Previous Page Next Page 
వ్యూహం పేజి 23


    వి.వి.ఎస్. ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్... సంస్థ అచిరకాలంలో పేరు పొందడానికి, 500 కోట్ల టర్నోవర్ సాధించడానికి ఒక్క వెంకట నారాయణ మేధాశక్తి మాత్రమే కారణం.

 

                                             *    *    *    *

 

    వి.వి.ఎన్. ఎస్టేట్స్...

 

    మెయిన్ గేట్ దగ్గరకొచ్చాడు శక్తి. మెయిన్ గేటు దగ్గర సెక్యూరిటీ పాయింట్... దాని కానుకుని రిసెప్షన్ హాలు... ఎడం వేపున కారు పార్కింగ్... కుడివేపున పార్కింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్లు...

 

    రిసెప్షన్ హాలు దాటాక విశాలమయిన లాన్... లాన్ మధ్యలో సిమెంట్ బాట... బాటకటూ ఇటూ, అందమయిన అమ్మాయిల పాలరాతి శిల్పాలు....

 

    మెయిన్ గేటు పక్కనున్న చిన్నగేటు దగ్గరకొచ్చాడు శక్తి.

 

    యాష్ కలర్ డ్రెస్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్, ఏం కావాలన్నట్టుగా తలెత్తి చూసాడు.

 

    ఆ చూపుల్ని పట్టించుకోలేదు శక్తి- గబగబా లోనికి వెళ్ళిపోయాడు.

 

    "ఎవరికోసం" ఒకింత కోపంగా అడిగాడు సెక్యూరిటీ గార్డ్.

 

    "వెంకటనారాయణగారిని కలవాలయ్యా..."

 

    "ఆ పేరెప్పుడూ వినలేదు సెక్యూరిటీ గార్డ్- అందుకే రిసెప్షన్ కి వెళ్ళమన్నట్టుగా చేత్తో చూపించాడు.

 

    తన మేనమామ ఆఫీసులోనే తనకు రూల్సు... అన్నట్టుగా వాడివేపు ఒకసారి తీక్షణంగా చూసి, రిసెప్షన్ వేపు నడిచాడు శక్తి. రిసెప్షన్ హాలు విశాలంగా ఉంది- అందంగా ఉంది- హాల్లో ఆకుపచ్చటి అందమైన కార్పెట్ పైన అటూ ఇటూ రెండు వరసల్లో క్రేన్ కుర్చీలు.

 

    మధ్యలో ఫౌంటన్... పైన షాండిలియర్. ఆ హాలుకి చివర ఒక విశాలమయిన టేబిల్, వెనక రిసెప్షనిస్ట్.

 

    "ఎస్. ప్లీజ్... వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ" అందమయిన రిసెప్షనిస్ట్, మరింత అందంగా నవ్వుతూ అడిగింది.

 

    "మంచివాళ్ళనే సెలక్ట్ చేసాడు మా మామ...." మనసులోనే అభినందిస్తూ-

 

    "వెంకటనారాయణ గారిని కలవాలి" ఠీవిగా, గర్వంగా, చెప్పాడు.

 

    "వెంకటనారాయణ... విచ్ డిపార్ట్ మెంట్..." ప్రశ్న వేసిందా అమ్మాయి.

 

    "తెలీదు" కోపంగా అన్నాడు శక్తి.

 

    "అయామ్ సారీ... డిపార్ట్ మెంట్ తెలీకపోతే.... ట్రేస్ చెయ్యలేం..." స్టయిల్ గా భుజాలెగరేస్తూ అందా అమ్మాయి.

 

    "వెంకటనారాయణగారు అంటే... మీ బాస్... మీ ఛైర్మన్..." సాధ్యమైనంత తక్కువ స్వరంతో, అసహనంగా అన్నాడు.

 

    "వాట్...?! మా ఛైర్మన్ గార్నా...?! నువ్వా?!!" శక్తిని ఎగాదిగా చూస్తూ అంది.

 

    శక్తి అరికాలి మంట నెత్తికెక్కిపోయింది. తననంత చులకనగా చూడటం భరించలేకపోయాడు.

 

    "వ్వాట్...? నువ్వా...? నేనా...? ఏమిటా ప్రశ్నలు...? ఆయన్నే కలవాలి. కల్సి తీరాలి- దట్సాల్" అన్నాడు శక్తి స్వరం పెంచి-

 

    "ఛైర్మన్ ని కలవాలంటే... ముందు ఆయన స్పెషల్ పి.ఎ.ని కలవండి." పక్కనే ఉన్న ఇంటర్ కమ్ తీసి ఎవరితోనో మాట్లాడి-

 

    "మెయిన్ బిల్డింగ్ లో ఫిఫ్త్ ఫ్లోర్ కెళ్ళండి" చెప్పిందావిడ. ఆ హాల్లోంచి బయటికొచ్చాడు శక్తి. రిసెప్షనిస్ట్ అలా చూస్తుండిపోయింది శక్తికేసి.

