Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 17


    "సార్! అదీ! అక్కడ ఎనుగుబొమ్మ కత్తిరించాలి. తొండం పైకి లేచినట్లు షేప్ రావాలంటే క్రోటన్స్ మరి కొంచెం ఎత్తు పెరగాలి సార్!"
    'అదీ ప్రాబ్లం! అందుకే పెంచుతున్నాం" అంటూ సంజాయిషీ యిచ్చాడు. గ్రీన్ వరల్డ్ నర్సరీ యజమాని!
    "అవునయ్యా! మీరు అందుకే పెంచుతున్నారు. ఆ సంగతి మాకు ఎలా తెలియాలి? అమ్మాయి చూస్తే ఊరుకుంటుందా?"
    "అమ్మయిగారే పెంచామన్నారండి! వారి బెడ్ రూం అద్దాల వెనుక స్క్రీను తీయగానే ఇక్కడ క్రోటన్స్ లో ఏనుగు బొమ్మ కన్పించాలట! అదీ వారి కోరిక" అంటూ వివరించాడు నర్సరీ యజమాని.
    "మరి ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? అమ్మాయి యిచ్చిన ఆర్డర్ అన్నమాట! అయితే పెంచండి. బాగా పెంచండి.
    ఇదిగో! ఏనుగు షేపు చాలా అందంగా రావాలి. లేకపోతే బేబీ కోప్పడుతుంది. ఆ తరువాత నీ కాంట్రాక్టు డబ్బు కూడ రాదు" అంటూ తిరిగి కారులో కూర్చున్నాడు ధర్మాజీరావు.
    బయట ప్రపంచంలో పులి. ఇంటికి రాగానే పిల్లి అయిపోతాడు.
అలాగే సార్! అమ్మాయిగారు మెచ్చుకునేలా షేప్ తీయిస్తాను. గార్డెన్ ఆర్ట్ లో ప్రత్యెక తర్ఫీదు పొందిన నిపుణుడు బొంబాయిలో ఉన్నాడు. అతన్ని రప్పించి ఈ పని చేయిస్తాను" అన్నాడు నర్సరీ .
    "దట్స్ గుడ్!" కారు కదిలింది. పోర్టికోలో అటెండర్ ఎదురు చూస్తున్నాడు. కారు ఆగగానే సెల్యూట్ కొట్టి తలుపు తీసాడు.
    క్రిందికి దిగగానే అయన అడిగే మొదటి ప్రశ్న ఏమిటో ఆ యింటిలో అందరు పనివాళ్ళకూ తెలుసు. సమాధానం ఇచ్చేందుకు పని మనిషి సిద్దంగా ఉంది. ఆ ప్రశ్న రానే వచ్చింది.
    "అమ్మాయి ఏం చేస్తున్నారు?"
    "పైన గదిలో ఉన్నారయ్యా!"
    "భోజనం చేశారా?"
    "ఇంకా లేదయ్యా! గదిలోంచి బయటికి రాలేదు. పిలిచేందుకు పొతే ఖస్సుమాన్నారు. నాకు భయంగా ఉందయ్యా!"
    ఈ సమాధానం విని ధర్మాజీరావు చాలా సంతోషించాడు. తానే కాదు ఆ యింటిలోనే కాదు మొత్తం ప్రపంచంలో అందరూ అమ్మాయి గారంటే అంత భయపడుతూ ఉండాలని కోరిక.
    "నేను వచ్చానని చెప్పు. పో! అయన వచ్చి హాలులో కూర్చున్నారు. లక్షా పాతిక వేలకు కొన్న షాండిలియర్ పైన వ్రేలాడుతోంది. క్రింద సోఫాలున్నాయి. ఓ సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి పైకి చూచాడు.
    షాండిలియర్ కన్పించింది. స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు బేబీ మోజుపడి తెచ్చుకుంది. క్రిష్టల్ షాండిలియర్!
    వెండితీగలకు బంగారు పూత.
    దానిలో ఒక్క దీపం వెలిగితే హాలంతా మిరుమిట్లు గొలుపుతుంది. అలాంటి దీపాలు అయిదున్నాయి.
    పనిమనిషి తిరిగి వచ్చింది. బిక్క మొఖంలో ఉంది.
    "బేబీ దిగి వస్తున్నారా?"
    "లేదండి. రామంటున్నారండి"
    "ఎందుకు, ఏమయిందిప్పుడు?"
    "ఏమోనండి, చాల కోపంగా ఉన్నారండి ."
    ధర్మాజీరావు గారికి ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. నేలమీద నడవగలరు. మెట్లు ఎక్కటం భాధాకరం.
    అయినా లెక్క చేయకుండా వంటవాడిని పిలిచి వాడి భుజం మీద భారం వేసి మెట్లు ఎక్కడానికి సాహసించారాయన. పైకి చేరుకునేసరికి వంటవాడు ఆయాసంతో రొప్పుతున్నాడు.
    ప్రియాంక బెడ్ రూమ్ వైపు సాగిపోయాడు ధర్మాజీరావు. లోపల దీపాలు లేవు. ఏ.సీ. అన్ చెయ్యలేదు. ఫ్యాన్ తిరగటల్లేదు. కనీసం గ్లాస్ డోర్స్ అయినా తెరిచిలేవు.
