Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 22


    "గరల్ ఫ్రెండ్ ఎవరన్నా...."

    ఈ క్షణాన మధుబాబు ఓ రచయితకాదు. ఓ మానసిక పరిణత చెందిన వ్యక్తికాదు. ఓ పిల్లవాడు.... చిన్న పిల్లవాడు అయిపోయాడు. ఆ ప్రొఫెసర్ వంక జాలిగా చూశాడు నీళ్ళు  కార్చటానికి సిద్ధంగా వున్నకళ్ళతో.

    "చెప్పు మధుబాబూ. వీలయితే ఏదైనా సలహా ఇస్తాను. ఐయామ్ యువర్ టీచర్. ట్రీట్  జస్ట్ మి లైక్ యువర్ ఫాదర్" అన్నాడాయన అభిమానం వుట్టిపడే కంఠంతో.

    మధుబాబు కరిగిపోయాడు. ఉద్రేకంగా, అమాయకంగా  అంతా చెప్పేశాడు ఒక్క వూహాస్వప్నం విషయం మినహాయించి. ఆ విషయం వెల్లడి చేయటానికి ఓ విధమైన వ్యక్తిత్వం అతన్ని  వారించింది.

    అంతా విని, ఆయన ఓ నిముషం ఆలోచించి "ఆమెని ఎందుకు పెళ్లి చేసుకోవు మధుబాబూ?" అని అడిగాడు.

    "నాకు తెలియటల్లేదు సార్ ఏ విషయం సరిగ్గా. అది మంచిపనే అవుతుందంటారా?"

    "అంతకన్నా మంచిపని ఇంకేముంటుంది? ఈసారి సెలవులకు వెళ్లి ఆమెను కలుసుకో. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా నిస్పృహ చెందకు పట్టుదలగా మేరేజ్ చేసుకో"

    ఆ సలహాతో మధుబాబుకు కొండంత  ధైర్యంవచ్చింది. ఓ విధమైన ఆత్మవిశ్వాసం కలిగింది. పద్మజ తనని గురించి ఎంతైనా ఊహించుకోనియ్యిగాక. తాను వెళ్లి ఒక్కసారి కలుసుకుంటే, ఆమెను తనవైపు తిప్పుకోవచ్చుననే మొండిధైర్యం కలిగింది. ఆ రోజంతా ఉత్సాహంగా వున్నాడు. ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది. చిత్రవధ తగ్గింది.


                                *    *    *

    ఎక్కడకుపోతుంది పద్మజ తనకు గాకుండా? కాని సూటిగా "మనం పెళ్ళి చేసుకుందామా?" అని అడగటానికి అతని మనస్సు ఒప్పలేదు. ఉత్తరాలు రాయటం ఆపేసి, కొన్ని నెలలయాక హఠాత్తుగా వెళ్లి ఆమెను కలుసుకుని, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసి, తమ వివాహప్రశంస తమాషాగా, కథలోని దృశ్యంలా జరగాలి. అందులో ఓ ప్రత్యేకత వుండాలి, సోగసుండాలి.

    "నేను మీకు ఇహ ఉత్తరాలు రాయను. వాటివలన మీకు చాలా కష్టం, అశాంతి కలుగచేస్తున్నట్లు నా  నమ్మకం. మీ జీవితంనుంచి తొలగిపోదలచాను. ఎప్పటికైనా మీకేదైనా.....జరిగితే నాకు తప్పకుండా శుభలేఖ పంపిస్తారు కదూ."

    తమ బంధం చిత్రమైనది. ఒకసారి నువ్వనుకుంటారు. ఒక్కొక్కసారి మీరనుకుంటారు.

    పోస్ట్ చేసి నిట్టూర్పు విడిచాడు.


