Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 19

 

    జోకు లేయకండి సార్! ఇంకేమీ లేవా?"
    "లేవు, ఇంకేమీ లేవు"
    "కేవలం ఒక్క లాటరీ టికెట్ కోసం లాకర్ తీసుకున్నారా?"
    "అవును దాని కోసమే తీసుకున్నాను. అలా చేయకూడదని రూలుందా?"
    "చెప్తే ఎవరయినా నమ్మాలి కదా! లాటరీ టికెట్ కొన్నారు అనుకోండి. దానికి ప్రయిజ్ వస్తుందని మీకెలా తెలుసు?"
    "తెలియదు. కాని నా అవసరం నన్ను నమ్మించింది "
    "నమ్మకాలు అవసరాలు తీరుస్తయ్యా సార్! మంచిదే ! ప్రయిజు రాకపోతే మీది ప్రాబ్లం కాదు. వస్తే ప్రాబ్లమే. వచ్చిందా?"
    "వచ్చింది సార్! పది లక్షలు!"
    "టెన్ లాక్స్! రియల్లి వండర్! పిటి యబుల్ థింక్!"
    "మరిప్పుడు నన్నేం చేయమంటారు?"
    "లాటరీ టికెట్ నంబర్ వివరాలు వ్రాసి యివ్వండి. మీ అడ్రస్ మా దగ్గరుంటుంది కదా! దొరికితే తప్పకుండా అందజేస్తాం!"
    "టికెట్ డిపాజిట్ చెయ్యటానికి నియమిత సమయం ఉంది కదా! ఈలోగా అది నాకు ఎలా దొరుకుతుంది?"
    "ఆ విషయంలో మేం చేయగలిగింది ఏమీ ఉండదు"
    అంతసేపూ బయట నిలబడి ఓర్పుగా ఎదురు చూస్తున్న ఓ షావుకారు గారు యిహ ఆలస్యం భరించలేక లోపలి కొచ్చాడు.
    "నమస్కారం బి.ఎమ్ గారూ!"
    "ఓ షావుకారు గారా! నమస్కారం"
    "చాల సీరియస్ గా ఉన్నారు?"
    "అవునండీ పాపం లాటరీ టికెట్ లాకర్ దాచుకున్నాడట. ఆ లాకర్ పగిలిపోయింది. ఏం చేస్తాడు పాపం"
    "లాకర్ లో లాటరీ టికెట్ దాచుకోవటం ఏమిటండీ!"
    "దానికి ప్రయిజు వచ్చిందా? ఎవరయినా ప్రయిజు వచ్చిం తరువాత భద్రత కోసం దాచుకుంటారు."
    "ఈయన ముందే ఎలా దాచుకున్నాడు. ప్రయిజు వస్తుంది ముందుగా తెలుసా? ఏమండీ మీకు తెలుసా?" నేరుగా జయసింహనే అడిగాడు. అతను చర్చలకి సిద్దంగా లేడు.
    ముందు దాని ఉనికి ఎక్కడుందో తెలుసుకోవాలి.
    "ఇంతకీ ప్రయిజ్ వచ్చిందంటారా?"
    "వచ్చిందనే అంటున్నాడు!"
    "ఎంత వెయ్యి రూపాయలా?"
    "కాదు పది లక్షలట! టెన్ లాక్స్" కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు పురుషోత్తం.
    "టెన్ లాక్స్? ఇదేదో విచిత్రంగా వుందే ఏ లాటరీ నాయనా?"
    "సౌభాగ్యవల్లీ లాటరీ!"
    "ఏమిటి సౌభాగ్యవల్లి బంపరా?"
    "అవును అదే!"
    "నే పేరేమిటి నాయనా!"
    "ఎస్. జయసింహ ఎం.ఎ"
    "ఏం జైలుకి వెళ్ళాలనుందా బాబూ!"
    "వాటార్ యూ టాకింగ్!?" మండిపడ్డాడు జయసింహ!    
    "లేకపోతే ఏమిటయ్యా! సౌభాగ్యవల్లీ బంపర్ లాటరీ నీకు వచ్చిందా? ఎవరైనా చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళుంటే వాళ్ళకి చెప్పు. ఆ ప్రయిజు రావటం, డబ్బు అందుకోవటం కూడ జరిగింది!"
    "మరొకరు డబ్బు డ్రా చేశారా?" అడిగాడు పురుషోత్తం.
    "అవును సార్! ఈయనేవడండీ ప్రైజు వచ్చిందనటానికి , మతి పోయి మాట్లాడుతున్నాడు. అది అదృష్టలక్ష్మి కదండీ!"
    ఎవరిని ఏ క్షణంలో వరిస్తుందో! అప్పుడెప్పుడో ఫాక్టరీలో పనిచేసే కూలికి వచ్చింది పండిపోయాడు.
    ఇప్పుడు చూడండి. ధర్మాజీరావుగారి దగ్గర పని చేస్తున్న అవిటి వాడికి వచ్చింది. డబ్బు డ్రా చేశారు.  
    జయసింహకి తాను వింటున్నది కలా? నిజమా? అర్ధం కాలేదు.
    "ఎందుకండీ అలా చూస్తారు? అబద్దలా? బ్యాంక్ ని మోసం చెడ్డామనుకున్నారా? కావాలంటే చూడండి. " అంటూ పేపర్ అందించాడు షావుకారు.
