Read more!
 Previous Page Next Page 
ప్రార్థన పేజి 3


    "మైగాడ్! పది లక్షలా!"

 

    "అవును. పదిలక్షల పనికిరాని నిర్జీవపు తెల్లకణాలు, అదే లుకేమియా (బ్లడ్ కాన్సర్). కాన్సర్ నివారించటానికి కెమోథెరపీ, రేడియోథెరపీ అనే రెండు మార్గాలున్నాయ్. రేడియో ఆక్టివ్ కిరణాల ద్వారా, పెరిగిన అనవసరపు భాగంలో సూదులు గుచ్చటాన్ని రేడియో థెరపీ అంటారు. బ్లడ్ కాన్సర్ కి ఇది పనికిరాదు. ఆ మారణ సృష్టిని ఆపు చెయ్యాలంటే కెమోథెరపీ, అంటే శరీరంలోకి మందు ఇవ్వటం అనేది చెయ్యాలి" అని భార్గవ చెప్తూంటే శేఖరం రేడియో ప్రకటనలా-

 

    "మీ వంట్లో రక్తకణాలు విజృంభిస్తున్నాయా? చింతించకండి. నేడే మీ ఇంట్లో వుంచుకోండి. కాన్స్ - క్యూర్... సామ్సన్ అండ్ సామ్సన్ వారి తయారీ.. కాన్స్ - క్యూర్!! ట్రింగ్ ట్రింగ్" అన్నాడు.

 

    మళ్లీ నవ్వులు.

 

    ఇంతలో శంకర్ లాల్ అక్కడికి చేరుకోవటంతో అందరూ ఆయన చుట్టూ చేరారు. శంకర్ లాల్ కూడా ఒకప్పుడు సైంటిస్టే. కానీ అతడో పారిశ్రామికవేత్తలా కనపడతాడు. ప్రస్తుతం ఇన్ స్టిట్యూట్ తాలూకు ట్రస్ట్ వ్యవహారాలు చూసుకొంటున్నాడు. కొద్దిగా బట్టతల. వున్న కాస్త జుట్టూ బాగా తెల్లబడింది.

 

    ఆయన మైకు పట్టుకుని "ఫ్రెండ్స్" అన్నాడు. అంతలో చిన్న చప్పుడుతో కరెంట్ పోయింది. ఎవరో పుసుక్కున నవ్వారు. భార్గవ చెవిలో "నేనుకాదు గురూగారూ నవ్వింది" అని రహస్యంగా వినిపించింది. క్రిందినుంచి కొవ్వొత్తులు పట్టుకొచ్చారు ప్యూన్లు. హుక్కాకాల్చే అలవాటున్న "సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరు జేబులోంచి లైటరు తీసి వెలిగించాడు. గాలికి ఆరిపోయింది అది.

 

    అప్పుడు గమనించాడు భార్గవ ఉత్తర దిక్కునుంచి చల్లటిగాలి రివ్వున వీచటాన్ని. అతడు తలెత్తి ఆకాశంకేసి చూడబోతూంటే టప్ మని ఓ పెద్ద నీటిచుక్క అతడి మొహంమీద పడింది.

 

    రెండు నిముషాలు గడిచేసరికల్లా వర్షం చినుకులు సూదుల్లా జారసాగాయి.

 


                                              2

 


    చూరునుంచి కారే నీటి చినుకుల కేసి నిస్సహాయంగా చూస్తూ వరండాలో కూర్చొని వుంది వసుమతి. పిల్లలు ఇంకో టీచర్ తో వెళ్ళి పోయారు.

 

    ఆస్పత్రి ఆమెకు కొత్తకాదు. ఆమెకు పధ్నాలుగేళ్ళ వయసులో ఆమె తండ్రి ఆస్పత్రిలోనే మరణించాడు. కుటుంబ భారం అంతా వసుమతి మీద పడింది. ఆమె బియ్యే పూర్తిచేసే రోజుల్లో తల్లి రాచపుండుతో మరణించింది. ఆ తరువాత సంవత్సరం చెల్లి ప్రేమలో విఫలమై నాటుమంత్రసాని దగ్గర ప్రేమ ఫలితాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో కూడా విఫలమై ప్రభుత్వాస్పత్రిలో మరణించింది. ఆమె టీచర్ ట్రయినింగ్ పూర్తిచేసిన సంవత్సరం మెట్రిక్యులేషన్ లో తప్పిన తమ్ముడు రైలుక్రింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్ట్ మార్టమ్ చేయబడ్డ శరీరాన్ని తీసుకెళ్ళటానికి, కుటుంబంలో ఒక్కత్తిగా మిగిలిపోయిన ఆమె ఆస్పత్రికి రావలసి వచ్చింది.

 

    ఆస్పత్రి ఆమెకి కొత్తకాదు.

 

    "అమ్మా, నీ వంతు వచ్చింది" అన్నాడు పక్క పేషెంటు ఖంగు ఖంగున దగ్గుతూ- ఆమె ఉలిక్కిపడి లోపలికి వెళ్ళింది.

 

    లోపల డాక్టరు కుర్రవాడు. తనకున్న తెలివితేటలకి ఏ న్యూయార్కు లోనో వుండాల్సింది- అదృష్టం బావోలేక ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కొచ్చి పడ్డానన్న భావం అతడి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతూంది.

