Previous Page Next Page 
వ్యూహం పేజి 21


    ఏం పేరబ్బా...?

 

    బేబీ ఎస్... బేబీనే...

 

    బేబీ... అదేం పేరు... అసలు పేరు ఏదో అయి వుంటుంది.

 

    ఇంతకీ ఎలా వుంటుందో?

 

    అసలు మేనమామ ఎలా ఉంటాడో తెలిస్తేనే కదా... అతని కూతురు ఎలా వుంటుందో తేలీడానికి.

 

    ముందు మేనమామని బుట్టలో వేసుకోవాలి... తర్వాత... ఆ బేబీని ఆ తర్వాత... ఆ ఆస్తి....

 

    అప్పుడు తన చుట్టు... మిస్ ఇండియాలు... మిస్ వరల్డ్ లు... ఆ ఆలోచనే థ్రిల్లింగ్ గా వుంది!

 

    రైలు ఏదో స్టేషన్ దాటింది. "టైమెంతయింది...?" ఎదురుగా కూర్చున్న వ్యక్తి అడిగాడు.

 

    ఆ వ్యక్తి వైపు ఎగాదిగా చూసాడు. ఆ ఆకారం అస్సలు నచ్చలేదు శక్తికి.

 

    వీడికి నేను... టైమ్ చెప్పాలా... అస్సలు వీడికి నేనెలా కన్పిస్తున్నాను. ఆవారా గాడిలా కన్పిస్తున్నానా?

 

    మళ్ళీ టైమ్ అడిగాడా వ్యక్తి.

 

    "ట్వల్వ్-" అయిష్టంగా చెప్పాడు. నోటికొచ్చిందేదో చెప్పాడు తప్ప, అసలు చేతి వాచీవేపు చూడలేదు.    

 

    "అంతయి వుండదే-" అంటూ ఆ వ్యక్తి, దూరంగా నుంచున్న ఒక వ్యక్తిని అడిగాడు.

 

    "పదిన్నరైంది" ఆ వ్యక్తి కరెక్టు టైమ్ చెప్పాడు. బట్టతల వ్యక్తి శక్తివేపు అదోరకంగా చూసి-

 

    "ఏ వూరు బాబూ ప్రయాణం-" మళ్ళీ అడిగాడు శక్తిని. నన్నేనా అన్నట్టు చూసాడు శక్తి అతనివేపు. పంచకట్టు, కళ్ళద్దాలు- అతన్ని చూడగానే, రెవెన్యూ ఆఫీసులో గుమస్తా, మున్సిపల్ స్కూల్లో టీచరు గుర్తుకొస్తారు.

 

    "బెంగుళూరు" చెప్పేస్తే, మరి అడగడు కదా అని నిజం చెప్పేసాడు.

 

    "నేనూ- బెంగుళూరే" చెప్పాడాయన. నేన్నిన్నడిగానా- అన్నట్టు ఆయన వేపు చూసాడు శక్తి. బెంగుళూరు వరకూ నన్నీయన వదలడేమో!"రిజర్వేషన్ దొరక్క- మరీ అత్యవసరమై- ఈ జనరల్లో ఎక్కానుగానీ- ఇకనుంచీ ఎక్కగూడదు- నీకూ రిజర్వేషన్ దొరకలేదా?" అడిగాడా వ్యక్తి.

 

    చికాగ్గా ఆయన మొఖంవైపు చూసాడు వ్యక్తి.

 

    "ఫ్లయిట్ టిక్కెట్ దొరకలేదు- అర్జంటుగా వెళ్ళాలి. అందుకు" కోతకోసాడు శక్తి.

 

    "దేశంలో జనాభా పెరిగిపోయింది. ఇప్పుడందరూ ఫ్లయిట్లెక్కెస్తున్నారు. ఫ్లయిట్ టిక్కెట్లు కూడ దొరకడం లేదు. కొత్త, కొత్త రవాణా సాధనాలు రావాలి తప్పదు-" నెమ్మదిగా అన్నాడాయన.

 

    దారంట ఏదో, ఒకటి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు ఆ బట్టతలాయన. మధ్యలో ఓసారి చెప్పాడు.

 

    తన పేరు బుద్ధమూర్తి అని... తన మేనల్లుడు బెంగుళూరులో ఉన్నాడని... పెళ్ళి సంబంధం విషయం మాట్లాడానికి వెళుతున్నానని.

 

    "మీ మేనల్లుడు ఏం చేస్తున్నాడక్కడ..." అప్రయత్నంగా శక్తి అడిగాడు.

 

    "వెంకటనారాయణ ఎస్టేట్స్... పేరు వినే వుంటావ్... ఆ... సంస్థ గురించి తెలియనివాళ్లు ఎవరుంటారులే- సౌత్ ఇండియన్ బిజినెస్ కింగ్.... అందులో క్లర్క్-" చెప్పాడాయన.

