ఒకరోజు తల్లి మళ్ళీ పెళ్ళిమాట ఎత్తింది.
పెళ్లిగురించి సీరియస్ గా ఆలోచించే అవసరం మళ్లీ వచ్చింది మధుబాబుకు. పెళ్లి అనేది జీవితానికి అందం, సంపూర్ణత్వం, సుఖం యివ్వటానికా? లేక ఓ మామూలా? పెళ్ళి చేసుకొనివాడి జీవితం అస్పష్టంగా, ఓ గురిలేకుండా వుండేమాట వాస్తవమే. కాని చేసుకుని ఏ లక్ష్యం లేకుండా బ్రతుకుతుంటారు. వయసురాగానే పెళ్లి చేసుకోవటం,సంసారాన్ని యీదటం, పిల్లల్ని కనటం, అవస్థలపాలవటం..... యిదంతా వాళ్ళకు చిత్రమనిపించదు. ఒకవిధంగా ఆలోచించటం చేతకానివాడి జీవితం సుఖపూరితంగా వుండవచ్చు. అది వాడి అదృష్టం. కాని అన్నీ వుండికూడా దురదృష్టవంతులైన వారుంటారు మధుబాబులాంటివాళ్లు. ఇన్ని ఆలోచన్లు, యింత మృదుత్వం అతనికి ప్రసాదించబడటం లోపమే కావచ్చు. కాని దానికి యింత పెద్దశిక్షా? ఎంతోమంది అమ్మాయిల్ని స్కూళ్ళల్లో, రోడ్లమీద అతను చూస్తూనే వున్నాడు. వీళ్ళలో యెవరూ అతని హృదయాన్ని కదపలేదు. తల్లి పోరుపడలేక కొన్ని సంబంధాలు చూశాడు. పెళ్లిచూపుల తతంగం అతనికి నవ్వువచ్చింది. ఏమిటీ పిల్లలు? ఎట్లా వీళ్లనుంచి ఒకర్ని ఎన్నుకోవటం? అది పెళ్లి అనుబడుతుందా? అసలు లోకంలో యింతకంటే వున్నతమైనవాళ్లు లేరా? వీళ్లని భార్యగా ఊహించటమే కష్టంగావుంది. తను గొప్పవాడని కాదు. తనని కదిలించే మనిషి అవతలవైపు లేనప్పుడు తన పరిధుల్ని ఎంత కుదించుకున్నా, దానికి తులతూగనప్పుడు ఎట్లా ఒకర్ని తనతో తెచ్చుకోవటం? తన స్నేహితులందరికి వివాహాలు జరుగుతున్నాయి. వాళ్లలో కొందరికి మంచి భార్యలే దొరికారు. ఇది ఎట్లా సంభావమైంది? వాళ్లు ఎక్కడినుంచి వచ్చారు? ఒకవేళ పద్మజని దృష్టిలో పెట్టుకుని తాను యిలాంటి విపరీతపు ఊహలు చేస్తున్నాడా? అలాంటి వాళ్లు కోటికి ఒక్కడు కూడా వుండనిమాట నిజమే. కాని ఆమె పెనిమిటికి ఎలా ఆమె లభించింది? అతనూ యిట్లా పెళ్లిచూపులు చూసి పిల్లను యెన్నుకున్నవాడేగా..... చక్కా ఓ చిన్నపిల్లను తెచ్చి ఆ పిల్ల బుల్లి బుల్లి పాదాల్తో, పసుపుపారాణితో అటూ ఇటూ యింట్లో తిరుగుతుంటే చూడాలని తల్లి ముచ్చట. అతనికి నవ్వు వస్తోంది. తాను మానసికంగా యెంత యెదిగాడో, అట్లా వికసించని భావాలుగల పిల్లని, ఈ పరిణతి చెందిన దశలో భరించటం ఎంతకష్టమో ఆమెకు యెట్లా నచ్చజెప్పగలడు?
