"నీకిష్టమైన 'పనిని' నిన్ను గెలిచి చేయించుకోవటంలో థ్రిల్ వుంటుంది రామ్!
నీకిష్టం లేకపోయినా బలవంతంగా నీతో పని చేయించుకొంటే అది చప్పచప్పగానే వుంటుంది. అందుకని నీ షరతుకి నేను అంగీకరిస్తున్నాను."
పరుశురామ్ లేచి నుంచున్నాడు. నందిని బీరువాలోంచి నోట్ల కట్టల్ని తీసి బ్యాగ్ లో వేసుకొంది.
"పద వెళదాం!" అని అతని చేయి పట్టుకొని మేడ మెట్లు దిగిందామె.
ఇంట్లో పనివాళ్ళకిప్పటికీ అతనెవరో తెలీదు. అతని విషయంలో ఆమె తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ, ఓ ముఖ్య అతిధికిచ్చే ట్రీట్ మెంట్ చూసి పనివాళ్ళు ఆశ్చర్యపోయారు.
కింద హాల్లోకి వచ్చాక-
"జస్ట్ వన్ మినిట్" అంటూ టెలిఫోన్ దగ్గరికి నడిచి ఓ నెంబర్ డయల్ చేసి మాట్లాడి పెట్టేసి--
"కమాన్!" క్రీగంట అతన్ని చూసి కన్నుగీటుతూ అంది చిరునవ్వు నవ్వుతో నందిని.
ఆమె డ్రైవ్ చేస్తోంది. ఆమె ప్రక్కనే కూర్చున్నాడు రామ్.
ఆమ ఏమిటేమిటో చెప్తోంది. కానీ అతని ధ్యాస ఎక్కడో వుంది.
నాలుగు రోజుల్నుంచీ పేపర్లన్నీ తిరగేస్తున్నాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారేమోననే భయం అతన్ని వేధిస్తోంది. పేపర్లో ఏ విధమైన వార్తా కనబడలేదు. దాంతో కొంచెం ధైర్యం వచ్చిందతనికి.
ఊహ తెలిసిన దగ్గరనుంచి తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో అతనికి తెలుసు.
అతని భుజం పైన మెత్తగా ఆమె చేయి పడింది.
అతను ఉలిక్కిపడ్డాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?"
"నా గమనం గురించి" గంభీరంగా అన్నాడు.
ఆమె నవ్వింది.
"నేను చేరుస్తాను"
ఆమె మాటలకి పరిహాసంగా నవ్వాడు.
"అది అంత తేలికకాదు మేడం!" అంటూ తలతిప్పి ఆమె కేసి చూశాడు.
ఆమె పవిట ప్రక్కకి జారిపోయి బ్లౌజ్ లోంచి నగ్న శిఖరాలు కాంతుల్ని వెదజల్లుతున్నాయి.
అతను ఆమె పవిటని భుజం మీద వేశాడు.
"పడగ్గదిలో మాత్రమే జారవల్సిన పవిట, కార్లలోనూ, రోడలమీదా జారిస్తే కుక్కలు కూడా వూరుకోవు మేడం...."
"షటప్" కోపంతో అంది నందిని.
కారు వేగంగా దూసుకెళుతోంది. రద్దీగా వున్న రోడ్డుమీద సైతం ఆమె చాలా చాకచక్యంగా కారు నడపడం చూసి-
"డ్రైవింగ్ లో ఎక్స్ పర్ట్ అనుకుంటాను" అన్నాడు.
"సిగ్గులేకపోతే సరి మొహానికి. నడపటంలో నేను 'ఎక్స్ పర్ట్ ని' మేడం అని చెప్పాల్సింది పోయి నా డ్రైవింగ్ ని మెచ్చుకుంటున్నావు."
"ఇంతవరకు నేనెప్పుడూ డ్రైవ్ చేయలేదు. ఎవరైనా నేర్చుకోనివ్వాలి కద!?"
"నా బండి మీద నేర్చుకో"
"ఇంత బండా?"
"షటప్! ఇంత బండా అంటున్నావు. ఇది ఎద్దుబండి కాదు. మాంచి కండిషన్ లో వున్న కారు. నీకు తెలుసో తెలీదో ఈ బండిని తోలగలిగితే ఫ్యూచర్ లో ఎలాంటి బండినయినా డ్రైవ్ చేయగలవ్ రామ్!
పరుశురాం తిరిగి మాట్లాడలేదు.
బంజారాహిల్స్ లో చాలా ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన భవనం కాంపౌండ్ వాల్ గేటులోంచి కారు లోపలికి వెళ్తుండగానే గేటు దగ్గర రంగు దీపాలతో కాంతుల్ని వెదజల్లుతున్న 'జూలీ క్లబ్' అన్న బోర్డుని చూశాడు పరుశురాం.
తనని ఎంతో ఊరించి ఊరించి ఆఖరికి ఆమె ఓ క్లబ్బుకి తీసుకొచ్చిందని గ్రహించగానే ఎక్కడలేని నీరసం వచ్చేసిందతనికి.
ఆమె కారుని పార్కింగ్ ప్లేస్ లో ఆపింది.
ఆమె కారు దిగుతుండగానే ఓ భారీ విగ్రహంగల వ్యక్తి ఆమె ముందుకొచ్చి-
"గుడ్ మార్నింగ్ మేడం!" అన్నాడు.
పరుశురాం తేరుకుంటూ అతన్ని చూశాడు.
ఒకేసారి యాభైమందిని నేలకరిపించగల దేహదారుఢ్యం గలవాడతను.
"గుడ్ మార్నింగ్ రాబర్ట్! అంతా ఏర్పాటు చేశావుగా?
"యస్ మేడం"
పరుశురాం కేసి తిరిగి అంది నందిని-
"రాబర్ట్ నాకు రైట్ హాండ్ రామ్....! నా బిజినెస్ వ్యవహారాలు అతనే చూసుకుంటాడు."
"హౌడూయూడు?"
రాబర్ట్ చేయి సాచాడు పరుశురాంతో చేయి కలపటానికి.
చేయి కలపకుండానే-
"ఫైన్" అన్నాడు పరుశురాం.
అది చూసి నందిని చిరుకోపంతో-
"స్నేహం కోరిన మనిషితో చేయి కలపడం మర్యాద రామ్...." అంది.
పరుశురాం మాట్లాడలేదు. రాబర్ట్ మెల్లగా అన్నాడు నవ్వుతూ.
"పోన్లెండి మేడం! ఇంకా కొత్త కదా!"
ఆమె సైగ చేయగానే రాబర్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.