                                                                 *    *    *


    "మీ చివరి ఉత్తరం అందింది. ఐతే శాశ్వతంగా సెలవు పుచ్చుకోదలచారన్న మాట. ఈ ప్రపంచంమీద నాకు నమ్మకం నశిస్తోంది. ఎంత అల్పులు మనుష్యులు! ఇంత సులభంగా బంధాలు తొలగించుకోవటానికి.... ఎంత కఠినత్వం! ఇన్నాళ్ళ పరిచయం, స్నేహం..... అంతా  ఒక్కక్షణంలో సఫా. మరోమారు చెబుతున్నాను. మీ ఉత్తరాల వలన నాకు అశాంతీ, ఇబ్బందీ ఏమీలేవు. అదంతా మీ భ్రమ. సరే కథ ముగింపువచ్చింది. కారణంలేని ముగింపు. నాకు యీ భూమ్మీద ఒకజత, లోకానికి అర్థంకాని ఒక ఉజ్జీ వున్నాడనుకున్నాను. అతనుకూడా అందరితోపాటే అయిపోయినాడు. ఎప్పుడైనా సన్నజాజి పువ్వులు కనిపిస్తేనైనా నేను జ్ఞాపకం వస్తావా? మీకు గులాబీలు ఇష్టంకదూ? రోజూ నిద్రలేవగానే కిటికీలోంచి మా తోటలోని గులాబీమొక్కకేసి చూడటం నా అలవాటు. దానికి రోజూ ఓ పువ్వు పూస్తోంది. అలాగే ఎంతోసేపు దాన్ని తిలకిస్తూ వుండిపోతున్నాను. ఎవర్నీ కోయనియ్యటం లేదు. మీరు నాకు రాసినా, రాయకపోయినా నా పుట్టినరోజుకు మీ ఆశీస్సులు అందాలి. ఇహ సెలవా? ఎట్లా సెలవు తీసుకోవటం? బైబై చెప్పటమా....? టాటా..... అని చేతిరుమాలు ఊపటమా? లేక మన హిందూ పద్ధతిలో మోకాళ్లమీద వంగి సాష్టాంగ....ఏం?

    అవునుగాని నా శుభలేఖ మీకు అందదు. ఎందుకంటే అది అచ్చయి అప్పుడే మూడేళ్ళయిపోయింది. అంటే నా పదిహేనేళ్ళ వయస్సులో, అర్థమవుతోందా? నేను పెళ్ళయినదాన్ని.

    మరి.... అయితే....

   
                                                                  *    *    *

    ప్రపంచం ఫెళఫెళమని విరిగిపడింది. వెయ్యికంఠాలు వెక్కిరించాయి. చీకటి నల్లగా నోరు తెరిచి నవ్వింది. భూమి బ్రద్ధలైంది.

    అతని గుండె పగిలిపోయింది.

    ఆ రాత్రి..... గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. పిచ్చెక్కినట్లు.

    రెండోసారి తన జీవితం చిరిగిపోయింది నిర్దయంగా. ఎన్ని ఆశలు! అన్ని కలలు!

    ఎటుచూస్తే అటు చీకటి.

    "ఎంతపని చేశావు పద్మా! ఎంతపని చేశావు? ఇన్నాళ్ళూ యీ విషయం ఎందుకు నాకు చెప్పలేదు? ఇంత అన్యాయం ఎందుకు చేశావు? నీకు కావలసింది వేరు, నాకు కావాల్సింది వేరు. చెప్పు పద్మా,ఇదంతా అబద్ధమనీ, వట్టి తమాషాకని, అంతా గమ్మత్ అనీ చెప్పు. లేదు పద్మా, నువ్వలా చెప్పవు. అంతా నిజం. నాకు తెలుసు.... ఈ ఉత్తరంతో ఇంత విషం పంపించక పోయావూ? పద్మా! పద్మా! పద్మా!!!