 

    "ఊ ఏమిటీ" అన్నాడు నిరాసక్తంగా.

 

    "పాపకి- జ్వరం" అంది వసుమతి.

 

    "నర్సు, టెంపరేచర్" అని అరుస్తూ సర్రున కాగితం లాగి, "పేరు?" అని ప్రశ్నించాడు.

 

    "ప్రార్థన!"

 

    పేరు కాస్త భిన్నంగా వుండేసరికి ఆ డాక్టరు ఒకసారి కళ్ళెత్తి చూసి మామూలే అన్నట్టు బరబరా కాగితంమీద గీకేసి ఇక వెళ్ళొచ్చు అన్నట్టు చూసేడు. ఆ చీటీ పట్టుకొని, ప్రార్థనని మరోచేత్తో లేపి నిలబెట్టటానికి ప్రయత్నం చేస్తూ, "ఫర్లేదంటారా" అని అడిగింది ఆశగా.

 

    డాక్టర్ తలెత్తి వ్యంగ్యంగా, "అంటే నేనేమన్నా దేముణ్ని అనుకున్నారా" అన్నాడు. అతడి పక్కనే కూర్చుని కబుర్లు చెబుతున్న పెద్దమనిషి అదేదో జోకులా నవ్వాడు. వసుమతి మొహం సిగ్గుతో కందిపోయింది. పాపని తీసుకుని పక్క రూమ్ లోకి వెళ్ళి మందు తీసుకొని, బయట వరండాలో బల్లమీద కూర్చొని, మాత్ర వేసి వళ్ళో పడుకోబెట్టుకుంది. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.

 

    ఇంతలో లోపల్నుంచి బిగ్గరగా నవ్వు వినబడింది. నర్సు అన్న మాటలకి డాక్టరు నవ్వుతున్నాడు. ఆమె లోపలికి చూడలేదు. తల్లినీ, తండ్రినీ, చెల్లినీ, తమ్ముడినీ ఆ లోపలికే అర్పించిన వసుమతి, ఈసారి అటు చూడటానికి భయపడి మనుష్యుల సకల పాపాల్ని తన కడుపులో దాచుకుని నిశ్చలంగా పరిభ్రమించే వసుమతిలాగా నిర్లిప్తంగా బయట చీకటిలోకి చూడసాగింది.

 

    ఆ చీకటిలోంచి...వర్షపు చినుకుల్ని చీలుస్తూ ముందు రెండు లైట్లు కనపడ్డాయి. నెమ్మదిగా అవి దగ్గరవుతూంటే వరండాలోకి వెలుగు పడసాగింది. అతడి వయసు నలభై వుంటుంది. జుట్టు చెంపలదగ్గర కాస్త నెరిసింది. భుజాలదగ్గర సూటు వర్షపు చినుకులకి తడిసింది దిగి తలుపన్నావెయ్యకుండా మెట్లెక్కాడు. అతడు అకస్మాత్తుగా తనిఖీకి వచ్చిన ఆఫీసర్లా వున్నాడు. లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా- వరండాలో కాందిశీకుల్లా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఆగాడు. దగ్గరకొచ్చి ప్రార్థన నుదుటిమీద చెయ్యి వేశాడు. ఈ లోపులో కారు చప్పుడికి బైటకొచ్చిన డాక్టర్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు.

 

    "ఏమైంది ఈ పాపకి?" ఇంగ్లీషులో అడిగాడు. అతడి ఇంగ్లీషు ఉచ్చారణ, ఆ వాతావరణాన్ని చూడటంవల్ల కలిగిన ఇరిటేషన్ తో మిళితమై సూటిగా వుంది.

 

    "ఏమైంది?"

 

    "ఫీవర్..."

 

    "వాట్స్ ద రీడింగ్?"

 

    "నాకు ... నాకు ... జ్ఞాపకం లేదు" తడబడ్డాడు.

 

    వృత్తికి సంబంధించిన నిర్లక్ష్యాన్ని గమనించటంవల్ల కలిగిన కోపాన్ని తమాయించుకుంటూ "అయిదు నిముషాల క్రితం చూసిన దాన్ని అప్పుడే మర్చిపోయారా?" అన్నాడు. డాక్టర్ మాట్లాడలేదు.

 

    "ఎనీవె... ఏం ఇచ్చారు మందు?"

 

    "నెవోక్విన్".

 

    "నె...వో...క్వి...న్!!!" అతడి గొంతు నమ్మలేనట్టు ధ్వనించింది. "డిడ్ షి కంప్లెయిన్ ఛిల్స్?"

 

    "ఇది బాగా మలేరియా వున్న ప్రాంతం!"

 

    అతడు నెమ్మదిగా తలెత్తి, అతికష్టంమీద ఇరిటేషన్ అణుచుకుంటూ తాపీగా అన్నాడు. "SINCE HOW LONG YOU ARE TREATING YOUR PATIENTS BY RANDOM SAMPLES DOCTOR?" (ఎంతకాలం నుంచీ మీరు రోగుల్ని టోకు పద్ధతిన ట్రీట్ చెయ్యటం మొదలు పెట్టారు డాక్టర్?)

 Previous Page Next Page