Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 21


    పిల్లిలా లేచాడు - లైట్ వెయ్యకుండానే చప్పుడు కాకుండా తలుపు తెరిచాడు. దడదడలాడుతున్న గుండెలతో చకచక మెట్లెక్కి జ్యోత్స్న ఉంటున్న వాటా తలుపు నెట్టాడు. తలుపులు దగ్గిరగా జేరవేసి ఉన్నాయి. తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపల చీకటి....
    లైట్ వేస్తూ "జ్యోత్స్నా!" అని పిలిచిన భాస్కర్ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు.  
    జ్యోత్స్న మంచం మీద వెంకట్రావు పడుకుని ఉన్నాడు. జ్యోత్స్న మంచం పక్కనే అతని మీదకు వంగి నిలబడి ఉంది.... లైట్ వేసిన అలికిడికి, 'జ్యోత్స్నా!' అన్న పిలుపుకి ఉలిక్కిపడి నిటారుగా నిలబడింది జ్యోత్స్న.  
    ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో చెప్పాలని జ్యోత్స్న పెదవులు కదిలాయి. కానీ, ఆ పరిస్థితుల్లో వెంటనే మాట్లాడలేకపోయింది. "ఛీ!" అని గిర్రున తిరిగి క్రిందకు దిగి వచ్చేశాడు భాస్కర్.
    అతనితో పాటు క్రిందకు దిగబోయిన జ్యోత్స్న భాస్కర్ ఇంటి గుమ్మం ముందు నిలబడిన సుశీలని చూసి మెట్లు దగ్గిరే ఆగిపోయింది. సుశీలని చూసి భాస్కర్ గతుక్కుమని ఆగిపోయాడు.   
    "ఆగిపోయారేం? గుడ్డిముండ - ఏమీ కనిపెట్టలేదు అనుకున్నారు కదూ? ఈ గుడ్డిదానికి కళ్ళు కనపడకపోయినా మనసుందండీ? ఈ మనసుతో అన్నీ చూడగలదు - అందరినీ అర్థం చేసుకోగలదు - నన్ను మోసం చెయ్యగలనని అనుకోకండి - మీరు మంచం మీద నుంచి లేచినప్పుడే నాకు తెలిసింది. ఇంత తొందరగా వచ్చేశారేం? ఏదైనా మరిచిపోయారా?"   
    సుశీల గొంతు చిన్నది కాదు - సుశీల అరుపులకి అప్పుడే ఎదురింట్లోంచి రేవతి, పార్వతమ్మ బయటికి వచ్చి వింత చూడసాగారు. అది చూసి భాస్కర్ శరీరం జలదరించి "ముందు లోపలికి పద! ఆ తరువాత మాట్లాడుకోవచ్చు" అన్నాడు.
    "సుశీల కదలకుండా అక్కడే నిలబడి కసిగా "మాట్లాడుకోవచ్చునా? నాతో ఏం మాటలున్నాయి మీకు? నా డబ్బుతో చదువు పూర్తిచేసుకోగానే నాతో మాటలూ పూర్తయిపోయాయి. వెళ్ళండి. వెళ్ళండి. పైకి వెళ్ళండి. కళ్ళ పండువుగా చూస్తాను. ఈ వైభోగం చూడటానికయినా దేవుడు నాకు కళ్ళిస్తే బాగుండును!" అంది.
    భాస్కర్ భరించలేక సుశీలను భుజంపట్టి లోపలకు బలవంతాన తీసుకుపోబోయాడు. సుశీల విదిలించుకుని "నన్ను లోపలకు నెడతారెందుకు? కళ్ళు లేనిదాన్ని. మీ విలాసాలకు నేనేం అడ్డు.... నన్ను దగ్గిర పెట్టుకునే మీ రాసక్రీడలు సాగించుకోవచ్చు" అంది.   
    అనేక విధాల విసిగిపోయి ఉన్న భాస్కర్ భరించలేక.... "ముందు లోపలికి నడు!" అని లోపలికి తోశాడు. తూలి పడింది సుశీల.    
    పట్టరాని అక్కసుతో "ఓయ్ దేవుడా! నా కళ్ళముందే దానితో కులుకుతూ, నన్ను చావ బాదుతున్నాడు నాయనోయ్!" అని ఏడుపు ప్రారంభించింది.
