చావుకి తప్పించి మరిదేనికి ఆడవాళ్ళు యిల్లు కదలినా అలంకరించుకోకుండా బైలు దేరరు. ఆఖరికి ఆసుపత్రిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొద్ది సీరియస్ గా వుంటే కూడా ఎంతోకొంత అలంకరించుకోకుండా బైలుదేరరు. చావు విషయానికి వస్తే బాధ పడాలి, దుఃఖించాలి, ఏడ్చే వాళ్ళని ఓదార్చాలి కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో వేషంతోనే బైలుదేరుతారు.
నిన్నటి రోజు దీక్ష అటు వెళ్ళగానే ఆదరాబాదరాగా మళ్ళీ అంతా సమావేశమయ్యారు.
"మీ యింటి కొచ్చిందా ఆ పిల్ల అంటే మీ యింటికొచ్చిందా అని..." ముందు తెలుసుకున్నారు.
దీక్ష అందరిళ్ళకి వెళ్ళి ఆహ్వానించింది.
"ఇదేమిటంటావ్?" ఈ ప్రశ్న అందరూ వేసుకున్నారు. వేశారు.
"ఏమిటో చాలా వింతగా వుంది." జవాబు అది.
"ఏం చేద్దాం!"
"ఎవరం వెళ్ళకుండా మానేస్తే సరి రోగం కుదురుతుంది."
"మరి అసలు విషయం మనకి తెలిసేది ఎలా?"
"అవును సుమా! తెలుసుకోకపోతే ఇదేమిటో ఎప్పటికి మనకి తెలియక చాలా బాధపడతాం."
"కనుక...!"
"వెళ్ళి అదేమిటో చూడటం మంచిది. అదేదో పబ్లిక్ గా భారత కళామంటపంలోనే జరుగుతున్నది. కాబట్టి ప్రమాదకరమైన విషయం కాదు. పైగా మనం యింత మందిమి వుండగా ప్రమాదం వుండదు గిమాదం వుండదు."
"నిజమే! వెళదాం."
ఎవరికి వారికే వెళ్ళి అదేమిటో చూడాలని వుంది. పైగా దీక్ష ప్రతి వాళ్ళ దగ్గర మీరు రాకపోతే తను బాధపడతాను. మనుగడే లేదన్నట్లు మాట్లాడింది. అందువల్ల కూడా ఎవరికి వారికే వెళ్ళాలని కూడా వుంది. అందరు చర్చించుకున్నారు. సై అనుకుంటూ సరే ననుకున్నారు. వద్దు అనుకున్న వాళ్ళు, వెనక్కిలాగిన వాళ్ళు ఎవరూ లేరు.
ఈ విషయంలో కూడా అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయిదున్నరకి అంతా రెడీ అయి కలసికట్టుగా వెళదామనుకున్నారు. కాస్త దగ్గర దగ్గర వాళ్ళు ఫలానా చీరలు ఇద్దరం ఒకేరకంవి కట్టు కెళదామని కూడా అనుకున్నారు.
పెళ్ళికో పేరంటానికో తయారయి వెళ్ళినట్లు చక్కగా డ్రస్ అయి వచ్చారు.
భారత కళామండపం దగ్గర ఏ ప్రదర్శన తాలూకా చిత్రాలు గాని బొమ్మలుగాని లౌడ్ స్పీకర్లలో పాటలు రంగురంగు కాగితాలు తోరణాలు, కాంతులు వెదజల్లుతున్న బల్బులు అలాంటి హంగు ఆర్భాటం వగైరాలు ఏమీలేవు.
భారత కళామండపంలో ఏ చిన్న ఫంక్షను జరిగినా హంగు ఆర్భాటం వుంటాయి.
అలాంటిది యిప్పుడు హంగు ఆర్భాటం లేకపోగా, జనం కూడా లేరు ఈ వచ్చిన ఆడవాళ్ళు తప్పించి.
వీళ్ళని చూసి దీక్ష మరో యిద్దరు అమ్మాయిలు లోపలి నుంచి వచ్చారు. "ఇదేమిటి, ఎవరూ లేరు!" అని ముఖముఖాలు చూసుకుంటూ వుండగా.
"రండి! రండి! అందరూ వచ్చారా!" అంది దీక్ష.
వాళ్ళంతా దీక్షని ఎగాదిగా చూశారు ఆశ్చర్యంతో.
దీక్ష జరీ బుటాలున్న మిరపపండు రంగు పట్టుచీర కట్టుకుంది. అదే కలర్ మ్యాచింగ్ బ్లవ్ జ్ వేసుకుంది.పెద్దజరీ అంచువున్న బెనారస్ పట్టుచీర కావటంతో చీర కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఆ చీరలో దీక్ష కడిగిన ముత్యంలా వుంది. చెవులకి రాళ్ళ బుట్టలు చంప స్వరాలులాంటి నగలవల్ల అలంకరణ కూడా అందంగా వుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే దీక్ష ఫాషన్ పెరేడ్ నిర్వహిస్తున్న దానిలాగా లేదు. పెళ్ళికూతురులాగా వుంది.
దీక్ష పక్కన వున్న అమ్మాయిలు కూడా అంతో యింతో బాగున్నారు.
దీక్ష అందరిని పేరు పేరున పలకరించింది. "వీళ్ళు తీసుకెళ్ళి కూర్చోపెడతారు. వెళ్ళి కుర్చీలలో కూర్చోండి. మరో అరగంటలో ప్రదర్శన ప్రారంభం అవుతుంది." అంది.