"హమ్మయ్య! అలా అయితే చెపుతాను. మీరు రోజుకో రకం పాంప్లెట్టు పంచి వెళుతున్నారు కదా! అదేమిటో అర్ధంగాక ఆడవాళ్ళంతా కలసి చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. మీరు దొంగల రాణి అసిస్టెంట్ లేక దొంగల ముఠాలో బాస్ వుపయోగించిన మనిషో అనుకుంటున్నారు. అలా అని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు."
"మీరు చెప్పేది నిజమా!" దీక్ష అనుమానంగా అడిగింది.
"ఎంతో అవసరం అయితే తప్ప నేను అబద్ధం ఆడనండోయ్. వాళ్ళ మీటింగు నిన్ననే జరిగింది. ఈరోజు, రేపు, రెండే రోజులు ఓర్పుగా వుంటారు. విషయం ఏమిటో చెప్పమని ఈరోజు రేపు గట్టిగా అడిగి మీరు చెప్పకపోతే మీమీద వాళ్ళు చేయి చేసుకోటమో పోలీసు రిపోర్టు ఇవ్వటమో చేస్తారుట. అలా అని ఓ నిర్ధారణకి వచ్చారు." పృధ్వీరాజ్ చెప్పాడు.
"బాప్ రే! అందువల్ల నన్నమాట ఈ రోజు వాళ్ళంతా నా మీద కారాలు మిరియాలు నూరింది...!"
"చూశారా! నేను నిజమే చెప్పాను!"
"అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం అని నమ్ముతున్నాను. వాళ్ళ ప్రవర్తన అర్ధంగాక తికమక పడ్డాను."
"నేను చెప్పనా! మీరెంత ప్రమాదంలో పడిందీను!" అంటూ మొత్తం వివరించాడు పృధ్వీరాజ్.
"అవును." అంది దీక్ష నిజం పూర్తిగా తెలుసుకుని.
"ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు?"
"ఏమీ చేయను."
"అదేమిటి?"
"ఈ రోజుతోనే నా పని పూర్తి అయింది కాబట్టి."
"అంటే?"
"ఇక రేపటి నుంచీ పాంప్లెట్లు పంచను కాబట్టి..." దీక్ష చిరునవ్వుతో చెప్పింది.
"ఈ రోజు..!" పృధ్వీరాజ్ అనుమానంగా ఆగాడు.
"ఆహ్వాన పత్రిక అందించాను. లేక పంచాను."
"నిజంగా?"
"నిజంగా నిజం."
"ఏది నాకివ్వలేదేమిటి?"
"నేను ఆహ్వానించింది ఆడవాళ్ళను మాత్రమే."
"మగవాళ్ళు రాకూడదా!"
"ఉహూ."
"మేమేం చేశాం పాపం?"
"పాపం చేశారని కాదు. దీనిలో పురుషులు కాలు పెట్టకూడదు."
"కంచిపట్టు చీరలా!"
"కంచిపట్టు చీరలు కాదు. మినప వడియాలు కాదు. మీకు కాని విషయం అన్నాకదా!"
"పోనీ నేను రాను కానీండి. ఆహ్వానం అన్నా యివ్వండి చూసి తరిస్తాను."
"చూసి తరిస్తారా! విషయ సేకరణ చేస్తారా!"
"అదేలేండి ఆ రెండేదే." నాన్చుతూ అన్నాడు పృధ్వీరాజ్.
"అది కనుక్కోటం అంత తేలికకాదు. సరే అడిగినప్పుడు యివ్వక పోటం మర్యాద కాదు. మర్యాద కోసమే మీకు యిస్తున్నాను." అంటూ దీక్ష సంచి లోంచి ఆహ్వాన పత్రిక తీసి యిచ్చింది.
పృధ్వీరాజ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచక చదివాడు. అర్ధమనేది ఆవగింజంత కూడా కాలేదు.
"ఇదేమిటి!" అన్నాడు.
"సస్పెన్స్." అంది దీక్ష.
"అదికాదు.." ఏదో అడగబోయాడు పృధ్వీరాజ్.
"సస్పెన్స్ అన్న తర్వాత చెప్పకూడదు. నా క్షేమం కోరి మీరు యిందాక నాతో వచ్చి ప్రమాదం మాట చెప్పారు. దేముడి దయవల్ల ప్రమాదం తప్పింది. వస్తానండి పృధ్వీరాజ్ గారూ! ఎప్పుడో ఎక్కడో ఒకసారి కలుసుకుందాం." అని శలవు తీసుకుని దీక్ష ముందుకు సాగిపోయింది.
పృధ్వీరాజ్ రోడ్డు మధ్యలో అలా నిలబడి పోయాడు.
- 12 -
సాయంత్రం అయిదున్నరకి....
అందరూ కదలి వచ్చారు.
అందరి చేతుల్లో దీక్ష నిన్నటి రోజు యిచ్చిన ఆహ్వానం తాలూకా ఫ్రీ పాస్ లాంటి కాగితం వుంది.