Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 18

 

    బాబూగారు! ఇదిగో నీళ్ళు" అతను లేవగానే అలవాటు ప్రకారం ప్లాస్టిక్ టంబ్లర్ తో నీళ్ళు తెచ్చి యిచ్చాడు. జయసింహ చేతులు ముఖం తుడుచుకున్నాడు.
    పానకాల్సామీ టవల్ అందించాడు.
    అప్పుడప్పుడే బృందావనం లోంచి దిగివచ్చిన వనకన్యలా ఉంది ప్రియాంక. ఉదయం ఎనిమిదిన్నర అయిందేమో!
    రోజుకన్నా ముందే నిద్రలేచి శుభవార్త చెప్పాలని వచ్చింది.
    "ఇంత ప్రొద్దెక్కినా ఇంకా నిద్రపోతున్నావా? నేను నీకోసం పరుగెత్తుకొచ్చాను. నువ్వు ఎటైనా వెళ్ళి పోతావని!"
    "పరుగెత్తుకు రావటం ఎందుకూ? కారుందిగా!" అన్నాడు జయసింహ!
    ఆమె వీణ వాయించినట్లు కిలకిలా నవ్వింది.
    "కారులోనే వచ్చాలే! రోజూ నేను నిద్రలేచే సమయానికి తెల్లవారు ఝామున తొమ్మిది గంటలవుతుంది."
    "తొమ్మిది గంటలయినప్పుడు అది ఉదయం కాదా?"
    "కాదు. అప్పుడే ఇంకా మా బంగ్లాలో తెల్లారదు. తొమ్మిది ఇరవై కి డాడీతో కలిసి ఫలహారం."
    "మరి యివాళ ఎలా వచ్చావు?"
    "నీకోసం అర్ధరాత్రి ఎనిమిది గంటలకే లేచాను"
    "ఓహో! ఏమిటా శుభవార్త?"
    "ఇలా దోమలకి రక్తం ధారపోస్తూ ఎంతకాలం ఉంటావు?"
    "ఈ పార్కు కూడా వదిలేసి వెళ్ళి పోవాలా?"
    "అవును. వదిలెయ్యాలి"
    "నేనేంటే నీకెందుకు అంత కోపం?"
    "కోపం కాదు. నువ్వంటే నా కిష్టం. నువ్వు మా ఇంటికి రావాలి!" అంది ప్రియాంక ఎంతో అభిమానంగా!
    "ఎందుకట?"
    "డాడీ పర్మీషన్ తీసుకున్నాను"
    "నువ్వు ఎదడిగినా యిచ్చేస్టారాయన! ఇప్పుడేమడిగావు?"
    "టెన్నీస్ నేర్చుకుంటాను"
    "మాష్టారు ఎవరు"
    "ఇంకెవరూ మీరే!"
    "నాకు టెన్నీస్ రాదు"
    "డాడీతో ఆ మాట చెప్పకు. ఇద్దరం కలిసే నేర్చుకుందాం"
    "అబద్దాలాడటం నాకిష్టం ఉండదు."
    "పోనీ నువ్వు మాట్లాడకు, నేను చెప్పుకుంటాను."
    "అమ్మాయిగారు అంత అభిమానంగా అడుగుతున్నారు! కాదనకు బాబూ!" సలహా యిచ్చాడు పానకాల్సామి.
    అందాల దేవతలా నిర్మలంగా పవిత్రంగా ఉన్న ఆ అమ్మాయి అతని అదృష్టాన్ని మార్చేయ గలదని అతనికి అనిపిస్తోంది.
    "ప్రియా! ఈ రోజు చాలా ముఖ్యమయిన పని మీద వెళుతున్నావు. ప్రొద్దుటే అందాలు చిందించే దేవతలా వచ్చావు చాలా సంతోషం.
    కాని నేను త్వరగా వెళ్ళిపోవాలి" అన్నాడు జయసింహ!
    ఆనందంగా ఉత్సాహంగా పరవళ్ళు త్రొక్కే సెలయేరులా, పిల్ల తెమ్మెరలా వచ్చింది ప్రియాంక. జయసింహ మాటలు విని ఆమె ముఖం నల్లగా అయిపొయింది. ఉత్సాహమంతా నీరు కారిపోయింది.
    "సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. కారులో డ్రాప్ చేస్తాను."
    "నేను నడిచే వెళ్ళాలి! నీకెందుకు శ్రమ!" ఆ మాటలు ఆమెకు కళ్ళ వెంట నీళ్ళు తెప్పించాయి.
    "జయా శ్రమ అనుకుంటే నీకోసం యిదంతా చేస్తాననుకున్నావా? సరే నీ ఇష్టం ఎలాగో అలాగే చెయ్యి! కానీ నీ కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను. ఏ క్షణంలో అయినా మన స్నేహాన్ని అంగీకరించి దానికి గుర్తుగా నువ్వు నా దగ్గరకు రావచ్చు"
    తల దించుకుని వసంత రుతువు ముగియపోగా వనాన్ని విడిచి పెట్టిన వనదేవతలా వెళ్ళిపోయింది ప్రియాంక!
    ఆమె ఉత్సాహమంతా మంచులా కరిగిపోయింది. ఆశలనీ మబ్బులా విడిపోయి తీవ్రమయిన నిరాశ చురుక్కు మనిపించింది.
    అలా వెళ్ళి పోతున్న ఆమెను చూచి పానాకాల్సామి ఎంతో బాధపడ్డాడు.
