Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 11


    అతని మాటలకి ఆమె కొంటెగా నవ్వింది.

    "న్నో! మనం వెళ్ళేచోటుకి యీ వేషం అవసరం రామ్!

    అయినా మగాడి అందం, అలంకరణ ఎలా వుండాలో మగాడంటే మోజుపడే ఆడదానికి తెలుస్తుంది రామ్!

    "నువ్వెలా వున్నావో నన్నడుగు. నేను చెప్తాను."

    ఆమె కింద పెదవిని మునిపంటితో నొక్కుతూ సగం మూసిన కళ్ళతో చూస్తూ అన్నది.

    అతను సిగరెట్ వెలిగించి ఆమె మొహంలోకి చూశాడు.

    "ఏ ఆడపిల్లలయినా సరే కళ్ళప్పగించి నిన్ను చూస్తూ 'మగాడు అంటే ఇతనే' అనుకొనేలా వున్నావు రామ్. నిన్ను చూడగానే ఆడది ఒళ్ళుమరిచి సిగ్గువిడిచి నడిరోడ్డుపైన ముద్దుపెట్టుకొనేలా ఆకర్షించే మాస్క్ లైన్ పర్సనాలిటీ నీదని నాకు తెలీదు రామ్!"

    "ఆమె పొగడ్తకిగానీ, అభినందనకి గానీ అతను పొంగిపోలేదు. గర్వపడలేదు.

    ఆమె కేసి కాస్త ఇబ్బందిగా చూశాడు.

    ఆమె కళ్ళలో మెరుపు.... పెదవులపైన చిరునవ్వు....

    నలభై ఏళ్ళ వయసుని దాచుకోడానికి ప్రయత్నిస్తూ పాతికేళ్ళ అమ్మాయిలా ప్రవర్తిస్తుంది నందిని.

    చూసేవాళ్ళు తన అందానికి నీరాజనాలు పలకాలన్న ఆమె ఆరాటం- ఆమె ప్రతి కదలకలోనూ వ్యక్తం అవుతోంది.

    గోదావరికి కొత్త నీళ్ళొచ్చి ఉరకలేస్తున్నట్లుగా వుంది నందిని.

    అతని దగ్గరగా వచ్చిందామె.

    అతని చెంపలని అరచేతులతో సవరదీస్తూ అతని మొహాన్ని దగ్గరగా తీసుకుని నుదురుపైన ముద్దుపెట్టుకొంది.

    "ఇప్పుడీ గంగిరెద్దు వేషంలో నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు?" అడిగాడు.

    నందిని అతని భుజంపైన చేయి వేసింది.

    "రామ్! నిన్ను 'గంగిరెద్దు' అనెవరన్నా అంటే మొత్తం 'స్త్రీ జాతి' అలా అనేవాడిని చెప్పుతో కొడుతుంది. నీకు తెలీదు రామ్! ఇప్పుడున్న సినిమా హీరోలు నీ ముందు దిగదుడుపే! నిన్ను చూస్తే ఏ ప్రొడ్యూసరు తన్నుకుపోతాడోనని నాకే భయంగా వుంది.

    పరుశురాం సిగరెట్ పీకను ఏష్ ట్రేలో కుక్కేస్తూ అన్నాడు.

    "నీకు అలాంటి భయం అవసరంలేదు మేడం. నాకు నటించడం చేతకాదు."

    అతని సమాధానానికి రత్నాలు రాలిపడేలా నవ్వింది ఆమె.

    "ఓహ్! అది చాలా గొప్ప క్వాలిఫికేషనయ్యా! నీకు 'ఏ బర్నింగి ఫిగరో' అని బిరుదుకూడా వచ్చేస్తుంది. కెమేరా ముందు నించోగలిగితే నువ్వే గొప్ప నటుడివి. నీకెలాగూ నటన రాదంటున్నావు కనుక నువ్వు ఎవర్నో అనుకరించే ప్రశ్నలేదు. అంచేత రేపు నీ శైలినే కొందరు అనుకరించనూవచ్చు!"

