పైనుంచి కుర్రాళ్ళు అరుస్తున్నారు. కంగారుతో కేకలు పెడుతున్నారు. ఒకడెవడో ముందుకు వంగి బ్యాట్ అందిచ్చాడు. అతడ్ని వెనకనుంచి మరో యిద్దరు గట్టిగా పట్టుకున్నారు. మధుబాబు చేయెత్తి శక్తినంతా ఉపయోగించి దాన్ని పట్టుకున్నాడు. రెండు మూడు నిముషాలు యమయాతన మీద పైకి లాగేశారు.
వళ్ళంతా బురద, మురికీ. ఎలా వుండాలో అలా వున్నాడు అతను.
గదికి వెళ్ళాక శుభ్రంగా తలంటుపోసుకుని, బట్టలేసుకుని కుర్చీలో కూర్చున్నాడు.
"దూరంగా వుండకు పద్మా! వుండలేను నిన్ను విడిచి. ఇలా బ్రతకలేను."
* * *
రాత్రి పదకొండు దాటింది. పద్మజ తమయింట్లో ఓ గదిలో కూర్చుని రాసుకుంటోంది. బయట ప్రళయంగా వర్షం పడుతోంది.
".....మీరు ఎక్కడకూ వెళ్ళలేరు మధుగారూ! నేను వున్నన్నాళ్ళూ అది మీకు చేతకాదు..... ఇలా ఓ రాత్రివేళ.... యింట్లో అంతా నిద్రపోతోంటే....బయట జోరున వాన పడుతూండగా..... ఈ గదిలో లైటు వేసుకుని కూర్చొని మీకో యువతి, మధ్యమధ్య ఆలోచిస్తూ, ఫాలభాగాన కలం ఆనిస్తూ ధ్యాన ముద్రలో పడిపోయి..... యిలా ఉత్తరం రాస్తోందంటే అదెంత అదృష్టం? మీ అదృష్టానికి అసూయగా వుంది.....
మాధూ! మధూ! మీరు నాకెప్పుడు కన్పిస్తారు? అసలు కన్పించరా?
వచ్చెయ్యండి మధూ! అక్కడో క్షణంకూడా వుండొద్దు. వచ్చెయ్యి వచ్చెయ్యి! నీకోసం ఎదురు చూస్తుంటాను వెయ్యికళ్ళతో. ఎప్పుడు వస్తావో రాయి. సరాసరి స్టేషన్ కి వచ్చేస్తాను. లేకపోతే ఎక్కడన్నా దిగి ఫలానాచోట దిగానని కబురుచెయ్యి. పరుగెత్తుకు వచ్చేస్తాను. ఏం మధూ! మాట్లాడవ్? ఎప్పుడు వస్తావు? రా... రా... రా..."
22
పద్మజ దగ్గరకెళ్ళిపోవాలనిపించింది మధుబాబుకు. నిజంగా అలా ఆదరిస్తుందా తనను? తనతో ఎక్కడికైనా వచ్చేస్తుందా? అంత ధైర్యం, స్వాతంత్రం వున్నాయా ఆమెకు? ఇల్లూ, నిబంధనలూ యివేమీ లేవా?
"మీతో రెండునిముషాలైనా ఏకాంతంగా గడపాలి. నన్నెక్కడికైనా తీసుకుపోండి. అలాంటి అవకాశం లభిస్తుందా నాకు?" అంటుంది పద్మజ.
ఎందుకంత భయం ఆమెకు? అలాంటి అవకాశం ఎందుకు లభించదు? అసలు తమ యిద్దరి బంధాన్ని గురించి ఏమని తలపోస్తూ వుంటుంది పద్మజ? దీనికి పర్యవసానం ఆమెకవసరం లేదా? శాశ్వతంగా ఇదే వాంఛిస్తోందా?
వెళ్ళిపోవాలాని వుంది ఆమెదగ్గరకు. నిజంగా వెళ్ళిపోయేవాడే కాని యింతలో ఆమె దగ్గర్నుంచి వచ్చిన మరో ఉత్తరం అతని గుండెల్ని చీల్చింది. అతన్లో దారుణ సంక్షోభాన్ని రేపింది.
* * *
"ఎందుకిలా అయింది? నేనేమిటి ఊహిస్తున్నాను?" అని పద్మజ విసుక్కుంది.