    "బాబూగారు! పువ్వు లాంటి అమ్మాయి. వికసించిన మనసుతో వచ్చింది. ఆమెను ఎందుకు అంత బాధ పెట్టారు" అన్నాడు దిగులుగా!
    "పానకాల్సామీ! ఆమె నా మీద చూపుతోంది గాని అయితే దాన్ని నేను భరించలేను. ప్రేమ అయితే దానికి నేను అర్హుడ్ని కాను"
    మనకి బాధ అనిపించినా ఆమెను వెళ్ళి పోనివ్వడమే మంచిది!" అంటూ లేచాడు. ఆపూట చాలా పనులున్నాయి. అవన్నీ గుర్తుకొచ్చాయి.
    మరొక అరగంటలో బయలుదేరాడు.
    శివకృష్ణ కాంప్లెక్స్ ప్రక్కనే ఉన్న డింగ్ డాంగ్ షోరూం ఎదురుగ్గా ఉన్న డాబా యింటిలోకి బ్యాంకును మార్చారు. అక్కడ క్రొత్త బోర్డు తగిలించారు. మేనేజర్ హడావుడిగా ఉన్నాడు.  
    ఇటీవల తానుండగానే చాల ఘోరంగా స్ట్రాంగ్ రూం పేలిపోయింది. అందువల్ల వచ్చిన అప్రదిష్టనించి బయట పడేందుకు తిరిగి ప్రజల్లో విశ్వాసం సంపాదించేందుకు అతడు ప్రయత్నం చేస్తున్నాడు.
    జయసింహ వెయిటింగ్ లో కూర్చున్నాడు. తాను సరిగ్గా మాట్లాడాలి. తన వెనుక వచ్చిన విజిటర్స్ ని కూడ ముందు పంపాడు.
    అంతా అయి పోయాక గదిలో కాలు పెట్టాడు.
    గ్లాక్సోస్ డి వాటర్ లో కలుపుకు త్రాగుచున్నాడు పురుషోత్తం! కూర్చోండి అన్నట్లు చేతితో సైగ చేశాడు.
    జయసింహ ఓ కుర్చీలో కూర్చున్నాడు.
    "ఈ ప్రపంచంలో చెయ్యకూడని పని ఏదైనా ఉంచంటే అది బ్రాంచి మేనేజర్ ఉద్యోగమే సుమండీ! పై అధికారులకి క్రింద ఉద్యోగులకీ మధ్య నలిగి పోవటం కన్నా హాయిగా స్కూలు మాస్టారి ఉద్యోగం చాలా మంచిది.
    కావాల్సినంత స్వేచ్చ ఉంటుంది. ఇంకో ప్రక్క ఈ కస్టమర్స్ తో  వచ్చింది నాకు. ఏం చెయ్యాలి! అష్టావధాన మయిపోయింది బ్రతుకు .
    లాకర్ పేలిపోతాయని ముందుగా నాకు తెలుసా? నా ప్రాణాల తోడేస్తున్నారు. ఈ బ్రాంచి మేనేజర్ ఉద్యోగం పగవాడికి కూడా రాకూడదు" అంటూ వాపోయాడాయన!
    "సర్! బ్యాంకు ఉద్యోగాలకి చాల గ్లామర్ ఉంది కదా! మంచి జీతాలు ! పని గంటలు తక్కువ! నిరుద్యోగులందరూ బ్యాంకులో ఉద్యోగం కావాలని కలలు కంటారు.
    మీరిలా అంటారేమిటి?" అన్నాడు జయసింహ!
    "దూరపు కొండలు నునుపు బయట నిలబడి చూచే వాడికి అలాగే కన్పిస్తుంది. మా కంటే పడవ నడుపుకునే వాడు నయం. ఒడ్డు చేరితే డబ్బడుగుతాడు . లేకపోతే లేదు.
    మధ్యలో పడవ మునిగితే హాయిగా తనొక్కడూ ఈది ఒడ్డుకి చేరుకుంటాడు. మా సంగతి అలా కాదె!
    మరొకరి అవసరాలకి మేం బలి కావాలి! అదంతా మీకు అర్ధం కాదులెండి. మా బాధలు మావి! మీరేం పని మీదోచ్చారో చెప్పండి" అన్నాడు బి.ఎమ్ పురుషోత్తం.
    "మానేజర్ గారూ! లాకర్స్ లో నది ఎనబై ఎనిమిదో నెంబర్!"
    "అవును ఒకసారి చెప్పారు కదూ! గుర్తుంది"
    "నా లాకర్ లో వస్తువులు ఏవైనా దొరికాయా?"
    "మీరేం దాచుకున్నారో మాకేలా తెలుసుతుంది సార్! గుర్తులు చెప్పి కొందరు తీసుకుపోయారు. దానికి ఓ ప్రొసీజర్ వుంది.
    ముందుగా మీ లాకర్ నంబర్ యివ్వాలి! మేం మీకు యిచ్చిన 'కీ' తిరిగి మాకు హ్యాండోవర్ చెయ్యాలి! భద్రంగా ఉన్న లాకర్ అయితే అది తెరిచే రోజు మిమ్మల్ని పిలుస్తాం.
    వచ్చి మీ వస్తువులు తీసుకు పోవచ్చు!
    ఎనబై ఎనిమిది పగిలి పోయింది కదా! అంచేత దాన్లో ఏం దాచారో ముందుగా మాకు లిస్టు వ్రాసి యివ్వాలి! దాని ప్రకారం మీ వస్తువులు దొరికితే కబురు చేస్తాం. గుర్తు చెప్పి తీసుకుపోవాలి."
    "దాన్లో నేను ఒక లాటరీ టికెట్ దాచాను"

 Previous Page Next Page