Previous Page Next Page 
వ్యూహం పేజి 25


    "ఏం... నమ్మలేరా..." చుట్టూ చూస్తూ అన్నాడు శక్తి.

 

    కేంటిన్ నిశ్శబ్దంగా వుంది...

 

    తెల్లటి మొజాయిక్ ఫ్లోరు తెల్లటి కార్పెట్ లా ఉంది. అక్కడక్కడ ఒకరిద్దరు ఉద్యోగస్తులు కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు.

 

    అదే సమయంలో యధాలాపంగా శక్తి తనకు మూడు వరసల అవతల కూర్చున్న, ఓ అమ్మాయిని చూసాడు... వాటె... స్టన్నింగ్ బ్యూటీ?

 

    ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మలా వుంది.

 

    పున్నాగ పువ్వులు, నందివర్ధనం పువ్వులు కలిపి, ఆకాశగంగతో రంగరించి... ప్రాణం పోసి... ఆపైన పసిడి మెరుగుపెట్టి, భూమ్మీద పెట్టిన మెరుపుల కావ్య నాయికలా వుంది ఆ అమ్మాయి. పసుపు రంగు ఆర్గండీ చీర... నలుపు రంగు బోర్డర్... అదే రంగు జాకెట్టు... పొడవుగా తెల్లటి అశోక వృక్షంలా ఆరోగ్యంగా, నాజూగ్గా వుంది ఆ అమ్మాయి. ఎదురుగా వున్న ఎవరితోనో మాట్లాడుతోంది చిన్నగా.

 

    "ఎవరి మాటైనా నమ్మకపోదునుగానీ... మీ మాట నమ్ముతాను. ఎందుకంటే, మన ఏరియావాళ్ళు అబద్ధాలాడరు. ఛైర్మన్ మేనమామ అయితే ఇక్కడిలా, అనామకుడిలా తిరగడం ఎందుకండీ. తిన్నగా ఛైర్మన్ రెసిడెన్స్ కి వెళ్ళిపోవచ్చు గదా..." ఆ మాట అన్న భగవాన్ ముఖంలోకి అయోమయంగా చూసాడు శక్తి. స్టన్నింగ్ బ్యూటీని చూసి శక్తి మెదడు అప్పటికే ఫ్రీజయి ఉంది.

 

    అవును నిజమే... ఇంటికెళ్ళమని తల్లెందుకు చెప్పలేదు-? ఇంటి అడ్రస్ ఎందుకివ్వలేదు? తనకి తెల్సిన ఓ పేరు చెప్పి, బాలచంద్రగాడి బారి నుంచి రక్షించడానికి, తల్లి తనని ఈ ఊరు పంపించెయ్యలేదు కదా? నిజంగా వెంకట నారాయణ... తన తల్లికి స్వంత అన్నయ్యేనా?

 

    స్వంత అన్నయ్య అయితే ఇన్నేళ్ళూ తనతో ఎందుకు చెప్పలేదు? ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా, ఆ పేరెందుకు ఇంట్లో వినిపించలేదు? అంత గొప్ప వ్యక్తి తన మేనమామ అయితే ఇన్నాళ్లుగా, ఒక్కసారి అయన తమ ఇంటికెందుకు రాలేదు? అమ్మగానీ, నాన్నగానీ ఆయనింటి కెళ్ళలేదు- ఎందుకని?

 

    రకరకాల ఆలోచనలు... తనకే సరయిన సమాధానం తట్టటం లేదు. తనేమని భగవాన్ సందేహాల్ని తీర్చగలడు?

 

    "తప్పుగా అనుకోకండి... మీరు చెప్పేది వింటే ఎవరికయినా నా కొచ్చిన సందేహం రాకపోదు" తిరిగి అన్నాడు భగవాన్.

 

    "అదే నేను చేసిన పొరపాటు- మా అమ్మని మా మామయ్య అడ్రస్ అడగటం మర్చిపోయాను..." తను చెప్పింది భగవాన్ నమ్మడం లేదనిపించింది శక్తికి.

 

    నిజంగానే నమ్మలేనట్లుగా చూసాడు భగవాన్.

 

    "పి.ఏ.ని కలిసి, ఓ లెటరిచ్చాను. రేపు రమ్మన్నాడు..." మళ్ళీ చెప్పాడు శక్తి.

 

    ఛైర్మన్ ఉండేది సదాశివనగర్, ఇలా అయితే ఇక్కడ పనులు జరగవండి... డిటైల్స్ నేను కనుక్కొని చెప్తాను- వెళ్ళండి... తాడో, పేడో తేలిపోతుంది" అన్నాడు భగవాన్.

 

    శక్తి దృష్టంతా ఆ స్టన్నింగ్ బ్యూటీ మీదే వుంది.

