Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 24
ఇంతలో నామణిమంజూష యలనల్లన నత్తరుణీమణి దాపునకు వచ్చినది. తరగలలో నూయల లూఁగుచు నరుదెంచిన యా పెరికదరికిఁబోయి మెల్ల మెల్లగా దరికిఁగొనివచ్చి భగవానుఁడగు పద్మబాంధవుఁడే తనమీద దయ దలఁచి యీ మార్గముఁ జూపించినాఁ డనియు, నీశ్వరేచ్చ యిట్లున్నది కాబోలు ననియుఁ దలపోసి యా రాజకుమారి చుట్టుప్రక్కల నున్న పూపొదల చెంత కేగి చిగురుటాకుల జిదుముకొనివచ్చి చిన్నారి తండ్రికి సెజ్జసమర్పించినది. మెత్తని పొత్తిగుడ్డలఁ బాన్పుగాఁ బరచినది. తలవైపు పూలగుత్తుల నెత్తు పెట్టినది. ఒత్తుకొనకుండఁ జేతితో నొత్తి చూచినది. ఎట్టకేలకు దడదడ గొట్టుకొనుచున్న గుండెలు బిగబట్టుకొని కన్నతండ్రిఁ గడసారి కరవుదీరఁగ గన్నులనిండఁ జూచుకొని బాష్పధారాక్తమగు నా పూలసెజ్జపై బుజ్జిబాబును బరుండబెట్టినది. పాప మా పసిపాప చిన్న పెదవులపై ముత్యాలు చిందిపోవునట్లు బోసినవ్వులు నవ్వునేగాని కన్న తల్లి కష్టమును దన యదృష్టమును గూడ రవ్వంతయు నెరుంగ కుండెను.
అంతఁ గుంతీకుమారి చెదరుచున్న హృదయమును శిలామయును సేసికొని యా మందసామును నదీ తరంగములలోఁ ద్రోయఁబోయెను. అంతలో పుత్రస్నేహ మంతరంగమునఁ గుప్ప తెప్పలై యుప్పొంగ బాలు నాలింగన మొనర్చు కొని వెక్కి వెక్కి యేడ్వసాగెను.
"భోగభాగ్యములతోఁ దులదూఁగుచున్న కుంతి భోజ రాజేంద్రుని గారాబుపట్టినే! కన్న బిడ్డకుఁ బట్టెడన్న మైనను బెట్టుకొన నోచని కఠినురాలనై గంగపాలు గావించు చున్నాను గదా! ముద్దులపట్టీ! నిన్నుఁ బెట్టెలోఁ బరుండఁ బెట్టి యీ నట్టేటిలోనికి నెట్టుచున్నాను. ఈ క్షణముతో నీకును నాకును ఋణము దీరిపోవుచున్నది. లోకాపవాద భీతిచే నేడు నేనంతటి ఘాతుకకృత్యమున కొడిగట్టుచున్నాను. పున్నమ చందురునివంటి నా తండ్రిమోము నాకు దూరమై పోవుచున్నది. ఇక నా జీవిత పథ మంతయు నంధకార బంధురమే కాబోలు! ఓ సూర్యభగవానుఁడా! ఇడుగో నీబిడ్డ. రక్షించుకొనుము. ఓ భూతామా! నా బిడ్డను గాపాడుము. ఓ దిక్పాలకులరా! నా తనయుని దిక్కులేని వానిగాఁ జేయకుఁడు ఓనదీదేవతా! నమస్కారములు! నాముద్దుల తండ్రిని నీకప్పగించుచుంటిని. వీని నేతల్లి చేతిలోనైనఁ బెట్టి నా మాట దక్కింపుము."
కుంతీకుమారి కొంతవడి యిట్లు విలపించి బిడ్డను మరల నొక్క మారు వెలుపలికిఁ దీసి, యెత్తుకొని, ముద్దాడి, వెండియు పేటికయందుఁ బరుండబెట్టి జోకొట్టినది. విలువ గల పెక్కు మణిహారములు సువర్ణరాసుల నందుంచినది. ప్రాంతమున నున్న యొక పద్మపత్రమును సనాళముగా గోసి కొనివచ్చి బిడ్డకు నెండవేడిమి సోకకుండ నాతపత్రముగా నమర్చినది. ఆ తామరాకులో నుండి తల దూర్చి నిద్రలో మైమరచియున్న ముద్దులకొడుకు ముత్యాల మూతిపై గట్టకడపటి ముద్దు నునిచినది. కన్నులు మూసికొని చిత్తమును జిక్కబట్టి మందసమును ముందునకుఁద్రోసినది.
