ఒక పాతబట్ట నీళ్ళలో తడిపి, ఆ తడి గుడ్డతో ముఖం తుడుస్తూ కూచుంది. ఒక పావుగంట తర్వాత కళ్ళు తెరిచాడు వెంకట్రావు. కళ్ళు తెరవగానే అతనికి తన నుదుటిమీద తడిగుడ్డతో వత్తుతోన్న జ్యోత్స్న కనిపించింది. అతని కళ్ళలో స్పష్టంగా బెదురు కనిపించింది. అతని చూపులు ప్రకాశమానంగా వెలుగుతోన్న లైట్ మీద నిలిచి, ఆ తరువాత జ్యోత్స్న మీదకు మళ్ళాయి.
లేచి కూచుంటూ, చాలా సిగ్గుపడుతూ "అయామ్ సారీ" అన్నాడు....
"ఫరవాలేదులెండి- ఏం జరిగింది?"
ఇబ్బందిగా నవ్వాడు వెంకట్రావు.
"ముందు ఇది చెప్పండి. నాకు పిట్స్ వచ్చి పడిపోగానే మీరు ఈ విషయం ఎవరికైనా చెప్పారా?"
"లేదు -" మొహమాటంగా అంది జ్యోత్స్న. 'ఎందుకు చెప్పలేదూ?' అని అడిగితే ఏ సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ....
కానీ, వెంకట్రావు ఎంతో ఆనందంగా "థేంక్యూ! చాలా మంచిపని చేశారు. ప్లీజ్! ఈ విషయం ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకండి. ఇంతవరకూ ఎవరికీ ఈ విషయం తెలియదు...." అన్నాడు.
జ్యోత్స్న ఆశ్చర్యంగా "అంత రహస్యంగా ఉంచవలసిన అవసరమేముందీ?" అంది.
"చెప్పనా? మనం బాధపడుతోంటే చుట్టుపక్కలవాళ్ళు సానుభూతి చూపిస్తారు. కానీ లోలోపల తమకంటే మనం ఏదో ఒక విధంగా తక్కువగా ఉన్నందుకు ఆనందిస్తారు. అలాగే మనకేదైనా అదృష్టం కలిసొస్తే అందరూ అభినందిస్తారు. కానీ, లోలోపల అదృష్టం తమకు దక్కనందుకు కుళ్ళిపోతుంటారు. నాకు నా చుట్టు ప్రక్కలవాళ్ళు అలా లోలోపల కుళ్ళిపోతూ అభినందించటమే ఇష్టం.... నా మీద సానుభూతి ప్రకటిస్తూ లోలోపల ఆనందించగలిగే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను నేను...."
వెంకట్రావు ముఖంలోకి చూస్తూ పకపక నవ్వేసింది జ్యోత్స్న....
"ఎంత హాయిగా నవ్వుతున్నారు! ఇలా నవ్వగలిగే వాళ్ళని ఇంతవరకూ నేను చూడలేదు-"
"ఆ మాటకొస్తే నాకూ తెలియదు, నేనిలా నవ్వగలనని...."
"మీ సహాయానికి మరోసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక విషయం నాకు చాలా వింతగా ఉంది. ఇలాంటి ఫిట్స్ వచ్చినప్పుడు కళ్ళు తెరవగానే నాకింకా ఏదో భయంగానే ఉండేది. ఏదో నిస్త్రాణగా కూడా తోచేది. కానీ ఈసారి ఎందుకో అంతగా నా గుండె దడదడలాడటం లేదు. ఆ మైకంలో కూడా ఏదో స్నేహ పూర్వకమైన స్పర్శ నా మనసు గుర్తించగలిగింది. నాకు మరొకరు తోడుగా ఉన్నారన్న ధైర్యంవల్లనే, నా మనసుకు ఎప్పటిలా భయం కలగలేదేమో!"
"అలా అనుకుంటే, జీవితంలోకి ఒక తోడుని తెచ్చుకోండి- పెళ్లి చేసుకోండి!"
"భలేవారు. ఈ వయసులోనా?"
"ఏమో! మీ వయసెంతో, మీరు చెప్తేకాని తెలియదు. చూసినవాళ్ళు మీరు సుశీలగారికి అన్నగారనుకుంటారు తప్ప, తండ్రి అనుకోరు."
ఆ విషయం వెంకట్రావుకీ తెలుసు, తనకు ఉన్న వయసు కంటె చిన్నగా కనిపిస్తున్నందుకు, ఎందరో తనను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు.
"తెలియవలసిన విషయాలు తెలియకుండా దాచి పెళ్ళిచేసుకోవటం న్యాయమేనా? మీరే చెప్పండి. ఎవరైనా నా డబ్బు చూసి నన్ను పెళ్ళిచేసుకుని ఆ తరువాత తీరిగ్గా పశ్చాత్తాపపడటం ప్రారంభిస్తే, నేను ఎలా సహించగలను?"
మీ డబ్బుచూసి మాత్రమే ఎవరైనా మిమ్మల్ని పెళ్ళిచేసుకుంటారని మీరనుకుంటే, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారనే చెప్పాలి. మీలాంటి భర్త దొరకటం ఆడదానికి తక్కువ అదృష్టం కాదు-"
వెంకట్రావు ఆశ్చర్యంగా. చిత్రంగా చూశాడు వెంకట్రావు చూసిన స్నేహభావంతో సంకోచం వదిలి మనసులో మాటలు నిర్భయంగా చెప్పగలుగుతోన్న జ్యోత్స్న ఆ చూపులకు తడబడింది.
అది గమనించిన వెంకట్రావు పరిస్థితిని సర్దేస్తూ "సరే ఎవరైనా నాకు నచ్చిన అమ్మాయి కనిపించి, నాకు పెళ్ళి చేసుకోవాలనిపించినప్పుడు ఆవిడని మీ దగ్గరకు పంపిస్తాను.... ఈ విషయం ఆవిడకి చెప్పి ఒప్పిద్దురుకాని వెళ్తాను -" అని వెళ్ళబోతూ, అక్కడ టేబిల్ పైన భాస్కర్ కి తను ప్రజింట్ చేసిన పెన్ చూసి, ఆశ్చర్యంగా "అరె! ఆ పెన్...." అంటూ ఆగిపోయాడు.
ఒక్కక్షణం జ్యోత్స్న, వెంకట్రావు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. జ్యోత్స్న తలదించుకుంది.
"వస్తాను-" అని అక్కడి నుంచి వచ్చేశాడు వెంకట్రావు.
11
పార్కులో చెరువుగట్టున కూచుని భాస్కర్ రాకకోసం ఎంతో ఆరాటంతో ఎదురు చూస్తోంది జ్యోత్స్న. అతడు తనను అపార్థం చేసుకున్నాడేమోనన్న అశాంతి హృదయాన్ని దహించి వేస్తోంది - అతడు రాగానే అన్ని విషయాలూ వివరంగా చెప్పాలని తహతహలాడుతోంది మనసు.