 

    "వెంకట... నారాయణ... ఎస్టేట్సా?" ఆశ్చర్యంగా అడిగాడు శక్తి.

 

    "అవునయ్యా... ఏం" అడిగాడాయన.

 

    "ఏం లేదు ఆ వి.వి.ఎన్. ఎస్టేట్స్ మాదే" శక్తి ఓరకంట, కిటికీలోంచి బయటకు చూస్తూ అన్నాడు ఠీవిగా.

 

    బుద్ధమూర్తి నమ్మలేకపోయాడు. శక్తి వేసుకున్న డ్రెస్ వేపు, వాచీవేపు, ముఖంవేపు పదే పదే చూసాడు.

 

    "మాదే... అంటే?!"

 

    "వెంకట నారాయణ మా మావయ్యే"

 

    బుద్ధమూర్తి కళ్ళు టపటప మన్నాయి ఆ మాటతో.

 

    "మీరెవరో తెలీక... మీతో ఏవేవో మాట్లాడాను. ఏవనుకోకండి బాబూ.. రాళ్ళ మధ్య రత్నాలున్నా, పోల్చుకోలేం గదా... తమరేం చేస్తుంటారు బాబూ" వెర్రిబాగులవాడిలా నొచ్చుకున్నాడతను.  

 

    తమరంటే తనేనా? ఇంతవరకూ నువ్వూ, నువ్వు అన్నవాడు, గౌరవం పెంచేసరికి ఉబ్బితబ్బిబ్బయి పోయాడు శక్తి.

 

    "వి.వి.ఎన్. ఎస్టేట్స్ కి కాబోయే ఎం.డి.ని అంటే మేనేజింగ్ డైరెక్టర్ ని..." పక్కనున్న పాత సూట్ కేసును బుద్ధమూర్తికి కన్పించకుండా వాటిమీద చేతులు పెట్టుకుని అన్నాడు శక్తి.

 

    రైలు మరేదో స్టేషన్ దాటింది.

 

    "చూడండి బాబు.... మూడేళ్ళ నుంచి మావాడు మీ కంపెనీలో క్లర్క్ గా వున్నాడు. కొంచెం ప్రమోషన్ విషయం గుర్తుంచుకోండి బాబూ... రేపు ఎండల్లో పెళ్ళి కూడా చేద్దామని అనుకుంటున్నాను" విన్నపం చేసుకున్నాడు బుద్ధమూర్తి.

 

    "దాందేముందిలేండి. రేపెళ్ళగానే మీవాడికి ప్రమోషన్ ఇప్పిస్తాను."

 

    ఆ మాటకి పొంగిపోయాడు బుద్ధమూర్తి.

 

    సరిగా ఎనిమిదిన్నరకు రైలు స్టేషన్ కొచ్చింది. స్టేషన్ లోంచి బయటి కొస్తున్నప్పుడు అడిగాడు బుద్ధమూర్తి.

 

    మీకు కారొస్తుందనుకుంటాను"

 

    "వస్తే... మా మామయ్యే.... స్వయంగా రావచ్చు. ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా కేన్సిల్ చేసుకుని వస్తాడాయన..."  

 

    శక్తికి మనసులో భయంగా ఉంది- మొట్టమొదటిసారి బెంగుళూరు రావడం.

 

    ఎక్కడకెళ్ళాలి....? ఏం చెయ్యాలి...? ఈ బట్టలతో ఈ అవతారంతో ఆఫీసుకెళితే...? అమ్మ పన్నెండు వందలిస్తే అందులో రెండొందలు ఛార్జీలకయి పోయాయి. ఇక మిగిలింది వెయ్యి... అవి అయిపోయేలోపు తను సెటిలయి పోవాలి... లేదంటే? ఇకపైన ఆలోచించ లేకపోయాడు.

 

    ముందేం చెయ్యాలి...? అటూ ఇటూ చూస్తూ ఆలోచిస్తున్నాడు. పక్కనే ఇంకా వెళ్ళకుండా వున్న బుద్ధమూర్తిని చూసి గతుక్కుమని-

 

    "మీరింకా వెళ్ళలేదా.... వెళ్ళండి" అన్నాడు.

 

    "మీ కారొస్తే... మీరెక్కాక.... నే వెళదామని..." వినయంగా అన్నాడు బుద్ధమూర్తి.

 

    "కారు డ్రయివర్ కి, టైమ్ సెన్స్ తెలీదండీ వాళ్ళకి ఎమ్.డీ. అన్నా ఖాతరు లేదు. అమెరికా ప్రెసిడెంటన్నా ఖాతరుండదు" విసుక్కుంటున్నట్టుగా ముఖంపెట్టి అన్నాడు శక్తి.

 Previous Page Next Page