బాలభానుని యరుణ కిరణములలో బంగారు పూతలు పూసికొనుచున్న యశ్వనదీ తరంగముల నల్ల నల్ల నుయ్యెల లూగుచుఁ బెట్టె కొట్టుకొని పోవుచుండెను. కుంతీకుమారి నిర్వీన్నురాలై నిశ్చల నిరీహ నేత్రములతోఁ బెట్టెవైపు గాంచుచు గట్టుమీదనే నిర్ఘాంతపడి నిలిచిపోయినది.
2
ఇట్లు కుంతీకుమారిచే విడిచిపెట్టబడిన మణిమంజుష యశ్వనదీ వేగంబునఁ జనిచని క్రమక్రమముగాఁ జర్మణ్వతియను నదీ ప్రవాహమ్మునం బ్రవేశించి యట నుండి మణి కొంతదూర మట్లే పోయిపోయి. యమునా శ్రోతస్వినిం జేరి యానదీప్రవాహమునం గొంతదూరము సాగి కట్టకడకు మెలమెల్లగా గంగానదిం బ్రవేశించెను. ఆహా! ప్రపంచమునందదృష్టవంతులనుఁ జెరచువాఁడును దురదృష్టవంతులను బాగుపరచువాఁడును లేడు గదా!
ఆ కాలమున హస్తినాపురమును రాజధానిగాఁ జేసికొని ధృతరాష్ట్రుఁడు భారతదేశమును బరిపాలించుచుండెను. ఆయన సోదరుఁడును ననన్యసామాన్య శౌర్య విభ్రాజితుఁడు నగు పాండురాజు తన బాహు పరాక్రమమునఁ బరదేశా ధీశ్వరుల నందఱ జయించి యనంత మణిగణ ధనసంపదలం గొనివచ్చి యన్నముందుఁ గుప్ప పోయుచుండెను. పెద్దవాఁడగుటచే బేరునకు మాత్రము ధృతరాష్ట్రుడు సింహాసన మెక్కెనేగాని పాండుభూపాలుఁడే సామ్రాజ్య భారతమంతయు భుజస్కంధమున వహించి నిర్వహించుచుండెను.
ఆనాఁడు ధృతరాష్ట్ర మహారాజున కాత్మమిత్రుండగు నధిరథుండను సూతకులఁ బ్రసూతుండొకడు తన పత్ని యగు రాధతోఁగూడి గంగానదిలో స్నానమాచరింప వచ్చెను. ఆతఁడట్లు స్నానము సేయుచు దూరముగా నా నదీ తరంగములలో నుయ్యెల లూగుచు నరుదెంచు మణిమంజూష నాలోకించెను. అధిరథుఁ డద్దానింగాంచినంతనే మిక్కిలియక్కజంపడి తన పరిజనులం బంపి పట్టి తెప్పించెను.
అతఁడా మందసము నేకాంతమ్మునం దెఱచి చూడఁగా నందు దివ్యతేజో విలాసములచే దిగంతముల దీప్తి మంతములు గావించు నొక పసిబిడ్డ కన్నులకు మిరుమిట్లు గొలిపెను. విమల కమలదళ లోచనుండును, విశాల ఫాలభాగుండును, సువర్ణ దేహుండును, సుదృఢ సుదీర్ఘ సుందర బాహుండును, సహజ కవచకుండల మండితుండును, తరుణభాస్కరశోభాభాసమానుండును నగు నక్కుమారునింగాంచి మనంబున సంతోష సంభ్రమాశ్చర్యమ్ములు ముప్పిరిగొన తన ప్రియ పత్నియగు రాధకుం జూపి "దేవీ! నేటికి మన తపములు ఫలించినవి. మన కష్టములు కడతేరినవి. మన కాంక్షలీడేరినవి. అనపత్యులమైన మనపై ననుకంప పెంపున దయా మయుఁడగు భగవంతుఁడే మనకీ యనుంగుబిడ్డ ననుగ్రహించి నాఁడు చూడుము! వీఁడు సామాన్య మానవ బాలకుఁడుగాఁ గానవచ్చుట లేదు. వీని ముఖద్యుతులు దేవాంశ సంభవుఁడని చెప్పకయే చెప్పుచున్న"వని పలుచుచు వాని నామె చేతులలో నుంచెను. రాధయు నింతింతనరాని సంతోషాతి శయముతో నక్కుమారు నెత్తుకొని మాటిమాటికి నక్కున నొత్తికొనినది.
Previous Page
Next Page