అసలతనికి పెళ్లాడాలనిలేదు. అది ఓ మధురబంధం కాక, వట్టి నిబంధన అయితే అసలు భరించలేడు. తప్పించుకోవటమెలాగు? అన్నీ తిరస్కరిస్తున్నాడు. డాంబికంగా కాదు.... నిజంగా నచ్చకే. అబ్బా! పద్మజ తనని యిన్ని బాధలు పడమని యెందుకు శాసించింది?
24
వేసవి సెలవులు గడిపి మధుబాబు మళ్ళీ విశాఖపట్నం వచ్చేశాడు. ఈ మనుషుల మధ్య గడపటం చాలా దుస్సహంగా వుంది. మనం అనుకున్నట్లు మనల్ని ఏమాత్రం బ్రతకనివ్వరు యీ మనుష్యులు. వంటరిగా వుందామనిపిస్తుంది. ఎవడో వస్తాడు, యేదో మాట్లాడతాడు. ముభావంగా వున్నా అర్థం చేసుకోడు యెంతకీపోడు. మనం ఏమీ అనలేం. సభ్యత అడ్డొస్తుంది. ఒక్కోసారి ఏడుపుకూడా వస్తుంది విసుగు, కోపం భరించలేక.
అసలు సున్నితత్వం మనిషికి ఎక్కువగా వుండకూడదు. అడుగడుక్కీ సమస్యలు యెదురౌతుంటాయి. గట్టిగా నవ్వితే భయం, యెక్కువగా మాట్లాడితే భయం. నిద్రలేచినప్పటినుంచీ మళ్ళీ నిద్రపోయేదాకా అన్నీ యిబ్బందులే. ప్రతిదాన్ని గురించీ సంఘర్షణ, తర్జన భర్జన. హొటల్ లో భోజనం చేస్తూంటే ముద్ద నోట్లోకి పోదు. ప్రక్కన తింటున్నవాడు నోటితో అసహ్యంగా చప్పుడు చేస్తుంటే..... అదో చికాకు. మరి వీటికి అలవాటు పడలేడు, భరించనూలేడు.
అతనికి భోజనం చేశాక తమలపాకులు వేసుకునే అలవాటుంది. అతని ముఖం చాలా సుకుమారంగా, లేతగా వుంటుంది. నాలికా పెదాలు యిట్టే పండుతాయి. అట్లా వుండటం అతనికి చాలా యిష్టం. కిళ్ళీకొట్టువాడితో అతనికి బాగా పరిచయం ఏర్పడింది.
"అట్లా వుంటున్నారేం బాబూ ఈమధ్య?" అనడిగాడు కిళ్ళీకొట్టు రాఘవులు ఓ ఉదయం.
"వంట్లో అంత బాగుండటంలేదు రాఘవులూ..... ఓ పనిచేసి పెడతావా?"
"చెప్పండి."
"నాకు యీ గదుల్లో, ఇళ్లలో వుండాలని లేదు. సౌకర్యంగాకూడా లేదు. హాస్టల్ లో కూడా వుండలేను. ప్రశాంతంగా వుండాలనిపిస్తోంది. ఎక్కడన్నా మంచి పాక వేసుకుందామనిపిస్తోందోయ్"
"తమరు పాకలో వుంటారా బాబూ?" అని రాఘవులు ఆశ్చర్యపడ్డాడు.
"తప్పేముంది? నాకది చాలా ఇష్టం. తప్పకుండా ఎక్కడన్నా చూడు రాఘవులూ."
కిళ్లీ దుకాణంవాడు "ఈ పేట తిన్నగా ఇట్లాపోతే వూరిబయటగా నాకో నాలుగొందల గజాల స్థలం వుంది బాబూ. గజం రూపాయికాడికొస్తే ఆమధ్య తీసుకున్నాను. లేబరోళ్ళు, ఆళ్ళూ ఆ చుట్టుప్రక్కల వున్నారుగానీ, మరీ దగ్గరగా ఏంలేరు. సందడి ఏమీ వుండదుకూడా. అక్కడ పాకేసుకుంటే బాగుంటుంది బాబూ" అన్నాడు కొంచెం ఆగి.
