"అనూ! నీ ప్రేమలో ఎప్పుడూ లోపం లేదు. నువ్వెందుకలా అనుకుంటున్నావు. నీ మనసుకింత బాధ కలగడానికి కారణం నేనే అని భావిస్తే నన్ను క్షమించు అనూ! కానీ మనం కలుసుకోవద్దని షరతులు, ఆంక్షలు పెట్టి నన్ను పిచ్చివాడ్ని చేయకు!" ఆర్తితో అభ్యర్ధించాడు. అనూష విరక్తిగా నవ్వింది.
"అవును రామ్! కష్టమో, నష్టమో తప్పదు. అసలు మనది ప్రేమో, కాదో మనం తెలుసుకోవాలి."
"మనది ప్రేమ అనూ!"
"ఎంత పిచ్చివాడివి రామ్! ఇంత జరిగినా నన్ను ఇంకా ఇది ప్రేమే నని నమ్మమంటావా? అందుకనే ఒక సంవత్సరంపాటు మనం కలుసుకోకూడదు."
"సంవత్సరమా!" అదిరిపడ్డాడు పరుశురాం.
"అవును రామ్! రోజులిలా తిరిగొస్తాయి. రోజూ తిరిగినట్టే మనిషిలోనూ మార్పు సహజంగా వస్తుంది.
మనం సంవత్సరం తర్వాత కలుసుకున్నప్పుడు ఇప్పటిలాగే ఒకరంటే ఒకరికిష్టం, అభిమానం, ఆకర్షణ.... ఒకర్నొకరం చూడాలనే ఆరాటంతో మనసు తపించిపోతే మనం ప్రేమికులం అవుతాం. లేదా ఎవరి దారిన వాళ్ళు విడిపోతాం!"
"అంతేనా?" జీరబోయిన గొంతుతో అడిగాడు. ఆమె కళ్ళతోనే 'ఔను' అన్నట్లుగా సమాధానం చెప్పింది.
"అయితే మళ్ళీ ఎప్పుడు?"
ఆమె కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది. ఆమె తల ఒంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె తలపైన చేత్తో నిమురుతూ అన్నాడు.
"ఓ.కే. అనూ! వచ్చే నీ పుట్టినరోజునాడు యిదే గుడిలో యిదే మండపం దగ్గర కలుస్తాను."
అనూష తలెత్తి అతని మొహంలోకి చూసింది. 'సంవత్సరం పాటు నిన్ను చూడకుండా ఎలా వుండాలి రామ్' అన్నట్టుగా వుందామె చూపు.
"మా డాడీకి ట్రాన్స్ ఫర్ అయింది. ఈ ఊర్నించి వెళ్ళిపోతున్నాం రామ్. నీకోసం నువ్వు చెప్పినట్లే ఆ రోజు వస్తాను. 'విష్ యూ గుడ్ లక్' అని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది అనూష.
ఆమె గొంతులోని వేదన అతనికి తెలిసింది కాదు. అయితే అంత బేలగా అనూషని ఎప్పుడూ చూడలేదు.
తనకి ధైర్యాన్ని నూరిపోసే అనూషలో ఆ మార్పుకు కారణం తనేనని అతనికి తెలుసు.
అనూష!
కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చేశాడు పరుశురాం.
6
మర్నాడు సాయంత్రంవరకూ నందిని అతనికి కనిపించలేదు.
పరుశురాం మధ్యాహ్నం ఆమె కారులో బయటికి వెళ్ళటం చూశాడు.
ఉదయం కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం గెస్ట్ రూంలోనే తీసుకొచ్చాడు రంగన్న. దాంతో బంగళాలోకి వెళ్ళే అవసరం దొరకలేదతనికి.
భోజనం చేసి పడుకొని సాయంత్రం అయిదుగంటలకి లేచాడు. స్నానం చేసి డ్రస్ చేసుకుని రెడీగా కూర్చున్నాడు.
ఆరుగంటలకి నందిని క్లబ్బుకి వెళ్తుందని అతనికి తెలుసు.
అతని ఊహ కరెక్టే.
సరిగ్గా ఆరుగంటలకి నందిని బ్యాగ్ భుజానికి తగిలించుకుని పోర్టికోలోకొచ్చింది.
అక్కడే నిలబడి తోటమాలికి, మరో పనిమనిషికి ఏవో పనులు పురమాయించి చెప్తోంది.
పరుశురాం సిగరెట్ వెలిగించుకుంటూ ఆమె దగ్గిరికి నడిచాడు.
నందిని అతనికేసి కూడా చూడకుండా, అసలతన్ని చూడనట్ట నటిస్తూ కారు డోర్ తీసి బ్యాగ్ ని నిర్లక్ష్యంగా సీటులోకి విసిరకి స్టీరింగ్ ముందు కూర్చుంది. పరుశురాం డోర్ తెరిచి ఆమె పక్కనే కూర్చున్నాడు.
అతన్ని అప్పుడే చూసినట్లుగా చూసింది.
"గుడ్ మార్నింగ్ మేడం!" అన్నాడు.
"మార్నింగ్. నేను క్లబ్బుకి వెళ్తున్నాను" అంది.
"తెలుసు. నేను క్లబ్బుకి వస్తున్నాను"
ఆమె తమాషాగా నవ్వింది.
"ఎందుకు బాబూ! మళ్ళీ ఏ అమ్మాయితోనో గొడవ పడ్డానికేగా!" అంది.
"నేను అనవసరంగా ఎవరితోనూ గొడవ పడలేదు మేడం!"
"ఊ.... అలాగా!" నవ్వింది.
"ఎందుకా నవ్వు!"
కళ్ళ గ్లాసెస్ ని ముక్కుపైకి జరిపింది.
"ఏ. నేను నవ్వడానికి నీ పర్మిషన్ కావాలా?" అతను మౌనంగా వుండిపోవడం చూసి అంది నందిని.
"నాకు చేతకాని వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది!"
"నేను క్లబ్బుకి రాకూడదా?" సూటిగా అడిగాడు పరుశురాం.
"రావద్దని నేను ఎప్పుడూ అనను. యూ ఆర్ మోస్ట్ వెల్ కమ్ రామ్.
నువ్వు నా గెస్ట్ వి.
డ్రింక్ చెయ్. అందమైన అమ్మాయిల్ని చూస్తూ కాలక్షేపం చెయ్. నీకేది సరదా అనిపిస్తే అది దొరుకుతుంది అక్కడ...."