    అంత రాత్రివేళ ఇంట్లోంచి పారిపోయాడు భాస్కర్. అతడు కాంపౌండ్ దాటేవరకూ మెట్ల దగ్గిరే నిలబడిన జ్యోత్స్న అప్పుడు నెమ్మదిగా లోపలకు వచ్చింది.    
    వెంకట్రావు మంచం మీద అలాగే పడుకుని ఉన్నాడు జ్యోత్స్నకు ఏమీ అర్థం కావటం లేదు.
    రాత్రి పదిగంటల ప్రాంతంలో వచ్చాడు వెంకట్రావు జ్యోత్స్న ఇంటికి. తెల్లబోయి చూస్తోన్న జ్యోత్స్నతో "నన్ను అపార్థం చేసుకోకండి. ఇప్పుడు తప్ప మీతో మాట్లాడగలిగే అవకాశం లేదు. మిమ్మల్ని క్షమాపణ కోరుకోకుండా స్తిమిత పడలేకపోతున్నాను అన్నాడు. జ్యోత్స్న సమాధానం చెప్పలేదు.
    "మిమ్మల్ని అవమానపరచాలనీ, చిన్నబుచ్చాలనీ ఆ విషయం చెప్పలేదు నేను. అందరి మధ్య ఉంటూనే, ఏ ఒక్కరితో సంబంధం లేనట్లుగా ఎక్కడకో పారిపోగలిగిన వ్యక్తిని మిమ్మల్ని మాత్రమే చూశాను, ఆనాడు హోటల్లో.... మళ్ళా మీలో అలాంటి మూర్తినే ఇవాళ చూడగానే, మిమ్మల్ని ఇదివరలో ఎక్కడ చూశానా అని ఎప్పటినుండో మధనపడుతోన్న నాకు గభాలున స్ఫురించింది. అనాలోచితంగా పైకి అనేశాను. దయచేసి క్షమించండి...."   
    వెంకట్రావు మాటల్లో నిజాయితీ కనిపించింది జ్యోత్స్నకి.... అతని ముఖంలో తనపట్ల సానుభూతి ఉంది. ఆ కళ్ళు తనను ఎంతో ఆర్ద్రంగా, అభిమానంగా చూస్తున్నాయి.
    "మీరు ఆ హోటల్ కి ఎందుకొచ్చారు? అలా ఎప్పుడూ వస్తూ ఉంటారా?" కుతూహలంతో అడిగింది జ్యోత్స్న.
    ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి కొంచెం తటపటాయించాడు వెంకట్రావు. "నేను...." అంటూ ఏదో చెప్పబోయినవాడు హఠాత్తుగా ఆగిపోయి, ఎవరో తరుముకొస్తున్నట్లు తలుపులు దగ్గిరగా జేరవేశాడు. లైట్ ఆర్పేశాడు. మంచం మీద పడిపోయాడు. అదంతా కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయింది.
    జ్యోత్స్న కంగారుపడి "ఏమిటండీ. లైట్ ఎందు కార్పేశారు? ఇదంతా ఏమిటి?" అంది. వెంకట్రావు దగ్గిరనుండి సమాధానం రాలేదు. సరికదా ఒక విధమయిన వగర్పు వినిపించింది. జ్యోత్స్నకు మతిపోయినట్లయి ఏమిటో చూద్దామని ముందుకు వంగింది. అంతలో లైట్ వెలిగింది. భాస్కర్ రావటమూ, పోవటమూ కూడా జరిగిపోయాయి.      
    మంచం మీద స్పృహ లేకుండా పడివున్న వెంకట్రావుని చూస్తే ఏం చెయ్యాలో తోచలేదు జ్యోత్స్నకి. అంతకు కొన్ని క్షణాలకు ముందే జరిగిన గొడవ తర్వాత క్రిందకు వెళ్లాలనిపించలేదు. మచ్చల డాక్టర్ ఇంట్లో లేడు. పాపం తనను జాగ్రత్తగా తన వాటాలో దింపి ఏ సినిమాకో వెళ్ళిపోయినట్లున్నాడు.

 Previous Page Next Page