Previous Page Next Page 
అర్చన పేజి 73


    ఊళ్ళో ఉన్నన్ని రోజులూ పసివాడి ఆటలు, పాటలు, ముద్దు మాటలూ ఫోన్ లో వినిపిస్తూ ఉంటే ఆయన హృదయం మనవడి పట్ల వాత్సల్యాభిమానాలతో నిండిపోయింది. ప్రతిక్షణం వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా, వాడితో ఎప్పుడెప్పుడు దగ్గర ఉండి ఆడుకుంటానా, ఎప్పుడు వాడిని గుండెలకు హత్తుకుని పడుకోవాలా, వాడి చిటికెన వేలు పట్టుకుని షికారు తీసుకెళ్ళాలా అని తహతహలాడిన కృష్ణస్వామికి ఇప్పుడు మనవడి స్పర్శ చిన్నికృష్ణుడి స్పర్శగా అనిపిస్తోంది. ఆ వేణుగోపాలుడు ఈ పసివాడి రూపంలో తన ఒడిలో కూర్చుని ఉన్నట్టుగా భావించి పారవశ్యం పొందసాగాడు.
    ఇప్పుడు ఆ దంపతులకి పసివాడే ప్రాణం. వాడే లోకం. వాడు అల్లరి చేసినా, ఇంట్లో ఏం పడు చేసిన ఏమీ అనరు. నవ్వుతూ చూస్తుంటారు.
    వేణు ఇంట్లో ఉన్నంతసేపూ అతని సెల్ ఫోన్ రిత్విక్ చేతుల్లోనే ఉంటుంది. ఆ ఫోన్ చెవికానించుకుని, "తాతా, తాతా" అంటూ వాడేవో కబుర్లు చెప్పేస్తుంటే మురిసి మురిసి చూశారు. అలా మాట్లాడుతూనే మాటలు పాటల కిందకి మార్చి రాగాలు తీస్తూ సెల్ కుడిచేత్తో పట్టుకుని నేలకేసి కొడుతూ ఆడుకుంటూ, ఆడుకుంటూ ఓ శుభముహూర్తంలో ఫోన్ బద్దలు కొట్టేశాడు.
    అది చూసి కెవ్వున అరిచాడు వేణు. ఆ అరుపుకి బెదిరిపోయిన రిత్విక్ గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. పదివేల రూపాయల సెల్ నాశనం. వేణు ముందు మండిపడ్డా వాడి ఏడుపు చూసి కంగారుపడ్డాడు.
    తల్లీ, తండ్రీ "వాడికేం తెలుసురా? వాడికి అందేలా పెట్టడం నీదే తప్పు" అంటూ తననే నిందించేసరికి మౌనంగా ఉండిపోయాడు. అయితే, మనసులో మాత్రం ఎక్కడో ఓ మూల వాడి ఆటలకి ఆనందం మాత్రం చిందులేసింది.
    ఇల్లు మరమ్మత్తు పనులు, ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, పెరట్లో వాకిట్లో ఊడ్చుకోవడం క్షణం ఖాళీ ఉండడం లేదు నీలవేణికి. రిత్విక్ ని పూర్తిగా కృష్ణస్వామి, తాయారమ్మ దంపతులే చూసుకుంటున్నారు. ఇల్లు పెద్దదవడం, కన్ స్ట్రక్షన్ పని వలన కలిగే ఇబ్బందులు, అదనపు పనులు ఆమెకి పని బాగా పెరిగింది.
    అది గమనించిన తాయారమ్మ వేణుకి చెప్పింది మరో మనిషిని చూడమని.
    త్వరలోనే మరో పనిమనిషిని కూడా పెట్టేశాడు వేణు.
    నాలుగైదు నెలలు గడిచి ఇల్లు పూర్తయింది.
    గృహప్రవేశానికి ముహూర్తం చూశాడు కృష్ణస్వామి. వసంత పంచమి, గురువారం అద్బుతంగా ఉంది. అప్పటిదాకా సరైన ముహూర్తాలు కనిపించలేదు.
     ఆ రోజు మాధవి వచ్చింది. కౌశిక్ ని తీసుకుని వచ్చిన మాధవిని మనసారా ఆహ్వానించింది తాయారమ్మ. "రామ్మా రా! కులాసానా?" అంటూ చేతులు చాచి కౌశిక్ ని అందుకుంది.
    "అమ్మమ్మా!" అంటూ కౌశిక్ ఆవిడ కళ్ళజోడు తీయబోతుంటే "నా తండ్రిగా దీని జోలికి రాకురా" అంటూ మేడమీద ఉన్న నీలవేణికి వినిపించేలా కొంచెం గట్టిగా అంది "నీలవేణి! బాబుని తీసుకురా! వాడి స్నేహితుడొచ్చాడు ఆడుకుంటాడు."
