"తిన్నపూట తింటాడు. లేని పూట లేదు. నాతొ అయినా చెప్పడు తల్లీ! తల్లిలా బ్రతిమాలి బామాలి తినిపించాలి!
ఎలా బ్రతుకుతాడో ఈ పిచ్చి తండ్రి!
ఎనబై ఎనిమిదివేలకు యిల్లమ్మి రెండు పూటల భోజనానికయినా ఉంచుకోకుండా ఎవరికో అర్పించాడు , పిచ్చి మారాజు"
అతని వెనుక ఏదో అద్బుత చరిత్ర ఉందని ఊహించింది ప్రియాంక.
తన భోజనం గురించి ఆలోచించని మనిషి ఎంత ఉన్నతుడు??
ఎంత నిస్వార్ధపరుడు! ఎంత గొప్పవాడు.
ఆమె కంటి వాకిట దీపాలు వెలిగాయి. మనసులో ముత్యాల ముగ్గులు అల్లుకున్నాయి. గుండెల్లో రాగరంజితాలైన రాజీవ పత్రాలు విచ్చుకున్నాయి! ముఖంలో మందారాలు విరిసాయి.
"వాట్ గ్రేట్ మాన్ హి ఈజ్!" అనుకుంది.
ఇంక యిప్పుడు ఎవరూ ఏమీ చెప్పనక్కరలేదు. ఆమెకు అంతా అర్ధమయిపోతోంది. జయసింహ గొప్పవాడు, మహానుభావుడు!
పేదరికమనే మబ్బులు చాటున ఉన్న సూర్యుడు. దాన్ని తొలగిస్తే అతని గొప్పతనం ప్రపంచానికి కన్పిస్తుంది. అంతటి మనిషి ఇలా యిల్లు లేకుండా కనీసం వేళకు తిండి అయినా లేకుండా పడి వున్నాడు.
"బాబూగారూ! అయిదు రోజులుగా ఎక్కడికి పోయారు!"
"అత్తారింటికి పోయాను. చాల మంచి మర్యాదలు చేశారు" ఈ మాటలు అర్ధం కానట్టుగా చూచాడు పానకాలసామీ!
'అయిదు రోజుల క్రితం లాటరీలో పది లక్షలు వచ్చాయంటూ వెళ్ళిపోయాడమ్మా! పోన్లే ఈ బాబు కష్టాలు తీరిపోతాయి కదా అనుకున్నాను. మళ్ళీ యివాళ యిలా కన్పిస్తున్నాడు.
ఇదంతా చూస్తె నా కేమితో భయంగా ఉంది అన్నాడు.
ప్రియాంక అందంగా నవ్వింది!
'అంతేలే పెద్దయ్యా! గొప్ప వాళ్ళ పనులు మనలాంటి వాళ్ళకు అర్ధం కావు" అంది. "అవునూ! జయా! ఎందుకిలా జరిగింది. అసలు ఈ లాటరీ టికెట్ గొడవ ఏమిటి?" అని అడిగిందామె ఆసక్తిగా.
ఆ జ్ఞాపకాలు రాగానే జయసింహ ముఖం నల్లగా అయిపొయింది. అతని చూపులు ఎక్కడో శూన్యంలో గ్రుచ్చుకుంటున్నాయి.
డైరీ తీసి తాను లాటరీ టికెట్ కొన్న తేదీ , నంబర్ చూపించాడు ......
"ఆ నంబర్ ప్రయిజు వచ్చిందా!"
"అవును. ఫస్ట్ ప్రయిజ్! టెన్ లాక్స్"
"ఇదంతా నిజమే అయితే ఇంత పిచ్చివాడిలా కూర్చున్నావేం జయా!"
"టిక్కెట్ పోగొట్టుకున్నాను "
"అంత అజాగ్రత్తగా ఎందుకు దాచావు!"
"ఎస్.బి.ఐ బ్యాంక్ లాకర్ లో దాచాను "
"లాకర్ లో దాచావా! ఎలా పోయింది! హిజ్ ఇట్ పాసిబుల్!"
"స్ట్రాంగ్ రూం పేలిపోయింది. లాకర్లు పగిలాయి."
"రియల్లీ! వండర్! అలా జరగటం ఆసాధ్యమనుకుంటాను"
"కాని జరిగింది బాడ్ లక్!"
"మరిప్పుడెం చెయ్యాలి!"
"ఎలాగయినా ఆ టికెట్ సంపాదించాలి."
"సంపాదించలేవనుకో! అప్పుడేం చెయ్యాలి"
"టికెట్ ని ఇన్ ష్యూర్ చెయ్యలేదు కదా! నష్టాన్ని భరించాలి"
"బాంక్ లాకర్ ప్రేలిపోవటంలో మన తప్పు లేదు కదా! మేనేజ్ మెంట్ నష్ట పరిహారం యివ్వదా."
"లాకర్స్ విషయంలో అలాంటి ఏర్పాటు లేదు ఒకవేళ నష్ట పరిహారం యిచ్చినా ఆ మొత్తం నాకు చాలదు కదా!"
"నీకు ఎంత కావాలేమిటి."
"ఆరు లక్షలు పైగా కావాలి"
"అమ్మో! అంత మొత్తం ఒకేసారి ఏం చేసుకుంటావు."
"ఒక ప్రాణం కాపాడుకోవాలి"
"ఎవరి ప్రాణం." జాలిగా అడిగింది ప్రియాంక.
