"అడవిమనిషిని."
"వట్టి....."
"అవును, బట్టి అడవి మనిషిని."
"మీకేం కావాలి?"
"తెలీదు. తెలీదు."
"మీరు ఎక్కడ వున్నారు?"
"చీకట్లో...."
"భయం వెయ్యదూ?"
"అబ్బ! చాలా చాలా. ఒంటరిగా పడుకోవటం యెంత భయం?"
"నాకు నవ్వొస్తోంది."
"నా మంచితనం చూశా? నేను చాలా మంచివాడ్ని తెలుసా?"
నేనెవర్ని?"
"ఒట్టి మొద్దువి."
"ఏయ్! నాకు కోపం వస్తుంది చెబుతున్నా."
"శిక్ష విధిస్తారా?"
"ఊఁ"
"ఏమిటి?"
"గుంజీళ్ళు."
?"మీరెవరు?"
"భావదీయుడ్ని."
"అంటే?"
"ఎవరినన్నా అడగండి."
.........
..........
"అర్థం తెలుసుకున్నా "భవదీయ" అంటూ నేనుమాత్రం మదీయే బాబూ!"
"కాదని నాకు తెలుసు."
"అలాగా, ఎప్పట్నుంచండి ఈ అహంభావం?"
21
అతని పరీక్షలు జరిగాయి. ఒకవైపు పద్మజని గురించి హృదయం నింపుకుంటూనే ఓపిక చేసుకుని చదివాడు మధుబాబు. పేపర్లు బాగా రాశాడు.
అతను పరీక్ష పాసయ్యాడు.
ఓ పదిరోజులు సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ చిక్కిపోయాడని తల్లి గోలచేసింది. అక్కడున్నన్నాళ్ళూ మంచి ఆహారం తీసుకొమ్మని తండ్రి ఆదేశించాడు.
అతని పెళ్లిసంబంధాలు వస్తున్నాయి.
కోడల్ని తెచ్చుకోవాలని కోరిగ్గా వుంది సుందరమ్మగారికి. ఈ విషయాన్ని మధుబాబు ముందు ఎత్తింది. "అప్పుడే నాకు పెళ్ళేమిటమ్మా" అని అతను చికాకుపడ్డాడు. "నాకు మాత్రం కోడల్ని చూసుకోవాలని లేదుట్రా. మీ అబ్బాయికి పెళ్లిచేస్తారా? అని ఎంతమందో వచ్చి తిరిగిపోతున్నారు. అలా మన దగ్గరకు వస్తోంటే నిర్మొహమాటంగా చెప్పటంకూడా కష్టం. అయినా ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే నష్టమేముంది? కాపురానికి తీసుకురావాలని నిబంధన ఏమన్నా వుందా? పండగలకూ వాటికీ చక్కగా నువ్వత్తారింటికి వెళ్ళటం, ఆ పిల్ల ఇక్కడకు వచ్చి ఇల్లంతా కలయతిరగటం ఎంచక్కా వుంటుంది" అంది ఆవిడ ఆ దృశ్యాన్ని ఊహిస్తూ.
"ఈసారి వేసవి సెలవులకి వచ్చినప్పుడు చూద్దాములేమ్మా! ఇప్పుడు సెలవులు కూడా తక్కువ" అంటూ మధుబాబు తప్పించుకున్నాడు.
* * *
విశాఖపట్నం వచ్చి మూడోఏడులో చేరాడు. హాస్పిటల్ కి దగ్గరగా మరోగది తీసుకున్నాడు. హాస్పిటల్ లో పెషేంట్సు, నర్సులు, తమ కాలేజీ అమ్మాయిలు.... యీ జీవితం కొంతకొత్తగా వుంది. ఇదివరకటి మాదిరిగాకాక ఇప్పుడు అమ్మాయిలకు మరింత చేరువగా సంచరించే అవసరం, అవకాశం రెండూ వున్నాయి. కాలేజీలో అమ్మాయిల్లో అందమైనవాళ్ళు గూడా వున్నారు కాని చూడని వాటిమీద మోజో, ఎదుటనున్న వారిమీద నిర్లక్ష్యమో అతనెప్పుడూ వీళ్ళనిగురించి మరోరకంగా ఆలోచించనియ్యకుండా చేసేది పద్మజ. పద్మజ! రూపం తెలియని పద్మజ! ఆమెగురించే నిరంతరం అతని తపన.
