Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 17


    నిజానికి ఆమె ఓడిపోవటానికి కారణం తను కాదు అసలామె తెలివైనదో కాదో అతనికి అర్ధం కాలేదు.

    రెండు లక్షలు.... హారతి కర్పూరంలా చేసేసింది.

    రూపాయలా! కాగితం ముక్కలా! అంత డబ్బుపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది

    ఓడిపోతున్న కొద్ది రెచ్చిపోయి ఆడింది పాపం. ఆమె గెలవలేదన్న విషయం అతనెప్పుడో పసిగట్టాడు. అట్లా జరుగుతున్నప్పుడు మధ్యలో తను ఇంటర్ ఫియర్ కాకూడదు. అందుకే తనూరుకోవాల్సి వచ్చింది.

    జూదానికి ముఖ్యంగా కావాల్సింది సహనం. స్లో అండ్ స్టడీ, విన్ ది రేస్ అన్నారు.

    పేకాటలో డబ్బు జారిపోతున్నప్పుడు ఉద్రేకపడినా, రెచ్చిపోయినా, పంతానికి పోయినా హాండ్ ఇంకా డౌన్ అవుతుంది. అప్పుడే ఆటను కంట్రోల్ చేయగలగాలి.

    ఆమె మేడదిగి కిందికి వస్తుందేమోనని ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాడు సిగరెట్ పైన సిగరెట్ కాలుస్తున్నాడు. మధ్యమధ్యలో మేడ మెట్లకేసి ఆత్రంగా చూస్తున్నాడు.

    దాంతో మేడం ఎంత కోపంలో వున్నదీ అర్ధం అయిందతనికి.

    విసుగ్గా వుంది.

    జేబులోంచి కార్డ్స్ తీసి ఆడుకోవడం మొదలుపెట్టాడు,

    పది నిమిషాల తర్వాత రంగన్న వచ్చి "బాబూ భోజనానికి రండి" అని పిలిచాడు.

    "మేడం వస్తున్నారా?" ఆత్రుతగా అడిగాడు పరుశురాం.

    రంగన్న చాలా మెల్లగా చెప్పాడు.

    "అమ్మగారు చాలా 'కాక' మీదున్నారు బాబూ! ఇలాంటప్పుడు పలకరిస్తే కొరడా దెబ్బలు తప్పవు."

    పరుశురాం అతన్ని ఎగాదిగా చూశాడు.

    "అంత భయపడుతున్నావు. నువ్వెప్పుడన్నా రుచి చూశావా?"

    రంగన్న నవ్వాడు.

    "ఆ విషయంలో అమ్మగార్కి తరతమ భేదం లేదు బాబూ! ఇక్కడ నౌఖర్లకే కాదు బాబూ! మీలా యింటికొచ్చిన అతిధులు కూడా కొందరు అమ్మగారి చేతివాటం రుచిచూసిన వాళ్ళే! ఆ తల్లికి ఎంత కోపమో హృదయం అంత చల్లన బాబూ!"

    "పరుశురాం మాట్లాడలేదు. ఇప్పటివరకు తను ఆమె ఆదరణనే చూశాడు. రంగన్న చెప్పినట్లు ఆమె తనని కూడా బాదుతుందా? లాక్కుని తిరిగి కొట్టగలడు! కానీ, ఇంతవరకు ఆదరించి అన్నం పెట్టిన ఆమె విషయంలో రెండు దెబ్బలు తిని వెళ్ళిపోతాడే తప్ప ఆమెను ఎదురుతిరిగి అందుల ఓ ఆడదాన్ని కొట్టడం....ఛ...."

    పేకముక్కల్ని జేబులో పెట్టుకొని డైనింగ్ హాల్లోకి నడిచాడు పరుశురాం.

    రంగన్న వడ్డన చేసి చేతులు కట్టుకుని నించున్నాడు. భోజనం అయిందనిపించుకుని గెస్ట్ రూమ్ లోకి నడిచాడు పరుశురాం.

