ఆయన భార్యవేపు నిర్లిప్తంగా చూడడం తప్ప, మరేం చెయ్యలేకపోయాడు. చేతిలో డబ్బులేదు. ఆలస్యమైతే- తెల్లవారితే తన కొడుకు తనకు దక్కడు. ఆ ఎమ్.ఎల్.ఏ. చేతికి దొరికితే? ఆ ఆలోచనే ఆమెని భయకంపితురాల్ని చేసింది. ఏం చేసైనా తెల్లవారేలోపు కొడుకుని ఊరు దాటించాలి. ఎలా? ఏం పాలుపోవడం లేదు. ఆలోచిస్తూ గదిలో పచార్లు చేస్తోంది లక్ష్మీదేవి.
అకస్మాత్తుగా ఆవిడ చూపులు గదిలో దేవుడి పటం పక్కనున్న పాతకాలపు ట్రంక్ పెట్టెమీద పడ్డాయి. గబగబా ముందుకెళ్ళి, అ ట్రంక్ పెట్టెని తెరిచి చూసింది. అసలు సిసలయిన బెనారస్ పట్టుచీర! ఎప్పుడో ఇరవై ఏడు ఏండ్ల క్రితం తన పెళ్ళికి అన్నయ్య వెంకటనారాయణ ప్రేమగా ఇచ్చిన పట్టుచీర. ఇప్పటికీ విలువా, వన్నె తగ్గని పట్టుచీర...
దాదాపు రెండువేలు చేస్తుంది.
పెట్టెలోంచి ఆ చీరతీసి "ఇప్పుడే వస్తానుండండి..." అంటూ పెరట్లోంచి బయటికెళ్ళి పక్కింటివేపు నడిచింది పరుగులాంటి నడకతో, పక్కింటి దుర్గమ్మది వడ్డీ వ్యాపారం- వస్తువుల్ని, సరుకుల్ని కుదవ పెట్టుకుని డబ్బులిస్తుంది.
అర్థరాత్రి వచ్చిన లక్ష్మీదేవినిచూసి, దుర్గమ్మ ఆశ్చర్యపోయింది.
"ఇప్పుడేమిటి లక్ష్మీ... ఇలా వచ్చావ్?" అడిగిందామె ఆశ్చర్యంగా.
"అర్జంటుగా వెయ్యిరూపాయలు కావాలి... ఈ పట్టుచీర ఉంచుకో... రేపు జీతాలు రాగానే ఇచ్చేస్తాను..." అవసరం చెప్పింది లక్ష్మీదేవి.
లోనికెళ్ళి వచ్చి, చీర తీసుకుని, ఒకసారి వెల్తురులో చూసుకొని పదివందనోట్ల కాగితాల్ని చేతిలో పెట్టింది దుర్గమ్మ.
దుర్గమ్మ చేతిలో వున్న తన పట్టుచీరని, ఆ చీరకు అప్పుడెప్పుడో అంటుకున్న పసుపు మరకలవేపు ఒకసారిచూసి, ఒక్కసారి ఉప్పెనలా వచ్చిన దుఃఖభుజకమైన జ్ఞాపకాల్ని చెరిపేసుకుని- ఆ ఇంట్లోంచి బయటికొచ్చింది లక్ష్మీదేవి తడిదేరిన కళ్ళతో. నిజానికి శక్తికి బెంగుళూరు వెళ్ళాలని లేదు. కాని తల్లి తన కోసం పడే ఆరాటాన్ని అర్థం చేసుకున్నాడు. తనకు దారి ఖర్చులకు డబ్బివ్వటం కోసం తల్లి ఏ పని చేసింది తెల్సుకుని కదిలిపోయాడు. ఎంతో అపురూపంగా చూసుకొనే పట్టుచీరని తాకట్టు పెట్టి డబ్బు తేవడం... ఎందుకో శక్తి కళ్ళు తడిదేరాయి. వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. సరిగ్గా నాలుగ్గంటలైంది. ఇంట్లోంచి బయటకొచ్చాడు శక్తి. పక్కన తల్లి లక్ష్మీదేవి, చెల్లి శారద-
"మీరుండండి నాన్నా..." గుమ్మం వరకూ వచ్చి నిల్చున్న తండ్రివేపు చూస్తూ అన్నాడు శక్తి ఒకింత దిగులుగా.
"తలుపేసుకోండి.... నేనూ, శారద, శక్తిని దిగబెట్టి వచ్చేస్తాం" అంది లక్ష్మీదేవి భర్తకేసి చూస్తూ.
వీధి దీపాలు మసగ్గా వెలుగుతున్నాయి.
ఆ దీపాల వెల్తురులో వాళ్ళు ముగ్గురు చీకటి మేఘాల్లా నడుస్తున్నారు. దార్లో మరేం మాట్లాడలేదు లక్ష్మీదేవి.
