"పరుశురాం! ఈ నందిని స్టేటస్, కెపాసిటీ నీకు తెలీదు. నీకా పేక ముక్కలు కావాలంటే ఓ కొత్త ఫ్యాక్టరీ పెట్టి కొత్తకార్డ్స్ అచ్చేయించి నీకివ్వగలను తెలుసా?"
పరశురాం తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు.
"నీ శక్తి సామర్ధ్యాలు, ఐశ్వర్యం కళ్ళతో చూశాను. నేను నీనుంచి ఏమీ ఆశించడంలేదు. నా కార్డ్సు నాకు కావాలి."
నందిని జాలిగా చూసింది.
"పోయిన వాటిని ఎలా తెచ్చివ్వగలను?"
"వీల్లేదు. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. కానీ అవి పోవడానికి వీల్లేదు" జీరపోయిందతని గొంతు.
అతని మాటలకు నందిని విప్పారిత నేత్రాలతో చూసిందతన్ని. బీరువా దగ్గిరికి నడిచింది. ఓ పక్క అతనంత టెన్షన్ క్రియేట్ చేస్తున్నా ఆమె నడకలో వయ్యారం, సింగారం, కులుకు మేళవిస్తున్నాయి.
బీరువాలోంచి డజన్లకొద్దీ పేకసెట్లని తీసి అతని ముందు పడేసింది. ఆ కార్డ్స్ దేశదేశాల్లో తయారయినవి.
"రామ్! కావాలంటే ఇవన్నీ తీసుకో! ఇవి ఎక్కడా ఎవరికీ దొరకవు" అంది.
అతను వాటికేసి కనీసం చూడలేదు.
"నాకు ఆ కార్డ్స్ కావాలి."
పగిలిపోయిన ఆ బొమ్మే కావాలి అని ఏడుస్తున్న పసివాడిలా కనిపించాడు పరుశురాం నందినికి.
ఆమెకి ఎక్కడాలేని విసుగూ వచ్చేసింది.
"రంగన్నా!" విసుగ్గా కేకేసింది.
రంగన్న పరిగెత్తుకొచ్చాడు.
"ఉదయం చెత్త ఎక్కడ పారేశావు?" అడిగింది.
"బయట చెత్తడబ్బాలో వేశానమ్మా!" చెప్పాడు.
"అందులో పాత పేకముక్కలు వుంటాయి. వెళ్ళి ఏరి తీసుకురా" అంది నందిని.
ఆమె మాటలు పూర్తికాలేదు. పరుశురాం అక్కడినుంచి దూసుకెళ్ళి పోయాడు.
రోడ్డుప్రక్కనే ఉన్న చెత్తకుండీని చేతులుపెట్టి కెలికాడు.
పేకముక్కలు కనిపించాయి.
అంతే! అతని ఆనందానికి అవధుల్లేవు.
అన్ని పేకముక్కల్ని జాగ్రత్తగా ఏరి వాటిని ముద్దు పెట్టుకున్నాడు.
ఆ ముక్కల్ని కలుపుతూ ఆనందంతో తిరిగొచ్చి వెర్రివాడిలా కుర్చీలో కూర్చుని ముక్కల్ని ఎదురుగా ఉన్న బల్లమీద విసరటం మొదలుపెట్టాడు.
నందిని విస్మయంగా చూసింది.
ఆ పేక చాలా పాతది. ఏ పది పదిహేను సంవత్సరాల నాటిదో. ముక్కలన్నీ చాలా పాతబడిపోయి వున్నాయి. వాటికోసం అతను చేసిన గొడవని మరిచిపోలేక పోతోందామె!
"పరుశురాం!" పిలిచిందామె.
అతను మెల్లగా తలెత్తి చూశాడు.
"అంత విలువైనదా యీ పేక?"
ఆమె ప్రశ్నకి అదోలా నవ్వాడతను.
"అవును. నన్ను చూస్తుంటే పిచ్చివాడిలా కనిపిస్తున్నాను కదూ మేడం?"
"లేదు.... నీ వెనుక ఏదో విషాదగాధ వుందనిపిస్తోంది రాం!"
అతను మాట్లాడలేదు.
"ఒక లక్ష్యాన్ని గురిగా పెట్టుకొన్న నాకు నా ఆశయాన్ని నెరవేర్చుకోడానికి నా గుండెల్లో రగిలే అగ్నిపర్వతాన్ని చల్లారకుండా ఈ పేక ముక్కలు ఊపిరి పోస్తున్నాయి మేడం!"
"ఆ పేకముక్కలపైన రక్తం మరకలు...." ఆమె అడిగింది.
పరుశురాం కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది.
ఆ పేకముక్కల్ని గుప్పిట్లోకి తీసుకొని నాలుగు వేళ్ళతో పట్టుకొని బొటనవేలితో విరిచాడు.
"ఈ పేకపైన చిమ్మిన రక్తపు మరకలు మాసిపోయి చెరిగిపోక ముందే నా లక్ష్యాన్ని సాధించుకుంటాను. ఈ రక్తపు మరకలు రగిలించిన నా గుండెలోని అగ్నిపర్వతం అప్పుడే చల్లారుతుంది. అది సాధించకపోతే నేనున్నా ఒకటే! లేకపోయినా ఒకటే!!"
నందిని మెల్లగా అతని దగ్గరికి నడిచి వస్తోంది. ఆమె కదలికకి నడుం, నడుంపైన ముచ్చటైన ముడతలు వయ్యారంగా కదులుతున్నాయి. అతని తలచుట్టూ చేతులువేసి ముందుకు లాక్కుంది నందిని.
జాకెట్ కీ, బొడ్డుకింద కుచ్చెళ్ళకీ మధ్య జానెడు పొట్టపైన అతని మొహం.... బొడ్డుపైన అతని పెదవులు....
సున్నితంగా అతని మొహాన్ని పొట్టపైన నొక్కుకుంది నందిని.
అతని మీసాలు పాలసముద్రపు అలల్లా పైకి కిందకీ కదులుతున్న ఆమె పొట్టపైన గుచ్చుకుంటున్నాయి.
4
నందిని దగ్గరుండి డ్రసెస్ చేసింది పరుశురాంకి. బ్రౌన్ కలర్ సూటు, రెడ్ కలర్ టై, చేతికి ఖరీదైన వాచీ, కళ్ళకీ రేబాన్ గ్లాసెస్, కాళ్ళకి ఫుల్ షూ.
అద్దంలో తనని తాను పరీక్షగా చూసుకొన్నాడు పరుశురాం.
తననా వేషంలో పోలీసులు గుర్తించరనుకున్నాడు. అయితే ఆ వేషం తనకి అతికించినట్లు ఎబ్బెట్టుగా తోచింది.
"నన్నేమన్నా జంతు ప్రదర్శనశాలకి తీసుకెళ్తున్నావా?" నందినిని అడిగాడు అతను.
ఆమె ముద్దొచ్చేలా నవ్వింది.
"వాట్ బ్యూటీ! అక్కడ చాలా క్రూరమృగాలు వుంటాయి. వాటితో నువ్వెలా నెగ్గుకు రాగలవో చూడాలనుంది రామ్!"
"ఛాల్లెండి మేడమ్. ఈ డ్రస్ లో నన్ను చూసిన వాళ్ళకి సర్కస్ లో బఫూన్ లా కనిపిస్తాను, తీసేస్తాను" విసుగ్గా అన్నాడు పరుశురాం