మెయిన్ గేటు ముందు ఆగిన నీలంరంగు మెర్సిడస్ కారులోంచి, ఓ పెద్ద మనిషి, ఠీవిగా దిగి, లోనికి రావటం చూసాడు. భారీ విగ్రహం- అక్కడక్కడ నెరిసిన జుత్తు... హుందాగా నడుచుకుంటూ, ఉద్యోగస్తుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ కాకుండా ఇంకొక లిఫ్ట్ ఎక్కాడు- లిఫ్ట్ తలుపులు మూసుకున్నాక ఆ లిఫ్ట్ పైన రాసున్న అక్షరాలు వేపు చూసాడు-
FOR CHAIRMAN ONLY -అనుందక్కడ- ఆయనేనా ఛైర్మెనా?
ఆయనేనా తన మేనమామ...? నమ్మలేక పోయాడు. విచిత్రమయిన ఉద్వేగానికి గురయ్యాడో క్షణం. ఆ పైన అక్కడుండలేక పోయాడు.
* * * *
ఆ రోజంతా పిచ్చిపట్టినట్లుగా బెంగుళూరు రోడ్లెంట తిరిగేసి సాయంత్రానికి తను దిగిన ప్రకాష్ కేఫ్ కొచ్చాడు. ఆ రాత్రంతా శక్తికి నిద్ర పట్టలేదు. మర్నాడు సరిగ్గా ఉదయం పదిగంటలు...
స్పెషల్ పి.ఏ.రూమ్ ముందు పచార్లు చేస్తున్నాడు శక్తి. అప్పుడే అక్కడకొచ్చిన పి.ఏ. ప్యూన్-
వచ్చేసేవా... అన్నట్టు చూసి, లోనికెళ్ళి స్పెషల్ పి.ఏ.తో చెప్పడం, ఆ వెన్వెంటనే శక్తి ఆయన రూమ్ లో కెళ్ళడం జరిగాయి. ఆ స్పెషల్ పి.ఏ. పేరు రామబ్రహ్మం- నలభయ్ ఏళ్ళుంటాయి.
"చెప్పండి" అన్నాడు రామబ్రహ్మం.
తనొచ్చిన పనిని వివరంగా చెప్పాడు శక్తి.
"ఛైర్మన్ గారిని కలవాలా!?" శక్తిధర్ వేసుకున్న దుస్తులవేపు చూస్తూ హేళనగా నవ్వుతూ అన్నాడు రామబ్రహ్మం.
ఆ నవ్వు విపరీతమైన కోపం తెప్పించింది శక్తిలో. అయినా నిగ్రహించుకున్నాడు.
"ఆయన మా మేనమామ. మా అమ్మగారు లెటర్ కూడా ఇచ్చారు. జేబులోంచి లెటర్ తీసి చూపెడుతూ కోపంగా అన్నాడు శక్తి.
"నాకు తెల్సినంత వరకూ, ఆయనకు అక్క చెల్లెల్లెవరూ లేరే... మీరు ఏ వెంకటనారాయణ అనుకుంటున్నారో.... ఒకసారి కన్ ఫర్మ్ చేసుకోండి" నెమ్మదిగా చెప్పాడాయన.
"నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలిసే మాట్లాడుతున్నాను. డూ యువర్ బాజ్... దట్సాల్... ఆయన నాకు ఎపాయింట్ మెంట్ ఇవ్వనంటే చెప్పండి... అదే మీ డ్యూటీ...." కోపంగా అన్నాడు శక్తి.
"అయినా, ఛైర్మన్ ఇవాళ చాలా బిజీ... జపాన్ డెలిగేట్స్ తో మీటింగ్స్ వున్నాయి" ఖరా ఖండీగా చెప్పేసాడు రామబ్రహ్మం.
శక్తికి ఏం మాట్లాడాలో తోచలేదు. తల్లిగానీ, పొరపాటు పడిందేమో... తను ఫూల్ అవుతాడేమో...? ఉత్సాహమంతా నీరు కారిపోయింది.
"లెటరేదో తెచ్చామంటున్నారు కదా... ఇవ్వండి... పంపిస్తాను చూస్తాను. రేపు రండి మీరు- లేకపోతే ఫోన్ చెయ్యండి...." ఆయన మాటలతో శక్తి ముఖం ఒకింత తేటపడింది.
గబుక్కున జేబులోంచి లెటర్ తీసి, టేబిల్ మీద పెట్టి... "రేపొస్తానండి" అంటూ లేచి నిలబడ్డాడు. ఆ లెటర్ తీసుకుని, టేబుల్ సొరుగులో పెట్టాడాయన. ఆ గదిలోంచి బయటికొచ్చాడు శక్తి.
