స్టూడియో చేరుకునేసరికి ఏదో ఫిలిమ్ షూటింగు జరుగుతోంది. షూటింగు చూస్తూ ఆశ్చర్యపోసాగిందామె. షూటింగు ఇలా వుంటుందని తెలీదు తనకి. మధ్యాహ్నం భోజనాల సమయంలో డైరక్టర్ సిమ్మాద్రి కోసం చూస్తె అతనెక్కడా కనిపించలేదామెకి. అక్కడున్న ఒకరిద్దరిని అడిగితే అలాంటి పేరుగల డైరక్టరు ఎవరూ లేరని చెప్పారు. ఆమె ఖంగారు పడి ఏడుపు ముఖం పెట్టింది.
"నా నగలన్నీ కూడా అతనింట్లోనే ఉన్నాయండీ!" అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.
"ఆరువందల డెబ్బయ్ నాలుగు" అన్నాడు స్టూడియో మేనేజరు.
'ఆరువందల డెబ్బైనాలుగేమిటి?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"ఇలా నగలు పోగొట్టుకొన్న వాళ్ళ సంఖ్య"
'అంటే సిమ్మాద్రి నిజం డైరెక్టరు కాదా!"
"పదకొండువందల ఎనిమిది" అన్నాడతను.
"ఇదేం సంఖ్య?"
"ఇలా పిచ్చి ప్రశ్నలడిగే వాళ్ళ సీరియల్ నెంబర్."
అందాల రాశి బెదిరిపోయి "ఊరయినా అడగలేదు - అడ్రసయినా అడగలేదు" అంటూ పాడుకోసాగింది.
"నీకేం ఫరవాలేదమ్మా ! నేనున్నాగా!" అన్నాడు ఓ పెద్ద మనిషి.
"నువ్వెవరు?" అనుమానంగా అడిగింది అందాలరాశి.
"నేనేవరయితే నీకెందుకమ్మా? చాలామంది పెద్ద తారలందరూ నా ద్వారానే సినిమాల్లో ప్రవేశించారు" అన్నాడతను.
"అయితే మరి నన్ను సినిమాల్లో చేరుస్తావా?" ఆశగా అడిగిందామె.
"ఇంకా అనుమానమేమిటి?" పద" అంటూ కార్లో ఓ పెద్ద స్టార్ హోటల్ కి తీసుకెళ్ళాడు.
అక్కడ ఓ డీలక్స్ గదిలో మరో పెద్ద మనిషికి ఆమెను పరిచయం చేశాడు.
"వీరు పెద్ద నిర్మాత, ఈయన సినిమాల్లో నీకు అవకాశం ఇస్తారు. అయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు" అంటూ తను బయటికెళ్ళిపోయాడు.
నిర్మాత ఆమె వంక ఎగాదిగా చూసి "నీ కొలతలేమిటి?" అనడిగాడు.
"ఏం కొలతలు ?" అంది అందాలరాశి.
"శరీరం కొలతలు ! తెలుగు సినిమాల్లో నటించాలంటే 48-28-38 గానీ లేదా 38-38-48 గానీ ఉండాలి" అన్నాడతను.
"అదేమిటో నాకేమీ అర్ధం కావటం లేదండీ" అందామె భయంగా.
"నేను చూపిస్తానుండు" అంటూ జేబులో నుంచి టేప్ తీసి కొలతలు తీసుకుని "ప్చ్ లాభం లేదు' అంటూ పెదవి విరిచాడు.
"అయ్యో! ఏమిటండీ లాభం లేదు" అంది అందాలరాశి గాభారగా.
"నీ కొలతలు తక్కువయాయ్! ఎలా నీకు చాన్సివ్వటం? అందులోనూ హీరోయిన్ వేషం అంటే మాటలా?"
"అలా అనకండి ! సినిమా ఫీల్దుని నమ్ముకుని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వకపోతే నా గతేం కాను?" అంటూ బావురుమంది.
"పిచ్చిదానా! అలా ఏడుస్తే పనులవుతాయా?" అన్నాడతను నవ్వుతూ.
"మరేం చేస్తే అవుతాయ్ ' ఆశగా అడిగిందామె.
"నేను చెప్పినట్లు చేస్తే అవుతాయ్! మరేం లేదు. ఈ రాత్రికి ఇక్కడ నాతో గడిపితే చాలు. రెపీపాటికి హీరోయిన్ గా వెలిగిపోతావ్!"
"అమ్మో!" అంది అందాలరాశి ఏడుపు ముఖం పెట్టి.
'అలా ఏడవకూడదని చెప్పానా? సినిమా ఫీల్డులో ఏ పనయినా సరే నవ్వుతూ చేయాలి. అప్పుడే పైకొస్తావ్ . ఒకవేళ ఏడుపోచ్చినా నవ్వుతూ ఏడవాలి. రా. ఇలా దగ్గరకు రా!' అంటూ ఆమెని ఆక్రమించుకున్నాడతను. అందాలరాశికి ఆ తర్వాత ఏడుపు రాలేదు.
