Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 13


    విశాలమైన ఆవరణలో కట్టబడిన ఆ భవనం విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతోంది.

    కాంపౌండ్ వాల్ చుట్టూ ఎత్తుగా పెరిగిన భారీ అశోక వృక్షాలు.

    దారికి మధ్యలో ఫౌంటెన్.... దానిలోంచి నీరు రంగు రంగుల్లో పైకి ఎగజిమ్ముతోంది.

    రాజోద్యనవనంలా అందమైన తోట....

    పూల చెట్లు, క్రోటన్స్, పళ్ళ చెట్లు.

    పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కారులు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది ఆ క్లబ్బు ఘనత.

    "బాగుందా?" అడిగింది ఆమె.

    అతను స్విమ్మింగ్ ఫూల్ వైపు చూస్తున్నాడు.

    నందిని మొహం పైకి పడుతోన్న జుత్తును చేత్తో వెనక్కి తోసుకుంటూ అంది-

    "ఇక్కడికి రకరకాల మనుషులు వస్తారు రామ్.

    అధికారులు, రాజకీయ నాయకులు, స్మగ్లర్లు, క్రీడాకారులు, జూదగాళ్ళు, పేరుమోసిన రౌడీలు....

    ఇక్కడ చాలా రకాల ఆటలుంటాయి. ఎవరికి కావల్సిన ఆట వాళ్ళు ఆడుకోవచ్చు.

    ఎంజాయ్ చేయటానికి కొందరు, జూదంలో డబ్బు గెలుచుకోవాలని మరికొందరు, మందుకొట్టి కేబరే చూడ్డానికి యింకొందరు, స్నేహాలను పెంచుకొని తమ తమ పనులను చక్కబెట్టుకోడానికి కొందరు.... యిలా ఎందరో ఎన్నో రకాలు.

    అఫ్ కోర్స్! నేను మాత్రం కమర్షియల్ మైండ్ తోనే వస్తాను.

    డబ్బు.... డబ్బు కోసం ..... రామ్..... ఎప్పటికైనా ఈ క్లబ్బు నా స్వాధీనం కావాలి. అది నా ఆశయం!"

    ఆమె మాటలకి ఉలిక్కిపడ్డాడు పరుశురాం. ఇంతవరకు తనెరిగిన నందిని చాలా డిఫరెంటుగా కనిపించింది.

    "మొత్తం జంటనగరాలనే సొంతం చేసుకో ఎవరొద్దన్నారు?" ఎగతాళిగా అన్నాడు పరుశురాం.

    అతను ఎగతాళి చేశాడని ఆమె కోపం తెచ్చుకోలేదు.

    ఆమెకు క్లబ్బులో చాలా పలుకుబడి ఉందని అతను గ్రహించాడు.

    "హలో.... గుడ్ మార్నింగ్ మేడం!" ఎవరో ఆమెని విష్ చేస్తూ దగ్గరకొచ్చేరు.

    "హలో.... హలో....లో....లో....మిస్టర్ నాయుడు!" అంటూ అతనికి షేక్ హాండ్ ఇచ్చింది నందిని.

    నాయుడు ఏదో మాట్లాడుతున్నాడు ఆమెతో. వాళ్ళ మధ్య తనుండటం ఇష్టంలేక పరుశురామ్ మెల్లగా స్విమ్మింగ్ ఫూల్ దగ్గరికి నడిచాడు.

    స్విమ్మింగ్ డ్రస్ లో దరిదాపు ఇరవైమంది యువతులు స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొడుతున్నారు. దీపాల వెలుగులో వాళ్ళ అందం, చందం, నునుపైన అవయవాలు చమక్ చమక్ మని మెరిసిపోతున్నాయి. అందరూ పదహారునుంచి ముప్ఫైలోపు వయసుగల అమ్మాయిలు.

    స్విమ్మింగ్ ఫూల్ గట్టుమీద కుర్చీలో కూర్చుని నఖశిఖ పర్యంతం కళ్ళింత చేసుకుని ఆ యువతుల అందాలని కొరుక్కుతింటూ కూర్చున్నారు కొందరు. అయితే చాలామంది దృష్టి ఒకే అమ్మాయి మీద వుంది.

