కందుకూరి వీరేశలింగంగారి ఇల్లు చూపించాడు శ్రీపతి. ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన నడిచిన పరిసరాలు అర్చన ఆనందానికి అవధుల్లేకుండా అయింది. ఆయన స్థాపించిన హితకారిణి సమాజం గురించిన కొన్ని ఫోటోలు కూడా చూపించాడు. మహాభారతాన్ని రచించిన నన్నయ రాజమండ్రివాడె అని చదివినట్టు గుర్తు అనుకుంది అర్చన.
గోదావరి నది రంపచోడవరం నుంచి ప్రవహించి ధవళేశ్వరం వద్ద వశిష్ట, గౌతములుగా చీలుతుంది. వశిష్ట పశ్చిమానికి ప్రవహించి వైనతేయమనే పాయగా చీలి రాజోలు దగ్గర సముద్రంలో కలుస్తుంది.
రాజమండ్రి గోదావరి నదిపైన సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన బ్యారేజ్ మీద నిలబడి చూస్తుంటే పరవళ్ళు తొక్కే గోదావరి పై కథలన్నీ తన గర్భంలో దాచుకుని అలలనే అక్షరాలు పేర్చి ఆ కథలన్నీ తనకు వినిపిస్తున్నట్టే అనిపిస్తుంటుంది అర్చనకి.
చుట్టుప్రక్కల ప్రాంతాలైన రాజోలు, భీమవరం మొదలైన ప్రదేశాలన్నీ ఒక్కొక్కరోజు ఇన్ స్పెక్షన్ కి వెళ్ళి అన్నీ చూడాలని నిర్ణయించుకుంది.
ఒకసారి కలెక్టర్ అక్షయ్ కుమార్ తో కలిసి యానాం, సామర్లకోట వెళ్ళింది.
అక్షయ్ కుమార్ వయసు ముఫ్ఫై ఏళ్ళు. అతనిది అవడానికి తూర్పు గోదావరే అసలు ఊరు అయినా తండ్రి ఉద్యోగరీత్యా చాలాకాలంక్రితమే నార్త్ లో సెటిల్ అయాడు. తేకుగు బాగానే వచ్చు, పచ్చగా, ఆరడుగులు ఎత్తు, అమీర్ ఖాన్ లా ఉంటాడు. అర్చనతో ఎంతో స్నేహంగా ఉంటాడు. అతని భార్య ఫ్యాషన్ డిజైనర్. అమెది పూర్తిగా నార్త్. పేరు హంస. అతనికి తగినట్టే అందంగా ఉంటుంది. ఈమె ఎన్నడూ అందాలపోటీలకు వెళ్ళి ఉండదు. వెళ్ళి ఉంటే తప్పకుండా మిస్ యూనివర్స్ అయి ఉండేది అనుకుంటుంది అర్చన. ఒకటి రెండుసార్లు ఆమె కూడా భర్తతో కలిసి టూర్ వేసుకుని వచ్చింది. అందరూ కలిసి కడియం వెళ్ళారు. కడియం నర్సరీలో మొక్కలు చూసి చిన్నపిల్లల్లా సంబరపడ్డారు అర్చన, హంస.
ప్రతి క్షణం నీళ్ళు చల్లుతూ, కలుపు మొక్కలు ఏరి పారేస్తూ, గులాబీ కొమ్మలు కట్ చేస్తూ, మట్టిని కదుపుతూ కంటికి రెప్పల్లా కాపాడుతున్నారు అక్కడివాళ్ళు. మగపిల్లల్లా నడుం చుట్టూ టవల్ కట్టుకుని, పొడుగాటి జాకెట్ వేసుకున్న ఒకమ్మాయి ఆ మొక్కల మధ్య మొక్కగా మారి చిలకలా నవ్వుతూ, కబుర్లు చెపుతూ, ఒక్కో క్రోటన్ పేరు చెబుతూ మొక్కల్ని పరిచయం చేస్తున్న తీరు అధ్బుతంగా అనిపించింది అర్చనకి. చల్లనిగాలి, ఆ గాలిలో వస్తున్న పరిమళం.
"నాకిక్కడ నుంచి కదలాలని లేదు సార్" అంది అర్చన నవ్వుతూ.
"మీకిక్కడ పోస్టింగ్ ఇవ్వమంటారా?" తనూ నవ్వుతూ అడిగాడు అక్షయ్.
"ఇక్కడ క్వార్టర్స్ కట్టించి ఇవ్వండి చాలు" అంది.
"రెవెన్యూ మీదే కదా మీరే కట్టుకోండి."
