Previous Page Next Page 
మహాశక్తి పేజి 6

    "ఇలాంటి చోట ఎక్కువసేపు ఉండకూడదు."

    "భయమా?"

    ఒక ఆడపిల్ల మగాణ్ని పట్టుకుని అలా అడిగితే ఏం సమాధానం చెప్పగలడు?

    "భయం నా గురించి కాదు. నీ గురించి."

    "నువ్వున్నావుగా?

    ఆమెకి సమాధానం చెప్పడం కష్టమని ఈశ్వర్ కి తెలుసు. నిజానికి ఆ మనోహరమైన వాతావరణాన్నీ ప్రదేశాన్నీ విడిచిపోవాలని అతనికీ లేదు.

    "మళ్ళీ రేపు వద్దాం" అన్నాడు.

    "నీ మాటలెవరయ్యా నమ్మేది? రేపు కాలేజీకెళ్ళేసరికి ఎవర్నో కొట్టడంలోనో, నాలుగు తినడంలోనో పడి నన్ను కాస్తా మరిచిపోతావు?"   

    "నిన్ను నే నెప్పుడూ మరిచిపోను."

    "ప్రియురాలి బర్త్ డేని మరిచినవాడివి...... నేనే గుర్తుంటే యీ రోజునెలా మరచిపోతావు?" ఆమె యధాలాపంగానే అడిగినా ఈశ్వర్ గుండెని ముల్లుతో గుచ్చినట్టుగా అనిపించింది.

    అతని మొఖాన్ని చూసేసరికి నవ్వొచ్చింది చిత్రకి.

    "సరే ఏడవకు. పద!" అంది.

    ఆమెతో పాటు కారు దగ్గరికి నడిచాడు ఈశ్వర్.

    చిత్ర కారు స్టార్ట్ చేసింది.

    కారు కదలడమే వేగంగా కదిలింది. చిత్ర చేతిలో స్టీరింగ్ ఉంటే ఎవరూ పట్టలేరు.

    ఆ సంగతి ఈశ్వర్ కి తెలుసు. చూసే వాళ్ళకీ, కారులో కూర్చునే వాళ్ళకీ హడలెత్తాలేగానీ ఆమె తన పద్దతి మార్చుకోదు.

    కారు మలుపు తిరుగుతున్నప్పుడల్లా ఆమె వడిలో పడుతున్నాడు ఈశ్వర్.

    చిత్ర కిలకిలా నవ్వుతోంది.

    ఆ నవ్వుకు మరో మగాడికి మతిపోవచ్చుగానీ, ఈశ్వర్ కి మాత్రం అది కోపాన్ని తెప్పిస్తోంది.

    ఆమె అలా నవ్వినప్పుడల్లా తెల్లని పలువరుస తళుక్కుమని మెరుస్తోంది. కళ్ళు చిన్నవై చేపపిల్లల్లా మిలమిల లాడుతున్నాయి.

    పెదవులు తమాషాగా వంకర్లు తిరుగుతున్నాయి. బుగ్గల్లోకి ఎరుపురంగు తన్నుకొస్తోంది.

    "ఎందుకా అవస్థ? కదలకుండా నన్ను పట్టుకుని కూర్చో?"

    "కారుని రోడ్డు కేసి చూసి నడుపు."

    "కళ్ళకి గంతలు కట్టుకుని కూడా నడపగలను. చూస్తావా?" అంటూనే ఆరేడు గజాల దూరంలో ఎవరో మనిషి అడ్డు కనబడటంతో సర్రుమని బ్రేకు వేసింది చిత్ర.

    ఆ శబ్దానికి రోడ్డుకి అడ్డంగా నడిచిన ఓ ముసలి అవ్వ కింద పడిపోయింది. మూలుగుతూ లేచి చిత్ర దగ్గరికొచ్చింది అవ్వ.

    "ఏమ్మా కారు నడిపేది నువ్వేనా?" అడిగింది.

    "అవును. కారు బాగుందా? లిఫ్ట్ కావాలా?"

    ఆమెది అహంభావం అనుకోవాలో, అమాయకత్వం అనుకోవాలో ఈశ్వర్ కి అర్ధం కాలేదు.

    "కారుకంటే నువ్వే బాగున్నావు. కానీ మీ అమ్మా, నాన్నకి ఎంతమందున్నారు?"

    "నే నొక్కదాన్నే. యీవేళ నా పుట్టిన రోజు కూడా" అంది చిత్ర నవ్వుతూ.

    "ఏమ్మా, మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలని లేదా?"

    అవ్వ మాటలకి ఈశ్వర్ కి ఛెళ్ న కొట్టినట్టయింది.

    చిత్ర అతని ముఖంలోకి చూసింది చిన్నబోయిన వదనంతో.

    "కారు పోనీయ్!" అన్నాడు గంభీరంగా ఈశ్వర్.

    తల విదిలించి ముఖంపైన పడిన జుత్తుని నిర్లక్ష్యంగా వెనక్కి తోసుకుంటూ నువ్వు బెంగపెట్టుకోకు అవ్వా? నీలాగే నా బతుకూ నూరేళ్ళు గ్యారంటీ" అని  కారుని ముందుకి పరుగు తీయించింది చిత్ర.

    ఈశ్వర్ ముభావంగా ఉండటం చూసి కారు వేగాన్ని తగ్గించింది చిత్ర.

                                                                     3

    జెన్నీ విసురుగా పచార్లు చేస్తున్నాడు.

    "అంకుల్, నే నీ అవమానాన్ని భరించలేను. వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి" జెన్నీ కళ్ళు ఎరుపెక్కాయి.

    అంకయ్య చుట్ట వెలిగిస్తూ జెన్నీనీ, వరసగా నించుని ఉన్న అతని స్నేహితులను చూసి -  "దెబ్బలు బాగా తగిలాయా?" అని అడిగాడు.

    "వాడి ప్రాణం తీస్తాను?" అరిచాడు జెన్నీ.

    "వూరికే ఎద్దురా రంకె వెయ్యకు. మొరిగే కుక్క కరవదని సామెత. అందుచేత విషయం ఏదన్నా కానీ సైలెంట్ గా జరిగిపోవాలి.

    ఒక్కడు ఆరుగుర్ని చితకబాదాడు. సెభాష్! ఆణ్ని మనం ఓసారి చూడాలి."

    "అంకుల్!" రోషంగా పిలిచాడు జెన్నీ.

    "ష్. అరవకు.

    ఒకణ్ని ఏడిపిస్తే నాకు ఆనందం.

    ఒకణ్ని నేలకరిపిస్తే నాకు పరమానందం.

    కానీ ఇలా దెబ్బలు తినొచ్చి నా ముందు నించోడం, కూర్చోవడం నాకు బొత్తిగా గిట్టదురా జెన్నీ!

 Previous Page Next Page