"అయితే ఆ స్థలం ఎప్పుడు చూద్దాం?" అన్నాడు మధుబాబు ఆత్రంగా.
"రేపు ఆదివారం కదుబాబూ! రేప్రోద్దున దుకాణానికొచ్చేముందు మీ రూమ్ కాడికొస్తాను. అక్కడినుండి ఇద్దరం కలిసెల్దాం."
"మరి నీకేమీ అవసరం లేదా స్థలం?"
"అక్కర్లేదు బాబూ. యెప్పుడన్నా పనికొస్తదని కొన్నాను. ఇప్పుడు నేనుంటున్న ఇల్లు చాలునాకు."
మరునాడు మధుబాబు అతన్తోకూడా వెళ్లి ఆ ప్రదేశం చూశాడు. చుట్టు ప్రక్కల ఎక్కడా ఇళ్లు లేవు. అక్కడక్కడ చెట్లు, దూరంగా కనిపించే కొండలూ, కనిపించీ కనిపించనట్లున్న సముద్రం..... ఈ ఏకాంతం ప్రదేశం చూసి అతను పరవశుడయ్యాడు.
"తప్పకుండా ఇక్కడే వుంటాను రాఘవులూ" అన్నాడు ఉత్సాహంగా.
"మీ ఇష్టం బాబూ."
"ఓ మంచి, అందమైన పాక వేసుకోవటానికి యెంతవుతుందంటావు?"
రాఘవులు ఆలోచించాడు. "మట్టిగోడలైతే మీరుండలేరు బాబూ. ఇటుకతోనే కట్టించాలి అబ్బాయిగారికి. చుట్టూ కర్రలు చెక్కి దడి కడితేగాని బాగుండదు. మరి మొత్తం రెండుగదులైనా వుండాలూ? మట్టినేలయితే మీకసహ్యంగా వుంటుంది. రాళ్లు పరిపించాలి. బాగా వుండాలంటే.....మొత్తం అంతా కలిసి ఏడెనిమిదివందలు అవుతుంది బాబూ."
పుస్తకాలు రాయగా వచ్చినదాంట్లో వెయ్యిరూపాయలదాకా వున్నాయి మధుబాబు దగ్గర. "అయితే మునిసిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని రెండు మూడురోజుల్లోనే పని ప్రారంభించుదాం రాఘవులూ! ఇవాళంతా ఆలోచించి ఇలాచేస్తే బాగుంటుందీ, ఏమిటీ అదంతా నేచెబుతాను. దగ్గరవుండి పని చేయాల్సినవాడివి నీవు. ఈ సరంజామ కొనటం, పనివాళ్లూ అదంతా నాకేం తెలియదు. నువ్వే చూసుకోవాలి. కావాల్సిన డబ్బు నేనిస్తూంటాను. యేం?" అన్నాడు ఉత్సాహంతో పొంగిపోతూ.
"స్వంతపనిలా చేయిస్తాను బాబూ."
ఆ రాత్రంతా మధుబాబు తనకొత్త ఇంటినిగురించి ఆలోచించాడు. తమ వూళ్ళో ఐ.ఎల్.టి.డి. కంపెనీవాళ్ళు వేసుకున్న ఇళ్ళు గుర్తుకువచ్చినై. చుట్టూ తోటకు స్థలం వుంచి మధ్యలో చిన్నపాక..... అది తాటాకులతో గాకుండా రెల్లుతో కప్పిస్తే ఇంకా అందంగా వుంటుంది. ప్రహరీకి బదులుగా వెదురు కర్రలు ఓ డిజైన్ లో వంచి, ఓ క్రమంలో కట్టించాలి. రెండుగదులు చాలు. ఓ ఆశ్రమంలాగానూ వుండాలి. ముద్దుగా ముచ్చటగా వుండాలి. ఇలా కలలు కంటూ నిద్రపోయాడు.
