"అంతేగా మరి."
"మరి నాకెప్పుడైనా జబ్బుచేసి నీ దగ్గరకు వస్తే మందిస్తావా?"
"మీ మద్రాస్ లో డాక్టర్లు తక్కువైనారా?"
"నాకు నీ దగ్గరే ట్రీట్ మెంటు తీసుకోవాలని వుంది చినబాబూ."
ఈ కంఠస్వరం కొత్తగా వినిపించి చకితుడై అతను తలయెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె చప్పున కళ్ళు ప్రక్కకి త్రిప్పుకుంది.
"అంత అవసరం వస్తే. అవశ్యం అలాగే" అన్నాడతను నెమ్మదిగా.
* * *
శైలజ భర్త ఊళ్ళోలేడు. హిందీలో చిత్రం నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పనిమీద బొంబాయి వెళ్ళాడు.
"షూటింగ్ ఏమైనా చూస్తావా" అనడిగింది శైలజ ఆ మధ్యాహ్నం.
"ఇంటరెస్ట్ ఏమీలేదు. మీదేమన్నా వుంటే చెప్పండి. వస్తాను."
"ఇవాళ నాకు కాల్ షీట్ ఏమీలేదు. రేపువుంది. అయినా ఇవాళ యీ షూటింగూ, పాడూ ఏమీ వద్దులే. ప్రశాంతంగా వుండాలని నిన్ను పిలిచాను. నువ్వెందుకో నా డియరెస్ట్ ఫ్రెండ్ వనిపిస్తోంది. మహాబలిపురం పోదామా?"
"మీ ఇష్టం."
"పదపోదాం" ఒక్కక్షణం ఇంట్లో వుందామన్నా భయంవేస్తోంది. ఈ బిజీగా వుండటం, ఇదంతా విసుక్కుని వంటరిగా వుండాలని కోరుకుంటామేగాని..... అదీ భయంకరంగానే వుంటుంది."
ఇద్దరూ మెట్లుదిగి క్రిందకు వచ్చారు. శైలజ ఫ్రంట్ డొర్ తెరబోతూ "నీకు డ్రైవింగ్ వచ్చునా?" అనడిగింది.
"మాకు కారు వుందిగా మరి."
"అయితే నువ్వే చెయ్యి. నేను నీప్రక్కన కూర్చుంటాను. ఇదివరకెప్పుడైనా మెడ్రాస్ వచ్చావా? దారులన్నీ బాగా తెలుసా" అంటూ తిరిగి వెళ్లి తలుపు తెరిచి ముందువైపు కూర్చుంది.
మధుబాబు స్టీరింగ్ ముందు కూర్చుని "నా చిన్నతనాన వచ్చి కొన్నిరోజులు వున్నాను. దార్లు తెలీవు. మీరు డైరెక్ట్ చేస్తూ వుండండి" అంటూ స్టార్ట్ చేశాడు.
"పెళ్ళి చేసుకున్నావా" అనడిగింది శైలజ దారిలో.
"లేదు."
"ఎందుకని...."
"భార్యగా వుండటానికి యేదో ఓ మిషన్ ని తెచ్చి యింట్లో ఫ్యాక్టరీ పెట్టటం ఇష్టంలేదు. అందుకని..."
శైలజ కిలకిలమని నవ్వింది. "అచ్చం రచయితలాగే మాట్లాడుతున్నావే."
అతనేం జవాబు చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు.
కొంచెం ఆగి శైలజ "నీకు ఫ్యాన్ లెటర్సు వస్తూంటాయి. రకరకాల ప్రేమలేఖలు, బూతులు, అభినందనలు...."ఆగింది.
మధుబాబు వీధిమలుపు త్రిప్పుతూ "మీకొచ్చే లెటర్సుకి, మాకు వచ్చేవాటికీ చాలా వ్యత్యాసం వుంది. ఏమాత్రం లైకింగ్ వున్నా, లేక కాలక్షపానికి, లేక గ్లామరుతో రాస్తారు మీకు. తమ జీవితాల్లో ఏదో ఒక అంశాన్ని స్పృశిస్తేనేగాని మాకు రాయాలని వాళ్లకు స్ఫురించదు. అందుకే మాకొచ్చేవి ఆశామాషీగా కాక సన్నిహితంగా లోతుగా వుంటాయి. ఇహ మీకు వందలకొద్దీ యెందుకు వస్తాయంటారా? పాఠకుల సంఖ్యకంటే ప్రేక్షకుల సంఖ్య ఎంతో ఎక్కువ కాబట్టి" అన్నాడు.
