Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 11

 

    ఎవరి ధోరణి వాళ్ళది! ఎవరి హాబీ వాళ్ళది!!
    పెటంచు కండువా పెద్ద మనిషి లోనికి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబిల్ కోసం వెతికి చూచాడు ముందు అది కన్పించలేదు.
    ఖాళీగా ఉన్న సీటుకోసం చూచాడు. బిక్కుబిక్కుమంటూ ఓ మూలగా ఉన్న ఒంటరి సీటు కన్పించింది.
    దాన్లో సెటిల్ అయిపోయాడు.
    జయసింహకి అయన ప్రక్కన మరో ఖాళీ కన్పించలేదు. నిరాశ పడ్డాడు. ఎవరో పేపరు చదువుతుంటే తొంగి చూచాడు. ఆ పేజీ తిప్పలేదాయన! ప్రక్క మనిషితో చర్చిస్తూ ఎడిటోరియల్ లోంచి ఒక్కొక్క వాక్యం చదువుతున్నాడు, మళ్ళీ చర్చిస్తున్నాడు.
    ఇలా అయితే ఆ ఒక్క ఎడిటోరియల్ చదివేందుకు కనీసం ఒక్క గంట అయినా పడుతుంది? ఈలోగా ఆ పెద్దమనిషి కూడా వెళ్ళిపోతాడెమో! తల ఎత్తి చూచాడు.
    ఆ పెద్దమనిషి ఎదురుగా ఉన్న వ్యక్తీ కాఫీ త్రాగటం పూర్తీ చేశాడు.
    బిల్లు కోసం ఎదురు చూస్తున్నాడు. బిల్లు వచ్చింది లేచాడు.
    హమ్మయ్య అనుకుంటూ ఆ సీట్లో కూర్చున్నాడు జయసింహ! ఎదురుగా ఉన్న పెద్దమనిషి పేపర్ చంక లోంచి తియ్యలేదు. టేబిల్ మీద పెడతారేమోనని ఎదురు చూశాడు.
    ప్చ్! ప్రయోజనం లేదు. అత్యంత ప్రేమాస్పుదురాలయిన మనవరాలని ముద్దాడి చంకన ఎత్తినట్టు ఎత్తాడు. మరింక దింపడు!
    ఈలోగా సప్లయిర్ వచ్చి "ఏం కావాలి సార్" అని రెండు సార్లు అడిగిపోయాడు. సమాధానం చెప్పలేదు.
    "చూడండి సార్! ఈ దేశం దరిద్రంలో ఉందంటారు. ఎక్కడ చూచినా కరువు అంటారు. కాని ఎక్కడుంది సార్ కరువు!
    ఖరీదయిన ఏ.సి దియేటర్ కి పొతే ఖాళీలు ఉండవు. ట్రాలీలు బస్సులు, సిటీ బస్సులు, లోకల్ ట్రెయిన్స్ చివరికి ఆటోలు, టాక్సీలు  కూడా ఖాళీ కన్పించవు.
    బట్టల షాపుల్లో రద్దీ! ఫర్నిచర్ షాపుల్లో రద్దీ!
    "కరువు కరువంటారు. ఇంకా కరువు ఎక్కడండీ బాబూ!" అన్నాడు . అంత వయసొచ్చినా ఈ ప్రపంచం అర్ధం గానట్లు అమాయకంగా! జయసింహ నవ్వాడు.
    "కరువు అనేది మీరు చెప్పే చోట్లలో కన్పించదు సార్! మీరు చెప్పేది అధిక జనాభా వల్ల కలిగే పరిణామాలు!
    కరువు అనేది కాలే కడుపుల్లో ఉంటుంది.
    నూకలు వండుకుని దాన్లో మజ్జిగ బదులు నీళ్ళు పోసుకుని నంజుకునేందుకు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడ దొరకని మనుషుల జీవితాల్లో ఉంటుంది.
    బడి కెళ్ళే బిడ్డకి పెన్సిల్ కొని ఇవ్వలేని తల్లి కంటి చూపుల నిస్సహాయతో ఉంటుంది కరువు.
    తల్లి చనిపోతే కాల్చేందుకు కట్టెలు కొనలేక "పూడ్చటమే మా ఆచారం" అని చెప్పుకునే బిడ్డలా దౌర్భాగ్యం లో ఉంటుంది కరువు.
    "కొందరు చూచే ప్రపంచంలో కరువు అనేది కన్పించదు" అన్నాడు జయసింహ ఆవేశంగా.
    హాస్ బూటు పెటంచు కండువాలో ఉన్న ఆ పెద్దమనిషి అతని వంక భయంగా చూశాడు. ఏమనుకున్నాడో, ఎగిరిపడ్డాడు.
    చివాలున లేచి వాకిలి వంక నడవటం మొదలెట్టాడు.
    "వెళ్ళి పోతారేం సార్!" అన్నాడు జయసింహ నిరాశగా!
    'చాల అర్జంటుగా పనుంది. వెళ్ళాలి" అంటూ ఆ పెద్దమనిషి మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. మెట్లు దిగిపోయాడు.
    "ఏం కావాల్సార్! యిడ్లీ సాంబార్ గారే పూరి వడ దోసె" ఇంకా చాల పొడవయిన పాఠం వల్లిస్తున్నాడు.
    "నాకేమీ వద్దు" ఓ గ్లాసు మంచినీళ్ళ గడగడ తాగేసి లేచి బయటకు నడిచాడు జయసింహ.
    అతనికి దుఃఖం పొంగుకు వచ్చింది.
    కావాలని కోరుకున్నప్పుడు చిన్న వస్తువు అయినా అందక పోవటమే కదా జీవితం అంటే! గుండెలు మండుతున్నాయి.
    పరిశీలించుకునే వారికి జీవితం చాల అద్భుతం! ఓ గొప్ప విచిత్రం ప్రతి జీవితాన్ని విశ్లేషించుకో గలిగితే మహత్తర చరిత్ర అవుతుంది.
    హోటల్ నించి మరికొంత దూరం నడిచాడు దిగులుగా! డింగ్ డాంగ్ షోరూం ముందు ఓ ప్రక్కన చిన్న బంకు ఉంది.
    దానిలో మోటారు సైకిల్సు రిపేరు చేసే కుర్రాడు పేపరు చదువుతున్నాడు. దాని ఎదురుగా అడవి పత్తి చెట్టు నీడలో మరో యువకుడు పేపరు చదువుతున్నాడు. జయసింహ ముఖం వికసించింది.
    ఎవరో ఒకరు రెండు నిమిషాలు పేపరు యివ్వకపోరు. ఉత్సాహంతో అటు వైపుగా వచ్చాడు.
    "పేపరు యిస్తారా?" అని అడిగాడు మెత్తని స్వరాన.
    "తీసుకోండి సార్!" ఇచ్చేశాడు . తడబడుతున్న చేతులతో పేజీలు  త్రిప్పటం ప్రారంభించాడు.
    "ఏం కావాలి సార్? ఏం చూస్తున్నారు?"
    " సౌభాగ్యవల్లి లాటరీ ఫలితాలు."
    "అవి ఈ పేపర్లో పడవు సార్! అదుగో చెట్టు క్రింద నిలబడి చదువుతున్నాడు చూడండి. ఆ పేపర్లో పడ్డాయి."
    పేపరు తిరిగి యిచ్చాడు. వాటిని చూసే క్షణాలు అటువంటి అవకాశం దగ్గర అవుతున్న కొద్దీ కాళ్ళు వణుకుతున్నాయి.
    "సార్ ఒకసారి పేపరు యివ్వండి. చూసి యిచ్చేస్తాను "
    "ఉండవయ్యా! క్రికెట్ రివ్యూ చదువుతున్నాను. జయసింహ ఓర్పుగా ఎదురు చూస్తున్నాడు. అయిదు ----ఆరు---- పది-----పన్నెండు --------- నిముషాలు గడుస్తున్నాయి.
    "ఇంద తీసుకో !" పేపరు అందించాడు.
    "హమ్మయ్య" అనుకుంటూ పేపరు అందుకున్నాడు.
    సౌభాగ్య లక్ష్మి బంపర్ లాటరీ!!
    ఫలితాలు తొమ్మిదవ పేజీలో ఉన్నాయి అన్నీ నంబర్లే! చూడటం మొదటిసారి! చేతులు వణుకుతున్నాయి.
    కన్నులు చేదిరిపోతున్నాయి! హారన్ వినిపిస్తోంది.
    లూనా మోపెడ్ వచ్చి వారి ముందు ఆగింది. ఓ యువతి నడుపుతోంది.
    "రండి వెళ్ళిపోదాం" అంది అతని వైపు చూస్తూ!
    "మాష్టారూ! మా ఆవిడ వచ్చింది. వెళ్ళిపోతున్నాం. పేపరు నేనింకా పూర్తిగా చూడలేదు . ఇస్తారా?"
    నీరసించిపోయాడు జయసింహ. పేపరు తిరిగి యిచ్చేశాడు. లూనా మోపెడ్ వెనుక సీటు మీద కూర్చున్నాడు యువకుడు.
    ఝూమ్ అని దూసుకు పోయింది.
    ఉస్సురని నిట్టూర్చాడు జయసింహ.