                                                     23


    వేసవి సెలవులు యిచ్చారు. మధుబాబు ఇంటికి వచ్చాడు. అతని తల అంతా ప్రస్తుతం శూన్యంగా వుంది. అభిప్రాయాలూ లేవు. అభిరుచులూ లేవు. బయటకు కూడా కదలటం మానేశాడు. ఉమాపతి తరచు వచ్చిపోతున్నాడు. అతనీ మధ్య నవలొకటి రాశాడు. పొదుపు అనేదాన్ని ప్రాథమిక ఉద్యమంగా తీసుకున్నాడు. మధ్యతరగతి వాళ్ళ బాధలకూ, కష్టాలకూ కారణం..... ఎక్కువ దుబారానే అనీ, అర్థంలేని వంశానుగత ఆడంబరాలేననీ విమర్శించుకుంటూ వచ్చాడు. పండుగలూ, పెళ్లిళ్ళూ,సమర్తలూ వీటిలో ఎంత డబ్బు వృధాగా,  అవివేకంగా ఖర్చుపెడతారో సహేతుకంగా నిరూపించ సాగాడు. సీరియల్ గా వస్తోన్న అతని నవలకు ప్రచారం వచ్చింది. వంటింట్లోంచి బయటకు రాణి స్త్రీ శిరోమణులనికూడా ఆకర్షించింది.

    ఉమాపతి ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ కూడా బహుముఖంగా చదవలేదు. కాని తనకు అవసరమైనంతవరకూ క్షుణ్ణంగా చదువుతాడు. తెలియని సంగతి గురించి అసలు రాయడు. దాని జోలికిపోడు. స్వతహాగా కొన్ని అభిప్రాయలు వున్నాయి. జీవితాన్ని చూసి కొన్ని ఏర్పరచుకున్నాడు. నిశితంగా, చురుగ్గా ఆలోచించగలడు.

    మధుబాబు ఏమీ రాసేస్థితిలొ లేడు. ఒకప్పుడు రాశాడా ఇలా? అన్న సంశయం వచ్చేటంతగా శూన్యస్థితికి వచ్చాడు. రాద్దామన్న ఉత్సాహం, ఏమీ యిన్స్పిరేషన్ లేవు. పత్రికలవాళ్ళూ, అడుగుతూనే వున్నారు. అతను మౌనంగా ఊరుకున్నాడు.

    పద్మజ పుట్టినరోజు అతనికి జ్ఞాపకం వుంది. ఆరోజు ఆమెకు అందేటట్లు గ్రీటింగ్స్ పంపించాడు, అచ్చువేయబడిన గులాబీ పువ్వులు. కాని ఆమెకు సకాలంలో అందినట్లు లేదు. విశాఖపట్నం ఎడ్రెస్ కు ఉత్తరం రాసింది. అది బెజవాడకు రీడైరెక్టు చేయబడి వచ్చింది.

    "......రాత్రి తొమ్మిది గంటలైంది. వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయారు. కొత్తబట్టలతో నేను ఒక్కదాన్ని కుర్చీలో వంటరిగా అలిసిపోయిన శరీరంతో మిగిలిపోయాను. ఈరోజు నీ దగ్గర్నుంచి ఉత్తరం వస్తుందని ఎంతో ఆశించాను. కాని నువ్వెంత కఠినుడివి? బుద్ధదేవుడికి వారసుడిలా, నాపరాయిలా వుండిపోయావు. నన్ను వెదుక్కుంటూ వచ్చిందీ నువ్వే. దూరంగా  పోయిందీ నువ్వే. ఎంత స్వార్థం నీకు? నాకు పెళ్ళయినంతమాత్రంచేత నన్ను దూరం చేసుకోవాలని వుందా?  అయితే నన్నుగురించి మరోవిధంగా ఆశించావన్నమాట. అంతేనా? మరేమీలేదా? ఎంతకోపం వస్తోంది నీమీద? ప్రపంచానికి అతీతులమై, ఒకరిపట్ల ఆసక్తిలేని ఆకర్షణ..... యివన్నీ నీలో లేవన్నమాట. నేను నీనుంచి ఏమీ కోరలేదు. నువ్వూ అంతేననుకున్నాను. అసలు యిది మీ రక్తంలోనే వుంది....."

