Read more!
 Previous Page Next Page 
ప్రార్థన పేజి 2


    "ఇదే అయితే దీని గురించి నాకు కొద్దిగా తెలుసు గురూగారూ" అన్నాడు శేఖరం.

 

    "ఏమిటి"

 

    "అంటార్కిటికా ఎక్స్ పెడిషన్... ముందు సముద్రంలోకి పడవ లేసుకు వెళ్ళటం మీద ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతూంది. అక్కడేమీ లేదని అమెరికా, రష్యాలు ఎప్పుడో వదిలేసిన బీడుమీద అనవసర ప్రయోగాలు చేసి, ఏదో సాధించినట్టు పద్మశ్రీలు కొట్టేస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరికి బంధువులో, డబ్బంతా ఎక్కడికి వెళుతూందో, ఢిల్లీలో ఏం జరుగుతూ వుందో చాలా కొద్దిమందికే తెలుసు. ప్రజలు మాత్రం పెంగ్విన్ పక్షుల పక్కన మనవాళ్ళని ఫోటోల్లో చూసి, 'ఆహా- ఓహో' అని సంబరపడిపోతూ వుంటారు" అన్నాడు.

 

    "ఛార్టెర్డ్ అకౌంటెంట్ అయినా మీకు ఓషనోగ్రఫీ తెలిసినట్టుందే" అన్నాడు కరుణాకర్ నవ్వుతూ.

 

    "మనవాళ్ళకు అక్కడ ఏదీ దొరకదు గురూగారూ. ఇది ఓషనోగ్రఫీ కాదు, నాకున్న జ్యోతిషశాస్త్ర ప్రావీణ్యతతో చెబుతున్నాను" అన్నాడు.

 

    "ఏమిటీ - మీకు కామర్సుతోపాటూ జ్యోతిషంలో కూడా ప్రావీణ్యత వుందా?"

 

    "ఆహాఁ ఆస్ట్రాలజీ, హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం, థాట్ రీడింగ్ అన్నీ".

 

    "ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారండీ బాబూ"

 

    "కాలేజీలో చదువుకునే రోజుల్లో...." నవ్వాడు శేఖరం. "ఓ అమ్మాయితో కొద్దిగా పరిచయం పెరిగాక ఆమె చేతుల్ని మన చేతుల్లోకి తీసుకోవటానికి ఉత్తమమైన మార్గం హస్త సాముద్రికం. ఆ తరువాత ఆ అమ్మాయి మనసులోని మాట బైటకి చెప్పించటానికి బెస్టు సాధనం థాట్ రీడింగ్. ముద్దు పెట్టుకోవటానికి ముహూర్తం నిర్ణయించేది ఆస్ట్రాలజీ. ఎన్ని పెట్టుకోవాలో నిర్ణయించేది సంఖ్యాశాస్త్రం... న్యూమరాలజీ".

 

    ఎప్పుడూ సీరియస్ గా వుండే భార్గవ కూడా నవ్వేసేడు. కపాడియా ఇన్ స్టిట్యూట్ లో అందరూ నలభై దాటినవారే. పైగా అందరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులు. ఇలా సరదాగా- స్వచ్చంగా నవ్వుతూ మాట్లాడుకోవటం తక్కువ. వాళ్ళు నవ్వటం చూసి, "ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రావీణ్యత మీద మీకు నమ్మకం లేదా- కావాలంటే న్యూమరాలజీ ప్రకారం లెక్కకట్టి మీ పేర్లో మొదటి అక్షరం చెప్పమంటారా భార్గవగారూ" అని అడిగాడు.

 

    "చెప్పండి" అన్నాడు భార్గవ.

 

    "బి"... సీరియస్ గా అన్నాడు. మళ్ళీ నవ్వులు.

 

    శేఖర్ వారివైపు అయోమయం నటిస్తూ చూసి "మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? నా శాస్త్రం మీద మీకు నమ్మకం లేదా?" అని అడిగాడు.


    
    "ఉంది ఉంది, శ్రీమాన్ అన్నాబత్తుల సోమశేఖరంగారూ, మీ శాస్త్రాన్ని ఉపయోగించి ఇప్పుడీ ప్రోగ్రాంలో హైలైట్స్ ఏమిటి చెప్పండి" అన్నాడు.

 

    శేఖరం మనసులోనే లెక్కలు వేసుకొని, "ఈ ప్రోగ్రాం జరగదు. వర్షం వల్ల ఆగిపోతుంది" అన్నాడు. అందరూ తలెత్తి ఆకాశంకేసి చూశారు. వేసవికాలపు నిర్మలమైన ఆకాశంకేసి చూడగానే తామందరూ ఫూల్స్ అయినట్టు గ్రహించి ఒక్కసారిగా నవ్వేశారు.

 

    "ప్రోగ్రాం సంగతి సరే, మీ భవిష్యత్తు మాటేమిటి?"

 

    "నాది- నాది గొప్ప భవిష్యత్తు. నోరూ, కళ్ళూ బావున్నంత కాలం ఛార్టెర్డ్ అకౌంటెంట్లకి ఫర్వాలేదు" అంటూ శేఖరం "ఏదీ మీ చెయ్యి" అని అతడి చేతిని తీసుకుని పరీక్షించసాగాడు. కరుణాకర్ నవ్వు ఆపుకోలేక పోతున్నాడు. భార్గవ మేధస్సుని చూసి అందరూ అతడితో మామూలుగా సంభాషించటానికి భయపడతారు. తన విజ్ఞానంతో తనచుట్టూ గోడల్ని నిర్మించుకున్న మేధావి భార్గవ. అలాంటి శాస్త్రజ్ఞుడిని నవ్విస్తున్నాడంటే ఈ కుర్రవాడు సామాన్యుడు కాడు.  