 

    "ఎవరే... ఛైర్మన్ అంటున్నాడు" టెలిఫోన్ ఆపరేటర్ అడిగింది రిసెప్షనిస్ట్ ని.

 

    "ఉద్యోగం కోసం కామోసు- పల్లెటూరి నుంచి వచ్చినట్టున్నాడు. మన ఛైర్మన్ అంటే ఎమ్.ఎల్.ఏ. అనుకున్నాడేమో... అమాయకుడు" నవ్వుతూ అంది రిసెప్షనిస్ట్.

 

    "మనం ఇక్కడ పని చేస్తూ కూడా ఆయన్ని చూడక నెల అయిందని తెలీని అమాయకుడులే పాపం" అంది ఆపరేటర్.

 

    బయటికొచ్చిన శక్తికి ఆ మాటలు విన్పించాయి.

 

    "నేను ఉద్యోగంలో చేరగానే... నేను చేసే ఫస్టు పనేంటో తెల్సా. మిమ్మల్ని ఇంటికి పంపించెయ్యడం" కోపంగా అనుకుని ముందుకు నడిచాడు శక్తి.

 

    మెయిన్ బిల్డింగ్ లోకి అడుగు పెట్టిన శక్తికి, తను జపాన్ లోనో, అమెరికాలోనో ఉన్నట్టనిపించింది.

 

    అన్నివేలమంది అక్కడ పనిచేస్తున్నా, స్ట్రిక్ట్ డిసిప్లిన్, సైలెన్స్... నిశ్శబ్దంతో కలిసి వాళ్ళు పనిచేస్తున్నట్లుగా ఉంది. ఒక్కొక్క మనిషీ ఒక్కొక్క రోబోట్ లా అనిపించాడు.

 

    అయిదో ఫ్లోర్లో-

 

    వరసగా ఉన్న గదుల్లో ఒక గది ముందు పి.ఎ. టూ ఛైర్మన్ (స్పెషల్) అనే బోర్డు చూసి లోని కడుగేసాడు.

 

    లోన విజిటర్స్ హాలు... అది దాటాక పి.ఎ. ఛాంబర్. పి.ఎ.ఛాంబర్. పి.ఎ. ఛాంబరే... ఇళా ఉంటే, ఛైర్మన్ ఛాంబర్ ఇంకెలా ఉంటుందో... ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తూ, ఎదురుగా వచ్చి నిలబడిన ప్యూన్ తో.

 

    "పి.ఎ.ని కలవాలి" అన్నాడు దర్పంగా.

 

    "పనేంటట" టక్కుమని అడిగాడు ప్యూను.

 

    ఛైర్మన్ గారిని కలవాలి..."

 

    "ఛైర్మన్ గారిని కలవాలి... నువ్వు? ఎందుకు బాబూ... నీలాంటి వాళ్ళని కలిసి, కాసేపు కబుర్లాడుకోవడమే పననుకున్నావా. ఈరోజు పి.ఎ.గారు బిజీ, రేపురా" నిర్మొహమాటంగా అన్నాడు ప్యూన్.

 

    "నేనెవరో నీకు తెలుసా" కోపంగా అన్నాడు శక్తి.

 

    "ఎవరట... నెహ్రూగారి కొడుకువా... గాంధిగారి మనవడివా-" వేళాకోళంగా అన్నాడు ప్యూన్.

 

    అంతా కొత్త ప్రదేశం- వింతగా చూస్తున్న మనుషులు- ఊళ్ళోని మంత్రి- పక్కూర్లో అనామకుడు అన్నట్లుగా ఉంది తన పరిస్థితి తనకే.

 

    ప్యూన్ వేపు తీక్షణంగా చూసి, లేచి నిలబడ్డాడు శక్తి.

 

    "రేపు ఇదే టైంకి రా... పి.ఏ.గార్ని కలుపుతాను... వెళ్లు" తెగేసి చెప్పాడు ప్యూన్.

 

    ఆకాశమంత ఎత్తు రంగుల కలల్లోంచి ఒక్కసారి జారి ప్యూన్ కాళ్ళ దగ్గర పడ్డట్లయింది శక్తికి. అంత ఆశాభంగాన్ని అతనూహించలేదు. తిరిగి క్రిందికి దిగొచ్చి విధిలేక ఆశ చావక, హాల్లో ఓ పక్కగా నిలబడి కిటికీలోంచి చూడసాగాడు- ఏం చేయాలని ఆలోచిస్తూ.

 

    అదే సమయంలో-

 Previous Page Next Page