Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 22


    నిర్ణీత సమయమునకు ముందే 'అఫ్ జుల్ ఖా'నటకు వచ్చి జయము తనదిగా భావించుకొనుచు నటు నిటు పచారు సేయుచుండెను.
    కపటాభినయమున నొకరిని మించినవారొకరు.
    శివాజీని జూడఁగనే 'ఖాను' సంతోషాతిశయము నభినయించుచు నెదురుగా వచ్చి 'భాయి! శివాజీ!' అని కౌగిలించుకొను నటులు నటించి కత్తిని శివాజీ డొక్కలోఁ గ్రువ్వ యత్నించెను.
    వెంటనే శివాజీ "సోదరా! నీ వింతవాఁడవయితివా!"యని పులిగోళ్ళతో ఖానునిఁజంపి తన దుర్గమునకుఁ దాను చేరుకొనెను.
    రహస్యముగా నటనట నుంచఁబడిన మహారాష్ట్ర వీరులు హఠాత్తుగా శత్రుయోధులపైఁబడి నురుమాడిరి.
    మృత్యుముఖమునఁబడక మిగిలిన కొలఁదిమంది సైనికులు బిజాపురము చేరకముందే 'శివాజీవిజయ వృత్తాంతము' ఆదిల్ శాహి కనులముందు దళుక్కున మెరసెను. అతని కనులు మూతపడెను. ఆ పిడుగు తనపై నెప్పుడు పడునోయని యాతనిగుండె గుబుక్కుమనెను.


                               5


    ఢిల్లీ నగరమునందలి 'దర్బారు'లో 'ఔరంగజేబు' సింహాసనాసీనుఁడై యుండెను. సరదారులు - సామంత భూకాంతులు - రాజకీయోద్యోగులు తమ తమ యాసనముల నధివసించి యుండిరి.
    అంత నౌరంగజీబు "మొగలుసామ్రాజ్యనౌక యెట్టి తుపాను దెబ్బలకు లోనుగాక కాలప్రవాహమున సుఖప్రయాణము చేయుచువచ్చినది. కాని కొలది కాలము క్రింద తుపాను చెలరేగినది. 'శివాజీ' దక్షిణభారతమందలి మహమ్మదీయ రాజ్యములఁ గొల్లగొట్టుకొనుచు నజేయుఁడై బలీయములగు దుర్గముల నాక్రమించుకొని 'మహారాష్ట్ర రాజ్యమును' స్థాపించినాఁడు. మన సామ్రాజ్యమునుగూడ కబళింప నసంఖ్యాక బలముల నాయత్తపరుచు కొనుచున్నాడు. అతనికిఁ దగిన శాస్తిగావించుటకు మేము 'శయిస్తఖాను' నంపుటయు - నాతఁడు తెగవ్రేయ'బడిన చేతివ్రేళ్ళతో చావు దప్పికన్ను లొట్టపోయి, పలాయితుఁడై వచ్చుటయు - తరువాత 'జయసింహుఁడు' మనసేనలఁదరలించుకొని పోయి వాని నెదిరించి నిలువనేరక యసువులఁ దక్కించుకొని వచ్చిన సంగతియు మీ రెఱిఁగియే యున్నారు. మన ప్రయత్నములు రెండును వమ్మయ్యెను. ఆ 'కొండయెలుక' రాజగఢము కోటకొమ్మల కెక్కినదఁట. వానియెడ దండముకన్న సామదానములే ప్రయోగింప సాధ్యములేమో! 'పురందరు'లో జరిగిపిన సంధినియమముల కాతఁ డంగీకరించినట్లు తెలియ వచ్చినది. నేఁడో - రేపో మనతోడి మైత్రి బెంపొందించుకొన నాతఁడే యిట కేతెంచును - ఇందులకు మీరేమందు"రని ముసిముసి నగవులు దోఁపఁ బలికెను.
    సభాసదులు 'చిత్తము - చిత్తము. తమ శక్తియద్వితీయ' మనిరి.
    మఱునాఁటి మొగలుదర్బారునకు శివాజీ విచ్చేసెను; కాని యాతనికి సంధినియమప్రకారము కాక 'పంచహజారీ స్థానము'న నొక యాసనము ప్రత్యేకింపఁ బడెను. దానితో 'ఛత్రపతి' దండ తాడిత భుజంగమై కాలమునకుఁ గట్టువడి తన యాసనమునందే యుండెను.
    అంతఁ బాదుషా నిరాదరణ సూచకముగ 'రాజా! శివాజీ! నీ రాక మాకు సంతోషము గలిగించిన'దనెను.
    శివాజీ 'జహాపనా!' అని యేమో పలుకఁబోయి కోపావేశము నాపుకొనలేక స్మృతిఁ దప్పి యాసనమందే యొఱగెను.
    అంతఁ బాదుషా "రాజా శివాజీకి శరీర స్వాస్థ్యము సరిగ లేనట్లున్నది; కావున నీతనినిమన 'రాజమహలు'నకుఁ జేర్చి తగిన చికిత్స చేయింపుఁ"డని సరదారుల కానతి వెట్టెను. తోడనే పాదుషావారి యాజ్ఞ నిర్వర్తింపఁబడెను.


