Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 25
ఈరీతి నా సూతదంపతులు ప్రీత చేతస్కులై యాత్మ మందిరమునకుం జని యొక్క శుభ ముహూర్తమ్మున సముచితమ్ములగు జాతకర్మాది సంస్కారముల యథావిధి జరపించి సహజ కుండలాలంకృత కర్ణుండగు నా బాలునకుఁ గర్ణుండని నామకరణంబు గావించి కన్న కుమారునకన్నఁ గడుంగడు గారాబముగా వేయికన్నులతోఁ గనిపెట్టి పెంచుకొనుచుండిరి. రాధాకుమారుం డగుటచే రాధేయుఁ డనియు, ననంత వస్తుసమూహముతో దొరకుటచే వసుషేణుండనియుఁ గర్ణునకు నామాంతరములు వచ్చినవి. ఈ వృత్తాంత మంతయు రహస్యముగాఁ దెలిసికొని కుంతి కొంత శాంతి వహించి యూఱట నందియుండెను.
క్రమ క్రమముగాఁ గొంతకాలమునకు రాధేయుండు సంప్రాప్త యౌవనుండై సమర్థులగు గురువులవద్ద సమస్త విద్యల సభ్యసింపసాగెను తన ముద్దులపట్టి జగజెట్టి యగువిలుకాఁడు కావలయునన్న కౌతూహలముతో నధిరథుఁడు ధనుర్వేదనిధియగు నుపాధ్యాయ నన్వేషించు చుండెను.
ధృతరాష్ట్ర మహారాజునకు గాంధారియందు నూరుగురు కుమారులుద్భవించిరి. వారందఱయందు జ్యేష్ఠుఁడు దుర్యోధనుఁడు. దుశ్శాసనాదు లతని సోదరులు పాండురాజున కురువురు భార్యలుఁ గలరు. వారిలోఁ గుంతి భోజ రాజేంద్రుని కుమార్తెయగు కుంతీదేవికి యమ, వాయు, పురందరుల యనుగ్రహమ్ముచేఁ గ్రమముగా ధర్మజ, భీమార్జునులు జన్మించిరి. రెండవ భార్యయగు మద్రభూపతి పుత్రిక మాద్రీదేవికి అశ్వినీ దేవతల ప్రసాదమున నకుల సహదేవులుద్భవించిరి. ధార్తరాష్ట్ర శతంబును, బాండవ పంచకంబును నన్యోన్యానురాగంబులఁ గలిసిమెలిసి మెలంగు చుండిరి. కాని మహాబలులగు భీముని, నర్జునుని గాంచి దుర్యోధనుఁడు లోలోనఁ గుములుచుండెను.
బాల్యమునందే తమజనకుండగు పాండు భూపాలుఁడు పరలోకగతుఁ డౌటచేఁ బాండవులు తల్లియగు కుంతితోఁ బెద్దతండ్రివద్దనే పెరుగుచుండిరి. రాజనందనులు యుక్త వయస్కులగుటఁ గాంచి ధృతరాష్ట్ర ధరణీకాంతుడు ధనుర్విద్యా ధురంధరుఁ డగు ద్రోణాచార్యుఁ డను బ్రాహ్మణ పుంగవునిఁ బిలిపించి తన రాజ్యమున నుంచుకొని రాజనందనులకు విలువిద్య నేర్పింప నేర్పాట్లు గావించెను. రాజకుమారులతోఁ గూడి రాధేయుండును ద్రోణాచార్యుని సమక్షమున నస్త్రవిద్యా రహస్యములు గ్రహింపసాగెను.