"ఆ ఒక్క ప్రశ్న కే నేను సమాధానం చెప్పలేను ప్రియాంకా!"
"అంత రహస్యమయిన విషయమా."
"నేనెవరికీ చెప్పకూడదు చెప్పలేను అంతే!"
"ఆ నంబర్ టికెట్ పొతే ఆ ప్రయిజ్ మొత్తం ఏం చేస్తారు"
"నిమమితమయిన కాలం ఎదురు చూస్తారు. ఆ తరువాత లాస్స్ అయిపొయింది. ఈ లోగా టికెట్ సంపాదించాలి."
అతని జీవితంలో ఉన్న ఆ రహస్యం ఏమిటా అని అలోచిస్తోండామే. ఈ డబ్బు కావాలని ఎదురు చూస్తోంది తన కోసం కాదు. మరొకరి కోసం అన్నమాట! ఎంత చిత్రమయిన మనిషి. అనుకుంది.
"జయా! ఇంకో మాట అడుగుతాను. దాచుకోకుండా చెప్తావా."
"నీ దగ్గర మనసు దాచుకోలేను"
"పోలీసు గొడవలో ఎందుకు చిక్కుకున్నావు."
"కోటిలింగం ఆ టికెట్ నాకు యిచ్చాడు. యిప్పుడేమీ తెలియదని బుకాయిస్తున్నాడు. జయసింహ కళ్ళు ఎరుపెక్కాయి.
"ఒక వేళ తెలుసు అంటాడనుకో! ఆ టికెట్ అమ్మింది నేనే అని ఒప్పుకుంటాడనుకో! అందువల్ల నీకేమిటి ప్రయోజనం. టికెట్ ప్రజంట్ చేయందే డబ్బు రాదు కదా!
ఆవేశంలో తొందర పడుతున్నావు జయా!
ఆలోచిద్దాం! విశ్రాంతి తీసుకో!" అందామె ఓదార్పుగా!
జయసింహ బెంచి మీద నడుం వాల్చాడు. కళ్ళు మూసుకున్నాడు.
"పెద్దయ్యా! జయాకి ఏం కావాలో చూడు" వాకేట్ లోంచి నూరు రూపాయల నోటు తీసి అందించిందామె!
పానకాల్సామి రెండు చేతులూ ఎత్తి దండం పెట్టాడు!
"ఆ బాబు నా కడుపున పుట్టిన బిడ్డలాంటోడు గుక్కెడు గంజికాచి పోసినందుకు డబ్బిచ్చుకుంటానా."
'ఆ పాపం నాకొద్దు తల్లీ!" అన్నాడు గద్గద స్వరంతో!
ప్రియాంక నెమ్మదిగా అక్కడినించి వెళ్ళిపోయింది.
* * *
రావణబ్రహ్మ పాలించే లంక లాగా విశాలంగా వుంది. ఆ భవనం చుట్టూ విశాలమయిన పూల తోట . అక్కడ కూడా పెద్ద వృక్షాలున్నాయి. రకరకాల పూల మొక్కలున్నాయి.
దాన్ని ఎంతో అందంగా, అపురూపంగా ఆరుదైనదిగా పెంచి పోషించేందుకు నర్సరీల వాళ్ళు పోటీలు పడుతున్నారు. తలకొక బ్లాక్ చొప్పున కాంట్రాక్టుకి తీసుకుని ప్రతిష్టాత్మకంగా పోటీ పడుతున్నాయి.
కారు అల్లంత దూరాన ఉండగానే ఘూర్కా మెయిన్ గేటు తెరిచాడు. కారు లోనికి పోతుండగా కొయ్యముక్కలా నిలబడి సెల్యూట్ కొట్టాడు.
కారు లాన్స్ మధ్యలో ఉన్న తారురోడ్ మీద యింటి చుట్టూ తిరిగి పోర్టికోలోకి వస్తోంది.
మధ్యలో ఒకచోట కారు నిలువు చేయించాడు ధర్మాజీరావు.
"ఈ బ్లాక్ కాంట్రాక్టు తీసుకుందేవరు? తోటలో పని చేస్తున్న ఒకరిని పిలిచి అడిగాడు కోపంగా.
"గ్రీన్ వరల్డ్ నర్సరీ వాళ్ళు తీసుకున్నారు."
"వెంటనే వాళ్ళని ఈ పని మానుకోమని చెప్పండి."
"ఎందుకు సార్! అయన ఇక్కడే ఉన్నారు"
"ఇలా రమ్మను. త్వరగా!' తోటమాలి వెళ్ళిపోయాడు......నర్శరీ యజమాని డిజైనర్ కి ఏదో చెపుతున్నాడు. ఈ వార్త అందుకుని పరుగున వచ్చాడు.
"ఇక్కడ పూలతోట పెంచుతున్నారా? అడవి పెంచుతున్నారా" చాల కోపంగా తీవ్రమయిన స్వరంతో అడిగాడు ధర్మాజీరావు.
"సార్! గార్డెన్ డిజయినింగ్ లో మా నర్సరీ కి మంచి పేరుంది. ఏమయిందిప్పుడు . ఏదయినా పొరపాటు జరిగిందా?"
"క్రోటన్స్ అలా పిచ్చిగా పెరిగి పొయిందేమిటి? కత్తిరించుకోవటము మీ పని కాదా? ఈ గార్డెన్ కోసం ఎంత తగలేస్తున్నానో తెలుసా?"