"ష్ ..... నెమ్మది. నాన్న వింటారు. బాగుండదు దివ్యా..... ఈసారికి తీసుకెడదాం. మళ్ళీసారి నించి అసలు మనం ఇంట్లో చెప్పొద్దు సినిమాకి వెడుతున్నట్టు. ఈ ఒక్కసారి రానిద్దూ. ఇప్పుడు వద్దంటే నాన్నగారేం అనుకుంటారో..... ప్లీజ్!" బతిమిలాడుతూ భార్యని శాంతపరచడానికి ప్రయత్నించాడు.
తండ్రి అన్నని పిలిచి చెప్పడం, భార్యాభర్తల మధ్య ఘర్షణ ఏమీ తెలియని నిర్మల అన్న వచ్చి 'సినిమాకి వెడుతున్నాం, నీవూరా' అనగానే చిన్నపిల్లలా సంబరపడిపోయి వెంటనే ముస్తాబయి బయలుదేరిపోయింది. తీరా చేసి బయలుదేరాక వదినగారు మొహం ముడుచుకుని వుండటం, అన్న ముభావంగా ఉండటం చూశాక, కారణం తెలియక చిన్నపోయింది. సినిమా హాల్లో కూడా దివ్య ఒక్క మాటా మాట్లాడలేదు. నిర్మల పలకరిస్తే తలాడించి జవాబిచ్చింది తప్ప మాట్లాడలేదు.
అన్నావదినా కూడా మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంగా ఉండటం చూసేసరికి నిర్మల చాలాసేపటికిగాని తనరాక వాళ్ళకి నచ్చలేదన్న విషయం తట్టలేదు. మరి అలాంటప్పుడు తనని ఎందుకు పిలిచినట్టు? ఏం అర్థం కాలేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకునే ఆ ఇద్దరూ అలా కూర్చుంటే తనేదో తప్పు చేసినట్టు సిగ్గుతో చితికిపోయింది నిర్మల. ఛా..... ఎందుకువచ్చాను అని బాధపడింది. ముగ్గురూ మౌనంగా సినిమా చూసి ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ అలా ఎందుకున్నారో గదిలో రాత్రి రఘు, దివ్యల ఘర్షణ విన్నాక నిర్మలకి అర్థం అయింది. డ్రాయింగ్ రూంలో పుస్తకాలు తీసుకుని మేడమీదకి వెడుతుంటే గదిలో తన ప్రసక్తి వినవచ్చి ఆగిపోయింది నిర్మల.
"దివ్యా..... ఇంకా కోపం పోలేదా? మరీ నీవు అంతలా మాట్లాడకుండా వుంటే నీరు ఏం అనుకుందో? నాన్నగారికి తెలిస్తే బాగుండదని అన్నాను. అయినా అదేం పరాయిదా? ఎంతయినా నా చెల్లెలు. ఒకసారి సినిమాకు వస్తే అంత కోపం తెచ్చుకోవాలా? మనం ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాన్న చెప్పాక ఆయన ఎదురుగా ఏమనమంటావు? ఈసారి నించి అసలు మనం సినిమాకి వెడ్తున్నట్టు ఇంట్లో చెప్పద్దన్నానుగా? ఈ మాత్రం దానికి అంత కోపం అయితే ఎలాగోయ్!" భార్యని గదిలో బతిమిలాడుతున్నాడు రఘు.
"నాకోపం మీకేం లెక్క? మీ ముద్దుల చెల్లెలికి కోపం రాకుండా చూసుకోండి. ఆవిడగారికి ఎక్కడ కోపం వస్తుందోనని మీ నాన్నగారు, మీ నాన్నగారికెక్కడ కోపం వస్తుందోనని మీరు..... ఆవిడగారు మొగుణ్ణి వదిలి ఏళ్ళ తరబడి పుట్టింట్లో కూర్చున్నా ఆవిడగారికింత ఇంపార్టెన్స్! అంతేలెండి కొందరి అదృష్టం - ఏం చేసినా చెల్లుతుంది. ఆవిడగారు మీకు ముద్దయితే మీరు నెత్తినెక్కించుకోండిగాని నా నెత్తిన ఎక్కించాలని చూడకండి." దివ్య కోపంగా అంది.
ఆ ఇంట్లో మామగారు నిర్మలని ఎంత ముద్దు చేస్తున్నది - అపురూపంగా చూస్తున్నది, ఆ ఇంట్లో ఆమె ఏం అడిగినా ఆయన క్షణాలమీద ఎలా జరుపుతారో ఈ నాలుగైదు నెలల నించీ చూస్తున్న దివ్యకి నిర్మలంటే జలసీ లాంటిది కల్గింది. దానికి తోడు పుట్టింట్లో నిర్మల గురించి అనుకునే చులకన మాటలు, ఇవన్నీ కల్సి నిర్మల అత్తింట్లో కాపురం వదులుకుని ఇక్కడ తిష్ట వేసిందని, ఆవిడగారు జన్మంతా తమ నెత్తి మీద వుంటుందని, తన సంపాదన ఏదో తిని పోతున్నట్టు అసూయ, కోపం పెంచుకుంది దివ్య. ఆ ఉక్రోషం ఇవాళ వెళ్ళగక్కింది.
