశ్వరుఁడైన ద్రుపద భూపతి తన పుత్రిక యగు ద్రౌపదికి స్వయంవారము నేర్పాటుచేసెను.
    పాంచాలీ స్వయంవరార్థమై నానాదేశాధిపతులు సేనా సమేతులై విచ్చేసిరి. మరియు విరాట శల్య జయప్రధ బృహద్రథాదులును, భగదత్త పౌండ్రక శిశిపాల జరాసం ధాదులును, కర్ణ శకుని దుశ్శాసనాదులతో దుర్యోధనుఁడును, ఏకచక్రపురము నుండి పాండవులును, ద్వారకా నగరమునుండి శ్రీకృష్ణ బలరాములును వచ్చి తమతమ యాసనమ్ముల నలంకరించిరి. స్వయంవర మంటపములోని సోదరియగు ద్రౌపదితో వచ్చిన ధృష్టద్యుమ్నుడు సభ్యులనుద్దేశించి "మహాశయులారా! ఇదిగో విల్లు! అదిగో మత్స్యయంత్రము. మీలో నేవీర శిఖామణి యీ వింట బాణము సంధించి యాకర్ణాంతము నెక్కువెట్టి మత్స్యయంత్రమును భేదించునో వానిని నా సహోదరి వరింపఁగల" దని వాక్రుచ్చెను.
    పెక్కుమంది ధారుణీపతు లద్ధనువును గదలింపనైన శక్తి చాలక ప్రయత్నించి భంగపడి లజ్జావినమ్ర వదనులైరి. అనంతరము ధనుర్విద్యా విశారదుఁడును నసాధారణ బాహు బల సంపన్నుఁడునగు కర్ణుఁ డాకార్ముకము నెక్కువెట్టి మత్స్యయంత్రము నేయబోవుచుండ "సూతవంశ సంజాతుని నేను వరింప" నని పాంచాలి పలికినది. రాజపుత్రి వాక్యములకు రాధేయుఁడు సిగ్గుపడి విల్లువిడిచి వెనుకకు మరలి వచ్చెను. పిమ్మట బ్రాహ్మణ వేషముతో నున్న పార్థుడు వింటిని మోపెట్టి మత్స్యయంత్రమును ఖండించి పాంచాల రాజపుత్రినిఁ బరిణయ మాడెను.
    దైవోపహతులకు నెందు బోయినను కష్టములు వెన్నంటి యుండును గదా! పాపము మన కర్ణునకు నెంతటి దుర్విధి మహత్వమోకాని యెక్కడకుఁ బోయినను జుక్కెదురగు చుండెను. బ్రాహ్మణుఁడు శాప మిచ్చుటయుఁ బరశురాముఁడు దయమాలి తిట్టుటయు, నిండు సభలో ద్రౌపది "సూతపుత్రుని వరింప" నని పరాభవించుటయుఁ కర్ణుని దురదృష్టవశమున గాక మరేమి? త్రిమూర్త్యాత్మ కుఁడైన సూర్యభగవాను నంశమున నొక్క సుక్షత్రియాంగనకు జన్మించిన దివ్యమూర్తి నీచకులసంజాతుఁడని నిందింప బడుట యెంతటి సంతాపకరము పాపము మన కర్ణునకుఁ దన జన్మ వృత్తాంత మేమి తెలియును? వాస్తవముగ రాధయు నధిరథుఁడే తన జననీజనకులని యతఁడు నమ్మియుండెను. దైవము కలసిరాలేదు గాని కర్ణుని పరాక్రమమున కేమి? నిరుపమాన తేజోరాశియగు నాతని శౌర్య ధైర్యములు జగద్విశ్రుతములయ్యెను.
    పరాక్రమముతోఁ బాటు దాతృత్వ గుణము గూడ కర్ణుని కీర్తికి వన్నెబెట్టెను. ఎవ్వ రేది యడిగిన నయ్యది లేదనక యిచ్చి యాచక జనుల సంతృప్తుల జేసి పంపుచుండెను అర్థిజనకల్ప వృక్షమగు నా యాదిత్య నందనుని వదాన్యత నలుమూలల వ్యాపించెను.

 Previous Page Next Page