"అమ్మాయిలుకూడా రాస్తుంటారా?" అనడిగింది శైలజ కుతూహలంగా.
"ఆఁ ఏం?"
"ఏంలేదు. అప్పుడు నీకేమనిపిస్తుంటుంది?"
"ఆశ్చర్యంగా వుంటుంది. మనకు తెలియని ప్రపంచం ఇంకా ఎంతవుందో అనిపిస్తుంది. మన చుట్టుప్రక్కల యిలాంటి గండిపడ్డ జీవులు విపరీత విషాద మనస్కులు మనకు అంతగా కనబడరు. ఉదాహరణకు మా కాలేజీ లేడి స్టూడెంట్స్ నే తీసుకుందాం. మెకానికల్ గా చదువుకోవటం, పరిస్థితుల్ని బట్టి అబ్బాయిలకి దగ్గరగా రావటం, అప్పుడప్పుడు మితిమీరటం, వట్టి ఏబ్రాసి తనం తప్ప ఓ ఉత్సాహం, ఆరాటం , జిజ్ఞాస, లోతు ఏమీ కనబడవు. కాని మరి అలాంటివాళ్ళు మనకి కనిపించకుండా చాలామంది వుంటూనే వున్నారు. ఎలాగో కదిలించబడి సన్నిహితంగా వస్తూనే వున్నారు. అదే ఆశ్చర్యం."
శైలజ నిట్టూర్చి "నేనూ నీకు సిన్సియర్ ఫాన్ నే. అబ్బ! ఆ పుస్తకాలు ఎలా కదిలించాయి నన్ను" అంది.
అతను చకితుడైనాడు. ఓ క్షణం వూరుకుని "కాని అవి నేనుతప్ప ఇంకెవరైనా రాసివుంటే మీరు ఉత్తరం రాసివుండేవాళ్ళు కాదు. నేను పరిచయస్థుడ్ని కావడంచేత మే మనస్సు. పొజిషన్ అభ్యంతరం చెప్పలేకపోయినై" అన్నాడు.
శైలజ ఆశ్చర్యంగా "నిజమే! అలాంటి అహంభావం నాకువుంది" అని ఒప్పుకుంది.
* * *
ఆ రాత్రి భోజనాలు ఐనాక తనకోసం ఏర్పాటుచేసిన గదిలోకి పోతూ వుండగా ప్రక్కన ఓ బల్లమీద సితార్ కనిపించింది. దానిమీద అతనీమధ్య సాధనం చేశాడు. ఒక వాద్యం బాగా వచ్చినవాడికి మిగతావి తేలిగ్గా అలవాటు పడిపోతాయి. అనుకోకుండా తలలో ఓ సంపర్కము తెలుస్తూ వుంటుంది. అతనికి సితార్ మెడ వాయించటం బాగానే వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుని గదిలోకి తీసుకువెళ్లాడు.
ఈ మధ్య విడుదల అయిన సినిమాలో శైలజ పాడినపాటే వాయించ సాగాడు సోఫాలో కూర్చుని.
శైలజ తన గదిలోంచి బయటకు వస్తూ యీ మధుర మంజులగానం ఆలకించింది. నెమ్మదిగా, చప్పుడు చేయకుండా వెళ్లి గుమ్మం ఇవతల నిలబడింది.
కొన్ని నిముషాలైనాక పాట ముగిసింది.
మధుబాబుకు ఏదో అనుమానం తోచి, ఆమెనిచూచి లజ్జితుడయి "మీరా? ఎంతసేపయింది వచ్చి? వట్టి పిచ్చి నాకు" అన్నాడు.
శైలజ లోపలకు వచ్చి మరోకుర్చీలో కూర్చుని "నీకు రానివిద్య అంటూ లేదా చినబబూ? ఏదీ మరొకటి వాయించు. చాలా ఆసక్తిగావుంది" అని అడిగింది ఎంతో కుతూహలంగా.