    మధుబాబు వికలమనస్కుడయాడు. దీనికతను సరియైన సమాధానం యివ్వగలడు. ఒకే కోణంనుంచి ఆలోచిస్తోంది పద్మజ. కాని ఎందుచేతో ఆమె ఎన్నిమాటలన్నా అతనికి కోపం రావటంలేదు. అందుకని సరికిసరి ప్రత్యుత్తరం చెప్పి ఆమె అన్యాయాన్ని ఆమెకు తెలిసేటట్లు చెప్పలేకపోతున్నాడు. తన జీవితంలో ఎటువంటి గండి ఏర్పరచిందో ముఖాన అనెయ్యలేకుండా వున్నాడు. ఇది తన  లోపంగా, తను చేసేవన్నీ అన్యాయాలుగా భావిస్తుందేమో పద్మజ. తాను ఆమెనిగురించి మరోవిధంగా ఆశించాడా? అట్లా ఆశించేపక్షంలొ రూపం తెలియని ఆమెను, వందలమైళ్ల దూరంలోవున్న ఆమెనే ఎన్నుకోవాలా? తనకు ఇక్కడ అవకాశాలు లేవా? తనకు చేతకాదా? తను పిరికివాడా? ఎట్లా తెలుస్తుంది యీ సత్యం పద్మజకు? తన  సర్వస్వం తెలిసి, తన లోపాలూ, గుణాలూ అన్నీ తెలిసి తనకోసం ఆరాటపడే జీవులందరు యిక్కడ వుండగా, ఆమెపెట్టే చిత్రవధను సహిస్తూ, చివరకు ఆమెని కలుసుకోవటానికే భయపడి, ఆమె దయమీద ఆధారపడేస్థితికి వచ్చాడే తాను. ఇదంతా అర్థం చేసుకుంటుండా పద్మజ. "నిన్ను అట్లా వూహించాను. ఇట్లా ఊహించాను" అని ప్రతిసారీ దాన్నిగురించే నొక్కినొక్కి రాసి, తాను ఆ ఊహించుకున్న రూపాన్నే ఆరాధిస్తున్నానని రాస్తే భరించగలదా పద్మజ? బ్రతగ్గలదా? ఆమె రూపాన్ని గురించి ఆలోచనకు తావియ్యకుండా, యిప్పుడేకాదు. ఎప్పుడూ.... చచ్చిపోయే దాకా కూడా ఆమెని ఆరాధిస్తూ వుంటాడని ఆమె ఎలా  తెలుసుకుంటుంది?

    ఇవన్నీ ఆమెకు చెప్పటం యిష్టంలేదు అతనికి. జవాబు యివ్వకుండా ఊరకున్నాడు.

    అతని నవలకు వచ్చిన బహుమానాన్ని సాహితీసమితివాళ్లు హైదరాబాద్ లో యివ్వటానికి నిర్ణయించి తేదీ, పెద్ద ఎత్తున  జరిగే ఆ సభ వివరాలూ తెలియజేశారు. హైదరాబాద్ లో జరుగుతుందా? అయితే తాను వెళ్లడు అక్కడకి వెళ్ళలేడు.

    తండ్రి వెళ్ళమని బలవంతం చేశాడు. అసలు వెళ్లననటానికి కారణం ఆయనకు బోధపడలేదు. "నాకు వెళ్ళాలని లేదండీ" అని ముభావంగా ఊరుకున్నాడు మధుబాబు. విశ్వనాథంగారు యింకేమీ అనలేకపోయారు. ఫంక్షన్ సరిగ్గా రెండు రోజులుందనగా తనకు జ్వరంగా వుందని రాలేక పోతున్నాననీ వైర్ యిచ్చాడు మధుబాబు. తనమీద తనే కసితీర్చుకున్నట్లు అతనికి తృప్తిగా వుంది.

 Previous Page Next Page