    "వస్తున్నానమ్మా!" నీలవేణి రిత్విక్ ని ఎత్థుకుని కిందికి దిగింది.
    మాధవిని చూసి నవ్వుతూ దగ్గరగా వచ్చి "బాగున్నారా అక్కా?" అంటూ పలకరించింది.
    మాధవి రిత్విక్ ని ఎత్తుకుని కాస్సేపు ఎగరేసి, ఆది, ముద్దు పెట్టుకుని నీలవేణి చేతికిచ్చి, వాళ్ళిద్దరి ముందు బొమ్మలు పడేసి" వెళ్ళి పని చూసుకో వాళ్ళే ఆడుకుంటారు" అంది.
    "నేనున్నాగా తల్లీ! ఆడించడానికి" అంటూ వచ్చిన కృష్ణస్వామికి నమస్కరించింది.
    "దీర్ఘసుమంగళీభవ!" అంటూ "కులాసానామ్మా" అడిగాడాయన.
    "ఆ... మాకేం మేము కులాసానే బాబాయ్ గారూ! మీరెలా ఉన్నారు?" అడిగింది.
    "నా మనవడితో ఆడుకుంటుంటే వయసు ఓ పదేళ్ళు తగ్గినట్టుందమ్మా" అన్నాడాయన.
    నవ్వింది మాధవి.
    తలతిప్పి ఇల్లంతా కలయచూస్తూ, "ఇల్లు చాలా బాగుంది పిన్నిగారూ!" అంది.
    "అవునమ్మా! నా కొడుకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు" అందావిడ.
    "అదృష్టవంతులు మీరు. ఒక్కడైనా బంగారంలాంటి కొడుకు" అంది మాధవి.
    కృష్ణస్వామి పిల్లలిద్దరినీ తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయాడు ఆడించడానికి.
    మాధవి తాయారమ్మ పక్కన సోఫాలో కూర్చుంది.
    "మీ బాబాయి గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారమ్మా. ఈలోగా వాడికేదన్నా సంబంధం చూడమ్మా! పెళ్ళి నిరాడంబరంగా జరిగినా ఎంచక్కా కొడుకూ, కోడలూ కలిసి గృహప్రవేశం చేసుకుంటారు" అంది తాయారమ్మ.
    నెల రోజుల్లోనే సంబంధం కుదిరి, వేణు పెళ్ళి చేసుకుని భార్యతో గృహప్రవేశం చేయాలన్న ఆవిడ కోరికకి ముందు నవ్వొచ్చినా తరువాత జాలేసింది.
    "తప్పకుండా చూస్తానండి. మంచి సంబంధం చూడాలని ఆలస్యం చేశాను" అంది.
    "మనకేం కట్నకానుకలివ్వాలా? అదేం లేదుగా. వేణు చక్కటి కుర్రాడు, బుద్దిమంతుడు, తల్లిగా నేను చెప్పకూడదు కానీ, నీకు తెలుసుగా చక్కగా ఉంటాడు."
    మాధవి ఆవిడ చేతిమీద చేయెసి మృదువుగా అంది "అతడ్ని అర్ధం చేసుకుని అన్ని విధాలుగా సహకరించే అమ్మాయి కావాలి కదండీ."
    "అవునమ్మా!" అందావిడ మాధవి వివేకానికి ముచ్చటపడుతూ.
    మాధవి అదే అదనుగా ఆవిడకి కొంచెం దగ్గరగా జరిగి స్వరం తగ్గించి నెమ్మదిగా అడిగింది. "అది సరే! ఈ విషయం చెప్పండి. మా ప్రీతిని చూశారుగా! ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటి?"
    ఆవిడ కళ్ళు మెరిశాయి. ఉత్సాహంగా అంది "ఆ అమ్మాయికేం పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మవారిలా ఉంది" అంది.
    మాధవి నవ్వింది "దాన్ని ముందు అడిగి తన అభిప్రాయం తెలుసుకుని మీకు చెప్తాను. తరువాత వేణుని అడుగుదాం" అంది.
    "అలాగే! నువ్వెలా అంటే అలా నీతో బంధుత్వం కలుపుకునే అవకాశం రావడం అదృష్టం" అందావిడ మనస్ఫూర్తిగా.
    "అయ్యో! అంతమాటనకండి పిన్నిగారూ! మీ ఔన్నత్యం ముందు నేనెంత చెప్పండి" అంటూ ఆవిడ చేయి మీద చెయ్యేసి నెమ్మదిగా నొక్కింది మాధవి. ఆ స్పర్శలో ఆవిడకి అంతులేని ఆప్యాయత కనిపించింది.

 Previous Page Next Page