Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 24


    "నీ మాటలు అబద్ధాలు కావు - నిజాలు కావు. కటకటాల వెనుక  బంధితుడైన వ్యక్తి తానారాధించే దేవతకు బాహాటంగా గుడి కట్టి పూజ చెయ్యటానికి ఆశక్తుడే కావచ్చు. అంతమాత్రాన అతని మనసులోని ఆరాధన అబద్ధం కాదు...."   
    "దేవత".... "ఆరాధన...." భాస్కర్ నోటనుండి తన నుద్దేశించి వచ్చిన ఆ రెండు పదాలకు విభ్రాంతురాలయింది జ్యోత్స్న. అప్పటికప్పుడే అతని పాదాలమీద వాలి ఆత్మార్పణ చేసుకోవాలనిపించింది.... ఉదాత్తుడయిన ఈ యువకుని ప్రేమకంటే లోకంలో మరేదీ విలువైనది కాదనిపించింది.    
    భాస్కర్ లేచి ఇవాళ మిమ్మల్ని చాలా కష్టపెట్టాను క్షమించండి. కానీ, ఒక్క విషయం మీ దృష్టిలోకి తెస్తున్నాను. ఇన్నాళ్ళ మన పరిచయంలో నేను ఏనాడూ మిమ్మల్ని అనుచితంగా ఏదీ కోరలేదు. నామీద లేనిపోని అభాండాలు వెయ్యడం మీకు న్యాయమేనా! నామీద కోపం ఉంచుకోకండి. ఈ భాస్కర్ మీకెప్పటికీ స్నేహితుడేనని గుర్తుపెట్టుకోండి...." అని వెళ్ళిపోయాడు.    
    భాస్కర్ వెళ్ళిపోగానే జ్యోత్స్న కంటినుండి కన్నీరు కాలువలు కట్టింది.
    లోకంలో వేయిమందిలో ఏ ఒక్కరికో కాని లభ్యంకాని అదృష్టం తనను వరించింది. కానీ ఆ అదృష్టదేవత కత్తులకోసం నిలబడి అందాలు చిందిస్తూ తనను ఆకర్షిస్తూంది. "రా రమ్మని ఆప్యాయంగా ఆహ్వానిస్తూనే "సర్వ నాశనమయి కాని నన్ను వదులుకోలేవు" అని హెచ్చరిస్తోంది.
                                        12
    మచ్చల డాక్టర్ ప్రాక్టీస్ బాగా పెరిగింది- అతని బేంక్ బేలెన్స్ కూడా పెరిగింది. సుబ్బలక్ష్మి పుణ్యమా అని మచ్చల డాక్టర్ పేషెంట్స్ జ్యోత్స్న జోలికి రావటంలేదు.
    మచ్చల డాక్టర్ జ్యోత్స్నను చాలా గౌరవించేవాడు - ఆవిడతో ఏదైనా మాట్లాడటానికి భయపడేవాడు - ఆవిడకంటే తను కొంత తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిననే భావం అతనికి లోలోపల ఉండేది.  
    కానీ, ఇటీవల అతని దృష్టి మారింది. జ్యోత్స్న బొంబాయి హోటల్లో అర్థనగ్న ప్రదర్శనలిచ్చేదనే రహస్యం తెలిసినప్పటి నుంచీ, అతనికి జ్యోత్స్న అంటే లోలోపల ఉండే భయం పూర్తిగా పోయింది - ఎదురు 'పాపం, అభాగ్యురాలు !' అనుకునేవాడు - రేవతి, ఐరావతమ్మ, జ్యోత్స్నను వెలివేసిన దానిలా చూడటం - జ్యోత్స్నతో మాట్లాడటానికే చిరాకు పడటం - ఇదంతా చూసి 'పాపం' సమాజం ఈవిడని ఇలాగే చూస్తూంది అని జాలి పడేవాడు-
    ఇలాంటి ఆలోచనల మధ్య 'జ్యోత్స్నను తను పెళ్ళి చేసుకుంటే?' అనిపించింది. ఛీ! అర్థనగ్న ప్రదర్శనలిచ్చిన మనిషిని పెళ్ళి చేసుకోవటమా! అని కొంచెంసేపు మథనపడ్డాడు.
    చివరకు, ఏమైనాసరే, జ్యోత్స్నను 'ఉద్ధరించటానికే' సంకల్పించుకున్నాడు - ట్రిమ్ గా తయారయి జ్యోత్స్న వాటాలోకి వచ్చాడు -
    మాజీ తహసీల్దారుగారికి భయపడినట్లుగా మచ్చల డాక్టర్ కి భయపడదు, జ్యోత్స్న-
    "రండి? కూర్చోండి!" అని ఆహ్వానించి కుర్చీ చూపించింది.
    "ఇవాళ మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడటానికి వచ్చాను-"
    "మాట్లాడండి-"
    తీరా చెప్పబోయేసరికి, తను చెప్పదలచుకున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు మచ్చల డాక్టర్ కి.
    "నా ప్రాక్టీస్ బాగా పెరిగింది-"
    "చూస్తున్నానుగా!"
    "నా టేలెంట్ జనం గుర్తిస్తున్నారు."  
    "అవును టేలెంట్ ఉండాలేగాని, ఆలస్యంగానయినా బయట పడుతుంది."
    "ఎందుకూ, మీకే తెలుసుగా, నా మందులెంత బాగా పనిచేసేది? మీకు తలనొప్పి వచ్చినా, కడుపునొప్పి వచ్చినా, నామందు వేసుకోగానే వెంటనే తగ్గిపోయేది-"
    "అవును!"
    "బేంక్ లో కూడా కొంతడబ్బు వెయ్యగలిగాడు -"
    "మంచిదే! ఇంకా వెయ్యండి! పొదుపుగానే ఉండాలి!
    "ఇన్నాళ్ళూ, నాకు పెళ్ళి చేసుకునే ఆలోచనరాలేదు. కానీ ఇప్పుడు-"
    ఆగిపోయాడు మచ్చల డాక్టర్....
    అతడు చెప్పదలచుకున్న దేమిటో అర్థమయి పోయింది జ్యోత్స్నకి .... ప్రతి ఒక్కరూ తిరిగి తిరిగి ఈ దశకే చేరుకుంటున్నారు - మాట్లాడకుండా కూర్చుంది....
    "నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను - అనేశాడు మచ్చల డాక్టర్.
    నిర్లక్ష్యంగా నవ్వింది జ్యోత్స్న -
    "మీరు నన్ను పెళ్ళి చేసుకోవటమేమిటండీ!"
    "అలా మాట్లాడకండి - జీవితంలో ఎప్పుడో, ఏదో, పొరపాటు జరిగినంత మాత్రాన జీవితం వ్యర్థమయి పోవలసినదేనా! మీ జీవితం అలా నాశనం కానియ్యను. మీకోసం ఈ మాత్రం త్యాగం చెయ్యగలను నేను...."
    'జీవితం నాశనం కానియ్యను-' 'త్యాగం చెయ్యగలను' ఈ రెండు మాటలకూ రగులుకుపోయింది జ్యోత్స్న మనసు - కోపంతో తలెత్తింది.                          

 Previous Page Next Page