    ఆమె తమాషాగా మాట్లాడుతున్నా ఆ మాటలు అతనికేమీ ఆసక్తిని కలిగించలేదు.

    విసుగ్గా అన్నాడు.

    ఇంతకీ ఏ సినిమా కంపెనీ కన్నీ తీసుకెళుతున్నావా?"

    ఆమె కళ్ళతోనే కాదన్నట్టు చూసింది.

    "కాదు రామ్! లక్షలు కురిసే చోటది. చూస్తే ఉక్కిరి బిక్కిరి అయి పోతావు. నీ ఊపిరి ఆగిపోతుందేమోనని నువ్వు భయపడతావు!"

    ఆమె మాటలు వింటూ సిగరెట్ పొగని బలంగా పీల్చి గాలిలోకి విడిచిపెడుతూ.

    "నేనిప్పుడు ఎలాంటి అద్భుతాన్ని చూసి చలించను మేడమ్.

    నీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలో నిజంగానే నేను ఉక్కిరి బిక్కిరి అయిన మాట నిజం. ఇప్పుడిలాంటి విడ్డూరాన్ని చూసినా చాలా కాజువల్ గా తీసుకొంటాను. ఇంతకీ ఆ అద్భుతమైన చోటు ఎక్కడ?"

    "చెప్పకపోతే రావా?" కొంచెం కోపం ధ్వనించిందామె గొంతులో.

    పరుశురాం నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.

    తనని ఎందుకో ఉపయోగించుకోవాలని ఆమె ఆరాటపడుతోందని అతనికి తెలుసు.

    జేబులోంచి పేకని బయటికి తీశాడు. నాలుగు వేళ్ళతో దాన్ని పట్టుకుని బొటన వేలితో విరిచాడు.

    అతని చేతిలో పేకని చూడగానే ఆమె ముఖం వికసించింది. కానీ అతని ముఖంలో ఏదో మార్పు....

    కళ్ళు ఎర్రబడుతున్నాయే. మొహం జేవురించింది. పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి.

    "అయ్!" అంటూ పిడికిలి బిగించి టీపాయ్ పైన కొట్టాడు. దాని పైన అద్దం భళ్ళుమని పగిలిపోయింది.

    తేరుకుని చూసి "సారీ....సారీ....మేడం!" అన్నాడు.

    "రామ్!" ఆతృతతో అతని వంక చూసింది నందిని. పరుశురాం తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు.

    "ఏమైంది? ఎందుకలా అయిపోయావు?" అడిగింది.

    "సారీ మేడం! తెలీని ఆవేశంలో ఒక్కోసారి నేనేం చేస్తానో నాకే తెలీదు."

    "నీమీద ఏమిటో నాకు చెప్పుకోవచ్చుగా!"

    అతను విరక్తిగా నవ్వాడు. తల అడ్డంగా ఊపాడు. "దయచేసి నన్నేమి అడగొద్దు. ముక్కూ మొహం తెలీని నన్ను ఆదుకొన్నావు. ఆవారాలా రోడ్డుమీద తిరిగే నన్ను తీసుకొచ్చి రాజభోగాన్ని కలిగించావు. అన్నింటికంటే ఇప్పటివరకు 'నువ్వెవరు? ఏ వూరు? నీ బాబెవరు? నీ కధేమిటి? లాంటి ప్రశ్నలు వేసి నన్ను చంపకుండా విసిగించకుండా ఓ మనిషిగా గుర్తించిన నీకు నా కృతజ్ఞతలు మేడం!

    ఆ గౌరవంతోనే చెపుతున్నాను. నువ్వెక్కడికి తీసుకెళ్ళినా వస్తాను.

    ఆఖరికి నరకానికైనా సరే!

    "కానీ ఒక్క షరతు! నాకిష్టంలేని పనిని నా చేత చేయించడానికి మాత్రం ప్రయత్నించకూడదు!

 Previous Page Next Page