ఆ మాటలు వినగానే నిర్మల మొహంలోకి రక్తం పొంగింది - తండ్రి చెప్పాడని కాదనలేక పిలిచాడన్నమాట అన్న! తనువారి వెంట వెళ్ళడం దివ్యకి ఇష్టం లేదన్నమాట!! తనెంత ఫూల్! అన్న పిలిచాడని ముందు వెనకలు ఆలోచించకుండా వెళ్ళినందుకు తగిన శాస్తి జరిగింది. అవమానంతో, ఉక్రోషంతో ఆ రాత్రి చాలాసేపు ఏడ్చింది నిర్మల.
ఆ రోజు నుంచి దివ్య నిర్మలతో అసలు మాట్లాడటం మానేసింది. ఎదుటపడితే మొహం చిట్లించింది. నిర్మలకి కూడా అదో రకం విరక్తి లాంటిది కల్గింది. కాలేజీకి వెళ్లడం రావడం. తన గదిలో లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలు చదువుకోవడం. ఎప్పుడైనా తండ్రి పలకరిస్తే మాట్లాడటం తప్ప సాధారణంగా గది వదిలి బయటికి రావడం మానుకుంది. కృష్ట బెంగుళూరులో ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయాడు. మోహన్ యమ్. బి.ఏ ఆఖరి సంవత్సరం చదువుతో క్షణం తీరిక లేకుండా వున్నాడు. ఎవరి మటుకువారు వారి పనులలో బిజీ...... తనొక్కతే ఏ పనిపాటు, ఏ బాధ్యతలు లేకుండా ఎవరికీ అక్కరలేనిదన్న భావం నిర్మలలో రోజురోజుకీ బలపడసాగింది. దాంతో మరీ మూడీగా తయారైంది. ఎవరి సమస్యలతోనూ ప్రమేయం లేనట్టు రోజులు మాత్రం దొర్లిపోసాగాయి.
అలాంటి స్తబ్ద వాతావరణంలో ఆ ఇంట్లో చిన్నారి అనిల్ రాకతో ఏదో పోయిన చైతన్యం తిరిగి వెల్లివిరిసినట్లయింది. దివ్య పురుడు పోసుకుని మూడో నెలలో బాబుని ఎత్తుకుని రాగానే బొద్దుగా తెల్లగా ముద్దొస్తున్న మనవడిని చూడగానే వ్యథ, చింత, ఆందోళన, కొడుకు కోడలు పట్ల విముఖత అన్నీ పోయి ఒక్కసారిగా శివశంకరంగారు నూతనోత్సాహంతో శక్తి పుంజుకున్నట్టు అయ్యారు. రోజంతా ఇంట్లో ఉన్నంత సేపూ మనవడితోనే గడపసాగారు ఆయన. శారదాంబ సరేసరి. వాడి ఆలనా పాలనా అంతా ఆవిడే చూసుకునేది. నిర్మలకీ బాబుని చూడగానే ఏదో మమతానురాగాలు పుట్టాయి. అన్న వదినలతో ఎలా వున్నా బాబుని చూడగానే మాత్రం అన్నీ మరిచిపోయి, వాడిని అపురూపంగా ఎత్తుకునేది.
వెధవ, ఎంత ముద్దుగా వున్నాడు అనుకునేది. వాడి మెత్తటి బుగ్గలు పుణుకుతూ, వాడి బోసి నవ్వులు చూసి, వాడి ఊంగాలు వింటూ, వాడితో సరిగా పలుకుతూ సమయం మర్చిపోయేది.
వాడిని ఎత్తుకున్నప్పుడల్లా అప్రయత్నంగానే తనకీ ఓ బాబు ఉంటే తనజీవితం ఇంత డల్ గా ఉండేది కాదు. వాడి ఆట పాటలతో, ముద్దుమురిపాలతో టైము గడిచేదేమో అని అనుకున్నప్పుడల్లా, అప్పుడు ఆ పిండాన్ని వదుల్చుకోవాలని తనెంత ఆరాటపడిందో గుర్తువచ్చి గుండెల్లో ముల్లు గుచ్చుకున్న అనుభూతి కలిగేది. తను తొందరపడింది..... అలా చెయ్యకపోవలసింది- చెయ్యకుండా వుండి వుంటే ఈ రోజు తన బతుక్కు ఒక అర్థం, ఓ ఆలంబన ఉండేది అనుకుని నిట్టూర్చేది. బాబుకి తల్లిస్నానం చేయిస్తే పౌడరు వేయడం, బట్టలు తొడగడం, వాడిని ఆడించడం అన్నీ నిర్మలే చూసేది.
దివ్యకి పిల్లవాడి బాధ్యత అత్తగారు, నిర్మల తీసుకోవడం - తన సినిమాలకి, షికార్లకి ఆటంకం లేకపోవడంతో బాగా ఉందనిపించింది. నిర్మల బాబుతోడిదే లోకం అన్నట్టు గడపడం చూసి శివశంకరంగారు బాధపడేవారు. దానికి పిల్ల పాప వుంటే ఇలా పిల్లల కోసం మొహం వాచినట్లుండేదా? ఎంతయినా స్త్రీకి మాతృత్వం మీద మమకారం వుంటుందంటారు. ఆ అవకాశం ఇంక నిర్మలకి రాదేమో అనుకుంటే ఆయన గుండెలు బరువెక్కేవి. శారదాంబ కూతురుని చూసి నిట్టూర్చేది. 'మోడులా మిగిలిపోయింది. ఓ అచ్చటా ముచ్చటా లేకుండా' అని లోలోన కుమిలిపోయేది.