    డ్రెస్ మార్చుకొని మంచంమీద వాలిపోయాడు.

    కిటికీలోంచి చల్లని గాలి మత్తుగొలిపే సంపెంగి సువాసనల్ని తోడుగా తీసుకొచ్చి అతని ఒంటిని తాకుతోంది.

    కానీ, రెస్ట్ లెస్ గా ఫీలౌతున్న పరుశురాంకి ఆ వాతావరణం ఉల్లాసాన్ని కలిగించడం లేదు. ఏదో దిగులు.

    ఆమె అంత డబ్బు ఓడినందుకు అతనికి ఎంతో బాధగా వుంది.

    ఆమె తన గదిలోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడతను.

    ఆమెతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలో నిర్ధారణగా అతనికే తెలీదు. కానీ ఆమె రావాలి, తను మాట్లాడాలి ఇది అతను కోరుకుంటున్నాడు.

    సిగరెట్ పైన సిగరెట్ కాలుస్తూ గంటపైగా ఎదురు చూశాడు.

    గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టింది.

    ఆమె రాలేదు.

    ఏదో తెలీని బాధ అతని గుండెని మల్లుతో పొడుస్తోంది.

    అసలామె ఎవరు?

    తనని ఎందుకింతగా ఆదరించింది?

    ఆదరించడంలో గల ఆంతర్యం ఏమై వుంటుంది? మళ్ళీ ప్రశ్నలు.

    ఆమె ఎదురుపడే సరికి ఏమీ అడగలేడు. అసలామెకి తన అవసరమేమిటో అర్ధం కావడంలేదు.

    తనకోసం డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తోంది. తననుంచి ఆమె ఆశిస్తున్నదేమిటి?

    అతనికి చెయ్యిచ్చింది!

    అసలు తన దగ్గర ఏమన్నా వుంటే ఆశించడంలో అర్ధం వుంది.

    తనే ఓ అనామకుడిలా తిరుగుతున్నాడు.

    సిగరెట్ పొగ పీలుస్తుంటే నాలుక చేదుగా అనిపిస్తోంది పెదవులు మండుతున్నాయి. తల గిర్రుగిర్రున తిరుగుతోంది.

    చేతిలో సిగరెట్ సగం కూడా కాల్చకుండానే ఏష్ ట్రేలో కుక్కేశాడు.

    చల్లని చిరుగాలి వీస్తున్నా అతని మొహాన చిరు చెమటలు పోస్తున్నాయి.

    తోటలోకొచ్చి ఆ భవనంకేసి చూశాడు. దీపాలు ఆర్పేసి ఉన్నాయి.

    దాంతో నిర్ధారించుకున్నాడు. ఆ పూట నందిని ఇక రాదని.

    కాసేపు తోటలో తిరిగి ఓ సిమెంట్ బల్లపైన కూర్చున్నాడు.

    ఆలోచనలతో అతని బుర్ర పగిలిపోతోంది. చిక్కు ముడులు పడి పోయిన తన సమస్యలు ఎప్పటికి విడిపోతాయి?

    'అనూష'ని తన చేరుకోగలిగేదెప్పుడు?

    అనూష!

    తన ప్రాణం, గుండె కాయ.

    అతని పెదవులపైన విషాదమైన చిరునవ్వొకటి కదిలిపోయింది.

    అంత కఠినమైన శిక్ష. అనూషను విడిచి అతనేనాడు ఊహించలేదు. సంవత్సరంపాటు కలుసుకోకూడదని షరతు పెట్టింది అనూష.

    "రామ్! నీమీద నమ్మకం పోయిందని నేను అనడంలేదు. నాలో, నా ప్రేమలో ఏదో లోపం వుంది. అందుకే యిలా జరిగి వుండాలి. దయ చేసి మనం.... మనం.... ఇక కలుసుకోవద్దు రామ్!"

 Previous Page Next Page