నెమ్మదిగా మెట్లు దిగుతున్నాడు.
నిన్నట్లాగే, ఛైర్మన్ కనిపిస్తే బాగుణ్ను- కింద హాల్లో కొచ్చి, అక్కడ కూర్చున్న విజిటర్స్ వేపు, తిరుగుతున్న మనుష్యుల వేపు చూస్తూ నిలబడ్డాడు.
అదే సమయంలో-
అతని వేపే వస్తున్న ఓ వ్యక్తికి చూసాడు. ఆ వ్యక్తి నేరుగా శక్తి దగ్గరకొచ్చాడు.
"మిమ్మల్ని నిన్న చూసాను. ఇవేళ చూసాను- ఎవరికోసం వచ్చారు మీరు" నవ్వుతూ అడుగుతున్న అతని ముఖంవేపు చూసాడు శక్తి.
"వెంకటనారాయణ" విసుగ్గా అన్నాడు శక్తి.
"వెంకటనారాయణ అంటే... పర్సనల్ డిపార్ట్ మెంట్... ఆయనేనా...? నేను కూడా మొదట ఇలా బాధపడ్డవాడినే...." చనువుగా అన్నాడతను.
"వెంకటనారాయణ ఎక్కడకు పోడుగానీ... ముందు.... కాఫీ తాగుదాం పదండి" అంటూ ఆ వ్యక్తి దారితీసాడు. మరేం మాట్లాడలేక పోయాడు శక్తి.
ఇద్దరూ హాల్లోంచి బయటికొచ్చారు.
కుడిపక్కన ఇరవై అడుగుల దూరంలో వున్న స్టాఫ్ కేంటిన్ వేపు నడిచారు.
"నా పేరు భగవాన్... ఎకౌంట్స్ లో పనిచేస్తుంటాను. మీది కృష్ణాజిల్లానా? మీ భాషని బట్టి కనిపెట్టానులేండి" అన్నాడతను అంతకు ముందెంతో పరిచయం ఉన్నవాడిలా.
అవునన్నట్లు తలూపాడు శక్తి.
భగవాన్ కి ముప్పై ఏళ్లుంటాయి...
"చెప్పండి... కాఫీయా... టీయా... టిఫినా...." కూర్చుంటూ అడిగాడు భగవాన్.
"కాఫీ చాలండి...." మొహమాటంగా అన్నాడు శక్తి.
"ఓ.కే..." లేచి టోకెన్లు తీసుకొని, రెండు కాఫీ కప్పుల్ని పట్టుకుని వచ్చాడు భగవాన్.
"తీసుకోండి... చెప్పండి... కృష్ణాజిల్లానా... ఏ వూరు..." అడిగాడు భగవాన్.
"జగ్గయ్యపేట దగ్గరున్న నందిగామ" చెప్పాడు శక్తి.
"నారాయణగాడితో ఏం... పని.... జాబ్.... కోసమా? వాడు మాయల మరాఠీ అండీ బాబూ.... వాడ్ని మేనేజ్ చెయ్యటం కష్టం... అసలు ఈ ఆఫీసులో..." భగవాన్ ఏం చెప్పినా, ఉపన్యాసంలా వుంటుంది.
"పర్సనల్ డిపార్ట్ మెంట్లో నారాయణ ఉన్నాడో లేదో, నాకు తెలీదు గానీ... నేను మాత్రం ఛైర్మన్ వెంకటనారాయణ గారి కోసం వచ్చాను..." శక్తి నోట్లోంచి వచ్చిన మాట వినగానే...
కాఫీ తాగడం ఆపేసి, శక్తి కళ్ళవేపు అయోమయంగా చూసాడు భగవాన్... కనురెప్పల్ని టపటపలాడించాడు.
"ఛైర్మన్... ఛైర్మన్... మీకు తెలుసా?" కంగారు పడిపోతూ అడిగాడు భగవాన్.
"ఛైర్మన్... మా మేనమామ... కలవటాని కొచ్చాను..." అలా చెప్పటం వలన భగవాన్ నమ్ముతాడో లేదోననే సందేహం పీడిస్తున్నా చెప్పేసాడు శక్తి. అసలలా చెప్పవలసి రావటమే చాలా ఇబ్బందిగా వుంది శక్తికి.
"ఛైర్మన్... మీ అంకులా... ఈజిట్ ట్రూ...." శక్తి దుస్తులవేపు, వాలకం వేపు చూస్తూ, నమ్మలేనట్లు అన్నాడు భగవాన్. ఏ పుట్టలో ఏ పాముందో అనే సామెతని నమ్ముతాడు గనుకే అలా అడిగాడు భగవాన్.