భాస్కర్ వచ్చి "గుడ్ ఈవినింగ్! నేనిలా కూచోవచ్చునా?" అన్నాడు.
భాస్కర్ ధోరణి ఎప్పటిలాలేదు. ఎంతో పొగరుగా మాట్లాడుతున్నాడు. ఏదో వెటకారపు ధోరణి అడుగడుగునా కనిపిస్తోంది. ఆ ధోరణి చూసి బిత్తరపోయింది జ్యోత్స్న. ఎన్నెన్నో చెప్పాలనుకున్న గొంతు పెగలటంలేదు.
భాస్కర్ అంతటితో ఆగలేదు. మరింత వెటకారంగా, నిరసనగా "మానవుల మనసు ఎప్పటికప్పుడు వికసిస్తోనే ఉంటుంది కదూ! మామూలు మధ్యతరగతి ఉద్యోగస్థుణ్ణి బ్రహ్మాండమైన అభిప్రాయాలతో అదరగొట్టి.... పెళ్లి చేసుకుంటానన్నా, తిరస్కరించి బాగా డబ్బున్న నడివయసు మనిషిని ప్రక్కలో పడుకోబెట్టుకునే వరకూ వికసించింది మీ మనసు. మీ ధియిరీ ప్రకారం ఈ వికాసం ఇక్కడితో ఆదనుకుందా! ముందు ముందు ఇంకా ఎంత వికసిస్తుందో చూడాలి!" అన్నాడు.
ఈ నిష్టూర పరిహాసాన్నీ, నిరసననీ జ్యోత్స్న సహించలేక పోయింది.
"ఏం లాభం లేదు. నా మనోవికాసాన్నీ మీలాంటివాళ్ళు ఏనాటికీ చూడలేరు. డబ్బుకోసం.... అవసరాలకోసం శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని.... ఆ అవసరం తీరగానే కట్టుకున్న భార్యని ఎలా వదిలించుకోవాలా అని చూసే వ్యక్తులకు.... ఆ భార్య కళ్ళు కప్పి అందమైన అమ్మాయిలను పెళ్లి పేరుతో వలలో వేసుకోవాలని చూసే స్వార్థపరులకు.... వికాసమనే మాటకి అర్థమైనా ఎలా తెలుస్తుంది!"
భాస్కర్ కి మండిపోయింది
"ఏమన్నావ్! పెళ్ళిపేరుతో అందమైన అమ్మాయిని వలలో వేసుకోవాలని చూశానా?"
"కాకపోతే? శాస్త్రోక్తంగా మెళ్ళో తాళికట్టించుకుని అన్ని హక్కులూ పొందిన భార్యని సునాయాసంగా వదిలెయ్యగలిగిన పెద్దమనిషి, అవసరానికి చేసుకున్న అబద్దాల పెళ్ళికి విలువ నిస్తాడా?"
భాస్కర్ ముఖం పాలిపోయింది. మనసు భగభగలాడింది.
"అంతేలే? అంతకంటే నీకు ప్రేమగురించి ఏం తెలుసు ప్రేమతో వ్యాపారం చేసే మనుష్యులు హృదయాలకు సంబంధించిన ప్రేమను ఎలా అర్థం తెలుసుకోగలరు?"
"హృదయాలకు సంబంధించిన ప్రేమ!.... అది ఎలా ఉంటుంది బాబుగారూ? ఒక యువతి ఎక్కడో అర్థనగ్న ప్రదర్శన లిచ్చేదని వినగానే, ఆమె చెడిపోయినట్లేనని నిర్థారించుకుని ఒక రాత్రివేళ ఆమె గదిలోకి చేరటానికి ప్రయత్నించటమా, హృదయాలకి సంబంధించిన ప్రేమ?"
నిర్ఘాంతపోయాడు భాస్కర్....