    చాలా కోపంగా పడుకుని ఉంది ప్రయాంక. గాలి సరీగ్గా తగలక పోవటంతో ఆమె చెంప మీద రెండు చెమట చుక్కలు కన్పించాయి.  
    అవి చూచి తల్లడిల్లి పోయాడు ధర్మాజీరావు.
    అద్దం మీద నిలిచిన నీటి బిందువుల్లా తామర పువ్వుమీద ఆశిన వర్షపు చుక్కలా వున్న ఆ చెమారు చుక్కల్ని పై కండువాతో అద్ది ఆమెకు స్పృహ కలిగించారు.
    "బేబీ! ఎందుకు తల్లీ యింత కోపం."
    "నేను మీతో మాట్లాడ దలుచుకోలేదు.
    "ఏమిటమ్మా . నేను చేసిన అపరాధం? క్షమించరానిదా?"
    "తప్పు మీది కాదు. నాదే తప్పు"
    "ఎందుకు యివాళ ఫైర్ అవుతున్నావు? ఏం కావాలి?"
    "నేను అడిగింది యిస్తారనుకోవటం నాదే పొరపాటు."
    "బేబీ, నువ్వు అడిగింది ఏదైనా సరే యిస్తాను. హెలికాప్టర్ కావాలా?"
    "ఎందుకు ? దాన్లోంచి దూకి చావటానికా?" విసురుగా అంది ప్రియాంక.
    ధర్మాజీరావు ఆ మాట విని తల్లడిల్లిపోయాడు. కనులవెంట నీరు చిమ్మినాయి. ముఖం ఎర్రగా అయిపొయింది.
    "బేబీ ఎంత మాటన్నావమ్మా. కలువరేకుల్లాంటి నీ అరికాల్లో ముల్లు గుచ్చుకుంటే నా గుండెల్లో గునపం దిగినట్లుగా భావించుకున్నాను. నువ్వు ఒక్క చుక్క కన్నీరు కారిస్తే నా సంపదలన్నీ సముద్రంలో కలిసిపోయినట్లుగా తల్లడిల్లిపోయాను.
    ఇంక నేను చచ్చిపోతాను అంటే నేను విని తట్టుకోగలనా? ఆ మరుక్షణం నేను కూడా చచ్చిపోనూ? అంతమాట ఎండుకన్నావు తల్లీ.
    ఏం కావాలి నీకు? ఎప్పుడు నువ్వేది అడిగినా నేను లేదు అనలేదు ఎందుకో తెలుసా?
    లేదు అనేమాట నువ్వు వినకూడదు. ఇదే నా కోరిక. పేదరికం అంటే ఏమిటో చాల ఘోరంగా రుచిచూసిన వాణ్ణి. మొట్టమొదటిసారి ఓ చిన్న వ్యాపారం అని బయల్దేరుతుంటే తడబడే అడుగులతో నువ్వు ఎదురోచ్చావు? కలిసొచ్చింది, యింత వాళ్ళమయ్యాం.
    యిప్పటికీ నేను దేవతలకి మ్రొక్కను ఎక్కడికి బయల్దేరినా నువ్వే ఎదురు రావాలనుకుంటాను.
    తిరిగి వచ్చేసరికి నాకోసం నువ్వే ఎదురుచూస్తూ కూర్చోవాలను కుంటాను. ఈ సంపదలన్నీ నీ అదృష్టమే!
    నువ్వు పుట్టక ముందు నేను బికారిని. నువ్వు పుట్టాక కోట్లకి అధిపతిని! ఏం కావాలో చెప్పు!
    నా చర్మాన్ని ఒలిచి నేల మీద పరిచి దాని మీదగా నిన్ను నడిపించమంటావా! చెప్పు! అలాగే చేస్తాను"
    "సారీ డాడీ! నాది చిన్న కోరిక! మీరు కన్నీరు పెట్టొద్దు. అంటూ పసిబిడ్డలా తండ్రి మెడను కౌగలించుకొని భుజం మీద కండువాతో అయన  కన్నీరు తుడిచి తన కన్నీరు తుడుచుకుంది ప్రియాంక!!

    
                                 8


    "హాయ్! జయా! రాత్రి నిద్రపోలేదా?"
    "పోనివ్వలేదు . రక్తం తినిపిస్తూ కూర్చున్నాను."
    "ఈజిట్? ఎవరికి?"
    "మున్సీపాలిటీ రధాలకి" ఎర్రగా అయిపోయిన చేతుల వంక చూసుకున్నాడు. ముఖం మీద మెడ మీద గాట్లు కన్పిస్తున్నాయి ఎర్రగా కందిపోయి.
    "ఇవన్నీ ఏమిటీ?"
    "ముద్దెట్టుకున్నాయి. తెల్లార్లూ అదేపని ?"
    "ఈ విద్యలు కూడా నీకోచ్చా? అమాయకుడివేం కాదు"
    "నాకు రాదు. వాటికేవచ్చు"
    "ఏమిటవి?"
    "దోమలు-----!"
    "మస్కిటోస్ !?" దోమతెర వాడవూ?" తొందరపడి అడిగినందుకు తనే తప్పు తెలుసుకుంది . నాలుక కరుచుకుంది.
    జయసింహ తలదించుకున్నాడు. 

 Previous Page Next Page