"మీకిద్దరికీ ఛాన్స్ దొరికితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్యుపై చేసుకుంటారులే" అంటూ అల్లరిగా నవ్వింది హంస.
"పోనీలే నీకేగా మొత్తం" అన్నాడు అక్షయ్.
"అంత ఆశగానీ, అలాంటి దుర్భుద్ధిగానీ మాకు లేదులే హంసగారు!" అంది అర్చన.
"కమాన్ అర్చనా! ఈ గారూ, గీరూ ఐ డోంట్ లైక్ ప్లీజ్ కాల్ మీ హంసా!"
"ఓ థాంక్యూ!" అంగీకారంగా నవ్వింది.
"అందరం ఒకే వయసువాళ్ళం. హోదాలు పక్కన పెడితే పేర్లు పెట్టి పిలుచుకుంటే సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎలాంటి భేషజాలు లేకుండా మన జిల్లా అభివృద్ది కోసం కలిసి మెలిసి కృషి చేయచ్చు ఏమంటారు?" అడిగాడు అక్షయ్.
"అంతకన్నానా సార్! మీకు నా కోపరేషన్ హండ్రెడ్ పర్సెంట్."
"మరి ఈ సార్ ఎందుకు?"
"కరెక్టే కానీ, నాక్కొంచెం టైమ్ కావాలి సార్ అనే పిలుపు నుంచి మారడానికి."
"టేక్ సమ్ టైమ్" అన్నాడు.
ఇంతలో కొబ్బరి బోండాలు రావడంతో తీయటి కొబ్బరినీళ్ళు తాగి రిలాక్స్ అయ్యారు.
అర్చన, హంసా కూడా మొత్తం కలయతిరిగి బోలెడన్ని మొక్కలు తీసుకున్నారు.
అక్షయ్ కుమార్ సిసి, అతన్ని క్యాంప్ క్లర్క్ అంటారు. ఎంతో నమ్రతగా హంస సెలెక్ట్ చేసిన మొక్కలన్నీ కార్లో పెట్టించాడు. శ్రీపతి కూడా సింహాచలాన్ని పిలిచి అర్చన తీసుకున్న మొక్కలన్నీ కారులో పెట్టించాడు. రెండు కార్లూ బయల్దేరాయి.
ఆ రోజు ఉదయం లేచేటప్పటికి వాతావరణం చల్లగా ఉంది.
అర్చన బెడ్ లైట్ వెలుగులో గోడగడియారం వైపు చూసింది. చీకటిగా ఉంది. ఫ్యాన్ కూడా తిరగడం లేదు. అంటే కరెంట్ పోయిందన్నమాట!
పక్కనే పెట్టుకున్న సెల్ తీసింది. స్విచ్ ఆఫ్ అయి ఉంది. "అరె! ఛార్జి పెట్టలేదు రాత్రి" అనుకుంటూ తన పర్సనల్ మొబైల్ తీసుకుని ఆన్ చేసి టైం చూసింది ఆరుంబావు.
అరెరె! ఆరు దాటిందే అనుకుంటూ ముసుగు తీయబోతే బాగా చలిగా అనిపించింది. తిరిగి ముసుగు బిగీస్తూ కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది. బైట జల్లు పడుతున్న ధ్వని వినిపిస్తోంది. మొక్కలన్నీ నలవస్త్రం కప్పుకుని వర్షంలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్నాయి. దూరంగా చీకటిని చీల్చుకుంటూ మధ్య మధ్య మెరూపులు మెరుస్తున్నాయి.
ఎటూ కాని కాలంలో వర్షం ఏంటి? తుఫాను కాదు కదా!
అలా అనిపించగానే చటుక్కున లేచి కూర్చుంది.
'ట్రింగ్ ట్రింగ్' ఫోన్ మోగింది.
రిసీవర్ అందుకుని 'హలో' అంది.
"గుడ్ మార్నింగ్ మేడమ్! నేను శ్రీపతిని మాట్లాడుతున్నాను."
శ్రీపతి తన పి.ఏ.
"గుడ్ మార్నింగ్ శ్రీపతీ! ఏంటి ఈ టైమ్ లో ఫోన్ చేశారు?"
"మేడమ్ సైక్లోన్. అర్ధరాత్రినుంచీ మొదలైంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి. మీకోసం చాలాసేపట్నించీ ట్రై చేస్తున్నాను."
"అలాగా! అయ్యో నాకు అసలు వినిపించలేదు. సారీ! ఇంతకీ మీరెక్కడ ఉన్నారు?"