"ఉత్తరాలు రాస్తుంటావు కదూ- జాగ్రత్త- ఎవరితోనూ గొడవలు పడకు- మామయ్య ఏం చెప్తే అది చెయ్యి- ఆరోగ్యం జాగ్రత్త-" అంది తల్లి రాబోతున్న దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ.
"నాన్న ఆరోగ్యం జాగ్రత్తమ్మా- శారద- డిస్టంక్షన్ రావాలి నీకు... అక్కడ కుదుటపడగానే ఉత్తరం రాస్తాను..." చెప్పాడు శక్తి.
జగ్గయ్యపేట నుంచి విజయవద వెళ్ళే ఫస్ట్ బస్ వచ్చింది.
ఎక్కి కూర్చున్నాడు శక్తి. బస్సు బయలుదేరడానికింకా రెండు నిమిషాలే టైముంది.
"మావయ్యని, అత్తయ్యని, బేబీని అడిగానని చెప్పు..." అంది లక్ష్మీదేవి రాబోతున్న దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ, పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడూ తనను విడిచి ఉండని కొడుకును చూసి లక్ష్మీదేవి చలించిపోయింది.
శారదని దగ్గరకు రమ్మని పిలిచి రాగానే ఆమె నుదుటిమీద ముద్దు పెట్టాడు శక్తి ఆప్యాయంగా.
మసక వెలుగులో తల్లి కళ్ళవేపు చూసాడు. ఆ కళ్ళనిండా తడి. ముందుకెళ్ళిపోతున్న బస్ వేపు అలా చూస్తూ నిలబడిపోయారు లక్ష్మీదేవి, శారద.
కొండంత బరువు దిగిపోయినట్లయింది లక్ష్మీదేవికి. శక్తి జీవితం మలుపు తిరుగుతుందన్న నమ్మకం ఉందామెకు. తెల తెలవారుతుండగా ఇంటికొచ్చారిద్దరూ.
పడుకోడానికి ప్రయత్నించింది- కంటిమీదకు నిద్ర రాలేదు. తన అన్న వెంకటనారాయణ అభిమానంగా తన పెళ్ళికిచ్చిన పట్టుచీర- తన కొడుకు తన అన్నయ్య దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగపడటం విచిత్రంగా అన్పించిందామెకు.
అకారణంగా ఏదీ జరగదు- ఎన్నెన్నో కారణాల సంగమం జీవితం- ఇప్పటికి ఒక అధ్యాయం పూర్తయింది.
ఎవరి జీవితంలోనైనా, సంఘటనలు వేరైనా ఇలాంటి అధ్యాయాలే వుంటాయి.
ప్రతి వ్యక్తికీ, జీవితంలో మొదటి అధ్యాయంలాగే, రెండో అధ్యాయం కూడా వుంటుంది.
ఆ రెండో అధ్యాయమే... అతి విలువైనది.
సక్సెస్ కు అక్కడే శ్రీకారం మొదలవుతుంది.
* * * *
"మెరుపులాంటి ఒక భావం పేరే కల- ఆ కలకు, వ్యక్తి అదృష్టానికి సంబంధం వుంటుంది. కొన్ని వేల కలల్లో ఒకే ఒక కల ఆ వ్యక్తి జీవితానికి సంబంధించి వుంటుంది. ఆ కల నిజం కావాలని మనిషి మళ్ళీ, మళ్ళీ కలలు కంటాడు..."
- ప్రాయిడ్
* * * *
ఏదో గొడవకి కళ్లిప్పి చూసాడు శక్తి- అప్పటి వరకు కలల్లో ఉన్నాడు. విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్ళే రైల్లో సాధారణమైన జనరల్ కంపార్ట్ మెంట్లో తను కూర్చున్న విషయం అప్పటికి గానీ గుర్తుకు రాలేదతనికి. చికాగ్గా మొహం పెట్టి- ఎదురు సీటు వేపు చూసాడు శక్తి, ఎదురుగా ఇరుకు, ఇరుగ్గా ఆరుగురు వ్యక్తులు కూర్చున్నారు. తనేంటి, తన స్టేటస్ ఏంటి? ఈ అలగా జనం మధ్య కూర్చోవడం ఏంటి? మిస్ ఇండియాలతో, స్టార్ హోటల్స్ లో వుండాల్సినవాడు- ప్యాలస్ ఆన్ వీల్స్ ట్రైన్ లోనో, స్పెషల్ ఫ్లయిట్స్ లోనో తిరగాల్సిన వాడు.... ప్రస్తుతానికి మసిబొగ్గుల్లో బొగ్గుల్లా వున్నాడు.
తప్పదు... ప్రస్తుతానికి సర్దుకోక తప్పదు.
కలని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు శక్తి.
కలలో అమ్మాయి ఆకారం గుర్తుకు రాగానే, జ్ఞాపకాని కొచ్చింది మేనమామ కూతురు- తల్లిని మేనమామ కూతురు పేరడగటం మర్చిపోయాడు. ఏదో పేరు చెప్పింది తల్లి.