Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 23


                         భారత ప్రతిభ
    
                                            కర్ణుఁడు
    
                                             1
    
    
    అది యొక సుందరోద్యానము. ఆ యుపవన మధ్యమునందొక మహోన్నత సౌధరాజము కన్నుల పండువుగ విరాజిల్లుచుండెను. ఎవ్వరో పదునాలుగు పదునైదేండ్ల నవయౌవన శోభాభాసమాన యగు సుందరీ శిరోమణి యొకర్తుక యా సౌధద్వారములు దెరచుకొని తదీయ మణిమయసోపాన పంక్తి నల్ల నల్లన నవరోహించుచుండెను. ఆ యంగన బంగారు మేలిముసుంగు గాంచిన నెవ్వతయో రాజకుమారి వలెఁ దోచుచున్నది.
    కన్నియవలెఁ గనుపించు చున్నదేగాని యామె కరకమలములం దెవ్వఁడో చిన్న బాలుఁడున్నట్లున్నది. ఆ బిడ్డ యామెకేమియగునో? ఆ విధంగా నా రాజకుమారి వాలు గందోయినుండి జాలువారు బాష్పధారలతో నా ముద్దుల పసిపాప చెక్కుటద్దములు దడయుచుండుట కేమి హేతువో!!    
    కొంత దూరమువరకు మేడమేట్లు దిగివచ్చిన యా నెలంత చటుక్కున నిలిచిపోయినది. ఆ సుకుమారి సుమకోమల హృదయ మెందులకో గాని దడదడ కొట్టుకొన సాగింది. ఆ కరుణామయి చరణద్వయ మే కారణముననో గడగడ కంపించి పోవుచుండెను. ఆమె వెనుకకుఁ దిరిగి యొక్క మాటున ప్రాసాదము దెసఁ గనుఁగొని  వేడి నిట్టూర్పుఁ బుచ్చి మరల ధైర్యము దెచ్చుకొని మందగమనముతో ముందునకు సాగినది.
    సౌధసోపానపంక్తితదంతిక ప్రదేశమునఁ బ్రవహించుచున్న యశ్వనదీ తరంగములలోని కమర్చఁబడి యుండెను. మన రాకుమారి చిట్టచివరి మెట్టుమీఁ దికి వచ్చి నిశ్చేష్టురాలై నిలిచి పోయినది. ఆమె కోమల హస్తములలో నున్న చిన్నారి బిడ్డఁడు మాటిమాటికి జననీవాదన బింబమును సందర్శించుచు మందహాసము గావించుచుండెను. ముద్దులు మూట గట్టు మృదు పద పంకజముల నటునిటుఁ గదలించుచుఁ దృళ్ళింత లాడుచుండెను.
    అదిగో! ఆ ప్రశాంత ప్రభాతః మలయమారుత వీచికలలో నా రాజకుమారి మేలిముసు గొక్కింత ప్రక్కకుఁ దొలగినది. జలధారమాల చాటునుండి బయలుపడిన పరిపూర్ణ పూర్ణిమ చంద్రబింబము పగిది నామె సుందరవదనము సుష్పష్టముగాఁ గానవచ్చుచున్నది.
    సరి సరి! పోల్చుకొన్నాము. ఆమె కుంతిభోజ రాజేంద్రుని గారాబు పుత్రికయగు కుంతీకుమారి. మరియామె హస్తములలోని పసిబాలుఁడో! వాని కర్ణ యుగమునందు మంజులములగు మణిమయకుండలములు తళ తళ మెరయుచున్నవే! వాని శరీరమునం దావజరకవచ మెచ్చటి నుండి వచ్చినది! పుట్టియు పుట్టకముందే పొత్తిళ్ళలోని యా పసి పాపకు ననన్య సామాన్యములు నత్యంత ప్రభా విభాసితములు నగు కవచకుండలములను గాన్క గావించివా రివ్వరో!
    బాలభాను నంకాశమగు నబ్బాలుని వాదన మండలము నందలి ప్రకాశముఁ జూచిన, వాడు సాధారణ బాలకుఁడు గాఁడనియు, తప్పక దేవాంశ సంభూతుడై యుండవలయు ననియుఁ దోఁచక మానదు. ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డ నెత్తుకొని యా రాజకుమారి యెచ్చటికిఁ బోనున్నదో! ఆమె కంపమాన గాత్ర వల్లికను గాంచిన తదీయ హృదయాంతరాళమునం దేదియో భరింపరాణి యావేదన తాండవించుచున్న దనవచ్చును. మాటి మాటికీ నదీ ప్రవాహము వైపును, చేతులలోని యమాకుడైన చిన్నారి బిడ్డవైపును, గడచివచ్చిన ప్రాసాద సోపాన పంక్తివైపును, చంచల నయనాంచలములతో బాల కురంగివలె బెదరి బెదరి చూచు నామె కేంతతి కష్టము వాటిల్లెనో! ఆమె యదృష్ట తారాపథమున నెట్టి కారు మబ్బులు గ్రమ్ముకొనెనో యెవరు చెప్పగలరు!
