Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 25


    ఎంతో అభిమానంతో, అమాయకంగా జ్యోత్స్ననే చూస్తున్నాడు మచ్చల డాక్టర్.
    జ్యోత్స్న కోపం కరిగిపోయి తననింత పెద్దగా అభిమానించే ఆ తెలివితక్కువ డాక్టరంటే జాలి కలిగింది - అతని భాషలోనే అతనికి సమాధానం చెప్పాలనుకుంది -
    "వద్దు ఏకాంబరంగారూ! ఈ అభాగ్యురాలిని మీరు పెళ్ళి చేసుకోవద్దు - ఎవరైనా లక్షణమైన పిల్లను పెళ్ళి చేసుకుని హాయిగా జీవితం గడపండి -" అంది గంభీరంగా.
    "అలా మాట్లాడకండి! మీకోసం ఏ త్యాగం చెయ్యటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. మీరు ఎలాంటి వారైనా ఎలా జీవించినా, నేను నిండు హృదయంతో స్వీకరించగలరు-"
    అతని పీక నొక్కాలనిపించింది జ్యోత్స్నకి - అయినా శాంతంగా "ఏమిటి ఏకాంబరం గారూ! మీరొక్కరేనా త్యాగం చెయ్యగలిగింది? నేను త్యాగం చెయ్యలేనా? చూస్తూ చూస్తూ నాలాంటి హీనురాలిని పెళ్ళి చేసుకుని మీ జీవితం నాశనం చేసుకోవటానికి ఎలా ఒప్పుకోగలనండీ! వద్దు! వద్దు! స్వార్థంతో మీ బ్రతుకు బుగ్గి చెయ్యలేను - మరో అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోండి - మీ ప్రాక్టీసు, మీ బేంక్ బేలెన్స్ - వీటన్నిటికీ తగిన దాన్ని చూసి చేసుకోండీ-" అంది.     
    మచ్చల డాక్టర్ అప్పటికీ వదలకుండా ఏదో చెప్పబోతుండటం చూసి జ్యోత్స్న భరించలేక "ఇంకా వెళ్ళండి ఏకాంబరంగారూ! ఈ జీవితంలో పెళ్ళి ఆశవదిలేసుకున్నాను - ఆ ప్రస్తావన తేకండి- పెళ్ళి మాట ఎలా ఉన్నా, ఉద్యోగం సంగతి చూసుకోవాలి - నాకు షాప్ కి టైమయిపోతోంది-" అంది కొంచెం విసుక్కుంటు-   
    ఆ విసుగు చూసి ఇంకేం మాట్లాడలేక లేచి వెళ్ళిపోబోతూ, గుమ్మం దగ్గిర ఒక్క క్షణం ఆగి "ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. మీకోసం ఏం చెయ్యటానికయినా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు పతిత అనే భావంతో చిన్నచూపు చూడలేను" అన్నాడు.
    అతణ్ణి సాగనంపి తలుపులు వేసుకుని మంచం మీద పడి దొర్లి దొర్లి నవ్వింది జ్యోత్స్న. అంతలో భరించలేని దిగులు కూడా ఆవరించుకుంది. ఈనాటికి మచ్చల డాక్టర్ కూడా తనను ఉద్ధరించటానికి తయారవుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం! అనుకుని బాధపడింది.     
    మచ్చల డాక్టర్ జ్యోత్స్నను అంతటితో వదిలి పెట్టలేదు. ఆ సాయంత్రం మళ్ళా వచ్చాడు.
    ఆ సమయానికి జ్యోత్స్న వంటింట్లో వంట చేసుకుంటోంది. మచ్చల డాక్టర్ కంఠం వినగానే విసుగూ, కోపమూ, చికాకూ ఒక్కసారిగా కలిగాయి. అతడు మచ్చల డాక్టర్ కాకపోతే.... నలుగురిలో నిర్దాక్షిణ్యంగా పరిహసింపబడుతూ నలిగిపోతున్న వ్యక్తి కాకపోతే.... చెప్పు తీసుకు కొట్టినట్లు సమాధానం చెప్పేది.  
