Previous Page Next Page 
అర్చన పేజి 74


    మాధవి కాసేపు రిత్విక్ తో ఆదుకుని, కాస్సేపు నీలవేణికిపనిలో సాయం చేసి వెళ్ళిపోయింది,
    ఇంటికి వెళ్ళగానే తెలుగు క్యాలండర్ తీసుకుని మరునాటి తిధి, నక్షత్రం చూస్తుంటే చక్రవర్తి వచ్చాడు.
    "ఏంటి విశేషం? పంచాంగం చూస్తున్నావు? జాబ్ లో చేరుతున్నావా?" అడిగాడు.
    "రేపు సప్తమి, గురువారం. మంచిది. ఓకె" అంటూ క్యాలండర్ పక్కన పెట్టి "అది పంచాంగం కాదు, తెలుగు క్యాలండర్" అంది.
    "పంచాంగం అంటే తిథి, వార, నక్షత్రాలు, యోగ విషయాలు, కారణాలు అనే ఐదు సూత్రాల ఆధారంగా తయారుచేయబడింది. ఈ క్యాలండర్ లో  తిథి, వార, నక్షత్రాలున్నాయి కదా! అందుకిది పంచాంగం"వివరంగా తనకేదో బాగా తెలిసినట్టు చెబుతోన్న చక్రవర్తివైపు నిశితంగా చూస్తూ ఫక్కున నవ్వింది మాధవి.
    "ఎందుకా నవ్వు?" అడిగాడు.
    "ఏమీ లేదు" అంటూ అతని టై వదులు చేస్తూ అంది "ప్రీతికి సంబంధం మాట్లాడాను. దాని అభిప్రాయం తెలుసుకోడానికి మంచిరోజు కోసం చూశాను."
    "నువ్వు చాలా పెద్దదానివైపోతున్నట్టు అనిపిస్తోంది. మరీ అమ్మమ్మని పెళ్ళిచేసుకున్నానేంటి?" అదోలా మొహం పెట్టి అంటోన్న చక్రవర్తి వైపు కోపంగా చూసింది. "పెళ్ళిమాటలు మాట్లాడితే అమ్మమ్మ అయినట్టా?"
    "కాదా...?"
    "అయితే మీరు నాకన్నా ముందే తాత అయ్యారు."
    "నేనా? ఎలా?" ఆశ్చర్యంగా చూశాడు.
    "వేణు పెళ్ళి మాటలు మీరేగా మాట్లాడారు,"
    "నో... నాకసలు తెలియదు."
    "అహా పాపం! తెలీదు. వేణు ప్రేమ, అర్చననే పెళ్ళిచేసుకుంటానని సవాల్ చేయడం మీకు తెలీదని నేను నమ్మాలా?"
    "అదా!" తేలిగ్గా అంటూ ఆమెని దగ్గరకు లాక్కుని అన్నాడు "నువ్వీ మధ్య చాలా నాటీ అవుతున్నావు. మాటకు మాట చమత్కారంగా జవాబు చెపుతున్నావు."
    "సహవాస దోషం లెండి కానీ, నేను రేపు ప్రీతితో వేణు గురించి మాట్లాడాలనుకుంటున్నాను."
    "వేణు గురించి డైరెక్ట్ గా అడిగే కన్నా ముందు పెళ్ళి మీద, కాబోయే భాగస్వామి మీద తనకున్న ఐడియాస్ ఏంటో ప్రీతినడిగి తెలుసుకో."
    మాధవి ఉలిక్కిపడినట్టు చూస్తూ అంది. "అరె నిజం! నేనిదంతా ఆలోచించలేదండి. నిజమే కదా! దానికీ దాని స్వంత ఆలోచనలు, ఏవో కోరికలు ఉంటాయిగా" అంది ఆలోచిస్తూ.
    చక్రవర్తి తన తలతో ఆమె తల ఢీ కొడుతూ "మొద్దుబుర్ర! ఆవేశమే కానీ, ఆలోచన లేదు" అన్నాడు.
    బేలగా అంది మాధవి "అది ఒప్పుకోదంటారా?"
    "ఒప్పుకోదని నేనన్నానా? కాకపోతే డైరెక్ట్ గా అడిగి తను కాదంటే బాధపడేకన్నా జాగ్రత్తగా తన మనసులో ఏముందో తెలుసుకుని నీ ఆలోచన చెప్పమంటున్నా."
    మాధవికి చక్రవర్తి మాటలు నిజమే అనిపించాయి. 'నిజమే కదా!' అనుకుంది. తనకా ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకుంటూ "సరేలెండి! మీరు కాళ్ళు, చేతులు కడుక్కురండి టీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
    ఆమె వెళ్ళిన వైపు చూస్తూ "ఆ కుటుంబంతో ఈమెకి ఏ జన్మదో ఈ బంధం" అనుకున్నాడు చక్రవర్తి.