మొన్న తల్లి తన పెళ్లి విషయం ఎత్తింది. తాను మరొకర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఒకప్పుడు రాజ్యలక్ష్మిని యీ ప్రపంచంలో అందరినీ ధిక్కరించి పెళ్ళి చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. తన త్యాగం భరించలేక ఆమె యీ లోకాన్ని త్యజించి వెళ్ళిపోయింది. ఆ పాపం తనదేనేమో. అది ఎన్నటికీ ఆరనిమంట. పద్మజ పరిచయంలో, ఆ అనురక్తిలో శీతలవాయువులు వీస్తున్నాయి. ఆమెను విడిచి తాను ఎలా వుండగలడు? ఆమె తనకి కావాలి! పద్మజలాంటి వ్యక్తులు కోటికి ఒకరుకూడా వుండరు. తను ఆమెనే వివాహం చేసుకోవాలి.
ఆమె ఎవరో, కుటుంబం ఏమిటో, ఏం చదువుతోందో, ఏం చేస్తుందో తెలియదు. అయినా ఆమె తనకు కావాలి. ఆమెలేని జీవితాన్ని వూహించలేడు. తను పద్మజకోసం. ఈ విషయం ఆమెకెలా చెప్పటం? యెన్నో విషయాలు రాసుకుంటారు. పెళ్ళివిషయం ఎత్తబోయేసరికి సంకోచం అడ్డువస్తోంది. తనని అపార్థం చేసుకుంటుందేమో! తప్పేముంది ఇందులో? అతను వాయిదాలు వేసుకుంటూ పోసాగాడు.
* * *
పద్మజ పరుగెత్తుతోంది. "ఆగవే! నీలాగా లేడిపిల్లలాగా మేము ఛంగు ఛంగున గంతులు వెయ్యలేం" అని స్నేహితురాళ్ళు గొడవపెట్టసాగారు.
ఆ తోటల్లో, వెలుగునీడల్లో, పచ్చికమీద చేరగిలబడి పోయింది ఆలోచిస్తూ.
"ఎవర్నిగురించి ఆలోచన?" అందో స్నేహితురాలు ప్రక్కకి వచ్చి కూర్చుని.
"ప్రేమగురించి."
"అబ్బో! ప్రేమ. పద్మా! నాకూ ప్రేమించాలని వుందే. ఎలాగో చెప్పవూ?"
"ఛా, పో."
"అబ్బ! చెప్పవే."
"ఐతే వుండు" అని పద్మజ లేచి చేతిలో సంచి తీసుకుని చెట్లచాటుగా వెళ్ళింది. అయిదు నిముషాలు గడిచాయి. చాటునుంచి ఓ యువకుడు బయటకు వచ్చాడు.
స్నేహితురాలు లేచి నిలబడింది.
"ఇలారా, నన్ను కవిలించుకో."
"ఒసేయి పద్మా! ఈ ప్యాంటూ, చొక్కా నీ కెక్కడివి?"
"హూఫ్! ఇప్పుడు నేను నీ వెంటబడతానన్నమాట. పోజుకొడుతూ వుంటాను. ఇదిగో ఇలా కొడతాను. మొట్టమొదట నీకు ఆగ్రహం కలగాలి. కొంచెం తిట్టు ఫరవాలేదు. తరువాత నీ వెనకాలనే పడి వో పాట అందుకుంటాను. సరిగ్గా సగం వరకూ అయినాక మూతీ, ముక్కూ విరుచుకుంటూనే నువ్వూ పాడెయ్యి కోపంగా. అటుతిరిగి మటుకు. నేను చూడకుండా చిరునవ్వులు నవ్వుకో. చివరకు చొరవగా నీచెయ్యి పట్టుకుంటాను. నన్ను చెంపమీద కొట్టటానికి చెయ్యెత్తి నిర్ఘాంతపోయి, నా కళ్లలోకి చూస్తూ నిల్చిపో, అప్పుడు నేను మరోపోజు కొట్టేసి ఇలా నవ్వేస్తాను. అదే లవ్వు! త్వరగా కానియ్యి..... ఇదిగో వెంటపడుతున్నాను.....ఊఁ ఇహ నువ్వు పాడెయ్యి..... ఆఁ చెయ్యి పట్టుకుంటున్నా. ఇంకా కొట్టటానికి చెయ్యి ఎత్తు. అదీ అలాగ! ఆఁ ఇప్పుడు పోజు కొడుతున్నాను కాచుకో."
