నిన్నూ, నీ మూకనూ మేపుతోంది, తర్ఫీదు ఇస్తోంది ఇలా దెబ్బలు తినడానికి కాదు. నువ్వు యువతకి నాయకుడివి కావాలని. రాబోయే ఎలక్షన్ లో యువత ఓట్లన్నీ మన గంపలో గుమ్మరించేలా చేస్తావనీ. అంతేకానీ పులిమీద పుట్రలా మరో హీరోగాణ్ని పుట్టనివ్వమని కాదు."
"అయితే వాణ్ని ఫినిష్ చేస్తాను" అన్నాడు ఫిలిప్స్.
అంకయ్య చుట్టపొగని గుప్పుమని విడిచాడు.
"ఆ తొందరపాటే మీ యువతని పాడుచేస్తోంది. ఫినిష్ చేయడం అనేది నిమిషాల్లో మాట. దానివల్ల మనం సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది. అది రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ఏదన్నా సమస్యని మనకి దొరికేలా చూసుకోవాలి. దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అదీ పద్ధతి."
"నీ ఉపన్యాసం నాకు అర్ధం కాలేదు" జెన్నీ విసుగ్గా అన్నాడు.
"నా చెల్లెలి కడుపున చెడబుట్టావురా జెన్నీ? నా పోలికలు మచ్చుకి పది శాతం కూడా నీకు రాలేదు."
"ఇంతకీ ఏం చెయ్యమంటావో చెప్పు."
"గుడ్. అలా అడుగు. కార్యక్రమం చెబుతాను. మన చేతికి మట్టి అంటుకోకుండా అవతలివాడు మొహానికి బురద పూయాలి. ఎలా అని అడుగు."
"ఎలా?" అందరూ ఒకేసారి అడిగారు.
అంకయ్య గంభీరంగా చూశాడు అందరివంకా.
"క్రిమినల్ లాయర్ డీ.ఆర్. కూతురు చిత్రని మనం బజారుకెక్కించాలి."
"అంటే?"
"ఆ అమ్మాయి నీ ప్రత్యర్థి ఈశ్వర్ తో తిరుగుతోంది కదూ?"
"అవును."
"ఇది మనకి నచ్చని విషయం. అందుచేత యీ విషయాన్ని మనం డి.ఆర్. వైపునించే ముందు నరుక్కొద్దాం."
"అర్థం అయ్యేలా విశదీకరించు మామా?"
"డి.ఆర్. కి. అతని కూతురు ప్రేమాయణాన్ని తెలిసేలా చేయండి. ఆ అమ్మడు కాలేజీలో తలెత్తి తిరక్కుండా చేయాలి. అప్పుడు డి.ఆర్. స్వయంగా ఈశ్వర్ గాడి సంగతి చూసుకుంటారు. ఈ విధంగా మీరెళ్ళి ఆ ఈశ్వర్ గాడి నెత్తిన నీళ్ళోయండి. ప్రేయసి దూరం అయిపోతే కోరలు పీకిన పాములా పడి ఉంటాడు ఈశ్వర్" అన్నాడు 'ఈశ్వర్' అన్న పదాన్ని'ఈస్పర్' అని వత్తి పలుకుతూ.
"బ్రహ్మాండంగా ఉంది మామా నీ ఆలోచన! యీ దెబ్బతో వాడి పొగరణచివేస్తాను."
జెన్నీ జబ్బలు చరుచుకున్నాడు.
"ఆలస్యం అమృతం విషం అన్నారు. యీ రాత్రికే కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీకు మేలు జరుగుతుంది" అన్నాడు అంకయ్య చుట్టకొన కొరికి వికృతంగా నవ్వుతూ. జెన్నీ తలూపాడు.
4
రాత్రి పన్నెండు గంటలయింది.
రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
కాలేజీకెదురుగా నాలుగు మోటార్ సైకిళ్ళు వచ్చి ఆగాయి
రోడ్డుకిరువైపులా దృష్టి సారించి చూశాడు జెన్నీ. ఎవరూ లేరు.
చెట్ల గాలికి ఆకులు చప్పుడు చేస్తున్నాయి.
జెన్నీ ఫిలిప్స్ కి సైగ చేశాడు.
గేటు ముందు వెలుగుతున్న ఎలక్ట్రిక్ బల్బ్ ని రాయితో కొట్టాడు ఫిలిప్స్.
రాయి సూటిగా వెళ్ళి తగలడంతో అది టప్ మని శబ్దం చేస్తూ పగిలిపోయింది. ఆ ప్రదేశమంతా చీకటి అయిపోయింది.
"గుడ్ షూటింగ్" అన్నాడు వెంకోజీ.
"పదండి లోపలకి" మెల్లగా ఆజ్ఞాపించాడు జెన్నీ.
ఒకరి తరువాత ఒకరు కాలేజీ కాంపౌండ్ వాల్ దగ్గరికి నడిచి గోడ దూకేశారు.
కాలేజీ లోపల దీపాలు వెలుగుతున్నాయి.
తమని ఎవరూ గమనించకుండా చీకటిలోంచి నడుస్తూ కారిడార్ దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు.
కారిడార్ దగ్గర పెద్దలైటు వెలుగుతోంది. దాని స్విచ్ కారిడార్ వరండాలో ఉంది. కానీ దాన్ని ఆర్పితే వాచ్ మన్ దృష్టిలో పడతారు. అందుచేత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు జెస్సీ.