Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 22

                                 

 

                                            అందాల రాశి కధ
                
                           


    పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. నడుస్తూ నడుస్తూ  ఆ బాక్స్ లోని సెన్సార్ కధ చెప్తుందేమోనని చెవులు రిక్కించుకుని వినసాగాడు. ఎంత దూరం నడిచినా కధ ప్రారంభం కాకపోయేసరికి చిరాకు పుట్టుకొచ్చి "కధ చెప్పవా - అలా మూగనోము పట్టావేం ఇవాళ" అన్నాడు కోపంగా ఆయాసంతో! అడిగిందే చాలని టకీమని కధ మొదలెట్టేసింది సెన్సార్.
    "అనగనగా ఆంధ్రప్రదేశంలో అందాలరాశి అని ఓ అమ్మాయి ఉండేది. ఆ పిల్లకి వాళ్ళింటి డాబా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పొద్దుగూకాక ఆ డాబా ఎక్కి కూచుంటే ఆ దాబాని అనుకునే ఉన్న సినిమా హాల్లోని వెండి తెర మూడొంతులు కనబడుతూండేది. అంచేత రోజూ డాబా ఎక్కి ఫస్ట్ షో, సెకండ్ షో చూసి అప్పుడు గానీ డాబా దిగేది కాదు. ఆ హాల్లో ఏ సినిమా వచ్చినా రోజుకి రెండాటలు చొప్పున అది అడినన్ని రోజులు చూడడం అలవాటయిపొయిందామేకి. అంచేత ఏ హీరోయిన్ ఎలా నటిస్తోంది, ఏయే దృశ్యాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు జోహార్లు అర్పిస్తోంది, ఏ పాటలకు తలలూపుతోందీ , ఏ ఆటలకు ఈలలేస్తోందీ, ఏ అంగ ప్రదర్శనకు ఎలా హుషారుగా కేకలేస్తోంది అన్నీ గ్రహించేసింది. డ్యూయెట్ పాడేప్పుడు మూడొంతుల తెర మీద కనిపించే హీరో కౌగిట్లో (కనిపించని ఒక వంతు తెర మీద హీరోయిన్ బదులుగా ) తనే ఉన్నట్లు భావించుకుని డాబా అంతా డాన్స్ చేస్తూ ఆనందపడేది. తన్మయత్వం చెందుతూండేది. ఈ విధంగా యాక్షనూ, రియాక్షనూ అన్నీ నేర్చేసుకుని తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదుర్చూడసాగింది. ఇలా ఎదుర్చూస్తుండగా ఓ రోజు అందాల రాశి స్నేహితురాలు సైదామిని వచ్చి ఆమె ప్రతిభను చూసి మూర్చ బోయినంత పని చేసి "అయ్యో! ఇంత టాలెంట్ ఉండి కూడా ఇంకా మీ డాబా మీదే ఉన్నావా?" అనడిగిందామే.
    "డాబా మీద కాకపోతే ఇంకెక్కడా ఉండాలి?" అంటూ ఆశ్చర్యంగా అడిగింది అందాలరాశి.
    "ఇంకేక్కడేమిటి? వెండి తెర మీదుండాల్సింది ఈపాటికి!"
    అందాలరాశికి సౌదామిని సలహాకు ఆనందంతో పొంగిపోయింది.
    "నాకూ సినిమాల్లో కెళ్ళాలని మహా ఇదిగా ఉందోయ్! కానీ మా అమ్మా, నాన్నా సినిమా ఊసెత్తితే చాలు "శివాశివా" అంటూ చెవులు మూసుకున్తున్నారు. ఏం చేయమంటావ్?" అంటూ అడిగిందామె.
    "పిచ్చిదానా! నువ్వు సినిమా పత్రికల్లో చదవలేదూ? చాలా మంది గొప్ప సినిమా తారలందరూ ఇంట్లో చెప్పకుండా మద్రాసుకి పారిపోయినవాళ్ళేనూట."
    "అవుననుకో, కానీ.... ఎందుకో భయం వేస్తోందే" అంది అందాలరాశి ఆలోచిస్తూ. ఆ రాత్రంతా అదే ఆలోచనల్తో గడిపాక మర్నాడు ఒంటినిండా నగలూ, అయిదొందల కాష్ తో మద్రాస్ బండేక్కేసింది ఎవరికీ తెలీకుండా.
    మద్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలు దిగి ఎటు వెళ్ళాలా అని దిక్కులు చూస్తోంటే ఓ గిరిజాల వాడు హడావుడిగా వాచ్చి వినయంగా నమస్కారం చేశాడు.
    "నా పేరు సిమ్మాద్రి అంటారండీ! ఎనిమిది భారీ వర్ణ చిత్రాలు ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్నాను. మీరు నా పిక్చర్ లో తప్పక హీరోయిన్ వేషం వేయాలి!" అన్నాడు బతిమాలుతూ. అందాల రాశి తెల్లబోయింది.
    "అదేమిటి? నేను హీరోయిన్ గా పనికొస్తానా?" అనడిగిందాశ్చర్యంగా.
    "పనికిరాకపోవడమేమిటీ? మీ అంత అందమయిన అమ్మాయి కోసమే నేను రోజూ స్టేషన్ కొచ్చి వెతుకుతున్నాను. నెల రోజుల నుంచీ. ఇన్నాళ్ళకూ నా శ్రమ ఫలించింది. పదండి ఇంటి కెళ్దాం. కాసేపు మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం రెండు గంటలకు మీకెలాగూ షూటింగు ఉంది" అన్నాడతను.
    'అప్పుడే షూటింగా?" ఇంకా తెల్లబోతూ అందామె.
    "అవును, మీరు దొరికారుగా ఇంకా ఆలస్యం ఎందుకు?"
    ఇద్దరూ టాక్సీలో ఓ అందమయిన ఇంటి కెళ్ళారు. అక్కడ కాఫీ, ఫలహారాలయ్యాక స్టూడియో కి బయల్దేరారిద్దరూ.
    "మీ నగలన్నీ ఇక్కడే పెట్టేయండి. స్టూడియో లో భద్రత ఉండదు" అన్నాడతను. అందాలరాశి తన నగలన్నీ సూట్ కేస్ లో ఉంచింది.

 Previous Page Next Page