    వంటింట్లోంచే "కూర్చోండి - వస్తున్నాను" అనేసి తాపీగా వంటలో మునిగిపోయింది. కావాలని మరింత ఆలస్యం చేసింది. ఈ రకంగానయినా అతడు తన అయిష్టాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోతాడని ఆశపడింది.
    దగ్గిర దగ్గిర గంటన్నర తరువాత జ్యోత్స్న వంటింట్లోంచి బయటికి వచ్చేసరికి, ఏకాంబరం అలాగే కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ముఖం మాత్రం బాగా పాలిపోయి ఉంది.... ఆ ముఖం చూచి చిరాకు పడలేక "సారీ! బాగా ఆలస్యమయింది" అంది మామూలుగా.   
    మచ్చల డాక్టర్ ఏమీ మాట్లాడకుండా తన చేతిలో మడతలు పెట్టిన కాగితం తీసి ముక్కలు ముక్కలుగా చింపసాగాడు.
    అది చూసి జ్యోత్స్న ఆశ్చర్యంగా - "ఏమిటది?" అని అడిగింది.
    "నేను మీకు వ్రాసిన ప్రేమలేఖ...."
    "నాకు ప్రేమలేఖ వ్రాశారా?"
    "అవును - నోటితో, నా మనసులో భావాలన్నీ సరిగా చెప్పలేకపోతున్నానని రాత్రంతా కూచుని ఈ ఉత్తరం వ్రాశాను."    
    "మరి, చింపేశారేం?"
    "ఇంక, ఈ ఉత్తరంతో అవసరం లేదు గనుక...."
    "అదేం?"
    "మీరు రావటం ఆలస్యమయితే, ఏమీ తోచక బల్లమీద ఉన్న పుస్తకాలు చూడటం మొదలుపెట్టాను. అప్పుడు.... ఆ పుస్తకాల వెనక.... నేను మీకిచ్చిన మందులన్నీ చెక్కు చెదరకుండా సీసాల నిండా కనిపించాయి."   
    జ్యోత్స్న ఏం మాట్లాడకుండా పట్టుబడిపోయిన దానిలా తలవంచుకుంది.
    "ప్రస్తుతం నేను హోమియోపతి డాక్టర్ గా బాగా రాణిస్తున్న మాట నిజమే! కానీ ఏ రంగంలోనయినా రాణించటానికి మనిషికి శక్తి కావాలి! ఆ శక్తి ఏమిటో, ఎలా వస్తుందో ఇప్పుడు అర్థమయింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి."
    "భలేవారు. మీలో శక్తి లేకుండా ఎలా పైకి రాగలిగారు?"
    "శక్తి అందరిలోనూ ఉంటుంది నిగూఢంగా.... కొందరు అదృష్టవంతులకు తమలో శక్తి ఉన్నదని కూడా తెలియకుండా అణగారిపోతుంది. నాలాంటి అదృష్టవంతులకు - మీలాంటి సహృదయుల సహకారం తోడయినప్పుడు ఉన్న శక్తి పదింతలుగా పుంజుకుని శోభిస్తుంది. మీకు కృతఙ్ఞతలు చెప్పుకోగలిగే భాష నా దగ్గిర లేదు."
    "చాల్లెండి."
    "మీరు మంచివారని నాకు మొదటినుంచీ తెలుసు. కానీ, ఆ మంచితనం ఎంత విలువైనదో మాత్రం, ఇప్పుడే అర్థమవుతోంది. నన్ను క్షమించండి - మీకు నేనే విధంగానూ అర్హుణ్ణి కాను. ఇంకొక్కసారి పెళ్ళి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని విసిగించను...." 

 Previous Page Next Page