"క్షమించాలి. ఇవి నా ఆనందంకోసం నేను నేర్చుకున్నవి. ఎందుకూ పనికిరానివి. గట్టిగా ఎవరైనా అడిగితే చెయ్యి కదలదు."
"బ్రతిమాలిన అంతేనా?"
"బ్రతిమాలాడవద్దని నేనూ బ్రతిమాలాడాల్సి వస్తుంది."
శైలజ నవ్వింది. "నీకు మృదుత్వం, పెంకితనం రెండూ వున్నాయి చినబాబూ" అంది.
మధుబాబు ఆలోచించసాగాడు. ఆమెలో ఏదో వేదన వున్నట్లు అతనికి పొడగట్టింది. అందుకనే తన సాన్నిహిత్యం కోరిందేమో. బహుశా అది బయటకు చెప్పలేకపోవచ్చు.
"చినబాబూ!" అంది శైలజ కంపితస్వరంతో అతని కళ్ళలోకి చూస్తూ.
అతని ప్రశ్నార్థకంగా చూశాడు.
"ఆ పుస్తకాలు ఎందుకలా రాశావు?"
"ఎలా?"
"అలా."
"ఎలా?"
"అవి చదువుతున్నంతసేపూ నేనేడుస్తూనే వున్నాను. నా జీవితంలో ఏదో సంఘటనతో అవి పోలాయని కాదు. కాని అజ్ఞాతంగావున్న నాలోని అసంతృప్తికి అవి పోలాయని కాదు. కాని అజ్ఞాతంగావున్న నాలోని అసంతృప్తికి అవి రూపాన్నిచ్చాయి. ఎన్ని తిరుగుళ్ళు, ఎత్తుపల్లాలు, మలుపులు, అసహ్యం నా జీవితం. ఆ యిన్స్పిరేషన్ లోనే నిన్ను రమ్మని ఉత్తరం రాశాను....అవునుగాని నేనిందులోకి ఎలా వచ్చానని అడగవేం?"
కుతూహలం లేదు."
"ఎందుకని?" అనడిగింది ఆమె కొంచెం గాయపడి.
"కొత్త ఏమీ వుండదు. పేరులమార్పుతో, సంఘటనల తేడాతో మీ అందరి కథలూ ఇంచుమించు ఒకలాగే వుంటాయి. గుండ్రంగా తిరిగే జీవితచరిత్రలు."
నువ్వు కఠినుడివి" అంది.
"ఇంతకుముందే మృదువైనవాడివన్నారు. అతిమృదుత్వం కూడా కఠినంగా కనబడుతుంది. అది అందరికీ అర్థమయే సంగతి కాదులెండి" అని మధుబాబు ముఖం ప్రక్కకి తిప్పుకున్నాడు.
శైలజ తెల్లబోయి చూసింది. భయంతో, నిజాయితీలోని వ్యధతో ఆమె ముఖం పాలిపోయిఅమి. "నాకు మనశ్శాంతికోసం అన్వేషణలోనే జీవితమంతా సరిపోతుంది. ఈ స్థితి ఎక్కడవున్నా తప్పదు. మీరు రాజయ్యగారి ప్రాపకంలోనే, ఆ పెంకుటింట్లోనే వున్నా యీ మనశ్శాంతి లేక బాధపడేవారు. ఈ సినిమాలోకంలోకి రాకుండా ఎక్కడికైనా వెళ్ళి మరోరకంగా జీవించినా అదే అవస్థ. ఇప్పుడూ అంతే. అది మనుషుల్లోని దుర్భలత. రూపంలేని తృష్ణ అంతే."
శైలజ ఓ క్షణంపాటు అతని నిర్మల, అమాయక వదనంకేసి పరీక్షగా చూసింది. "నీకు వుందా మనశ్శాంతి?"
"లేదు" జవాబు సూటిగా వచ్చింది.
"ఎందుచేత?"
మధుబాబు ఆమెకేసి భావశూన్యంగా చూశాడు. "దీనికి జవాబు చెప్పటం చాలాకష్టం."
"అంతరంగికమా?"
"కొంచెం అలాంటిదే."
"నువ్వు ఏ స్త్రీనైనా ప్రేమించావా?"
"ప్రేమించాను."
"ఆమె ఎలాంటిది?"
"అంటే?"