                            *    *    *
    
    "రావూ సాహబ్! ఆఫ్ కేలియే బహుత్ బహుత్ ఘుక్రియా!"
    "ఓ నట్వర్ లాల్! అయియే! అయియే!" లేచి నిలబడి ఆహ్వానించాడు ధర్మాజీరావు. అయన లేవగానే ఆ గదిలో కూర్చుని ఉన్న పెద్ద లందరూ లేచి నిలబడ్డారు.
    "థాంక్యూ రావూ సాహెబ్! మీకీ మాటా మాకీ జమా అయింది. రెక్కల్ మీద వచ్చి వాలుతున్నాం. మీకీ మాకీ దోస్తీ బడతే రహేగా!" నట్వర్ లాల్ బ్రీఫ్ ని ప్రక్కనే ఉంచుకొని సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగ్గా! రావూ సాహెబ్ కనుబోమల్నించి నిశ్శబ్దంగా వెలువడ్డ ఆజ్ఞల్ని అందుకుని టక్ చేసుకుని బఫ్ తగిలించుకున్న ఓ కుర్రాడు కూల్ డ్రింక్ తెచ్చి అందించాడు.
    "బడా మొహర్బాని అప్ కా! థాంక్యూ! థాంక్యూ" అంటూ కూల్ డ్రింక్ అందుకున్నాడు నట్వర్ లాల్! "ఖుషీ హో గయా జాదా! జీతారహా సాబ్! హమే షా కేలియే జీతారహా!' అంటూ ఆశీర్వదించాడు.
    ధర్మాజీరావు మిగిలిన వారి వంక చూచాడు.
    "ఫ్రెండ్స్! ఇరవై నిమిషాల తరువాత మనమంతా మళ్ళీ కలుద్దాం" అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ!
    నట్వర్ లాల్ బ్రీఫ్ తో రాగానే చాల మందికి అనుమానం వచ్చింది. ముందుగానే ! అనుకున్న స్థితి ఎదురయింది.

 Previous Page Next Page