Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 20

 

    జయసింహను పోలీసులు కంట్రోల్ రూంకి ఆహ్వానించారు. మర్యాదగా కుర్చీ యిచ్చి గౌరవించారు.
    "మీరు చేస్తున్న ఆరోపణ చాలా పెద్దది! చూపుతున్న సాక్ష్యం అసలు సాక్ష్యమనిపించుకోలేదు. ఇలా చేయటం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఇంతకూ మునుపెప్పుడయినా చేశావా?"
    "అంటే నేను చీట్ చేస్తున్నాననీ మీ అనుమానం? అంతేగా?"
    "అవునంటాననుకోండి . మీరేం చేస్తారు?"
    "కాదని నిరూపిస్తాను"
    "ఎలా నిరూపిస్తావు?"
    "సౌభాగ్యవల్లి లాటరీ ఫలితాలు రాకముందే ఈ నంబర్ గల లాటరీ టికెట్ పోయిందని మీ ఐ.ఎస్.పి విక్రమ్ కి చెప్పాను. ఆయనకి గుర్తుందో లేదో! మీరు అడిగి తెలుసుకోవచ్చు" చాల దూకుడుగా సంభాషణ ప్రారంభించిన జూనియర్ ఆఫీసర్ ఈ మాట విని ఖంగు తిని పోయాడు.
    "ఎ.ఎస్.పి దొరగారు మీకు తెలుసా?"
    "ఈ లాటరీ టికెట్ గొడవలోనే ఒకసారి వారిని కలిశాను. వారికి గుర్తుందో లేదో చెప్పలేను."
    దొరగారిని ఫోనులో అడిగి తెలుసుకొంటాను. వారు తెలియదు అన్నారనుకో! నువ్వు చీట్ చెయ్యటంలో పోలీసు ఆఫీసర్ల పేర్లు కూడా ఉపయోగించుకుంటున్నావని రుజువు అవుతుంది.
    అప్పుడు నేనేం చేస్తానో మీరు ఊహించుకోండి.
    ఇంకొకసారి చూసి ఆలోచించుకుని చెప్పండి.
    దొరగారికి టెలిఫోన్ చెయ్యమంటారా?" ఈ చివరి అవకాశం నించి ఎస్కేప్ అయ్యే అవకాశంలో మరింతగా ఫ్రేము బిగించి అడిగాడు.
    "ఆలోచించవలసిందేమీ లేదు. టెలిఫోను చెయ్యండి." జూనియర్ ఆఫీసర్ లోనికి వెళ్ళిపోయాడు.
    అయిదు నిమిషాల అనంతరం తిరిగి వచ్చాడు. అతని ముఖం చాలా ప్రసన్నంగా ఉంది.
    "దొరగారు మిమ్మల్ని రమ్మన్నారు"
    హమ్మయ్య నిట్టుర్పూ విడిచారు జయసింహ.
    ఎ.ఎస్.పి విక్రమ్ చిరునవ్వుతో ఆహ్వానించాడు.
    "ఊ చెప్పండి. మళ్ళీ ఏమిటి ప్రాబ్లం?"
    "సర్! మీరు నాకు న్యాయం చేస్తారా?" ఆరు లక్షలు అర్జంటుగా కావాలి"
    "అప్పివ్వమంటావా?" విక్రమ్ నవ్వాడు.
    "బహుశా మీకు పరిహాసంగా ఉండొచ్చు"
    "పరిహాసం కానే కాదు. మేము సమస్యని గురించి ఆలోచించటమనేది దేని మీద ఆధారపడి ఉంటుందనుకున్నారు"
    "మీకు ఎంత డబ్బు అవుసరం?"
    "ఏది ఎంత అర్జంటుగా మీకు కావాలి? అనే విషయాల మీద ఆధారపడి ఉంటుందనుకున్నారా?
    తొందరపడి మాటాడుతున్నారు.
    మనసులో ఉన్న టెన్షను అర్ధం చేసుకుంటున్నాను . చెప్పండి "
    "అదే నంబరు గల టికెట్ మొత్తం డ్రా అయింది "
    "ఈజిట్! చాలా విచిత్రమయిన విషయం"
    "భాద్యత గల అధికారులు నా భాదని గుర్తుంచలేదు సర్!"
    "తప్పకుండా నేను గుర్తిస్తాను. ఒకే నంబరు గల టికెట్స్ రెండు ఉన్నాయంటే ఎక్కడో మోసం జరిగి ఉండాలి కదా!?"
    "ఆ మోసం చేస్తోంది నేనే అని మీ అధికారుల అభిప్రాయం."
    "డెఫినేట్లీ నాట్! కాదని నాకు తెలుసు. ఈ ప్రయిజ్ ప్రకటించిన ముందే మీరు మీ టికెట్ పోయిందని నాకు చెప్పారు. అప్పుడు ఈ టికెట్ కే ప్రయిజ్ వస్తుందని మీకు తెలియదు కదా!"
    ప్రయిజ్ వస్తుందో రాదో తెలియకుండా మీరు టికెట్ ఎందుకు డిపాజిట్ చేశారనేది మా డిపార్టుమెంటుకి ముఖ్యం కాదు.
    మీకు అలాంటి ఆత్మ విశ్వాసం ఉండొచ్చు. మీ అదృష్టం మీద మీకు నమ్మకం ఉండొచ్చు. సరదాగా అయినా లాకర్ లో పెట్టవచ్చు.
    అది మాకు అనవసరం విషయం.
    మీరు ఆ టికెట్ లాకరులో ఉంచారా లేదా అనేదే మాకు కావాలి. ఉంచారనటానికి నేనే సాక్ష్యం!
    సమ్ ధింగ్ హంపెండ్ ఇన్ రాంగ్ వే! విచారిస్తాను. నా మీద మీకు నమ్మకం ఉందా?" అన్నాడు ఏ.ఎస్.పి విక్రమ్.
    జయసింహ నీళ్ళు నిండిన కళ్ళతో అతనికి చేతులు జోడించాడు!!

