"ఏజన్సీ వాళ్ళ మీద తగువు పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా చాల టికెట్స్ పోయాయి. అరెస్టు చేశాం."
అయన చెప్తూ ఉండగానే జయసింహని వెంట బెట్టుకోచ్చాడు పి సి.
"మీరా? యా?ఈజిట్ ట్రూ! సార్ ఈయన నిర్దోషి" లేచి నిలబడింది.
'చూడగానే ఎలా చెబుతున్నారు."
"నేరాలు చేసేవాళ్ళు యిలా ఎందుకుంటారు సార్!"
"క్రిమినల్స్ గురించి నాకే చెపుతున్నావా? వచ్చిన పని చూసుకో!"
"జామీను యిస్తాను! వీరిని వదిలెయ్యండి."
"ఇతను మీకు తెలుసా?"
"తెలుసు! చాలా దగ్గర బంధువు?"
"మీరెవరు?"
"ధర్మాజీరావు గారి డాటర్ని."
"మరి చెప్పరేం! నమస్కారం. మీ నాన్నగారంటే మాకెంతో గౌరవం."
"మా డాడీ మీకు తెలుసా?"
"తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు."
"అయితే వీరిని విడిచి పెట్టండి."
"విడిచి పెట్టటానికి ఓ పద్దతుందమ్మా! ఆ ప్రకారం చేయండి" అంటూ వివరాలు యిచ్చాడు ఎస్.ఐ.
వెంటనే రంగంలోకి దిగిపోయింది ప్రియాంక. మాగ్జయిన్ లో యింటర్వ్యూ మాట అసలు మర్చేపోయింది!!
7
"మీరు మళ్ళీ కన్పిస్తారని నేను అనుకోలేదు. ఒకవేళ కన్పించినా యిలా ఈ స్థితిలో కన్పిస్తారని ఊహించలేదు.
"నేనూ మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు. నేను సర్కిల్ ని అని దియేటర్ మేనేజర్ కి పరిచయం చేశారు."
అందుకే జైలు గోడల మధ్య కలుసుకున్నాం.
నాకెందుకింత సాయం చేశారు. అయిదు రోజులు! నన్ను తినేశారు! నాకు సాయం చెయ్యాలని మీకెందుకు అన్పించింది?"
"చెప్పాను కదండీ! ఎవరైనా కష్టాల్లో ఉంటే నాకు కన్నీళ్ళోస్తాయి"
"సినిమా కష్టాలకే అనుకున్నాను. నిజం కష్టాలకి కూడా అంతేనా?"
"అంతేనండి! అదేమిటో నా వీక్ నేస్! మీ అడ్రస్ చెప్పండి డ్రాప్ చేస్తాను" అంది ప్రియాంక ఆప్యాయంగా!
"నోబుల్ పార్క్!" అన్నాడు జయసింహ!
"చాలా రిచ్ ఏరియాలో ఉంటున్నారే!" అంటూ ఆ వైపుగా కారుని పరుగు తీయించింది ప్రియాంక!
"అవును. అక్కడే ఉంటున్నాను. మీ డాడీ కోటీశ్వరుడని విన్నాను. నిజమేనా? అంత గొప్పవారు నా కోసం ఎందుకొచ్చారు?"
"నేను కావాలంటే డాడీ ఏమయినా చేస్తారు. మీకేందరు పిల్లలు?"
"నా కింకా పెళ్ళి కాలేదు."
"ముదిరిపోతున్నారండీ బాబూ! త్వరగా చేసుకోండి. దేశంలో చాలామంది ఆడపిల్లలు అలాగే ఉండిపోతున్నారు. ఏ ఒక్కరికి అయినా విముక్తి కలిగించండి" అన్నది ప్రియాంక నవ్వుతోంది.
అరమరికలు లేని ఆమె మాటలు, నిర్మలమయిన ఆమె వ్యక్తిత్వం కష్టాల్లో ఉన్న వారికి సాయపదాలన్న ఆమె ఉబలాటం అతని గుండెల్ని తాకాయి. ఇలాంటి వాళ్ళు ఎందరుంటారు?
"ఇదే నోబుల్ పార్క్! ఆపండి దిగిపోతాను"
"అదేమిటీ! ఇంత సాయం చేశానంటూన్నారు కదా! నన్ను మీ యింటికి పిలవరా! పోనీ యిల్లు చూపించండి. వీలు చిక్కినప్పుడు నేనే వస్తాను." అందామె.
"అదే మా యిల్లు!" పార్కు వంక చూపించాడు.
"అయితే తప్పక చూడాలి. ఎంత పెద్ద గార్డెన్." కారుని రోడ్డు ప్రక్కన ఆపి దిగి వచ్చిందామే.
"ఆది మా యింటి ముందున్న తోట కాదు. అదే నోబుల్ పార్క్-----!"
"ఈ దగ్గరలోనే ఉందా మీ ఇల్లు!" జయసింహ బదులు చెప్పలేదు.