 

    శేఖర్ అతడి చేతిని ఇటూ అటూ తిప్పి రేఖల్ని పరీక్షించి, కళ్ళు మూసుకుని మరో క్షణం అంకెల్ని గుణించి "అతి కొద్దికాలంలోనే మీరు గొప్ప చిక్కుల్లో పడబోతున్నారు గురూగారూ. మీ చేతిని, మీ నామనక్షత్రాన్ని కలిపి చెప్తున్నాను. ప్రపంచం అంతా మీకు ఎదురు తిరుగుతుంది. మీరు పేపర్లోకి ఎక్కుతారు ... మనశ్శాంతి వుండదు. వృత్తిరీత్యా మీ కార్యకలాపాల్లోనూ గృహ సంబంధమైన విషయాల్లోనూ మొత్తం అన్నివైపుల్నుంచీ ఒక్కసారిగా మీకు వ్యతిరేకత కానవస్తుంది. దాంతో మీరు కాలిన పెనంమీద ఆవగింజలా అల్లల్లాడిపోతారు" అన్నాడు.

 

    ఒక్కసారిగా అక్కడి వాతావరణంలో ఆహ్లాదం స్థానే సీరియస్ నెస్ చోటు చేసుకున్నట్టయింది. వింటున్న కరుణాకర్ "ఏమిటిది? తాయెత్తు కట్టి డబ్బులు గుంజటానికి ప్రయత్నమా?" అన్నాడు ముందు తేరుకుని. శేఖరం కూడా నవ్వి, "నాకు తోచింది చెప్పానంతే" అన్నాడు.

 

    "నాకు జ్యోతిషం గురించి అంతగా తెలీదు గానీ అందులో మంచే గానీ రాబోయే 'చెడు' గురించి చెప్పకూడదనుకుంటానే" అన్నాడు భార్గవ దాన్ని తేలిగ్గా తీసుకుంటూ.

 

    "సారీ గురూగారూ అమెచ్యూర్ ఫామిస్టుని! ఏం చేస్తున్నప్పుడు, ఏ టైమ్ లో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియనివాణ్ణి. చాలా మంది అమ్మాయిలు నాకు ఇదే సర్టిఫికెట్టు ఇచ్చారు. పాపం నన్ను క్షమించి వదిలెయ్యండి" అన్నాడు శేఖర్. వాతావరణం తేలికైంది. ఇంతలో క్రింద శంకర్ లాల్ విదేశీ కారు తాలూకు పియానో హారన్ వినిపించటంతో కలకలం మొదలైంది. అప్పటికే అందరికీ టీలు సర్వ్ చెయ్యబడ్డాయి. చాలా మామూలు మీటింగ్ అది. ఒకవైపు బుట్టలో పూలదండలు తెచ్చి వుంచారు.

 

    "చంపాలాల్ గారికి సన్మానమా?" అని అడిగాడు.

 

    "అయ్యుండవచ్చు. కాన్స్ -క్యూర్ కనిపెట్టి పది సంవత్సరాలైన సందర్భంలో....." అన్నాడు కరుణాకర్ అటే చూస్తూ.

 

    "కాన్స్-క్యూర్ అంటే కాన్సర్ క్యూరా? దాన్ని బాగుచేస్తుందా?"

 

    "మామూలు కేన్సర్ ని కాదు....బ్లడ్ కాన్సర్ (లుకేమియా) అంటే తెలుసా మీకు?"

 

    "తెలుసు"

 

    "ఏం తెలుసు?"

 

    "సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి వచ్చేది".

 

    కరుణాకర్ నవ్వాపుకోలేక "నేను చెప్పలేను బాబూ, మీకు భార్గవే చెప్తాడు. అతడికే బాగా తెలుసు దీని గురించి" అన్నాడు. భార్గవవైపు తిరిగి "గురూగారూ నేను కామర్సు వాణ్ణి. బ్లడ్ కాన్సర్ కాదుకదా- అసలు కేన్సర్ అంటే ఏమిటని అడిగితే ఆన్సర్ చెప్పలేని వాణ్ణి. ముందు అది చెప్పండి..." అన్నాడు.

 

    "ప్రోల్ ఫిరేషన్ అంటే తెలుసా. కల్తీ"

 

    భార్గవ నవ్వాడు. "మనిషిలో అనుక్షణం జరిగే కణ విభజనని ప్రోల్ ఫిరేషన్ అంటారు. అదే శరీరం పెరుగుదలకి తోడ్పడుతుంది. మనిషి మేల్కొని వున్నా, నిద్రపోతున్నా, శరీరంలో ఈ కణ విభజన ఒక క్రమబద్ధంగా జరుగుతూ వుంటుంది. అలా జరక్కుండా తొందర తొందరగా జరిగితే, ఆ జరిగిన చోటంతా శరీరం అసంబద్ధంగా పెరిగిపోతుంది. దాన్నే కేన్సర్ అంటారు. ఉదాహరణకి రక్తంలో ఈ కేన్సర్ వస్తే తెల్లకణాలు విపరీతంగా పెరిగిపోవటం ప్రారంభించి ఒకానొక స్టేజిలో మిల్లీమీటరు (సి) రక్తంలో 50,000 నుంచీ పదిలక్షల దాకా ఏర్పడుతాయి. అప్పుడిక మరణాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు".

 Previous Page Next Page