                                 9

    "పసివాడికి పాలు చాలకుండా పోయాయి! బజారు వెళ్లి డబ్బా పాలు తీసుకురా! గుక్కపెట్టి ఏడుస్తున్నాడు" అంది తల్లి సముదాయిస్తూ .
    "పాలు ఎలా సరిపోతాయి? బలమయిన ఆహారం తీసుకోవాలి! మందులు వాడాలి! డాక్టర్ సలహా తీసుకోవాలి. అవన్నీ చేయకుండా డబ్బా పాలు పట్టటం చిన్న పిల్లలకి అనారోగ్యం" అన్నాడు చిన్నారావు.
    అతని మాటలు విని దిగులుగా చూసింది ఆ యిల్లాలు.
    "ఎందుకు మాటలతో కడుపు నింపుతావు? నేను తెచ్చిన కట్నం డబ్బులు హుష్ కాకి అయిపోయినాయి. ప్రతి నెలా వచ్చే జీతం ఏమవుతుందో ఆ పరమాత్మ కే తెలియాలి!
    తినేందుకు తిండి కూడా లేకుండా చేస్తున్నావు. ఇంకా డాక్టర్లు టానిక్కులు ఇవన్నీ ఎలా వస్తాయి. నీ బుద్ది సరిగా ఉంటె నా రాత బాగుండేది" అంటూ కన్నీరు తుడుచుకుందామే.
    "ఎందుకంటావేమిటి? బిడ్డ అల్లాడి పోతున్నాడు. పాల డబ్బా పట్రా!"
    "అదెంతపని! ఒక్క నిముషం! డబ్బులిలా పట్రా?"
    "ఇంకా నా దగ్గరేమున్నాయి. నువ్వే తీసుకున్నావు కదా!"
    "పోపుల డబ్బాలో దాచుకుంటావు కదా! ఆడవాళ్ళ సీక్రెట్ బ్యాంక్ అంటే అదే! వెళ్ళీ పట్రా! పాల డబ్బా తెస్తాను"
    "జీతం వచ్చి పది రోజులు కాలేదు. డబ్బు అంతా ఏం చేశావు? మిగిలిన నెల అంతా ఎలా గడుస్తుంది?" అంటూ వాపోయిందామె.
    "ఈ మాత్రం ఉద్యోగం కూడా లేనివాళ్ళకి ఎలా గడుస్తుంది అలాగే! అయినా నువ్వు ప్రశ్నించటం నేర్చుకుంటున్నావీ మధ్య. భారత నారీ అన్న తరువాత మొగుడు చెప్పినట్లు వినటం నేర్చుకోవాలి.
    ఎదురు తిరిగి ప్రశ్నించటం నేర్చుకోకూడదు. ఆడవాళ్ళు అనుమానించటం మొదలెడితే యిండియా యిట్లా ఉండదు" అదో పెద్ద జోకులా తనే నవ్వాడు. ఆమె కోపంగా చూసింది.
    "ఏం? ఈ దేశంలో ఆడవాళ్ళ కేమయింది. అందరూ భార్యలను నీలాగే తొక్కిపట్టి ఉంచుతున్నారా.
    దేశాన్ని పాలించుతున్నారు. విమానాలు నడుపుతున్నారు. కలెక్టరవుతున్నారు. ఇంజనీర్లున్నారు. నా ఖర్మే యిలా కాలింది. కాని దేశంలో మిగిలిన వాళ్ళకేం. అందరూ బాగానే ఉన్నారు"
    "అని నువ్వనుకుంటున్నావు. ముందుకి పోతున్న వాళ్ళు కొద్ది మంది నూటికి తొంభై మంది ఇంకా వెనక్కి పోతున్నారు. గొప్ప వాళ్ళ సంగతులు మనకెందుకు. తిరోగామించే తొంభై మందిలో నువ్వున్నావు."
    "అడగటం నేర్చుకోకు, మొగుడు చెప్పింది వినడం నేర్చుకో."
    "ఆ డబ్బులిలా పట్రా." అన్నాడు.
    ఆమె లేచి వెళ్ళి పోపుల డబ్బా దులిపి డబ్బులు తెచ్చి యిచ్చింది. ఎనిమిది రూపాయలున్నాయి.
    "నా దగ్గర మిగిలింది యింతే. ఇహ విషం కొనుక్కు తిని చావాలన్నా ఎర్రని పైసా లేదు. ఏం చేస్తావో నీ ఇష్టం" అంది.
    "పోపుల డబ్బాలో ఉండక పోవచ్చు. చీర మడతల్లో ఉంటాయి కదా."
    "నా మొఖానికి ఆ ముచ్చట కూడానా? నువ్వు కొనిపెట్టావా చీరలు!"
    "అన్నీ మా పుట్టింటివాళ్ళు పెట్టినవే."
    "నాకెందుకు చెప్తావు. చీర మడతల్లో డబ్బులు దాచకపోతే తెలుగింటి ఆడపడుచువె కాదు. వెళ్లి పట్రా."
    ఆమె మళ్ళీ లేచి వెళ్లి చీర మడతలు అన్నీ వెతికి మరో పది రూపాయలు అన్నీ చిల్లర నోట్లు తెచ్చి యిచ్చింది.

 Previous Page Next Page