అతనితో పరిచయం అయినప్పటినుంచీ అతన్నిగురించి, అతని రూపాన్ని గురించి గొప్పగా ఊహిస్తోంది. అట్లా వూహించకూడదు అని చాలాసార్లు అనుకుంది. తనుగా తను తనని వెదుక్కుంటూ వచ్చాడు. లేకపోతే అసలు యిన్ని ఆలోచన్లు, అనుభూతులు చెలరేగేవి కావేమో! అతని ఉత్తరాలు తనని మరింత ఊహాలోకంలో విసిరేశాయి. అతని పేరు గుర్తుకురాగానే, అతని మాటలు చదువుతోంటే ఓ మధురమనోహర రూపం మనోపథంలో సాక్షాత్కరించింది ఎంత వద్దనుకున్నా. ఎంత తిరస్కరిస్తున్నా ఎప్పుడూ అదే సుందర రూపం, ఆ వంకెలజుత్తూ, సుందర తరళనయనాలు, తెల్లటి దేహకాంతి, ఉన్నతమైన అతని సుకుమార మూర్తి, ఆ చిలిపిచేష్టలూ, చొరవా, ముఖ వర్ఛస్సూ.....
"నేననుకున్నట్లు అతను ఎట్లా వుంటాడు?..... ఇది అన్యాయం" అనుకుంది.
"అట్లా వుండకపోతే? ఒకవేళ అతను అట్లా వుండకపోతే......?"
భరించగలదా తను? తన ఊహాస్వప్నం చెదిరిపోతుంది. గాజులా గలగల పగిలిపోతుంది.
ఎంత మంచివాడు అతను? అతని మనస్సు ఎంత సున్నితం? అలాంటి మనస్సు చాలదా? ఎందుకు రూపం గొడవ? ఏం చేసుకుంటుంది దాంతో తను?
మనస్సు అంగీకరించటంలేదు.
అతను వచ్చేస్తే, తాను ఆశాభంగం పొందితే, తాను దురపిల్లుతోంటే ఎవరు ఓదారుస్తారు తనని? అబ్బ! ఎట్లా యీ అవస్థ భరించటం? అతను వచ్చేస్తాడేమో. రాకపోతే తను ఉండగలదా? వస్తే.....హా! ఏమిటి భగవాన్? నన్నింత ఊహావాసిగా ఎందుకు జన్మింపచేశావు?
అతనికి అబద్ధం రాయాలనిపించలేదు. రాసేసింది తన మనఃకల్లోలం.
* * *
మధుబాబు అద్దంలోకి చూసుకున్నాడు.
"తాను అందంగా వుంటాడా?"
జీవితంలో మొట్టమొదటిసారిగా యీ ప్రశ్న అతి సీరియస్ గా వేసుకున్నాడు.
జుట్టు వంకెలూ, ఉంగరాలూ తిరగలేదు. తాను తెల్లగానే వుంటాడు. తనకళ్ళు కొంచెం చిన్నవి. సన్నగా, పొడుగ్గా వుంటాడు. కాస్త బలహీనంగా వుంటాడు. తన రూపాన్ని గురించి అసంతృప్తి ఏమీలేదు. క్లాసు అమ్మాయి లందరూ తనతో మాట్లాడటానికి ఉత్సాహం ప్రదర్శిస్తారు. "నేను నీలా వుండి, నీ పొజిషన్ లో వుంటే యీ అమ్మాయిలందర్నీ అరచేతిలో వుంచుకునేవాణ్ణి" అంటూండేవాడో మిత్రుడు. అది ప్రగల్భం కావచ్చు. తనలో ఆకర్షణ వుందా ఏమైనా? రాజ్యలక్ష్మి తనని ఏంచూసి ప్రేమించింది? అతనికి చాలామంది ప్రేమగాథలు తెలుసు. వాళ్ళందరూ బొత్తిగా చెప్పుకోదగినవాళ్ళుకాదు. వాళ్ళకు సంప్రాప్తంగాని సమస్య తనకే ఎందుకు కలిగింది? తాను ఎప్పటికీ దురదృష్టవంతుడేనా?