                              6


    ఆ రాజమహలొక కత్తులబోను. శివాజీ యందుఁ జిక్కుపడిన మహోగ్రసింహము.
    వైద్యసాహాయ్యమునకుఁ గొదువలేదు. సదుపాయములకుఁ దఱుగులేదు; కాని గౌరవ ప్రతిష్ఠలు మంటఁ గలిపినవని భావికార్యక్రమమున కంతరయము గలిగినదని తీరని బాధచే శివాజీ యొకప్పుడు కుమిలిపోవును. పాదుషా వంచన తలంచి దంత ఘట్టన మొనర్చును. సుల్తాను దుష్ట గర్వమునకుఁ గష్టపడును. అతఁడు తన్నవమానింఛినందులకుఁ గన్నుల విస్ఫులింగములు రాల్చును. తానట బంధింపఁ బడుటకుఁ గటకటపడును. ఇది మన శివాజీ 'దినచర్య'.
    ఒకనాఁడకస్మాత్తుగానాతని మనస్సులో నొక యుపాయము స్ఫురించెను.
    తోడనే యాతఁడు రక్షకభటునొకనిఁ బిలిచి 'రేపు మా జన్మదినము. ఆ సందర్భమున మిఠాయిలు, పండ్లు విరివిగఁ బంచుటకు సంకల్పించినాము. దీనిని మీ యధికారి కెఱిఁగింపు' మని చెప్పి తన రహస్య పలాయన విధానమును విశ్వాసపాత్రులగు సేవకులచే ఢిల్లీ పట్టణమునందు తనకై వేచియున్న మహారాష్ట్ర వీరులకుఁ దెలియఁ జేసెను.
    మఱునాఁడు శివాజీ జన్మదినోత్సవము వైభవోపేతముగ జరిగిపోయెను. కావలియున్న భటుల కంట దుమ్ము గొట్టి 'మహారాష్ట్ర సింహము' పండ్ల గంపలతో దూరి 'రాయగఢము'నకుఁజేరెను.
    కావలివారి ప్రాణము లెగిరిపోయెను.
    పాదుషావారి గుండె జారిపోయెను.
    నగరములోఁ గలకలము, సైనికులలో సంచలనము మెండయ్యెను.
    శివాజీని బట్టి తెప్పించు పాదుషా ప్రయత్నము గత జల సేతు బంధనము కాక మఱేమగును?