                                                             * * * * *
                                        అర్చన ఇప్పుడు రాజమండ్రి ఆర్.డి.వోగా ఉంది. క్వార్టర్స్, వాహనం, పనివాళ్ళు, హోదా బాగుంది. ఇప్పుడు అర్చానకి గతం తల్చుకుంటే ఏమీ అనిపించడం లేదు. వేణు అసలు గుర్తే రాడు. బాబు మాత్రం అప్పుడప్పుడు గుర్తొస్తుంటాడు. ఇప్పుడు బాబుకి మూడేళ్ళుంటాయేమో, కబుర్లు చెబుతున్నాడేమో అనుకుంటూ ఉంటుంది. క్వార్టర్స్ లో పనిచేస్తున్న శోభకి మూడేళ్ళ పిల్లాడు, ఆరేళ్ళ పిల్ల ఉన్నారు. అక్కడే పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. భర్త తాపీమేస్త్రి. ఆ తల్లీ, పిల్లల్ని చూసినప్పుడు సన్నని నిట్టూర్పు వస్తుంటుంది. వాళ్ళకి కబుర్లు చెబుతూ శోభ అన్నం పెట్టే దృశ్యం అర్చనకి కన్నుల పండువగా అనిపిస్తుంటుంది.
    ఆఫీసులో కూడా పెద్దగా పని ఒత్తిడిగా అనిపించలేదు. పి.ఎ. శ్రీపతి, సూపరింటెండెంట్ వసుమతి, అకౌంటెంట్ ఇలా ఓ నలుగురైదుగురు అర్చనని బాగా అభిమానిస్తారు. అనుభవజ్ఞులైనవాళ్ళు దాదాపు వాళ్ళే ఆమెకి ఆఫీసు గురించి, అక్కడి పని గురించి అ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. పెద్దగా రాజకీయంగా కూడా ఎలాంటి హడావిడీ కనిపించదు. ఆమె చేరిన వారానికే ఆగస్టు పదిహేను, సాతంత్ర్య దినోత్సవం 
జరిగింది. తన చేతుల మీదుగా పతాకావిష్కరణ చేస్తుంటే తనువెల్లా పులకరించింది. తన హోదా తల్చుకుంటే గర్వంగా అనిపించింది. కానీ, హోదా హక్కులను లేదా అధికారాన్ని ఇవ్వదు. బాధ్యతలను మనపై ఉంచుతుంది అన్న ప్రముఖుల పలుకు గుర్తుకు తెచ్చుకుని తనని తాను సమాధానపర్చుకునేది.
    సాయంకాలాలు అప్పుడప్పుడు గోదావరి బ్రిడ్జిమీద నడుస్తూ ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది.
    సూపరింటెండెంట్ వసుమతిని తీసుకుని అన్నవరం, ద్రాక్షారామం, ర్యాలిలో జగన్మోహిని, చెన్నకేశవ ఆలయాలు దర్శించింది. ఎక్కడికెళ్ళినా తనకు జరుగుతున్న రాచమర్యాదలు, వాళ్ళిస్తున్న గౌరవం ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించినా తరువాత అనందంగా అనిపించింది.
    తూర్పుగోదావరి జిల్లా...
    విశాఖపట్నంలో పుట్టి, పెరిగినా ఎన్నడూ రాజమండ్రి వచ్చిన గుర్తేలేదు.
    ఎంత చరిత్ర ఉంది రాజమండ్రికి అనిపించింది.
    1904లో తూర్పుగోదావరి జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, గాంగులు, విష్ణుకుండిణులు, చాళుక్యులు, వెలనాటి చోళులు, కాకతీయులు, తురుష్కులు, కొండవీటి రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు పాలించారు. 1916లో లాగరాయి పితూరీ, 1922లో అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటులను అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మలబారు సైనికులను తీసుకువచ్చింది. జిల్లాలో 30 శాతం పైగా అడవులు వ్యాపించి ఉన్నాయి. రాజరాజనరేంద్రుని పేరు మీదుగా రాజమహేంద్రవరం నిర్మించబడింది. అదే నేడు రాజమండ్రి.

 Previous Page Next Page