ఆయన మిస్టర్ కుందన్ లాల్. సిటీలో వున్న ద్రాక్ష తోటలు, కోళ్ళ ఫారాలు ఎక్కువ సంఖ్యలో ఈయనవే. పోతే ఇతను శ్యామ్ లాల్. బంగారం వ్యాపారి" అని పరుశురామ్ కి పరిచయం చేసింది నందిని.
"ఏ బచ్చా కౌన్ హై?" అడిగాడు వజీద్ ఖాన్.
"రాధకి కృష్ణుడు వంటివాడు. అంటే చాలా కావలసినవాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను."
వాళ్ళు ముగ్గురూ ఆమె మాటలకి పడీ పడీ నవ్వారు.
"ఆట మొదలు పెడదామా?" అడిగాడు వజీద్ ఖాన్.
"ష్యూర్ నా బదులు మా పరుశురామ్ ఆడతాడు" అంది.
ఆ మాటలు విని పరుశురామ్ చివాల్న తలెత్తి చూశాడు.
"నేను ఆడను" అన్నాడు నిష్కర్షగా.
నందిని అతని మాటలకి విస్మయంగా చూసింది.
"అదేం? పేకాట నీకిష్టమేగా?" అంది.
"అఫ్ కోర్స్ కానీ నాకిష్టంలేని పనిని నాచేత చేయించడానికి మాత్రం ప్రయత్నించనని నాకు మాట ఇచ్చావు."
"నీకిది ఇష్టంలేని 'పని' అని నేను ఊహించలేదు."
"ఇప్పుడు చెప్తున్నాను కదా!"
"నా కోసం ఆడచ్చుకదా!" అతని భుజంపైన చేత్తో మృదువుగా నొక్కిందామె.
"ఇతరుల కోసం నేనెప్పుడూ జూదం ఆడలేదు!" మొండిగా సమాధానం ఇచ్చాడు.
"అదేం మేడం, ఆ బచ్చా మనతో ఆడి గెలవగలడనేనా?" పరిహాసంగా అన్నాడు ఖాన్ సాబ్
"గెలుస్తాడూ, గెలవడని కాదు ఖాన్ సాబ్. నాకు నమ్మకం వున్న వ్యక్తి ఈ రామ్. ఇతనితోనే ఇకముందు నా తరపు గాంబ్లింగ్ చేయించాలనుకున్నాను. నష్టంలేదు. అతనికిష్టం లేదంటున్నాడుగా. ఓకే లెటజ్ కేరీ ఆన్" అంది.
ఆ గదిలోకి ఆమె అనుచరుడు రాబర్ట్, అతని మనుషులతో వచ్చి గుమ్మం దగ్గిర నిలబడ్డాడు.
ఏదైనా మోసం జరిగినా, గొడవ జరిగినా ఆమెకి రక్షణ కల్పించడానికి వాళ్ళు వచ్చారని పరుశురామ్ గమనించాడు.
నలుగురి మధ్ ఆట మొదలైంది. ఖాన్ సాబ్ ముక్కలు పంచాడు.
కుందన్ లాల్ శ్యామ్ లాల్ డ్రాప్ అయ్యారు. నందిని బ్లెయిండ్ పదివేలు వేసింది.
ఖాన్ సాబ్ పదివేలు వేశాడు.
నందిని ముక్కలు ఎత్తి చూసింది. కలత పడింది. అది చూసి మరో ఇరవైవేలు బెట్ చేసింది.
ఖాన్ సాబ్ మూడు ఆసులు తిప్పాడు.
నందిని ఓటమిని చూసి గతుక్కుమన్నాడు రామ్.
ముక్కలు పంచుతున్నప్పుడే నందినికి ఆట పడ్డంలేదని పరుశురాం గ్రహిస్తున్నాడు. కానీ మాట్లాడ్డానికి వీల్లేదు.
నందిని చాలా రాష్ గా ఆడి డబ్బు పోగొడుతోంది.
"ఈ రోజు గెలుపు మొత్తం నాదే మేడం!" అంటున్నాడు ఖాన్ సాబ్.
కుందన్ లాల్, శ్యామ్ లాల్ చాలా జాగ్రత్తగా, బ్యాలన్స్ డ్ గా ఆడుతున్నారు.
"ఇక వెళ్ళిపోదాం" అన్నాడు పరుశురామ్ మెల్లగా.
"నధింగ్" అంటూ బ్లెయిండ్ పాతికవేలు వేసింది.
కుందన్ లాల్ మూడు రాజులు చూపించాడు. నందిని మూడు జాకీలు....
ఆమె మళ్ళీ ఓడిపోయింది.
ఒక్క ఆటకూడా గెలవలేదు.
ఆమె రెండు మూడు లక్షలు గెలుస్తానని ప్రగల్భాలు పలికింది. ఆమె బ్యాగ్ ఖాళీ అయిపోయింది.
పరుశురాం ఉక్రోషంతో జేబులోంచి పేకని తీసి నాలుగు వేళ్ళతో పేకని నొక్కి బొటనవేలితో విరిచాడు.
అదిచూసి ఖాన్ సాబ్ హేళనగా నవ్వాడు.
"భలే మేడం. పోలీస్ పేకతో ఆడుకునేవాడితో మాతో ఆడించాలనుకున్నారా?"
ఆ మాటలకి పరుశురాం మొహం ఎర్రబడింది.
ఉద్రేకాన్ని అణచుకుంటూ అదే చేతిని గట్టిగా నొక్కి విడిచిపెట్టాడు.
రెండే రెండు గంటల్లో రెండు లక్షలు పోగొట్టుకుంది నందిని. ఐనా ఆమె మొహంలో విచారంగానీ, ఆందోళనగానీ కనిపించలేదు.
ఆమె లేచి నించుంది.
"అదే మేడం! అప్పుడే వెళ్ళిపోతున్నారా?"
"తెచ్చిన సొమ్ము అయిపోయింది" చిరునవ్వుతో అందామె.
"మీమీద నమ్మకం వుంది. డబ్బుదేం వుంది ఆడండి" కుందన్ లాల్ ఉత్సాహంతో పరిచాడు.
"సొమ్ములేకుండా ఆడ్డం నాకు అలవాటులేదు" అని విసవిస బయటికి నడుస్తుంటే పిల్లిలా ఆమెను అనుసరించాడు పరుశురాం.
రాబర్ట్ తన అనుచరులకి సైగచేసి బయటికి నడిచాడు.
నందినితో బయటికి వస్తున్న పరుశురాంని ట్రాన్స్ పరెంట్ శారీలో లోపలికి వస్తూ భుజంతో డాష్ కొట్టి- "సో సారీ" అంటూ కన్ను గీటింది ప్రమీల.
5
తన మీద మేడంకి చాలా కోపం వచ్చిందని పరుశురాంకి తెలుసు. అందుకే దరిలో ఆమెను మాట్లాడించలేదతను.
పోర్టికోలో కారాపి దిగి, విసవిస నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది నందిని.