 

    ఆ అమ్మాయి సీట్లోంచి లేచి నిలబడింది. పక్కనున్న అమ్మాయి ఏదో జోక్ వేసిందేమో, నవ్వుతోంది ఆమె. ఆ అమ్మాయి నవ్వు అద్భుతంగా వుంది. తన కలలో కనిపించిన ఏ అమ్మాయి కూడా అంత అద్భుతంగా నవ్విన గుర్తులేదు శక్తికి. పొన్నాయి పూలచెట్టునుంచి వర్షించినట్లుగా ఉందామె నవ్వు.

 

    "ఎవరా అమ్మాయి" అప్రయత్నంగా శక్తి నోటివెంట ఆ మాట వచ్చేసింది.

 

    బిత్తరపోయి తల తిప్పి చూసాడు భగవాన్. ఆపైన ఒకింత నిట్టూర్పు విడిచాడు.

 

    "ఆ అమ్మాయేనా... చూసారా- చూస్సేరా- మీరు చూసేస్తారని తెలుసు. మా ఆఫీసులో ఇలాంటి స్టన్నింగ్ బ్యూటీస్ చాలామంది ఉన్నారు లెండి. మహిత అని మార్కెటింగ్ సెక్షన్ లో పనిచేస్తుంది. విజువలైజర్ కమ్... ఫోటోగ్రాఫర్" చెప్పాడు భగవాన్.

 

    మహిత పక్కనున్న ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ శక్తి కూర్చున్న కుర్చీ పక్కనుంచే వెళ్ళిపోయింది. తనకేసి ఒక్కసారి కూడా చూడలేదు. ఎలా చూస్తుంది? తను దిక్కుమాలిన బట్టలు వేసుకొని ఉంటే-

 

    రకరకాల పూలు, ఒక్కసారి వికసించి, సువాసనల్ని వెదజల్లినట్లయింది. ఒక మలయ మారుతం మంద్రంగా వీచి వెళ్ళిపోయినట్లయింది.

 

    సాలార్ జంగ్ మ్యూజియంలో రెబెక్కా సుందరి ముసుగు సవరించుకుని, నడిచివెళ్ళినట్లుగా ఉంది శక్తికి. ఫలక్ నూమా ప్యాలెస్ పాలరాతి సుందరి ప్రాణం పోసుకొని వెళ్ళిపోయినట్లుగా ఉంది.

 

    ఇంకా కళ్ళప్పించి, మహిత వెళ్ళిపోయిన వేపే అలా చూస్తున్నాడు శక్తి. ఆమె మెస్మరిక్ స్పెల్ లోంచి వెంటనే దిగి రాలేక పోయాడు శక్తి.

 

    నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట లాంటి డిజర్టెడ్ కేన్వాస్ మీంచి మైకలాంజిలో రంగుల ప్రపంచం మీద విహరించినట్లుగా ఉంది శక్తికి. ఓ తియ్యని భావం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది.

 

    ఆ అమ్మాయిని చూడగానే శక్తికి చప్పున మేనమామ కూతురు జ్ఞాపకానికొచ్చింది.

 

    "బేబీ... ఈ ఆఫీసు కొస్తుందా" శక్తి ఏమన్నాడో అర్థం కాలేదు భగవాన్ కి. అయోమయంగా చూసాడు శక్తివైపు.

 

    "బేబీయా బేబీ... అంటే" తొలిసారి నిప్పుని చూసిన ఆది మానవుడిలా అయిపోతూ అడిగాడు భగవాన్.

 

    "మీ ఛైర్మన్ గారి కూతురు..."

 

    "చూడండి- మీరేదో ఛైర్మన్ లెవల్లో స్టిల్ బర్గ్ సినిమాల్లో, సీక్రెట్స్ లాంటి సీక్రెట్లన్నీ మాట్లాడుతున్నారు. మా ఛైర్మన్ ఎలా ఉంటాడో నేనెప్పుడూ చూడలేదు- ఈ ఆఫీసులో మూడేళ్ళయ్యింది చేరి. నా సెక్షన్ లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. మనం తెలుసుకుంటున్నామని, అవతలి వ్యక్తికి తెల్సిందనుకోండి- డిసిప్లినరీ యాక్షన్ కింద, డిస్మిస్ అవుతాం. ఛైర్మన్ కి బేబీ ఉందో బాబీ ఉందో, బాబున్నాడో నాకు తెలీదు" చిన్న ఉపన్యాసం ఇచ్చాడు భగవాన్ తనని తాను గిల్లి చూసుకుంటూ.

 

    "మా మామయ్యకి కూతురుంది లెండి. బేబీ అని చెప్పింది మా అమ్మ. బేబీ అంటే చిన్న బేబీ అని కాదు అర్థం... ఇంట్లో ముద్దు పేరన్న మాట" చెప్పాడు శక్తి స్టన్నింగ్ బ్యూటీ ట్రాన్స్ లోంచి బయటపడుతూ.

 

    "అలాంటి విషయాలు మాకు తెలీదుగానీ- రండి వెళదాం..." అన్నాడు భగవాన్ ఇంకేం చెబుతాడో అన్న భయంతో.

 

    ఇద్దరూ బయటికొచ్చారు.

 Previous Page Next Page