పద్మజ రాసిన ఉత్తరం అతన్ని చిత్రవధ చేస్తోంది. తనని అతీతంగా వూహించే ఆమె ఆరాధిస్తోంది. ఆమె ఆరాధించేది తననికాదు. అసలావ్యక్తి భూమ్మీద లేడు. తాను వట్టి నిమిత్తమాత్రుడు. కలలను కలిగించటానికీ, మళ్ళీ పగలకొట్టటానికి జన్మించిన దౌర్భాగ్యుడు. ఆమె తన సాహిత్యాన్ని ప్రేమించటంలేదు. తనని మధుబాబుగా ప్రేమించటంలేదు. ఎందుకట్లా అయింది యీ పరిస్థితి? తన ఉత్తరాలే అట్లా చేశాయా? అంత గొప్పగా రాయలేదే తను? ఇంకా ఎట్లా ఎన్నిగుండెలతో కలుసుకుంటాడామెను? తనని చూస్తే ఆమె ద్వేషిస్తుంది. అబ్బ! "యితనికా యిన్ని ఉత్తరాలు యింత యిన్స్పిరేషన్ తో రాశాను?" అని వెలవెలపోతుంది. తనకిహ ఆత్మహత్య శరణ్యం. ఎన్నడూ అనుకోని సమస్య. తనని అల్లుడిగా చేసుకోవాలని ఎంతో మంది తల్లిదండ్రుల్ని తహతహపడేటట్లు చేసిన ఓ అబ్బాయి ఎదుర్కుంటూన్న సమస్య.
ఇంక పద్మజకు ఏ స్వేచ్ఛతో రాయగలడు తను?
* * *
"ఈ అగ్నిపరీక్ష భరించలేను పద్మా! ఈ మంట భరించలేను."
ఆమె మళ్ళీ ఉత్తరం రాసింది. అతను జవాబివ్వలేదు. రాద్దామని ఎంతో కోరిక కలిగింది. కాని ఎట్లా.....? ఎన్ని గుండెలతో.
పద్మజ మరో ఉత్తరం రాసింది.
అతను నిగ్రహించుకున్నాడు.
పద్మజకు కోపంవచ్చింది. "ఎంత అహం? అసలు మీ జాతి రక్తంలోనే వుంది యిదంతా."
ఎట్లా అర్థమవుతుంది ఆమెకు... యిట్లా గుండెలను చీల్చే వ్యక్తికి?
* * *
క్లాస్ లో అతను పరధ్యాసంగా కూర్చున్నాడు. ప్రొఫెసర్ పాఠం చెబుతున్నాడు. కాసేపటికి మధుబాబు పాఠం వినలేదని గ్రహించాడు.... అతని వంక చూసి "మిస్టర్ మధుబాబూ" అని పిలిచాడు.
క్లాసంతా అతనివంక చూశారుగాని, అతనుమాత్రం యీ లోకంలో లేడు.
"మిస్టర్ మధుబాబూ?!"
ప్రక్కనున్న స్టూడెంటు అతన్ని గట్టిగా గిచ్చాడు. ఎక్కడో లీలగా వినబడి నట్లయింది ప్రొఫెసర్ కంఠస్వరం.
"యస్ సర్" అన్నాడు తొట్రుపాటుతో లేచినిల్చుని.
అతని కళ్ళు ఎర్రగా వున్నాయి. గొంతు వణుకుతోంది.
"ఆర్ యూ లిజనింగ్ టు ది లెసన్?"
మధుబాబు తలవంచుకుని "సారీ సర్."
ఆయన ఆగ్రహించలేదు. "సిట్ డౌన్. బి యటెన్ టివ్"
మరునాడు మధ్యాహ్నం మధుబాబు ఎవరూ లేని చిన్నగదిలో కూర్చుని ముందున్న బల్లమీద తల ఆనించి ఆలోచిస్తున్నాడు. వెనక అడుగులు చప్పుడయాయి.
అతనికి వినబడలేదు. అలాగే వున్నాడు.
"మధుబాబూ!"
అతను ఉలిక్కిపడి లేచినిల్చుని "యస్ సర్" అన్నాడు భయంగా. ప్రొఫెసర్ అక్కడున్న కుర్చీలో కూర్చుని "అలా వుంటున్నావేం? హెల్త్ బాగాలేదా?" అనడిగాడు ఆదరంగా.
"అంత బాగాలేదు సార్" అన్నాడతను వినయంగా.
"ఏం?"
ఏం జవాబు చెప్పాలో తోచలేదు. తడబడుతూ "ఊరికేనేనండీ....."
"మనసుకూడా బాగుండటంలేదా?"
మధుబాబు అప్రతిభుడయ్యాడు.