"ఇంటికి వెళ్ళేముందు కాస్సేపు పార్కులో కూర్చుంటారా! చాల మంచి టెస్ట్" ప్రియాంక అమాయకంగా అడుగుతూనే వుంది.
నేరుగా వెళ్ళి అలవాటుగా కూర్చునే బెంచి మీద కూర్చున్నాడు. అదే అతనికి రాత్రి పూట బెడ్ గా కూడ ఉపయోగపడుతుంది.
పానకాల్సామీ దూరం నించే గమనించాడు.
"ప్రియాంకగారూ! మీరు అంతరాలను అధిగమించే స్నేహ భావం చూపారు. చాలా ధాంక్స్! కానీ మీకు కొన్ని నిజాలు తెలియాలి. బహుశా ఇలాంటి ప్రపంచం ఒకటుందని మీకింత వరకూ తెలియక పోవచ్చు. వినటం కూడ ఇదే క్రొత్త కావచ్చు.
ఈ బెంచి మీదే రాత్రులు నేను పడుకుంటాను "
"బ్రహ్మచారులు కదా! ఎక్కడయినా పడుకుంటారు. ఎవరు కాదంటారు. రాత్రి యిక్కడ పడుకుంటే చల్లని గాలి, ఆకాశంలో చక్కని చుక్కలు !" డ్రీమీగా అయిపోతుంది ప్రియాంక.
"నేను చాల రోజులుగా పడుకుంటున్నాను. కాని అలాంటివి నా కెప్పుడూ కన్పించలేదు. ఈగల్లాంటి దోమలున్నాయి. తెల్లవార్లు కళ్ళముందు అవే కన్పిస్తాయి భయంకరంగా!"
"రాత్రి పూట చలి వెయ్యదా?"
"ఎందుకు వెయ్యదు? ఒక్కోసారి వణుకు పుట్టిస్తుంది !"
"అప్పుడు మీ బెడ్ రూంకి వెళ్ళిపోయి రగ్గులో వెచ్చగా పడుకుంటారు అవునా?" అమాయకంగా అడిగింది ప్రియాంక.
అభిమాన తార సినిమా చూసేందుకు టికెట్స్ కోసం నాతొ కమల్ దియేటర్ మేనేజర్ని హడలెత్తించిన అమ్మాయేనా?
విస్మయంగా చూశాడు జయసింహ! అటువంటి నిర్మలమయిన పవిత్రమయిన స్నేహమయి ముందు యధార్ధాలు దాచుకోవడం అనేది ఎంత నేరం? ఎంత వంచన!
"ప్రియ! ఇల్లనేది ఉన్నవారికి కదా బెడ్ రూం ఉంటుంది?" అన్నాడు.
"మీకసలు యిల్లే లేదా?"
"ఒకప్పుడు ఉండేది అమ్మేశాను"
"కొత్త యిల్లు తీసుకుంటున్నారా?"
"నో! అప్పులు అవసరాలు తీర్చుకోవటానికి అమ్మేశాను"
"మరి యిప్పుడు ఎలా?"
"ఈ పార్కులోనే తలదాచుకుంటున్నాను. అడుగో వాచ్ మేన్ పానకాల్సామీ . అతని అభిమానం వల్ల ఈ అవకాశం దొరికింది. లేకుంటే పేవ్ మెంట్స్ మీదే!"
"స్టాపిట్! ఇంత దారుణంగా జీవిస్తున్నారా?"
"నేను ఇంకా కొందరికన్నా నయం. అర్ధరూపాయి పెట్టి పాలు కొనివ్వలేక బిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ కూర్చునే తల్లులున్నారు. చదువు చెప్పించలేక పదేళ్ళ వయసుకే బిడ్డల్ని బాసిన వృత్తుల్లోకి దింపుకుంటున్న తండ్రులున్నారు.
"ప్రియాంకా! ఈ ప్రపంచం నీకు క్రొత్త కావచ్చు. కాని నాకు అలవాటయి పోయింది" అన్నాడు జయసింహ!
అతని చూపులు ఆమె అంతర్యంలో గ్రుచ్చుకుంటున్నాయి. మాటలు వెన్ను లోంచి వణుకు పుట్టిస్తున్నాయి.
ఆమె మనో ప్రపంచంలో క్రొత్త లోకం వాకిళ్ళు తెరుస్తోంది. ఎన్నో బాధామయ దృశ్యాలు ! ఆర్తి! ఆరాటం! ఆవేదన! బాధ! రోదన.
దారిద్యం! నిస్సహాయత! మనుషుల దౌర్భాల్యాలు! యేవో చిత్రవిచిత్ర వేదనా పూర్వపర దృశ్యాలను ఊహిస్తోంది!
దీర్ఘంగా నిట్టుర్పు విడిచింది.
"మరి తిండి కోసం ఎలా తిప్పలు పడుతున్నారు?" అంది ఆవేదనగా.
"ఆ బాబు సంగతి నన్నడుగు తల్లీ నేను చెప్తాను" ఆ మాటలు విన్పించిన వంకకు తలత్రిప్పి చూచిందామె!
పానకాల్సామీ చేతులు కట్టుకుని నిలబడ్డాడు.