Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 22

    "నడిరోడ్డు మీద నుంచున్నాను. దరిదాపుల్లో మనుషులు లేరు. ఎవరివల్ల ప్రమాదం వస్తుందంటారు? కొంపదీసి మీ వల్ల కాదు కదా!"

    అప్పుడే గమనించినట్లున్నాడు పృధ్వీరాజ్. నలువైపులా చూశాడు.

    "నా వల్ల ప్రమాదం లేదు. నడిరోడ్డు మీద మనం యిలా నుంచుని మాట్లాడుకుంటుంటే మన్ని చూసేవాళ్ళ వల్ల ప్రమాదమే." అన్నాడు.

    "అరె." అంది దీక్ష.

    పృధ్వీరాజ్ పిలిచిం తరువాత దీక్ష ఆగిపోయింది. ఇరువురు రోడ్డుమీద మాట్లాడుకుంటూ నుంచున్నారు. ఆ విషయం యిప్పుడే గమనించారు.

    "నడుస్తూ మాట్లాడుకోటం మంచిది." అన్నాడు పృధ్వీరాజ్.

    "ఊ..." అంది దీక్ష.

    ఇరువురు నెమ్మదిగా ముందుకు అడుగులు వేశారు.

    "ఇందాక ప్రమాదం అని ఏదో అన్నట్లు గుర్తు!" నాలుగు అడుగులు వేసిం తరువాత దీక్ష అంది.

    "అవును మీరు చాలా ప్రమాదంలో వున్నారు."

    "ప్రమాదం ఎవరివల్ల?"

    "మీ జాతి వల్లనే."

    "చాలా తమాషాగా మాట్లాడుతున్నారే! మా జాతి ఏమిటండోయ్!"

    "మీ జాతి అంటే స్త్రీ జాతి అని అర్ధం."

    "ఓహ్." చాలా తేలికగా అంది దీక్ష.

    "అదేమిటి దీక్షగారూ! ఓ పక్క ప్రమాదం అని చెపుతుంటే ఆ విషయంలో గాభరా పడటం అటుంచి ఓహ్! అన్న ఒక్క మాటతో తేలికగా తీసి పారేస్తూ ఉఫ్ మంటూ ఊది పారేశారు!"

    "స్త్రీకి ప్రమాదం పురుషుడివల్ల కాని, స్త్రీకి స్త్రీ వల్లా?"

    "స్త్రీకి స్త్రీయే కదండీ శత్రువు!"

    "ఆఫ్ కోర్స్, అది వేరే విషయంలో. పస్తుతం నాకు ఏ స్త్రీ వల్లా ప్రాబ్లం లేదు. ఇహ స్త్రీలవల్ల ప్రమాదం అనే విషయం అప్రస్తుతం."

    "హరిహరీ! నేను ఎంతో కష్టపడి, విషయ సేకరణచేసి ఓ సత్యం కనుక్కుని మీ ముందు పెడితే మీరేమో కరేపాకుని తీసేసి నట్లు తీసి పారేస్తిరి." వాపోయాడు పృధ్వీరాజ్.

    పృధ్వీరాజ్ అలా అంటుంటే జాలివేసి, నవ్వొచ్చింది దీక్షకి.

    "కరేపాకుని తీయటం ఏమిటండీ!" అంది.

    "నేను కరేపాకులాంటి వాడినిలేండి."

    "అంటే!"

    "కూర, పులుసు, చారు వగైరా సవాలక్ష వంటల్లో కరేపాకు వాడుతారు కదండీ. కరేపాకు లేని పులిహోర, కారప్పొడి తలుచుకుంటేనే వాంతి. అలాంటి కమ్మని సువాసనగల కరేపాకుని అవసరానికి వంటల్లో తప్పక వేస్తారు. తినటానికి వచ్చేసరికి దివ్యంగా అన్నీ భుజించేసి కరేపాకుని ఏరి పారేస్తారు. అలాంటి జాతకం నాది. నేను అందరి అవసరాలకి ఉపయోగపడతాను. ణ అవసరానికి ఒక్కరంటే ఒక్కరు ఉపయోగపడరు. మీరూ అంతే. మీకు సాయం చేద్దామనుకుని పనిగట్టుకుని వచ్చి ప్రమాదం విషయం హెచ్చరిస్తుంటే నన్ను నా మాటలని కరేపాకు లాగా తీసి పారేస్తిరి." పృధ్వీరాజ్ మహా బాధపడిపోతూ చెప్పాడు.

    "సారీ! మిమ్మల్ని అలా తీసి పారేయలేదు, తమాషా చేస్తున్నారేమో అనుకుని నవ్వుతాలికి మాటకొట్టి పారేశాను. మీకో విషయం చెప్పమంటారా! నేను అందరిలాగా వంటల్లోని కరేపాకు తీసి పారేయను. తింటాను. మరో విషయం. కరేపాకులో చాలారకాల మంచి గుణం వుంది. నేను పచ్చి కరేపాకుని కూడా తింటాను."

    "ఈజిట్?"

    "ఎస్! పచ్చి కరేపాకు పదిరెబ్బలు ఓరోజు, పచ్చి వేపాకు పదిరెబ్బలు మరోరోజు తింటే, ఇటు చర్మరోగాలు రావు అటు విషానికి విరుగుడు. ప్రకృతి వైద్యం అనుకోండి. సరే ఇప్పుడు చెప్పండి నా కొచ్చిన ప్రమాదం ఏమిటో, ఎవరివల్లనో, ఎందుకో!"

    "నిజంగానే అడుగుతున్నారు కదూ!"

    "నిజంగానే."

 Previous Page Next Page