* * *
రోజూసాయంత్రం అయేసరికి హాస్పిటల్ నుంచి సరాసరి తన కొత్తయింటి దగ్గరకు పోయేవాడు మధుబాబు. రాఘవులు కిల్లీకొట్లో తన కొడుకుని కూర్చోబెట్టి దగ్గరుండి శ్రద్ధగా పనిచేయిస్తున్నాడు. ఊహించినప్రకారం, కోరిక ప్రకారం యీ చిన్నపాకను అందంగా మలుచుకుంటున్నాడు మధుబాబు. కోయంబత్తూర్ లో ఓ సినిమా ప్రొడ్యూసర్ అద్భుతమైన ఓ పాక అతి సౌకర్యంగా అమర్చుకున్నారని ఆ మధ్య బెజవాడలో కలిసిన ఓ సినీరచయిత మాటల సందర్భంలో చెప్పాడు. ఆ వర్ణనను దృష్టిలో వుంచుకుని పాకను తయారుచేసుకుంటున్నాడు మధుబాబు క్లుప్తంలో. రాఘవులు చాలా జాగ్రత్తయిన మనషి. డబ్బు దుబారాగాకుండా చూస్తున్నాడు.
నెలరోజులు పూర్తిగా గడవకుండానే పాక పూర్తయింది. మొత్తం ఖర్చు వెయ్యిరూపాయలదాకా అయింది. కాని అతను అనుకున్నట్లు తయారవటంవల్ల చాలా తృప్తిగా వుంది. రాఘవులకు స్థలానికి ఆ సంవత్సరపు అద్దెక్రింద కొంతడబ్బు యిచ్చాడు. ఓ సాయంత్రం హాన సామాన్లు తీసుకుని అందులోకి వచ్చేశాడు. ఈ విషయం ఇంట్లో తెలియనివ్వలేదు. తెలిస్తే తప్పకుండా బాధా, గాభరా పడతారు. కొత్తగా ఇంకో ఇంట్లోకి మారానని ఎడ్రెస్ ఇచ్చాడు.
కొత్తగా, వికాసంగా వుంది ఇక్కడ. సాయంత్రం ఆరున్నర, ఏడు అయేసరికి మనుషుల సందడి పూర్తిగా సన్నగిల్లిపోతుంది. మరీ బొత్తిగా నిర్జనమైన ప్రదేశమూ కాదు. ఏకాంతంగా చదువుకోవడానికి కావలసినంత అవకాశం వచ్చింది. గోడకు బుద్ధుడు, వివేకానందుడు, పరమహంస ఫోటోలు తెచ్చి తగిలించాడు. ఈ ఏడు చదువంత కష్టంకాదు. కోర్సుకంతటికీ కలిపి ఇదే కాస్త సుఖవిశ్రాంతులు లభించే సంవత్సరం కాబట్టి, ప్రొఫెసర్లుకూడా స్టూడెంట్లను అంత ఒత్తిడి చెయ్యరు.
రకరకాల పూలమొక్కలు తెప్పించి తనకు నచ్చినక్రమంలో నాటాడు. ఓ సన్నజాజిమొక్క నాటాడు. డానికి పద్మ అని పేరు పెట్టుకున్నాడు. ప్రక్కనే మరో గులాబీ మొక్క.