వెనకనించి చప్పట్లు వినిపించాయి. వెనువెంటనే కిలకిలమని నవ్వులు. కెమెరా క్లిక్ మంది.
"ఛీ, టైముకొచ్చి అంతా పాడుచేశావు" అంటూ పద్మజ విసుగు నటిస్తూ దూరంగా వెళ్ళింది. ఓ సన్నజాజి చెట్టు దగ్గరకెళ్లి కూర్చుంది. సన్నజాజిపువ్వులు ఎంత యిష్టం తనకు?
మధు ప్రక్కన వుంటే ఎంత బాగుండును? ఇలాగే అల్లరి చేసేదా? ఇంకా యింకా చేసేది. అతన్ని పట్టుకోమని చెప్పి అందకుండా ఛంగు ఛంగున పరుగెత్తేది. తనని అందుకోలేక అతను ఆయాసంతో అవస్థపడుతూ వుంటే ఉడికించి, దగ్గరకువచ్చి చెవులు పట్టుకుని ఊపిఊపి ఆడించేది. అతన్ని నీళ్ళలోకి తోసి యీతరాక అవస్థ పడుతోంటే కిలకిలమని నవ్వి గేలిచేసేది. అతడి వళ్ళో తలపెట్టుకుని జీవితాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి చిత్ర విచిత్రమైన కబుర్లు చెపుతోంటే ఊఁకొడుతూ ఆలోచించేది. అతని జుట్టుని చిందరవందర చేసేసి ఫక్కుమని నవ్వేది. ఆకాశంలో చందమామని తెచ్చి పెట్టమని మారాంచేసేది. అబ్బ! ఎలా కలుసుకుంటుంది అతన్ని! ఎలా కలుసుకుంటుంది?
భయంగా వుంది పద్మజకు. అక్కడినుంచి లేచి తూలుకుంటూ స్నేహితురాళ్ల దగ్గరకు వెళ్ళిపోయింది.
* * *
కాలేజీలో స్టూడెంట్లందరూ క్రికెట్ ఆడ్తున్నారు ఊరి బయటి మైదానంలో. మధుబాబుకి కూడా ఆడదామని సరదా పుట్టింది. బ్యాట్ తీసుకున్నాడు. బౌలర్ విసరిన బంతి విసురుగా మీదకు వస్తోంది. బలమంతా ఉపయోగించి కొట్టాడు. బంతి రివ్వున వెళ్లి దూరంగా వున్న పెద్ద చెత్తకుండీలో పడింది. మధుబాబు బ్యాట్ క్రిందపడేసి బంతికోసం పరిగెత్తాడు. అంత పెద్ద చెత్తకుండీ అక్కడ ఎందుకు వుందో తెలీదు. చెత్తాచెదారం విపరీతంగా పేరుకుపోయి వుంది. "అదిగో, ఆ మూల బంతి" వెనుకనుంచి ఎవరో అరుస్తున్నారు. అతనికి వినబడలేదు. బంతికోసం గబుక్కున లోపలకు దూకాడు.
మరుక్షణంలో అతనికి అర్థమయింది. అది ఎవరూ ఉపయోగించకుండా వదలేసిన బావి. పైన చెత్త, అడుగున నీళ్ళు. తృటికాలంలో అతడు ఆ బురదలో, ఊబిలో దిగిపోసాగాడు. తాను చచ్చిపోతున్నాడు. "పద్మా!" అనుకున్నాడు. కన్నుమూసి తెరిచేవ్యవధిలో కంఠంవరకూ వెళ్లిపోయాడు. చివరిప్రయత్నంగా చేతులు రెండూ ఎత్తి ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని తడిమాడు. ఏదో తగిలింది. గోడలోంచి పాకిన ఏదో మొక్క గట్టిగా పట్టుకున్నాడు. చేతులు వణుకుతున్నాయి. కళ్ళు మూసుకుపోతున్నాయి. "పద్మా! పద్మా!"