సమభ్యస్త శస్త్ర విద్యావిభవులయిన రాజకుమారుల కళాకౌలశంబు నాలోకించు కౌతుకమ్మున ధృతరాష్ట్రుఁ డొక్కనాఁడొక మహాసభ గావించెను. కౌరవ పాండవుల విద్యా విశేషమ్ములు పరీక్షించుటకై వ్యాస గాంగేయ విదుర కృప ప్రముఖలతో మహారాజు సభలో నొకప్రక్క గొలువు దీర్చియుండెను. గాంధారి, కుంతి మొదలగు నంతఃపుర కాంతారత్నము లొకవంకఁగూర్చుండి యుండిరి. వేరు వేరు దేశములందలి వివిధ సామంత నృపాలురును విచ్చేసి తమ తమ యాసనములపై నాసీనులై యుండిరి. ప్రేక్షక బృందముతోఁ గ్రిక్కిరిసియున్న యా రంగస్థలమ్ముమీద ద్రోణాచార్యుఁడు తమ శిష్య సమూహమును వెంట నిడుకొని నక్షత్రపటల పరీవృతుఁ డగు కళానిధి కరణిఁ గడుంగడు బ్రకాశించుచుండెను.
నిర్ణీత సమయమున రాజకుమారులు రంగస్థలమ్ముఁ బ్రవేశించి తమ యస్త్ర శస్త్ర పాండిత్యమును బ్రకటింప సాగిరి. కొంతసేపఖండ శౌర్య విరాజమానులగు భీమదుర్యోధనులు గదలు ధరించి మదగజ కలభమ్ముల కరణిం బెనంగి చూపరులకు నేత్రానందము గావించిరి. తదనంతరము ధన్వుద్యా ధురీణుం డగు నర్జునుండును ధనురాచార్యు నను మతమ్మున రంగస్థలంబునఁ బ్రవేశించి చిత్ర విచిత్ర భంగుల శస్త్రాస్త్రములఁ బ్రయోగించి యనూన శరసంధాన చాకచక్యమ్మున సభ్యులందఱిఁ జకితులఁ గావించెను. అనన్యా దృశములగు తదీయ విద్యా విశేషములకు విస్మయ విభ్రాంతులై విలోకించుచు సభాసదులు "మేలు మేలు! బాగు! బా"గని కరతాళ ధ్వనులతోఁ దమ యంతరంగములలోని యానందమును వెలిపుచ్చు చుండిరి.
ఫల్గునుఁడు శరశరాసన సమలంకృత కరయుగళుండై సగర్వముగా సభ్యుల నవలోకించు చుండెను. ఇంతలో నధిరథ తనయుఁడుగు కర్ణుడు స్వకీయ విద్యా ప్రావీణ్యముఁ బ్రకటింప సమకట్టి తదీయ రంగద్వారమ్మున కరుదెంచి భుజాస్ఫాలనమ్ము గావించెను. సభాసదు లెల్లరు విస్మయ విస్ఫారిత లోచనులై యా వీర శిరోమణివైపు తమ వీక్షణమ్ములఁ బ్రసరింపఁ జేసిరి. అంత రాధానందనుఁడు రంగ మధ్యమ్మున నిలిచి సభయంతయు నొక్కమాఱు గలయం బరికించి కృపాచార్య ద్రోణాచార్యులకు వినయ వినమ్రుడై ప్రణామమ్ము గావించి సజల జలద గంభీర భాషణమ్ముల నర్జునుఁజూచి యిట్లు పలికెను; "పార్థా! రాజకుమారులం దెల్ల నీవ నిపుణుఁడ నని గర్వింపకుము! నేనును గొంత విలువిద్య సభ్యసించితిని. నీవుచేసిన వీరకృత్యము లన్నియు నిందఱు సభ్యులు నచ్చెరు వందునట్లు నేను బ్రదర్శింపబోవు చున్నాను. చూడుము" ఇట్లు పలుకుచున్న యినతనయుని వచనముల విని సభయంతయు నాశ్చర్యమగ్న మయ్యెను. అర్జునుఁడు లజ్జాక్రోధ వివశుఁ డయ్యెను. కర్ణుని వీరవచనము లాకర్ణించి సోదర సమేతుడైన దుర్యోధనుఁ డత్యంత సంతోషతరంగితాంతరంగుఁ డయ్యెను.