    అంతలో స్విమ్మింగ్ ఫూల్లోంచి గట్టుమీద కొచ్చిందో అమ్మాయి.

    దీపం కాంతిలో దేవకన్యలా మెరిసిపోతోందామె. అందరి చూపు ఆమెమీద కేంద్రీకరించబడింది. గుటకలు మింగుతూ ఆ అందాన్ని చూస్తున్నారు. లాడర్ వైపు కదలబోతున్న ఆమె దృష్టి పరుశురాం మీద పడింది. అతను నీళ్ళల్లో ఈతలాడుతోన్న వాళ్ళని చూస్తున్నాడు.

    ఎందరెందరో కళ్ళు ఇంత చేసుకుని తన అందాలని చూడ్డం ఆమెకి తెలుసు. తను ఒక్కసారి వాళ్ళకేసి చూస్తే చాలని తపించిపోయే భక్తులున్నారు.

    అలాంటిది ఓ యువకుడు కనీసం తనకేసి చూడకపోవటం అసలు తనని పట్టించుకోకపోవటంతో క్షణంపాటు నివ్వెరపోయిందామె.

    అతనికేసి రెండుక్షణాలు చూసింది.

    "మగాడు" అనుకొంది.

    వెంటనే లేడిలా అతనికేసి పరిగెత్తుకొచ్చింది. పరుశురాం ఏమి జరుగుతున్నదీ గ్రహించేలోగా ఆమె అతని బూటుకాళ్ళపైకెక్కి అతని మెడచుట్టూ చేతులు వేసి గట్టిగా అతని పెదవులపైన ముద్దు పెట్టుకుంది. ఆమె తడి వంటితో తనని పట్టుకోవడంతో తన సూటు, బూటు పాడైపోవటం చూసి ఆమెని విదిలించుకున్నాడు కోపంతో. తనని, తన అందాన్ని అతను కేర్ చేయకపోవడమే కాకుండా విదిలించి కొట్టడంతో ఆ అమ్మాయి రెచ్చిపోయింది కోపంతో. రోషంతో బుసలు కొట్టింది.

    "బ్రూట్. దిసీజ్ ప్రమీలా ది గ్రేట్. ఈ క్లబ్బు మహారాణీని నేను. నాకోసం నా అందాన్ని చూడ్డానికి జనం పడి చచ్చిపోతారు. అలాంటిది నేను నేనుగా నిన్ను కిస్ చేస్తే విదిలించి కొడతావా? యు ఆర్ నాటేమాన్. బీస్ట్" అంటూ అతని చెంప పగిలేలా ఈడ్చి కొట్టిందామె. క్షణం పాటు ఆమె చర్యకి నివ్వెరపోయినా, తేరుకుని--

    "వ్వాట్ ది హెల్, బ్లడీ!" ఆమె చేతిని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. బాధతో కీచుగా అరిచింది ప్రమీల. తన చెయ్యి అతని చేతిలో నలిగిపోతుంటే విలవిల్లాడిపోతోంది. అప్పటివరకు ఎక్కడున్నారో?.... పదిమంది దృఢకాయులు పరుశురాంని చుట్టుముట్టారు.

    నందిని సరిగ్గా అప్పుడు చూసింది. జరిగిందేమిటో అర్ధం చేసుకోడానికి అట్టేసేపు పట్టలేదామెకి. క్షణం ఆలస్యం జరిగితే ఏం జరుగుతుందో ఆమెకి తెలుసు. ఆమె అక్కడికి సుడిగాలిలా దూసుకెళ్ళింది.

    "కమాన్ రామ్!" అంది అతని చేతిని పట్టుకొని. ఆ వ్యక్తి మేడంకి సంబంధించిన వాడని తెలీగానే రౌడీలు నివ్వెరపోయి ప్రక్కకు తప్పుకున్నారు. "సారీ మేడం!" అంటూ.

    "ఇట్సాల్ రైట్!" ఆమె పరుశురామ్ చేతిని పట్టుకొని అక్కడ్నించి తీసుకెళ్ళిపోయింది.

    అదుపు తప్పుతోందనుకున్న పరిస్థితి ఒక్కసారిగా స్తబ్ధంగా మారిపోవడంతో ప్రమీల ఊపిరి పీల్చుకొంది.

 Previous Page Next Page