    అల్లదిగో! మెల్ల మెల్లన నదీ తరంగములలోనికి దిగి పోవుచున్నది. పాప మా ప్రపంచ మెరుఁగని పసిబాలునితోఁ బాటు మన కుంతీకుమారి యశ్వనదీ గర్భమున గలిసిపోవుట లేదుగదా! మరల నేమి తలంచెనో, యేమి నిశ్చయించుకొనెనో, యించుక యాగి వెనుదిరిగి మెట్టు పైకి వచ్చినది. అచ్చట నాసీనురాలై ప్రేమాంకమున నున్న ముద్దులపట్టి చెక్కుటద్దములు ముద్దులాడుచున్నది.
    ఆహా! పరమ పవిత్రమగు మాతృహృదయముగాకున్న నా ప్రేమచుంబనమున కంతటి మాధుర్య మలవడునా? ఆ బాష్పధారల కంతతి నైర్మల్యము సిద్ధించునా!!
    ఆ కరుణామూర్తి గద్గద కంఠములో నుండి యేదియో విషాద వీణ మ్రోగుచున్నది.
    "తండ్రీ! నేనెంత దురదృష్టవంతురాలనురా! పరమ నిర్భాగ్యురాలగు నీ పాపిష్టురాలి గర్భమున నీవేల జన్మించితి వోయీ! అయ్యో! అల్లారుముద్దుల తండ్రివగు నిన్నిప్పుడేమి చేయుదును! ఎవ్వారి కప్పగింతును? జననీజనకుల కొక్కింత యీ రహస్యము దెలిసెనేని నా సౌశీల్యమున కెంతటి మచ్చ? పరిచారికలు పసికట్టరేని పరి పరి విధములఁ బరిహసింపకుందురా? చుట్టపక్కములకుఁ దెలిసిన మా వంశ మర్యాద దక్కునా? నా యవివేకమున నలుగురిలో నవ్వుబాట్లకు లోనగు నవస్థను చేతుల మీదుగాఁ గొనిదెచ్చుకొంటిని.
    అయ్యో! మహామునీందృఁడగు దుర్వాసుఁడు మా గృహమ్మున కేల రావలయును? అమ్మహానుభవుని పరిచర్యకై తండ్రి నన్నేల నియోగింపవలయును? వినయ విధేయతలతోఁ గూడిన నా సేవలకు ముదమ్ము పడి మునీందృఁడు నాకా మహామంత్రము నెల యుపదేశింపవలయును? ఆ పరమ మంత్ర ప్రభావమును బరీక్షించుటకై బాలభాస్కరుని నే నేలఁ బ్రార్థింపవలయును? ఆర్ధించినదే యాలస్యముగా నా లోక బాంధవుఁడు సముఖమ్మున కేగుదెంచి యీ బంగారు తండ్రిని నా కేల యనుగ్రహింప వలయును? 'నీ కన్యాత్వమున కెట్టి కళంకము కలుగబోఁదని కమల మిత్రుఁడు నన్నోదార్చి యంతర్హితుండయ్యెనేగాని యంతమాత్రమున నా స్వాంతమునకు శాంతి యెట్లు సమకూరును? లోకులఁ గన్నులు గప్పి యీ కన్నతండ్రి నెంతకాల మంతఃపురములో రహస్యముగా దాచుకొనగలను? కానిమ్ము అఖిల కలుషాపహారకరమగు నీ యశ్వనదీ గర్భమున నా కన్నకడుపుతోఁగలిసి పోయెదను."
    ఇట్టు లారాచపట్టి కరుణకంఠముతో బిట్టు వాపోవుచు మరల నా నదీ తరంగములోనికి నొకటి రెండు మెట్లు దిగినది. ఇంతలో దూరమున నక్కాంతామణి కాతరంగిణీ తరంగ మాలికా డోలికలలోఁ దేలియాడుచు నొక్కమణిమయ మంజూష మెల్ల మెల్లగాఁ గొట్టుకొని వచ్చుట దృగ్గోచరమయ్యెను. అంతకంతకు నంతికమున కరుదెంచు నా పెట్టియవంక నట్టె రెప్ప వెట్టక చూచి చూచి తలయూచి యా రాచకన్నియ పెట్టె పొడవును, దన ముద్దులపట్టి పొడవును సవిస్మయముగను, సవిమర్సముగను బరిశీలించి లోలోపల నాలోచింప సాగినది. ఆ మందసమును సందర్శించుటనే నామెకేమి తోఁచినదో యేమో ముందుకు వైచిన యడుగు మెల్లగా వెనుకకు వైచినది. "ఆత్మహత్య శిశుహత్య మహాపాపహేతువు"లని యామె కర్ణకుహరములలో బ్రతిధ్వనించినట్లుండెను. ముద్దుబిడ్డతో నదీ గర్భమున మునిగిపోవుటకు సిద్దముగా నున్న యా వెలంది యతర్కిముగ నాగిపోయినది.

 Previous Page Next Page