తరువాత సూర్యసూనుఁడు ద్రోణాచార్యు ననుజ్ఞ వడసి యింతదనుక సంక్రందననందనుండు ప్రఫర్శించిన యస్త్ర విద్యా విశేషమ్ములఁ జూపించెను. వాని ధనుర్విద్యా చాతుర్యము నవలోకించి, సభ్యులందరు వేనోళ్ళఁ బ్రశంసించిరి. దుర్యోధనుండు దానుందమ్ములును నారాధేయుం గౌగిలించుకొని బహుభంగులఁ దదీయ ప్రజ్ఞా విశేషమ్ముల స్తోత్రము గావించి నాకు నిఁకనుండి ప్రాణ మిత్రుడవై యుండుమని ప్రార్థించినఁ గర్ణుడు మందహాసము సేయుచు నంగీకారము సూచించి యందఱు విన నర్జునునిఁ దనతో ద్వంద్వ యుద్ధమునకై యాహ్వానించెను.
అది విని కవ్వడి కటకటం బడి "ఓయీ! నీ వెవ్వఁడవు? నిన్నిచ్చోటి కెవరు పిల్చినారు? పిలువని పేరంటమునకు వచ్చి పరాత్మ పరిమాణంబు లెఱుంగక ప్రగల్భ వాక్యములు పల్కెదవేమి?" అని యధిక్షేపించెను. అది విని రాధేయుఁడు "పార్థా! వ్యర్థభాషణమ్ములఁ గాలయాపనము సేయక ద్వంద్వ యుద్ధమున నీ యస మానత్వమును నిరూపించుకొమ్ము. నేను ములుకుల వాఁడనుగాని పలుకులవాఁ డను గాను. ఇది రంగభూమి. దీనిం ప్రవేశించి తమతమ ప్రతిభా విశేషమ్ములు బ్రకటించుట కందఱకు నధికారము గల"దని పలికెను.
ఇట్టు లా వీరవరు లిరువురును నొండొరుల నధిక్షేపించు కొనుచు సంగరమ్మునకుఁ గడంగిరి. ఆ శూర శిరోమణుల వీర విస్ఫూర్తికి సభలోని వారందఱు విస్మయం బందిరి. తన కుమారు లిరువురు నేక గర్భ సంజాతుల మని యెఱుంగక యట్లు ఘోర సంగ్రామంబు గావించుటం గాంచి కుంతీదేవి చింతాక్రాంతు రాలయ్యెను. ఎవ్వరి కేమి ముప్పు వాటిల్లునో యని యామె యరచేతఁ బ్రాణము లుంచుకొని యావీర దృశ్యమును గనుచుండెను.
ఇంతలో ద్వంద్వ యుద్ధ సమాచార నిపుణుడును, ధర్మవిదుఁడు నగు కృపాచార్యుఁ డయ్యిరువుర నడుమ నిల్చి సంగరమ్ము వారించి, కర్ణునిఁగాంచి యిట్లు పలికెను: "వీరాగ్రేసరా! వీరులు సమరము గావించు నప్పుడు ముందుగాఁ దమకులగోత్రాదులఁ బ్రకటింపవలయును. ఈతఁడు కురువంశోద్భవుడు. కుంతీ పాండురాజుల కుమారుడు. అర్జున నామధేయుడు. మఱినీవెవ్వడవు? ఇతనితో రణంబుసేయుటకు ముందు నీ కుల గోత్రముల జననీ జనకులఁ దెలుప వలయును. అజ్ఞాతకులశీల స్వభావులకుఁ బరస్పరము ద్వంద్వ యుద్ధము తగదని ధర్మశాస్త్రజ్ఞుల మతము" అనిన కర్ణుండు తన కులమ్మును, జననీ జనకుల నామములు నెఱింగించుటకు సిగ్గుపడి వినమ్రముఖఁ డయ్యెను.
Previous Page
Next Page