"అయితే వెళ్తాను బాబు. మావాడి విషయం మాత్రం మర్చిపోకండి" అని ముందుకెళ్ళి పోయాడు బుద్ధమూర్తి.
హిమాలయాలంత బరువు దిగిపోయినట్టయింది శక్తికి.
ఇప్పుడేం చెయ్యాలి?
ముందు ఏదో ఒక హోటల్లో దిగాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆటో స్టాండ్ వేపు నడిచాడు. నందిగామ ఎక్కడ....? బెంగుళూరు ఎక్కడ....? వి.వి.ఎన్. ఎస్టేట్స్ ఉండేది చామరాజ్ పేట్, పుట్టన్న శెట్టి రోడ్... ఆ చుట్టుపక్కల ఎక్కడైనా హోటల్లో దిగితే? అదీ, అతి చిన్న హోటలై వుండాలి.
"చామరాజ్ పేట్ వస్తావా?" ఇంగ్లీషులో అడిగాడు శక్తి.
విలాసంగా సిగరెట్ తాగుతూన్న ఆటో డ్రయివర్ సమాధానం చెప్పలేదు. విసుక్కుని ముందుకి నడిచాడు శక్తి.
* * * *
రాజసింహాసనంలాంటి కుషన్ ఛైర్లో కూర్చున్నాడు. వి.వి.ఎన్. ఎస్టేట్స్ ఛైర్మన్. వీరమాచనేని వెంకటనారాయణ.
"మీ అమ్మ ఎలా ఉంది? నువ్వు పెద్దవాడివయ్యావోయ్... మీ నాన్న అలాగే ఉన్నాడా? నాకయితే అందర్నీ చూడాలని వుంటుంది. ఎక్కడా ఒక్క నిమిషం ఖాళీ ఉండదు- మీరయినా అప్పుడప్పుడు రావచ్చు గదా... నేనేం పరాయివాడ్నా! ఏదో అవసరం ఉంది కాబట్టి మీ అమ్మ నిన్ను నా దగ్గరకు పంపింది. ఈ పనెప్పుడో చెయ్యాల్సింది. పోనీలే నీకేం జాబ్ కావాలో చెప్పు. ఛాయిస్ ఈజ్ యువర్స్" నవ్వుతూ మాట్లాడుతున్న మేనమామ, ఆయన చూపించిన అభిమానం, ఆప్యాయతలకు పొంగిపోయాడు శక్తి.
"మీ ఇష్టం... మామయ్యా... మీరేం జాబిస్తే అది చేస్తాను..." వినయంగా అన్నాడు శక్తి.
"ఐ లైక్ యువర్ ఒబీడియన్స్... ఒకే! నిన్ను పర్సనల్ మేనేజర్ గా ఎపాయింట్ చేస్తున్నాను" అని చెప్పి వెంకటనారాయణ ఇంటర్ కమ్ లో పి.ఎ.ను పిలిచారు.
"చూడండి! హీ ఈజ్ మిస్టర్ శక్తి. నా మేనల్లుడు. పర్సనల్ గా ఎపాయింట్ చెయ్యండి.... గ్రేట్ ఒన్ క్వార్టర్ ఎలాట్ చెయ్యండి... కార్ విత్ డ్రైవర్. ఓకే" చిర్నవ్వుతో మేనల్లుడివేపు చూసాడు వెంకట నారాయణ.
శక్తి లేచి నిలబడ్డాడు.
"రండి సార్" వినయంగా ఆహ్వానించాడు పి.ఏ.
ఛైర్మన్ ఛాంబర్ లోంచి, రాజఠీవితో బయటకొచ్చాడు శక్తి.
* * * *
ఊహల్లోంచి నిజంలో కొచ్చాడు శక్తి-
ఎదురుగా-
పదిహేనంతస్తుల భవనం...
మేనమామ చాలా గొప్పోడన్న మాట- మనసులోనే అనుకుని ఆనందించి-
"ఆ బిల్డింగు మా మావదే" అని తను ఎక్కి వచ్చిన రిక్షావాడితో కూడా చెప్పి, వాడి డబ్బులు వాడికిచ్చేసి-
"మళ్ళీ కలుద్దాంలే... థాంక్స్ వెళ్ళు" అన్నాడు శక్తి. అలా అంటున్న శక్తివేపు పిచ్చివాడి వేపు చూసినట్లుగా చూసి-
"ఎలా బతుకుతాడో ఏంటో..." అనుకుని రిక్షాను లాక్కుంటు ముందుకెళ్ళి పోయాడు రిక్షావాలా.