''''ఛా! ఛా! ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వూ నేను నీ గదిలోకి అందుకు వచ్చానా! ఆ సాయంత్రం నీ ఆవేదన చూసి, సహించలేక ఓదార్చాలని.... అంతేలే! అంతకంటే ఏమి అర్థమవుతుంది నీకు!"
"మీరు అందుకు రాలేదు.... కానీ, మీ మాఁవగారు మాత్రం అందుకే వచ్చారు. మీరొక్కరు మాత్రం ఉదారులు, మిగిలిన వాళ్ళంతా నీచులు - సాయంత్రం ఆవేదనపడుతోంటే చూసి జాలిపడ్డారు- రాత్రి ఏం జరుగుతోందో తెలియకుండా అసహ్యించుకున్నారు. హోటల్లో అర్థనగ్న ప్రదర్శనలిచ్చినట్లు తెలిసినా, మంచిదని నమ్మారు - ఒక మొగాడితో ఏకాంతంలో కనిపించగానే వ్యభిచారిణి అనే నిర్ణయానికి వచ్చేశారు! ఎంత బలమైనవండీ మీ అభిప్రాయాలు?"
తెల్లబోయి చూశాడు భాస్కర్.... ఏదో అసహనంతో ఉడికిపోతున్న అతని అంతరంగం ఒక్కసారిగా చల్లబడిపోయింది. వడిలిపోయి ఉన్న జ్యోత్స్న ముఖం చూస్తోన్న కొద్దీ అతనికి జాలి కలుగుతోంది. పసిపాపనులా ఆమెను తన చేతుల్లోకి తీసుకుని గుండెల్లో దాచుకోవాలనిపిస్తోంది.
"ఏం జరిగింది?" అని అడిగాడు మెల్లగా, తలవంచుకుని....
"హమ్మయ్య! ఎంతసేపటికి అడిగారు? కానీ ఈ ప్రశ్నకు నేను చెప్పవలసిన సమాధానమేముందీ! మీరే తెలుసుకోగలరు!"
"అంటే!"
"వెంకట్రావుగారినే అడగండి, ఏం జరిగిందో - ఆయనే అన్ని విషయాలూ చెపుతారు."
భాస్కర్ ముఖం పాలిపోయింది.
"మాఁవగారినా!"
విరగబడి నవ్వింది జ్యోత్స్న.
"ఏం మీ మాఁ వగారిని ఎందుకు అడగలేరు! ఒకటి. ఆయన మొగవాడు. ఆయన ఏం చేసినా అది మీ దృష్టిలోకాని, సమాజం దృష్టిలో కాని తప్పుకాదు. హోటల్లో అర్థనగ్న ప్రదర్శన లిచ్చిన నన్ను నీచంగా చూస్తూ ఆ ప్రదర్శనలను చూసి ఆనందించటానికి వచ్చిన ఆ పురుష పుంగవుణ్ణి గౌరవించి సమ్మానించగలరు. ఆయన్ను నిలదీసి అంత రాత్రివేళ జ్యోత్స్న ఇంటికి ఎందుకు వెళ్ళారని అడగలేరు.... రెండు.... మీరు జ్యోత్స్నను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారు - ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారంటే - ఈ ప్రేమ వ్యవహారం ఏ కొంచెం బయటికివచ్చినా భరించలేనంత గాఢంగా ప్రేమిస్తున్నారు. అంతా మూడో కంటికి తెలియకుండా రహస్యంగా జరిగిపోయినంత వరకే మీ ప్రగాఢ ప్రేమ నిలుస్తుంది.... మూడవది ఆయన మీ మాఁ వగారు. మీ భార్యకు తండ్రి. అంచేత మీ రహస్య ప్రణయం ఆయనకు తెలియడానికి వీల్లేదు. అలా తెలిసిపోతే మీరు చిక్కుల్లో పడవలసి వస్తుంది.... అంతే కదూ!"
భాస్కర్ వంచిన తల ఎత్తలేకపోయాడు. ఎంతోసేపటికి నిదానంగా అన్నాడు.