Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 15


    "ఓకే. ఇంతసేపు మాటల్లో పడి వచ్చిన పని మర్చిపోయాను. పద లోపలికి వెళదాం....!" అతని చేతిని పట్టుకొని ముందుకు నడుస్తూ అంది నందిని.

    ఆమెతో పాటుగా విశాలమైన హాలులో అడుగు పెట్టాడతను.

    లోపల వాతావరణం కళ్ళు జిగేల్ మనిపించేలా వుంది.

    అందమైన దీపాలు, ఖరీదయిన ఫర్నిచర్, సూటు, బూటు ధరించిన దొరబాబులు.... సీతాకోకచిలుకల్లా అందమైన అమ్మాయిలు.

    ఒకచోట పెద్ద చక్రం తిరుగుతోంది. దానికి పలురకాల రంగులు వున్నాయి. ఆ రంగు గళ్ళల్లో డబ్బుపెట్టి జూదం ఆడుతున్నారు. ఏ రంగు పైన సొమ్ము వేస్తే ఆ రంగు పాయింటర్ దగ్గర చక్రం ఆగాలి. అక్కడ హుషారుగా కేరింతలు అరుపులు వినబడుతున్నాయి.

    లోపల్నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తోంది. పరుశురాం లోపలికి తొంగి చూశాడు. ఇద్దరమ్మాయిలు అర్ధనగ్నంగా పోటీపడి డాన్స్ చేస్తున్నారు.

    అతని కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించింది.

    "ఇక్కడ సర్కస్ చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది రామ్. యిక్కడ ఎన్నో రకాల జూదాలు జరుగుతాయి, అంతా డబ్బే! ఎవరి అభిరుచి మీద వాళ్ళు ఆ ఆట ఆడతారు. నేను మాత్రం డంకాపలాస్ ఆడతాను" అంది.

    "డంకాపలాస్!" అనే మాట వినగానే చురుగ్గా ఆమె కేసి చూశాడు.

    ఆమె 'ఔను' అన్నట్లుగా కళ్ళతో నవ్వుతూ తలను కిందికి ఆడించింది.

    "అది చాలా ప్రమాదకరమైన ఆట మేడం"

    అతని మాటలకు విచిత్రంగా చూసింది నందిని.

    "సో వాట్?"

    సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు-

    "నువ్వు హాబీ కోసం ఆడుతున్నావా లేక డబ్బుకోసం ఆడుతున్నావా?"

    "యూ ఆర్ ఎ మాడ్ మాన్! నేను హాబీ కోసం జూదం ఆడను. డబ్బుకోసమే ఆడతాను. యిది నా ప్రొఫెషన్" అందామె.
    ఆమె ఓ టేబుల్ దగ్గరకు నడిచింది. విశాలంగా ఉన్న ఆ గదిలో పది టేబుల్స్ వున్నాయి. అరడజను టేబుల్స్ దగ్గర మెంబర్లు సీరియస్ గా ఆడుకుంటున్నారు.

    టేబుళ్ళ మీద కరెన్సీ నోట్లు కుప్పలు....

    ఆడా....మగా....పెద్దా....చిన్నా.... తారతమ్యం లేకుండా అక్కడ కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

    ఆమె పక్కనే కూర్చున్నాడు రామ్. అతనా వాతావరణానికి అలవాటు పడ్డానికి ప్రయత్నిస్తున్నాడు.

    గొప్ప గొప్ప మనుషులతో పాటు రౌడీ షీటర్స్ కూడా అక్కడ సమానంగా, చురుగ్గా పాల్గొంటున్నారు.

    "బార్ కేబిన్ దగ్గర నుంచున్నాడు చూడు వాడే ఈ క్లబ్ ఓనర్ కొడుకు మదన్. పేరుకు తగ్గట్టే మదంతో కొట్టుకు చస్తుంటాడు...." అంది నందిని.

    పరుశురాం మెల్లగా తలతిప్పి చూశాడు.

    అతను ఆకలిగొన్న పులిలా వున్నాడు. అతని కళ్ళు లోతుగా వుండి చూడగానే చెడు అభిప్రాయం కలిగేలా వున్నాడు.

    అంతలో చుడీదార్ వేసుకున్న అమ్మాయి అతని పక్కకి వచ్చింది.

    "హాయ్ డాలీ!" అన్నాడు మదన్. ఆ అమ్మాయి అతనికేసి రుసరుస చూస్తూ ముందుకు వెళ్ళబోయింది.

    ఆమెని రెండు చేతులతో ఎత్తుకుని "ఇవాళ నా నుంచి తప్పించుకోలేవు డాలీ డియర్" అంటున్నాడు మదన్.

    "యూ....లీవ్ మీ...." అని అతని గుండెల మీద రెండు చేతులతో కొడుతోంది డాలీ.

    అతను నవ్వుతూ లోపలికి ఎత్తుకెళుతుంటే చేతులనీ, కాళ్ళనీ తపతప కొడుతోంది డాలీ.... అతడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ.

    పరుశురాం లేవబోయాడు.

    నందిని కళ్ళతో వారిస్తూ అంది-

    "కూర్చో రామ్! నువ్వు హీరోలా ఇక్కడ ఏమీ కష్టపడనవసరం లేదు. ఆమె క్లబ్బులో డాన్సర్. అతను ఓనర్. వాళ్ళ మధ్య ఏం వుందో మనకి తెలీదు."

    "అయితే! ఆమెకిష్టంలేని పని అతను ఎందుకు చేయాలి" కోపంగా అన్నాడు.

    "పని జరిగిందో లేదో మనకి తెలీదు. అది మనకి అనవసరం. ఇక్కడ అన్ని విషయాల్లోనూ మన ప్రమేయం వుండకూడదు. మదన్ చాలా చెడ్డవాడు" అంది నందిని.

    అతను మొహం చిన్నబుచ్చుకునేసరికి నందిని అనునయంగా అంది.

    "ఇప్పటికే ప్రమీలతో గొడవ పడ్డావు. వచ్చిన రోజునే నిన్నందరూ రౌడీషీటర్ కింద జమకడితే నాకు బాధగా వుండదా? ఈ వేళ నేను కనీసం రెండు మూడు లక్షలు గెలవాలని వచ్చాను!" అంది.

    "ఏమిటి? రెండు మూడు లక్షలా?" అవేమన్నా చింతపిక్కలా అన్నట్టు చూశాడు.

    "లక్షలే. రూపాయలు. అంటే కరెన్సీ.... కరెన్సీని నేను చాలా ప్రేమిస్తాను రామ్."

    "కరెన్సీని ప్రేమించని వాళ్ళెవరూ వుండరు!" పరుశురామ్ అన్నాడు ముక్తసరిగా.

    ముగ్గురు వ్యక్తులు ఆమె ముందుకి వచ్చి నుంచుని.

    "గుడ్ మార్నింగ్ మేడమ్!" అన్నారు.

    నందిని తలెత్తి చూసి-

    "ఓహ్, ఖాన్ సాబ్ వెరీగుడ్. ఇవాళ నాకు సరైన కంపెనీ దొరుకుతుందో లేదోననుకుంటున్నానింతసేపు!" అంది.

    ఖాన్ సాబ్ చిరునవ్వుతో ఆమె ఎదురుగా కూర్చున్నాడు.

    "మనం కల్సి ఆడి చాలా దినాలైంది మేడం" అన్నాడు.

    "ఈయన వజీర్ ఖాన్. బడా బిజినెస్ మాన్.

 Previous Page Next Page