జీవించటం కోసం మనుషుల పడే తహతహను అర్థంచేసుకున్నాడు మధుబాబు. అందంగా బ్రతకాలని నిరంతరం తపించేవాళ్ల జీవితాలు కృత్రిమంగా గడుస్తున్నాయి. "అలా బ్రతకాలి" అని తాపత్రయపడటంతోనే తెల్లారిపోతోంది వాళ్ళ బ్రతుకు. అతీతంగా జీవిస్తున్నామన్న భ్రమతప్ప సహజమైన సుఖశాంతులు వుండవు. అంతా అయిపోయాక, జరావస్థలో సామాన్య మానవుడ్ని చూసి అసూయపడటం ప్రారంభిస్తారు. తమకు దక్కని నిజజీవిత సంఘటనల్ని చూసి ఖేదంలో మునిగిపోతారు..... అదిగాక ప్రతివాడి లోనూ ఓ ప్రత్యేకత చూడగలుగుతున్నాడు మధుబాబు. లారీడ్రైవర్ లో, కాలేజీ అటెండర్ లో, రిక్షాలాగేవాడిలో వివిధ ఆత్మవిశ్వాసాలు, చెక్కుచెదరని వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. ఓ సహజగుణం, ఆకర్షణ చూస్తున్నాడు. అదీకాక ఓ మనిషిని పూర్తిగా అర్థంచేసుకున్నామనుకోవడం వట్టి భ్రమ అన్న నిశ్చయానికి వచ్చాడు. ప్రపంచంలో ఏ జీవి, మరోజీవికి..... ఎంత ప్రాణ స్నేహితుడు, అంతకు మించినవాడయినా సరే తనని తాను బహిర్గతపరుచు కోడు. పూర్తిగా భూమ్మీద వున్న ప్రతివాడికీ ఇతరులకు చెప్పలేనివీ, చెప్పకూడనివీ కొన్నివుంటాయి. ఆ కాస్త దాచి మిగతాదంతా మనస్పూర్తిగా చెప్పేస్తాడు. ఆ కాస్త రహస్యంగా వుంచుకోని మనిషంటూ సృష్టిలోలేడు. రాత్రిళ్ళు వంటరిగా అలా చాలా దూరంవరకూ పోయి నడిచి వస్తూండేవాడు మధుబాబు, ఉదయం నాలుగున్నరా, అయిదుకల్లా లేచి వ్యాహ్యాళికి పోవటం అలవాటు చేసుకున్నాడు. ఇంతవరకూ దేశంలో చాలామంది సోమరిపోతులున్నారన్న నమ్మకం వుండేది. ఇప్పుడా నమ్మకం సడలిపోసాగింది. చేతినిండా పనివుండి, చేసుకోవటానికి తాపత్రయపడే వాళ్లని చూసి "ఇంత సిన్సియర్ గా పనిచేసే వాళ్ళున్నారా?" అని నివ్వెరపోతుండేవాడు. ఎంత రాత్రప్పుడు వీధిలోకి వెళ్లినా తలుపులు మూసుకుని బట్టలు కడుతోన్న టైలరో, ఇస్త్రీ చేసుకుంటూన్న లాండ్రీవాడో, కమ్మరివాడో కనిపిస్తూ వుండేవాళ్లు. జీవితంలో స్థిరపడ్డ ప్రతివాడూ డాక్టరు గానో, ఇంజనీరుగానో, ప్లీడరుగాన్లో, వ్యాపారస్థుడుగానో తన పనికి లోపం చెయ్యకుండా ప్రయత్నిస్తున్నాడు. సోమరిపోతులెవరైనా వుంటే, సోమరితనం వుంటే అది విద్యార్థి దశలోనే అని గ్రహించాడు మధుబాబు.
* * *
ఒక సినిమా కంపెనీవాళ్లు అతను రాసిన నవలొకదాన్ని ఇనిమా తీయటానికి నిశ్చయించుకున్నామని, హక్కులు కొనదలిచామని రాశారు. యిలాంటి సంఘటనలు చూసి ఆశ్చర్యపడేస్థితిలొ లేడు మధుబాబు. తను రాసిన కథ తెరమీదకెక్కితే సంతోషమే. కాని అతను యెందుచేతనో వ్యామోహితుడు కాలేదు. యీ అవకాశంకోసం చాలామంది అర్రులు చాస్తూ వుంటారని అతనికి తెల్సు. తాను ఆ ఫీలింగ్ కి అతీతుడైనట్లు భావించలేదుగాని, భుజాలెగురెయ్యలేదు. వాళ్లు టరెమ్స్ అడిగారు. తనకు తోచింది అడుగుతూ అతను జవాబు రాశాడు. గట్టిగా స్థిరపరుచుకున్నాక మళ్ళీ రాస్తాననీ, ఈలోగా ఎవరికీ మాట యివ్వవద్దనీ రాశారు వాళ్ళు.