    గ్రుడ్డివాడిని వరించిన సౌభాగ్యవల్లి! అనే హెడ్డింగ్ లో ఉన్న వార్త చూచి ఉలికిపడ్డాడు.
    ధర్మాజీరావు దగ్గర పని చేస్తున్న అతని ఫోటో కూడా ప్రచురించబడి వుంది.
    పేపర్ అందుకుని పురుషోత్తం కూడా ఆ వార్త చదివాడు.
    "ఇప్పుడేమంటావు? బ్యాంక్ యాజమాన్యంతో జూదమాడాలనుకుంతున్నావా? రూల్సు ప్రకారం యిప్పుడు మేం చేయగలిగిందేమిటో తెలుసా?' అని తీవ్రమయిన స్వరంతో ప్రశ్నించాడు బ్రాంచి మేనేజర్ పురుషోత్తం.
    జయసింహ పెదవి కదుప గలిగిన స్థితిలో లేడు.
    ఆ వచ్చిన పెద్దమనిషి కోపంగా చూచాడు.
    "ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదండీ! పోలీసుల్ని పిలిచి అప్పగించాలి! ఎంత బరితెగించి పోయారో చూశారా?" అన్నాడు.
    "అవును మరి, ప్రయిజ్ వచ్చిన టిక్కెట్స్ ని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. కాని ముందుగానే లాకర్ లో పెట్టాడా?
    ఎలాగూ లాకర్స్ ప్రేలిపోయాయి కదా! ఇదో నాటకం. ఒకే నంబర్ కలిగిన టికెట్లు రెండు ఉండటం యెలా సాధ్యం."
    "సాధ్యమే అనుకోండి. అంత మాత్రం చేత ఇలాంటి కట్టు కధ అల్లటం, మిమ్మల్ని మోసగించాలని చూడటం దారుణం కదండీ!"
    "లాకర్ కీ యిచ్చేశావా. అది కూడా నీ దగ్గరే ఉందా." పురుషోత్తం అతని వంక పరిహాసంగా చూశాడు.
    "నా దగ్గరే ఉంది! మంచి నీరు యిప్పిస్తారా? గొంతు యెనడిపోతోంది" నీరసమయిన కంఠస్వరంతో!
    "దానికేం భాగ్యం. మంచినీరు త్రాగండి. కాని యిలా పిచ్చి  వాళ్ళని చెయ్యాలని మాత్రం ప్రయత్నించకండి. దట్సాల్" మంచి నీరు తెప్పించాడు.
    త్రాగి రవంత స్థిమితపడ్డాడు జయసింహ!
    అతని మనసులో అనుమానాల తోరణాలు కదులుతున్నాయి.
    ఒకే నెంబర్ గల టికెట్స్ రెండు ఉండటం సాధ్యమేనా? బ్యాంక్ లాకర్ ప్రేలిపోయిన సందర్భంలో అనూహ్యమయిన కారణాల వల్ల ఆ టికెట్ మరెవరి చేతిలో అయినా పడిందా?
    "సర్. ఈ విషయంలో నేను ఊరికే ఉండాలనుకోవటం లేదు. రిపోర్టు వ్రాసిస్తాను. నా టికెట్ నంబర్ అదే కావాలంటే నా డైరీ చెక్ చేయండి" అంటూ డైరీ చూపించాడు.
    "వ్యవహారం పోలీసుల వరకూ పోయేందుకు యిష్టపడుతున్నావా"
    "ఏదో కుట్ర జరిగింది. లేదంటే ఎవరి వల్లనో పొరపాటు జరిగింది. అదేమిటో తెలియాలి లేకుంటే నేనే పోలీసుల సహాయం కోరతాను"
    "ఓ అంతదాకా ఉందా వ్యవహారం ." టెలిఫోన్ తీసి ఒక డబల్ జీరో కి పిలుపు యిచ్చాడు పురుషోత్తం!
    "రిపోర్టు వారికీ యివ్వండి!"
    జయసింహ పేపరు మీద కమిట్ అయ్యాడు. అదే నెంబర్ టికెట్ లాకర్ ప్రేలుడు ప్రమాదంలో పోయింది. దానికి సాక్ష్యం లేదు.
    మరొకరి పేరు మీదుగా ఆ నంబర్ టికెట్ డిపాజిట్ అయింది. డబ్బు తీసుకోవడం కూడా జరిగిపోయింది.
    వివరంగా వ్రాసి యిచ్చాడు.
    బ్యాంక్ నించి పిలుపు అనగానే పోలీసులు హడావుడిగా వచ్చారు.
    "రండి! రండి! ఇది నేను తేల్చగలిగిన వ్యవహారం కాదు. మేరె తేల్చాలి"
    "ఏం జరిగింది? వివరంగా చెప్పండి"
    'చాల చిత్రమయిన కేసు! లాకర్స్ లో ఈ నెంబర్ టికెట్ దాచాను అంటున్నాడు. ఆ మొత్తం డ్రా అయింది. అతను చూపే సాక్ష్యం డైరీలో వ్రాసుకున్న నంబర్ టిక్కెట్!
    "ఎలా ప్రశ్నిస్తారో? ఏం తెలుస్తారో మీ యిష్టం" ఆన్నాడు బి.ఎమ్ పురుషోత్తం.    

 Previous Page Next Page