* * * *
వి.వి.ఎన్. ఎస్టేట్స్... సుమారు రెండకరాల స్థలంలో అందమైన భవనాల సముదాయం. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం జగ్గయ్యపేటలోని ఒక సిమెంట్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ గా నారాయణ అనే వెంకటనారాయణ కలలతోనే జీవితాన్ని ప్రారంభించాడు.
రోడ్డు పక్క పెద్ద పెద్ద భవనాల్ని చూసినప్పుడల్లా ఇలాంటి బంగళాల్లో తను ఉండగలడా అని అనుకునేవాడు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను చూస్తున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీల్లో తను ఎప్పుడైనా పని చేయగలడా అని అనుకునేవాడు. కనీసం అంబాసిడర్ కార్లో తిరగ్గలనా అని అనుకునేవాడు.
"My Faith was only in my work...!"
వెంకటనారాయణ ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే వాక్యం అది. తను విశ్వసించిన వాక్యం అది.
వెంకట నారాయణకి ఇష్టమైన పదం సక్సెస్...
సక్సెస్ కి ఆయనిచ్చే డెఫినేషన్ కూడా వేరు...
సక్సెస్ అంటే ఆయన దృష్టిలో ఒక ఎక్స్ పరిమెంట్- ఒక్కొక్కప్పుడు ఎక్స్ పరిమెంట్ ఫెయిలవుతుంది. అంతమాత్రాన విజయం చేజారి పోయిందని అర్థం కాదు. ప్రయోగం... ప్రయోగం... జీవితం ఒక ప్రయోగం కావాలి. అప్పుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. అందుకు ప్రతి మనిషి నిరంతరం శాస్త్రవేత్త కావాలి.
తనదయిన లక్ష్యం, తనదయిన గమ్యం, తనదయిన ఆలోచన, తనదయిన విచక్షణం, తనదయిన విశ్లేషణ, రూపకల్పన, అనుసరణ... క్రమశిక్షణ... జీవితాన్ని విజయంవేపు నడుపుతాయి. ఇతరుల సక్సెస్ నుంచి, జీవితం నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకోవాలే గాని- వార్నే అనుకరించటంలో సక్సెస్ స్వంతమయిపోదు. తనదయిన పోరాటం నుంచే మనిషి ఎదుగుదల ఉంటుంది. వి.జి. పన్నీరుదాసు ఎదుగుదల ఒక రకంగా వుంటే... జె.ఆర్.డి. టాటా ఎదుగుదల మరోరకంగా వుంటుంది... క్రేన్ వక్కపొడి గ్రంధి వెంకట సుబ్బారావు పంధా ఒకటైతే స్వాతి బలరాం కృషి మరో రకంగా ఉంటుంది. ఒక రతన్ బాటా, అంబానీ, ఒక ఓబ్రాయ్ వీళ్ళందరి జీవిత సందేశం ఇదే....
వెంకటనారాయణ అందుకు రంగస్థలంగా బెంగుళూరుని ఎంచుకున్నాడు.
అభివృద్ధిని సాధించాలనుకునే ప్రతివాడూ, ముఖ్యంగా ముందుకు ఎంపిక చేసుకోవాల్సింది- తను ఏ రంగంలో కృషి చేయాలనేదే. అందుకు ఎక్కడ నుంచి ప్రారంభించాలనేది... ఊబిలో వరి పెరగదు... ఇసక మీద కాలేసేవాడు, పైకి ఎగరలేడు. బెంగుళూరు అభివృద్ధిని, ముప్పై ఏళ్ళ తర్వాత అక్కడ జరిగే మార్పుల్ని ముందుగా ఊహించాడు వెంకట నారాయణ-
అందుకే- తన వ్యాపార రంగం విస్తృతికి బెంగుళూరుని కేంద్రంగా ఎంచుకున్నాడు. ఆటోస్పేర్ పార్ట్స్ అమ్మకంతో వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. చిట్ ఫండ్స్, ఆటోమొబైల్స్, టూత్ పేస్ట్, సోప్స్, డిపార్ట్ మెంట్ స్టోర్స్, హోటల్స్, మద్రాసు, ఢిల్లీ, కలకత్తా, అహమ్మదాబాద్, బొంబాయిలలో ఫైవ్ స్టార్స్ హోటల్స్ ప్రారంభించాడు. రీసెంట్ గా ఎక్స్ పోర్ట్ కోసం ప్రాచీన కళాఖండాల షోరూమ్ ని కోటి రూపాయలతో ప్రారంభించాడు.