మర్నాడు ఎవరో తలుపు తట్టి లేపుతుంటే మెలకువ వచ్చిందామెకి. లేచి చూసేసరికి ఎదురుగ్గా హోటల్ మేనేజరు కనిపించాడు.
"త్వరగా బయటకు ఫో!" అన్నాడతను కోపంగా.
"అదేమిటి? నిర్మాత గారి రూమ్ ఇది! నేను వారి పిక్చర్ లో హీరోయిన్ ని" అంది అందాలరాశి అమాయకంగా.
"తెలుసులేవమ్మా! ఈ సినిమా లోకంలో నిర్మాత కాని మగాడు, హీరోయిన్ కాని ఆడది లేనేలేరు. వెళ్ళే,ళ్ళు! మీ నిర్మాత ఈ రూముకి కట్టిన డబ్బు గంట క్రితం వరకే సరిపోయింది. ఇంకా వుండాలనుకుంటే ఇంకో రెండు వందలు కట్టు" అన్నాడతను.
గత్యంతరం లేక లేచి గదిలో నుంచి బయటికి నడిచిందామే. రోడ్డు మీద కొచ్చి "శీలం లేనీ తనువొక నరకం- బిల్లు కట్టని హోటలోక నరకం" అని పాడుకుంటూ నడవసాగింది.
అలా వారం రోజుల పాటు సినిమా లోకంలోని అందరి కాళ్ళూ పట్టుకుంటూ తిరిగింది. ఆ తరువాత మరికొన్ని రోజులు నిర్మాతలతోనూ , దర్శకులతోనూ రాత్రుళ్ళు గడిపింది. చివరు ఆమె బాధ చూడలేక ఓ నిర్మాత ఓ సినిమాలో ఆమెకు హీరోయిన్ కన్నీళ్లు తుడిచే స్నేహితురాలి పాత్ర ఇప్పించాడు. చాలాకాలం అలా కన్నీళ్లు తుడిచే పాత్రలే వేస్తూ , మధ్యలో టైం దొరికినప్పుడల్లా తన కన్నీళ్ళు తుడుచుకుంటూ జీవితం గడపసాగింది. అలా గడుపుతుండగా ఓ రోజు ఓ సినిమాలో హీరోయిన్ తాలూకు చెలికత్తె లలో ఓ చెలికత్తె గా వేషం వేస్తోంటే అ షూటింగ్ చూడ్డానికొచ్చిన వాళ్ళలో వాళ్ళమ్మా, వాళ్ళ నాన్నా కనిపించారు. వాళ్ళని చూసి దుఃఖం పట్టలేక వారిని కౌగలించుకుని బావురుమని ఏడ్చింది. ఆమె పరిస్థితి చూసి వాళ్ళు కరిగిపోయి వాళ్ళు కూడా ఏడ్చారు.
"జరిగిందేదో జరిగింది. ఇప్పటికయినా మించిపోయింది లేదు. ఇంటికి వెళ్దాం పదమ్మా . నిన్ను అదివరకు లాగానే ప్రేమగా చూసుకుంటాం" అన్నారు తల్లిదండ్రులు.
ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది -
"నిర్మాతా. ఆ పరిస్థితిలో అందాలరాశి ఏం చేస్తుంది? తన తల్లిదండ్రులతో పాటు ఇంటి కెళ్ళిపోతుందా? లేక ఆ పరిస్థితి;ప తల్లిదండ్రులు కంట పడినందుకు ఆత్మహత్య చేసుకుంటుందా? ఈ ప్రశ్నలకు...."
అ మాట పూర్తి కాకుండానే నిర్మాత టకీమని అడ్డుపడ్డాడు.
"సమాధానం తెలుసులే. శాపం పెట్టకు. అందాలరాశి ఇంటికి వెళ్ళదు. ఆత్మహత్యా చేసుకోదు. ఎందుకంటే తన జీవితం ఎంత దారుణంగా ఉన్నా , పరువూ, ప్రతిష్టా , శీలం పోగొట్టుకుని బతుకుతున్నా , పస్తులుంటున్నా , సినిమా రంగాని కన్నా ఆకర్షణ నుంచి బయటపడడం కష్టం. ఈస్ట్ మన్ కలర్ లో కలలు కనేందుకు కావలసినంత స్కోప్ ఉన్న సినిమా స్కోప్ రంగం అది. దీపం కాంతికి దీపం చుట్టూ చేరే దీపం పురుగులు ఆ మంటలలో పడి నాశనమయినట్లే అందాలరాశి , ఇంకా అలాంటి ఆడపిల్లలు చాలా మంది ఆ సినిమా మాయలో పడి ఎప్పటికయినా గొప్ప తారలయి వెలుగొందగలమనే ఆశతో ఆ నికృష్టపు జీవితాలు గడుపుతూనే ఉంటారు. అంచేత అందాలరాశి కూడా తన జీవితం అలాగే ముగిస్తుంది....."
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***