                                               7


    శివాజీ 'రాయగఢము' చేరెను. మొగలు చక్రవర్తి తనపై నెత్తివచ్చుట తప్పదని నిశ్చయించి శివాజీ యొక ప్రక్క దుర్గములఁ గట్టిపరచుకొనుచుండెను. మరియొక దిక్కున 'సింహగఢ మహాదుర్గము'ను సత్వరముగఁ దన హస్తగత మొనర్చుటకు సర్వప్రయత్నములఁ జుఱుకుగ సాగించుచుండెను. ఛత్రపతి పిలుపునకు మహారాష్ట్ర దేశము నలుమూలలనుండి స్వాతంత్ర్య సమరయోధులు 'మేముమే'మని ముందునకు దుమికిరి. తానాజీ - సూర్యాజీ మున్నగువారు చక్రవర్తికిఁ జేదోడు వాదోడుగా నిలఁబడి సైనికుల నడపించిరి.
    తానాజీ 'సింహగఢము'ను జయించుటకు సాహసించెను. అందులకు శివాజీ సమ్మతించెను. సూర్యాజీ - బాలాజీ - మున్నగువారు తానాజీని వెన్నంటిరి.
    'సింహగఢము' ఒక పర్వత శిఖరముపై నున్న మహా దుర్గము. దానిచుట్టు ఎత్తగు 'రాతికోట' కలదు. బయట నున్నవారికి దాని సింహద్వారము తప్ప మరేమియు గోచరింపదు.
    ఒకనాఁటి చీకటిరేయిలో మహారాష్ట్ర సైన్యములు రహస్యమార్గమునఁబోయి దుర్గ ప్రాకారమును సమీపించెను.
    మహారాష్ట్ర భటుఁడొకఁడు ప్రాణములకుఁ దెగించి కోటగోడ కెగఁబ్రాకి త్రాటి నొకదానిని గ్రిందకు వదలెను. దాని యాధారమున మూఁడు వందలమంది వీరభటులు - తానాజీ మున్నగువారు కోటలోఁ బ్రవేశించిరి.    
    యవనసైనికులకు, మహారాష్ట్ర సైనికులకు సంకుల సమరము సాగెను.
    స్థానబలము - సంఖ్యాబలముగల శత్రుధాటికి మహారాష్ట్రవీరు లాగఁ జాలకపోయిరి.
    దురదృష్టవశమున నప్రతిమాన ప్రతాపుఁడగు 'తానాజీ' రణరంగమున నేలఁ గూలెను. తోడనే మహారాష్ట్ర వీరులు చిందరవందర కాఁజొచ్చిరి.
    అంతఁ దానాజీ సోదరుఁడును వీరశిరోమణియు నగు 'సూర్యాజీ' ముందునకువచ్చి సైనికులలో రణోత్సాహమును బురిగొల్పెను.
    మహారాష్ట్ర వీరులు సూర్యాజీ యండఁ జూచుకొని విజృంభించి ముహూర్త మాత్రములో యవనబలములఁ దఱుమఁగొట్టి 'సింహగఢము' నాక్రమించుకొనిరి.
    'సింహగఢము' చేజిక్కినది; కాని 'సింహము' కూలిపోయినది.
    సువిశాల భూభాగము మహారాష్ట్రుల పరిపాలనలోనికి వచ్చెను.
    ఢిల్లీ పాదుషా యంతటివాఁడు తలదిరిగి వచ్చి సంధి బేరమునకు దిగెను.
    బీజాపుర సుల్తానులు 'భాయి - భాయి'గ మెలఁగ నారంభించిరి.
    శివాజీ శత్రుదుర్నిరీక్ష్యుఁడై రవిసంకాశ తేజముతో వెలుఁగొందెను.


                             8


    అది యొక శుభముహూర్తము. 'రాయగఢము'న మంగళవాద్యములు మ్రోగుచుండెను. విప్రపుంగవులు సామగాన మొనర్చుచుండిరి.
    అట్టితఱి 'శివాజీ' గురుదేవుఁడగు సమర్థరామదాసుని భవానీదేవి యను గ్రహములతోను - మాతృమూర్తి శుభాకాంక్షలతోను - ప్రజల యుత్సాహాతి శయములతోను భారతసామ్రాజ్యపట్టము' గట్టుకొనెను.
    ఆనాఁటి 'పట్టాభిషేక మహోత్సవము'నకు సామంతులు, దండనాథులు, మిత్రరాజ్య ప్రతినిధులు విచ్చేసిరి.
    శివాజీ అందఱను సముచితరీతుల గౌరవించెను. ఆ మహారాజు పరిపాలనముతో భారత మాదర్శభారతమై వెలుగొందెను. నాఁటినుండియే స్వతంత్ర మహారాష్ట్రమునకు స్వర్ణయుగము ప్రారంభమయ్యెను.


                              * * * *

 Previous Page Next Page